జల్లి 'కట్టు' పై తంబి పట్టు | news about jallikattu | Sakshi
Sakshi News home page

జల్లి 'కట్టు' పై తంబి పట్టు

Published Fri, Jan 20 2017 2:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

జల్లి 'కట్టు' పై తంబి పట్టు - Sakshi

జల్లి 'కట్టు' పై తంబి పట్టు

జల్లికట్టు అంటే..
గిత్తను లొంగదీసే సంప్రదాయ తమిళ ఆట.  మదురై, తిరుచిరా పల్లి, తేని, పుదుకొట్టాయ్, దిండిగుల్‌ జిల్లాలో పోంగల్‌ సందర్భంగా కోలాహలంగా ఆడుతారు. నిర్దిష్ట స్థలంలో కొందరు యువకుల మధ్యకు బలిష్టమైన గిత్తను వదులుతారు. ఉత్తిచేతులతో దాన్ని లొంగదీసిన వారు విజేత. మరికొన్ని చోట్ల వీధుల్లో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి... మధ్యనున్న దారిలో గిత్తను వదులుతారు. దాన్ని కరుచుకొని ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించగలిగితే వారే విజేత. ఓ దండేసి విజేతను సన్మానిస్తారు.

మొదట్లో 101 రూపాయల చిల్లర నాణేలు ఎద్దు కొమ్ముకు కట్టేవారు. వాటితో పాటు ఓ ధోవతి, టవల్‌... ఇవే విజేతలకు దక్కే బహుమతి. తర్వాతి కాలంలో గ్రైండర్లు, ఫ్రిజ్‌లాంటి గృహోపకరణాలను కొన్నిచోట్ల బహుమతు లుగా ఇస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలు లేకున్నా జల్లికట్టులో నెగ్గడాన్ని తమిళ యువత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.

రాజకీయ కోణం..
విపక్ష డీఎంకే నేత స్టాలిన్‌ జల్లికట్టుపై నిషేధాన్ని రాజకీయం చేశారు. నిషేధం ఎత్తి వేతకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు మొదలుపెట్టారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వమే మొదట జల్లికట్టును అడ్డు కుందని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రతి విమర్శ చేశారు. తేవర్‌ కులం ప్రాబల్యం కలిగిన జిల్లాలో దీన్ని ఎక్కువ గా ఆడతారు. అన్నా డీఎంకేలో తేవర్ల ప్రాబల్యం ఎక్కువ. రాజకీయం గా ప్రాబల్యం కలిగిన కులం. సీఎం, శశికళ ఇద్దరూ ఈ కులానికి చెందిన వాళ్లే. అందువల్ల ప్రభుత్వం ఒత్తిడికి లోనైంది.

ఉప్పెనలా యువత...
కొంతమంది నిరసనకారులను అరెస్ట్‌ చేశారనే వార్తలతో మంగళవారం ఉదయం ఓ 50 మంది మెరీనా బీచ్‌కు చేరుకొని నిరసనకు దిగారు. గంటల్లోనే ఈ సంఖ్య వేలకు చేరింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో... యువత ఉప్పెనలా కదిలింది. ఐటీ నిపుణులు, ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బుధ వారం రాత్రయ్యేసరికి నిరసనకారుల సంఖ్య 15 వేలకు చేరుకుంది. రాత్రి చల్లని చలిలో బీచ్‌లోనే పడుకున్నారు. గురువారం ఉదయం పరిసరాలను శుభ్రం చేశారు.

తోటి నిరసనకారులకు కొందరు ఇంటి నుంచి భోజనాలు తెచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా వేలాది యువత రోడ్డెక్కారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తూనే... రాజకీయ నాయకులను తమ ఆందోళనకు దూరంగా ఉంచారు. నాయకుడెవరూ లేని నయా సమష్టి ఉద్యమమిది. సినీనటులు, ఇతర రంగాల ప్రముఖులు వీరికి మద్దతు పలుకుతున్నారు. జల్లికట్టును అనుమతించాలి, విదేశీ సంస్థ పెటాను నిషేధించాలి... అనేవి నిరసనకారుల డిమాండ్లు.

ఎందుకంత మద్దతు..
ద్రవిడ ఉద్యమం, హిందీ భాషకు వ్యతిరేక ఉద్యమాలు చేసిన తమిళుల్లో అస్థిత్వ భావన ఎక్కువ. తమిళ సంప్రదాయాల్లో ఇతరుల జోక్యమేమిటి? ఇది తమిళుల ఆత్మగౌరవానికి భంగకరమని వీరి భావన. ఈ భావనతోనే యువత ఒక్కసారిగా స్వచ్ఛందంగా కదిలింది. పైగా స్పెయిన్‌ బుల్‌ఫైట్‌లో లాగా తాము గిత్తలను హింసించి చంపడం లేదనేది వీరి వాదన.

వివాదం ఏంటి?
జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితర) ఇచ్చి... వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా... 2014లో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను (2016 మే) దృష్టిలో పెట్టుకొని గత ఏడాది ఆరంభంలో అమిత్‌ షా జోక్యంతో  ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్నా జల్లికట్టు ఆడుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. ఇది కోర్టు ధిక్కారమని జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ సుప్రీం తలుపు తట్టింది.

ఈ ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో క్రీడ మద్దతుదారులు కొందరు అనుమతించాలని మళ్లీ సుప్రీంకు వెళ్లారు. పొంగల్‌ సమీపిస్తున్నందున అత్యవసరంగా విచారించాలని కోరగా... ఈనెల 12 సుప్రీం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మదురై తదితర ప్రాంతాల్లో జల్లికట్టును నిర్వహించారు. అప్పటి నుంచి అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఢిల్లీకి పన్నీరు...
శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉండటంతో సీఎం పన్నీర్‌ సెల్వం బుధవారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించారు. జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చి ఆందోళనకారులను శాంతింపజేయాలని మొరపెట్టుకున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామన్నారు. కాగా తమిళనాడులో నిరసన ఉధృతమవుతున్న దృష్ట్యా సుమోటోగా తీసుకొని విచారించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టుకు వెళ్లమని సూచించింది.

ప్రధాని ఏమన్నారు
జల్లికట్టుపై తమిళుల సెంటిమెంట్లను మేము గౌరవిస్తాం. అయితే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. జల్లికట్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అండగా నిలబడతాం.

‘పెటా’ వాదనేంటి...
జల్లికట్టు ముమ్మాటికీ జంతు హింసే. గిత్తలు అదుపు తప్పి రెచ్చిపోయేలా పోటీకి ముందు వాటికి మత్తుమందులు ఇస్తున్నారు. కళ్లలో కారం జల్లుతున్నారు. దీనికి వీడియో సాక్ష్యాలు కూడా కోర్టుకు సమర్పించాం.    
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement