అన్షు ప్రకాశ్
ఆ పార్టీ వాళ్లు ఇలాంటి హింసను చట్టబద్ధం చేస్తే ఆ స్థాయి అధికారుల మీద దాడికి సంబంధించి దేశం నలుమూలలా ఉన్న కొరకరాని కొయ్యల వంటి రాజకీయనాయకులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయి. నిజాయితీ కల అధికారి ఒక ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఆదేశాలను తప్పుడు ఆదేశాలుగా భావించి తిరస్కరించినప్పుడు దానికి పరిష్కారం ఊహించండి. అలాంటి అధికారిని మీ ఇంట్లో జరిగే భేటీలోనో లేక అతడి కార్యాలయంలోనో చితకబాదడమే పరిష్కారమా?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుండెలు తీసిన భయానక వీధి రౌడీలతో రూపొం దిందన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కానీ ఆప్‌ను గట్టిగా వ్యతిరేకించేవారితో సహా చాలామంది అంగీకరించే మరొక విషయం మాత్రం ఉంది. నరేంద్ర మోదీ ప్రభ వెలిగిపోతున్న కాలంలో, అంటే 2014–15 సంవత్సరం శీతాకాలంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 70 స్థానాలకు గాను 67 చోట్ల గెలిచింది. అలా అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీకి అది ఇబ్బందికరంగా పరిణిమించింది. కేంద్రం ఆ పార్టీ ప్రభుత్వంతో ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభించింది కూడా. ఆఖరికి పూర్తి రాష్ట్ర హోదా లేనప్పటికి, ఉన్న ఆ తక్కువ అధికారాలను కూడా చలాయించకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి, మృదుభాషి, చాలామంది అభిమానించే అన్షు ప్రకాశ్ (1986 బ్యాచ్) మీద సోమవారం రాత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసంలో చేయి చేసుకున్న సంఘటన జరిగిందని చెబితే, దానిని చాలామంది సందేహిస్తారంటే నేను నమ్మను.
ప్రభుత్వాలకీ, అధికారులకీ ఘర్షణ పాతదే
ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకీ, ప్రభుత్వోద్యోగులకీ మధ్య ఘర్షణ కొత్త విషయం కాదు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా ప్రభుత్వోద్యోగులను ముఖ్యమంత్రులు కించపరిచే సంస్కృతి కూడా కొత్తది కాదు. చాలామంది నాయకులు అధికారులను తమ తస్మదీయుల చుట్టూ తిరిగేటట్టు చేసి, అందులో నుంచి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాయావతి అధికారుల బదలీ విషయంలో మహారాణి అనిపించుకున్నారు. అలాంటి అధికారాన్ని చలాయించడం గర్వకారణంగా కూడా ఆమె భావించేవారు. 2005లో ఆమెతో నేను ‘వాక్ ది టాక్’ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయాన్ని మాయావతి ఘనంగా చెప్పారు కూడా. తన గురువు కాన్షీరామ్‌ను మొదటిసారి కలుసుకున్నప్పుడు (ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాన్షీరామ్ హుమాయూన్ రోడ్‌లోని నివాసం ఫస్ట్‌ఫ్లోర్‌లో కోమాలో ఉన్నారు) ఆమె ఐఏఎస్ పరీక్షకు సమాయత్తమవుతున్నారు. ఐఏఎస్ పరీక్షను పట్టించుకోవద్దనీ, తనతో పాటు రాజకీయాలలో చేరమని ఆయన చెప్పారు. ‘నీవు మామూలు ఐఏఎస్ అధికారివి కావాలని అనుకుంటున్నావు. కానీ ఆ ఐఏఎస్ అధికారులంతా నీ చుట్టూ తిరిగేటట్టు నేను చేస్తాను’ అని ఆయన అన్నారు. అలాగే చేసిన వాగ్దానాన్ని కాన్షీరామ్ నిలబెట్టుకున్నారు కూడా. బెహెన్జీ కూడా ఏమీ తగ్గకుండా వారిని తన చుట్టూ తిప్పించుకున్నారు. 2007 ఎన్నికల సమయంలో బదయూన్‌లో జరిగిన ఒక సభలో సభికుల హర్షధ్వానాల నడుమ ఇందుకు తగ్గట్టే ఆత్మస్తుతి కూడా చేసుకున్నారు. తను పేరు చెబితేనే ఉద్యోగస్వామ్యం గడగడలాడిపోతుందని ఆమె అన్నారు.
