ఆ నాలుగు రోజులు ఆడేద్దాం
''హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు.. ఇవన్నీ ఎప్పుడూ మామూలే.. పండగ ముందు ఆ మాత్రం హడావుడి ఉంటుంది.. ఈసారి పండగ మూడురోజులతో పాటు ముక్కనుమ ఆదివారం వచ్చింది.. ఆ నాలుగు రోజులు కోడి పందేలు వేసుకోండి. ఏమైనా జరిగితే మేం చూసుకుంటాం..'' తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి కోడిపందేల నిర్వాహకులకు ఇచ్చిన భరోసా ఇది. ఆ నేత ఒక్కరే కాదు డెల్టా ప్రాంతంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పందేలరాయుళ్లకు వత్తాసు పలుకుతూ బరులు వేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు అయితే బహిరంగంగానే కోడిపందేలు నిర్వహిస్తామని, అవసరమైతే జీవో కూడా తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
కోడిపందేల నిర్వహణకు జీవో తెప్పించడమేమిటనేది ఎవరికీ అర్థం కాకపోయినా మాగంటి బాబు తమకు అండగా ఉన్నారనేది పందేలరాయుళ్లకు బాగానే అర్థమైంది. ఇక ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అండ ఎటూ ఉంటుంది. డెల్టా ప్రాంతంలో సెంటిమెంట్, గ్రామాల అభివృద్ధి పేరుతో ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ పందేలరాయుళ్లకు ఎప్పుడూ వత్తాసు పలుకుతారు. మిగిలిన టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకపోయినా ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు అవసరమైతే నానాయాగీ చేయగలరనేదానికి గత ఏడాది జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు చేసిన హల్‌చల్ తార్కాణం. సరిగ్గా ఆ ధైర్యంతోనే పందేల నిర్వాహకులు ఇప్పుడు బరులు సిద్ధం చేసేస్తున్నారు.
బరులు రెడీ
నిడదవోలులో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించేందుకు రెండు బరులను స్థానిక టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. విజ్జేశ్వరం, ముప్పవరం, తాడిమళ్ళ, సింగవరం, పెండ్యాల గ్రామాల్లో కూడా బరులు తయారు చేస్తున్నారు. పెరవలి మండలంలో ఖండవల్లి గ్రామంలోని కొబ్బరితోటలో భారీ పందెం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీస్థాయి పందేల నిర్వాహకుల్లో చాలామంది ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అనుచరులే ఉన్నారని అంటున్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేల్పూరు, తేతలి, మండపాక, దువ్వ గ్రామాలతో పాటు ఇరగవరం, సూరంపూడి, తూర్పువిప్పర్రు, రేలంగి, అత్తిలి ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేస్తున్నారు.
ఆడుకోండి... మరి నాకేంటి: టీడీపీ నేత బేరసారాలు
ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం అర్ధవరం, నిడమర్రు మండలం పత్తేపురం, ఉంగుటూరు మండలం నారాయణపురం, భీమడోలు మండలం గుండుగొలను గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఇటీవలే సమావేశం నిర్వహించారు. పోలీసులతో ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా... మరి నాకేంటి అని ఓ టీడీపీ నేత బేరసారాలు అడినట్టు తెలుస్తోంది. పెద్ద బరులకు ఒక రేటు, చిన్న బరులకు మరో రేటు ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
గూడెంలో గుట్టుచప్పుడు కాకుండా..
తాడేపల్లిగూడెంలో గుట్టుచప్పుడు కాకుండా బరులు సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంతం, లింగారాయుడుగూడెం, ఆరుగొలను, పెంటపాడు మండలం అల్లంపురం, పెంటపాడు, గూడెం మండలం పెదతాడేపల్లి, కొమ్ముగూడెం ఊళ్లల్లో పందేలు వేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఉండి నియోజకవర్గం అయిభీమవరం, సిద్ధాపురం, దుంపగడప, అప్పారావుపేట, కోళ్లపర్రు, కుప్పనపూడి, జువ్వలపాలెం, ఏలూరుపాడు, బొండాడపేట, చినమిరం, పెదమిరం, కొమటిగుంట గ్రామాల్లో భారీ ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, శేరేపాలె, మొగల్తూరు, పేరుపాలెం, మోళ్ళపర్రు, కొత్తోట గ్రామాల్లో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం, దూబచర్ల, పోతవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించటానికి టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయగూడెం, యర్నగూడెం, లక్ష్మీపురం, గోపాలపురం మండలంలో గోపాలపురం, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, కరిచర్లగూడెం, కొవ్వూరుపాడు గ్రామాల్లోనూ, ద్వారాకాతిరుమల మండలం మారంపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లోనూ కోడిపందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.