గృహ రుణంతో ప్రయోజనాలు ఇలా.. | Benefits with home loans | Sakshi
Sakshi News home page

గృహ రుణంతో ప్రయోజనాలు ఇలా..

Published Wed, Feb 21 2018 1:14 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

Benefits with home loans - Sakshi

పశ్చిమగోదావరి ,నిడమర్రు :  ఇంటి రుణం తీసుకుని సొంతిల్లు కల సాకారం చేసుకోవడమే కాదు. ఆదాయపన్ను పరిధిలో ఉన్నవారు భారీగా పన్ను ఆదా చేసుకునే అవకాశం కలదు. గృహరుణం తీసుకోవడం ఆదాయ పన్ను చెల్లింపులో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

రుణం తీసుకున్న అసలుపై
ఇంటి రుణం తీసుకున్న తర్వాత ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చెల్లిస్తుండాలి. ఇలా చెల్లించే మొత్తం రెండు భాగాలుగా చూడాలి. ఇందులో వడ్డీ, అసలు..రెండూ రుణానికి జమ అవుతాయి. ఇలా అసలుకు జమ అయ్యేదాన్ని ప్రిన్సిపల్‌గా పేర్కొంటారు. ఇలా అసలు రుణానికి జమ అయ్యే మొత్తాన్ని ఓ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద అనుమతించిన రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి మేరకు ఆదాయం మినహాయింపు కింద చూపించుకోవచ్చు.

ఉదాహరణ: ఓ ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణం ప్రిన్సిపల్‌కు రూ.1.5 లక్షలు అంతకంటే ఎక్కువే జమ చేశారనుకోండి. అప్పుడు బేసిక్‌ ఎగ్జంప్షన్‌ రూ.2.5 లక్షలు. ఇంటి రుణానికి చేసిన రూ1.5 లక్షలు కలిపి మొత్తానికి రూ.4 లక్షలపైనా పన్ను ఉండదు.
వడ్డీపైనా పన్ను ఆదా.. ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపులు ఉన్నాయి. అయితే రుణం తీసుకుని సమకూర్చుకున్న ఇంట్లో నివసిస్తూ ఉండాలి. ఇలా అయితే గరిష్టంగా ఓ ఏడాదిలో రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో చేసే చెల్లింపులపై పన్ను కట్టక్కర్లేదు. ఈ ప్రయోజనం పొందాలంటే రుణం తీసుకున్న అర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు ఇల్లు సమకూర్చుకోవాలి. కట్టిన ఇల్లయినా, లేక నిర్మాణం చేసుకున్నా గడువు ఇదే. ఈ కాల వ్యవధిలోపు ఇంటి నిర్మాణం సాధ్యం కాకపోతే పన్ను మినహాయింపు రూ.30 వేలకే పరిమితం అవుతుంది.
తొలిసారి అయితే మరో రూ.50 వేలు మినహాయింపు
మొదటిసారి ఇంటి కొనుగోలుదారులు అయితే నిబంధనల మేరకు అదనంగా మరో రూ.50 వేలు మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇంటిని అద్దెకు ఇస్తే ఆదాయంలో మున్సిపల్‌ పన్నులు పోను మిగిలిన మొత్తంలో ప్రామాణిక తగ్గింపు, వడ్డీ చెల్లింపులను నష్టంగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఇంటి అద్దె రూ.5 లక్షలు వస్తుందనుకోండి, ప్రామాణిక తగ్గింపు 30 శాతం అంటే రూ.3.5 లక్షలను నష్టంగా పరిగణిస్తారు. ఇందులో రూ.2 లక్షలను ఇతర ఆదాయం కింద పన్ను మినహాయింపుగా పొందొచ్చు. మిగిలిన రూ.1.5 లక్షలను తదుపరి ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు.

భాగస్వామితో కలసి తీసుకుంటే ప్రయోజనం
ఇంటి రుణాన్ని బార్య, భర్త కలిసి తీసుకుంటే ఇద్దరూ వేర్వేరుగా అంతే మొత్తం పన్ను మినహాయింపులు పొందొచ్చు. వడ్డీ రుపేణా చేసే చెల్లింపులపై చెరో రూ.2 లక్షలు చూపించుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న కుమారుడు, కుమార్తె కూడా ఉంటే బ్యాంకు రుణాన్ని మూడు భాగాలుగానూ చేస్తుంది. అప్పుడు ముగ్గురూ చెరో రూ.2 లక్షల చొప్పున పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది.

కొనుగోలు తేదీ నుంచి పన్ను మినహాయింపు
ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్లాట్‌ అయితే రేటు ఎక్కువే. అదే నిర్మాణంలో ఉన్న దాన్ని బుక్‌ చేసుకుంటే కొంచెం ధర తగ్గుతుంది. రుణం తీసుకుని ఇలా నిర్మాణంలో ఉన్న వాటిని కొనుగోలు చేసినట్టయితే, కొనుగోలు తేదీ నుంచి నిర్మాణం పూర్తయి చేతికి అందేలోపు వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. ఇంటి నిర్మాణం పూర్తయిన లేదా మీ చేతికి అందిన ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు సమాన వాయిదాల్లో చూపించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఇలా గరిష్ట మినహాయింపు ఒక్కో వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలుగానే ఉంటుంది.

ఇతర రుణం విషయంలో.. పనిచేస్తున్న సంస్థ నుంచి లేదా సహచర ఉద్యోగి నుంచి రుణం తీసుకున్నా లేక ప్రైవేటు వ్యాపారి నుంచి అప్పు తీసుకున్నా వాటికి పై వడ్డీ చెల్లింపులపైనా మినహాయింపునకు చట్ట ప్రకారం అర్హత ఉంది. కాకపోతే రుణం ఇచ్చిన వారి నుంచి ఓ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి వస్తుంది. ఇంటి మరమ్మతులు, నిర్వహణకు చేసే ఖర్చులను అద్దె ఆదాయంలో 30 శాతం వరకు ప్రామాణిక తగ్గింపు కింద చూపించుకోవచ్చు.

టీడీఎస్‌.. పనిచేస్తున్న సంస్థ ఉద్యోగి వేతనం పన్ను చెల్లించేంత ఉంటే ఆ మేరకు టీడీఎస్‌ రూపంలో మినహాయించి ఆదాయ పన్ను శాఖకు జమ చేస్తుంది. 2016–17 సంవత్సరపు రిటర్నులను 2018 మార్చి 31లోపు దాఖలు చేసుకోవాలి.

వడ్డీ ఆదాయం.. బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నా వాటన్నింటిలోని బ్యాలెన్స్‌ మొత్తంపై వడ్డీ రూపంలో ఏడాదికి రూ.10 వేలు ఆదాయం మించితే దానిపై పన్ను చెల్లించాలి. రూ.10 వేలు లోపు ఉంటే పన్ను కట్టక్కర్లేదు. ఆ ఆదాయాన్ని రిటర్నుల్లో ఇతర ఆదాయం కింద చూపించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement