ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
సరిగ్గా మూడేళ్లక్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి 70 స్థానాలకు 67 గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని వరస సంక్షోభాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రత్యర్థులు దాదాపు లేకపోవచ్చుగానీ వెలుపల చాలామంది ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల సంగతలా ఉంచి కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్, ఉన్నతా ధికారగణం వగైరాలతో అది వ్యవహరించాల్సి ఉంటుంది. కనుకనే ఆచితూచి అడు గేయడం ఆ పార్టీకి అవసరం. కానీ చాలాసార్లు ఆ విషయంలో అది విఫలమవు తూనే వస్తోంది. తాజాగా అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై ఆప్ ఎమ్మెల్యేలిద్దరు చేయి చేసుకున్న ఉదంతం ఆ సంగతిని రుజువు చేస్తోంది. రాజ్యాం గబద్ధంగా రావలసినవి రాబట్టుకోవడం ముఖ్యమే. కానీ అందుకు అనుసరించే విధానాలు హేతుబద్ధంగా ఉండాలి. పోరాటం విడనాడి ప్రాధేయపడాలని ఎవరూ చెప్పరు.
న్యాయంగా రావలసినవాటి గురించి పోరాడటం వేరు – అందుకు దౌర్జన్యానికి దిగడం వేరు. 2015 ఫిబ్రవరిలో అఖండ మెజారిటీ సాధించాక పార్టీ శ్రేణులను ద్దేశించి కేజ్రీవాల్ పదే పదే చెప్పిన మాట–అహంకారాన్ని దరిదాపులకు రానీయొద్దన్నదే. ఈ ఫలితాలు తనను భయపెడుతున్నాయని కూడా అప్పట్లో ఆయనన్నారు. ఇందుకు కారణాలున్నాయి. పోలైన ఓట్లలో 54.3 శాతం ఆయన పార్టీ ఖాతాలోనే పడ్డాయి. కాంగ్రెస్, బీజేపీలకొచ్చిన ఓట్ల శాతాలను కలిపినా అది ఆప్ దరిదాపుల్లో లేదు. బీజేపీకి 32.3 శాతం, కాంగ్రెస్‌కు 9.7 శాతం మాత్రమే వచ్చాయి. కనుకనే కేజ్రీవాల్ తమ పార్టీ శ్రేణులకు అంతగా హితవు చెప్పారు. కానీ ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరి సంగతలా ఉంచి కేజ్రీవాలే దీన్ని మరిచిపోయా రని ఈ మూడేళ్లలో జరిగిన పరిణామాలు చెబుతున్నాయి. ఏదో విషయంలో అటు కేంద్రంతోనూ, ఇటు అధికార యంత్రాంగంతోనూ అక్కడి ప్రభుత్వం ఘర్షణ పడు తూనే ఉంది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికార నివాసంలో సమావేశం జరిగినపుడు ఆప్ ఎమ్మెల్యేలు అమనతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాలు తనపై పిడిగుద్దులు కురిపించి గాయపరిచారని అన్షుప్రకాష్ కేసు పెట్టగా, ఆయన తమను కులం పేరుతో దూషిం చాడని ప్రకాష్ జర్వాతోపాటు మరో ఎమ్మెల్యే అజయ్ దత్ కేసు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పెట్టిన కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలనూ అరెస్టు చేసి రిమాండుకు పంపారు. తొలుత ఈ ఘటనను తాను చూడలేదని బుధవారం చెప్పిన కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్... ఆ తర్వాత స్వరం మార్చి అందుకు తాను ప్రత్యక్షసాక్షినని గురువారం వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో నిజానిజాలేమిటన్న సంగతలా ఉంచి అసలేమీ జరగకుండా పరిస్థితి ఇంతవరకూ రాదన్నది వాస్తవం. చానెళ్లకు విడుదల చేయాల్సిన ఒక వాణిజ్య ప్రకటన గురించి, రేషన్ పంపిణీ గురించి ఇంత వివాదం తలెత్తిందంటే, అది సీనియర్ ఐఏఎస్ అధికారిని కొట్టేంతవరకూ వచ్చిందంటే ఆశ్చ ర్యం కలుగుతుంది. ఇంతకూ రేషన్ పంపిణీ గురించి జరిగిన ఈ సమావేశంలో పౌరసరఫరాల మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ లేరు! ఇలా అధికారులతో ఆప్ నేతలు గొడవపడటం తొలిసారి కాదు. కీలకమైన అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్దే కేంద్రీకృతమైన ఢిల్లీ వంటిచోట కొందరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంపై చిన్న చూపు ఉన్నదంటే అందులో వింతేమీ లేదు. అలాంటి పరిస్థితిని తమకు అనుకూ లంగా మలుచుకుని ఎదగడానికి ప్రయత్నించేవారు సహజంగానే ఉంటారు. అలాగే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించి ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కార్యక్రమాలు అమలు కావడానికి దోహదపడేవారూ ఉంటారు. అంతిమంగా ఇలాంటి అధికారులందరితో పనిచే యించుకోవాల్సింది, సమన్వయంతో మెలగాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర, రాష్ట్రాల మధ్య వైరం వల్ల తమకు సస్పెన్షన్లు, వేతనాల కోతలు, సీబీఐ దాడులు తప్పడం లేదని ఆమధ్య ఢిల్లీ ఐఏఎస్‌ల సంఘం, సబార్డినేట్ సర్వీసుల సంఘం ఆవేదన వ్యక్తం చేశాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై అఖిల భారత ఐఏ ఎస్‌ల సంఘం సకాలంలో స్పందించి అటు తమ సహచరుల పనితీరు విషయంలో సలహాలిస్తూ ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వారెదుర్కొంటున్న సమస్యల్ని తీసుకెళ్లి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు. ఈ పరిణామాల పర్యవసా నంగా కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నట్టే అధికారగణం విశ్వసనీయతపై కూడా సందేహాలు ఏర్పడుతున్నాయని ఆ సంఘం గుర్తించాలి.
ఢిల్లీ పరిస్థితి విచిత్రమైనది. అక్కడ పేరుకు ప్రభుత్వం, అసెంబ్లీ ఉన్నా... ఆ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరి అధికారాలు చలాయించలేదు. శాసనాలు చేయడానికి అసెంబ్లీకి ఉండే అధికారాలు కూడా పరిమితమైనవి.
ప్రతి దానికీ కేంద్రం వైపు చూడాల్సిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అత్యంత కీలకమైన ఉపకరణమని భావించే పోలీసు శాఖ కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. అది దేశ రాజధాని ప్రాంతం కావడం వల్ల రాజ్యాంగంలోని 239ఏఏ అధికరణ ద్వారా ఈ ప్రత్యేక పరిస్థితిని కల్పించారు. అయితే ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తా మని ఒకానొక సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కేంద్రంలో తమ నేతృత్వంలో ప్రభుత్వాలు వచ్చినా ఆ హామీ నెరవేర్చడానికి సిద్ధ పడలేదు. 2013లో ఎన్నికై స్వల్పకాలం పాలించిన సమయంలో యూపీఏ సర్కారు ఉన్నా, ఇప్పుడు ఎన్‌డీఏ సర్కారున్నా ఆప్ సమస్యలు షరా మామూలే. ఢిల్లీ సర్కా రుకు తగినన్ని అధికారాలివ్వడమంటే వ్యక్తిగతంగా కేజ్రీవాల్‌కు అధికారా లివ్వడం కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల అభీష్టాన్ని, ఆకాంక్షలను గుర్తిం చడం. వారికి మెరుగైన పాలన అందడానికి దోహదపడటం. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులనూ, పార్టీలనూ, ప్రభుత్వాలనూ గౌరవించే సంస్కృతిని ఆచరిస్తే ప్రజాస్వా మ్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. వారికి కూడా ప్రజాస్వామిక సంస్కృతి అలవడుతుంది. అందుకు బదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం కలహిం చుకున్నప్పుడు ఓడేది ప్రజాస్వామ్యమే.
Comments
Please login to add a commentAdd a comment