మాయావతి అంటే గడగడలాడిపోవడానికి అవసరమైనంత భయాన్ని ఆమె అధికారులకి పుష్కలంగా ఇచ్చారు. ఆమె తరుచూ వారిని బదలీలు చేసేవారు. బదలీ చేసిన కొత్త ప్రదేశానికి వారు కుటుంబాలను తరలించే అవకాశం లేకుండా అవి జరిగేవి. దీనితో కుటుంబాలను పదే పదే తిప్పడం ఇష్టం లేక ఉద్యోగులు సర్కిట్ హౌస్‌లో మకాం పెట్టేవారు. చదువుకుంటున్న పిల్లలు ఉంటే మరీ ఇబ్బంది. ఏ పోస్టులో ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలిసేది కాదు. నిజానికి మాయావతి అంటే ఎంత భయపడేవారో, అంతగానూ అధికారులు ద్వేషించేవారు. కేంద్ర సర్వీసులలోకి, ఆఖరికి ద్వితీయ స్థానాలకు వెళ్లడానికి కూడా ప్రయత్నించేవారు.
ఇలా ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించిన రాష్ట్రాలలో నాకు తెలిసి హరియాణా కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా బన్సీలాల్, ఓంప్రకాశ్ చౌతాలా హయాములు అధికారులను వేధించడానికి పేర్గాంచాయి. ఆ సమయంలో అక్కడ తరుచూ ఉద్యోగుల బదలీలు ఉండేవి. వారి మీద అవినీతి కేసులు మోపేవారు. విజిలెన్స్ దర్యాప్తులు వంటి చర్యలు ఉండేవి. అలాగే అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇష్టులని పేరు పడిన వారికి బాధ్యతలు అప్పగించకుండా కూర్చోబెట్టడం కూడా జరిగేది (ఇలాంటి శిక్షకే ఖుద్దే లైన్ అని పేరు. అదేమిటో అనువదించి చెప్పడం ఇక్కడ బొత్తిగా అనవసరం). ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా చెప్పవచ్చు. రాజకీయ నేతల కుత్సిత మనస్తత్వానికి అద్దం పడుతూ ఉండే ఇంకొన్ని వాస్తవిక ఘటనలను కూడా ఉదాహరించవచ్చు. పత్రికా రచయితగా నా నలభయ్ ఏళ్ల జీవితంలో ఇలాంటి మరొక ఘటన జరిగినట్టు వెంటనే చెప్పమంటే నాకు కష్టమే. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద చేయి చేసుకోవడం, అందులోను ముఖ్యమంత్రి నివాసంలో అది జరిగిన ఉదంతం నాకు తక్షణం ఏదీ గుర్తుకు రావడం లేదు.
దాడి జరగలేదంటే ఎవరూ నమ్మరు
వైద్యుల నివేదిక, ఇప్పటిదాకా లభించిన వీడియో ఆధారాలు పరిశీలించినా, మూడు దశాబ్దాలుగా మంచి పేరు సంపాదించుకున్న అన్షు ప్రకాశ్ మాటను బట్టి ముఖ్యమంత్రి నివాసంలో దాడి జరిగిందనే వాస్తవాన్ని సందేహించడానికి అవకాశం తక్కువే. కాబట్టి ఇందులో వాస్తవం ఏమిటి అనేదాని గురించి చర్చ అనవసరం. ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయకుడు వీకే జైన్ కూడా ప్రకాశ్ మీద చేయి చేసుకున్న మాట నిజమని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. రోజులూ గంటలూ గడిచే కొద్దీ ఆప్ అధికార ప్రతినిధి సహా ఇతర నాయకులు కూడా తమ తమ వైఖరులను సడలిస్తూ వచ్చారు. అసలు అలాంటి దాడి ఏదీ జరగలేదని మొదట చెప్పారు. తరువాత మరింత అలక్ష్యంతో, న్యాయమూర్తి లోయా హత్య కేసులో అమిత్‌షాను ప్రశ్నించడానికి ఏమీ లేనట్టే భావిస్తూ, ‘ఏవో రెండు దెబ్బల’కే ముఖ్యమంత్రి ఇంటికి పోలీసులను పంపించి విచారిస్తారు అనే వరకు వారి మాటలు నడిచాయి. ఈ వైఖరిని మీరు పాత తరహా దబాయింపు అని పేర్కొనవచ్చు. నేను ఇంకో అడుగు ముందుకు వేసి దీనిని రాజ్యాంగపరమైన దురహంకారానికి మించినదని అంటాను. పశ్చాత్తాపం సంగతి పక్కన పెడదాం. మీ పాలనలో ఉన్న వ్యక్తి మీద జరిగిన దాడికి చిన్న సానుభూతి పదం కూడా నోటి నుంచి రాలేదు. భౌతికదాడికి గురైన వ్యక్తికి సంఘీభావం అసలే ప్రకటించలేదు.
ఢిల్లీ స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్, కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ గడచిన మూడేళ్లుగా సంఘర్షిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనీ, పంపిన ఫైళ్లనీ లెఫ్టినెంట్ గవర్నర్లు నిరాకరిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్లు మార్చడం లేదా నిరాకరించడం చేశారు. ముఖ్యమంత్రి సన్నిహిత ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ మీద సీబీఐ దాడి చేయించి అవినీతి కేసును నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న అవినీతి నిరోధక శాఖను వారి అధీనం నుంచి తొలగించారు. ఆర్థిక లబ్ధి ఉన్న పదవులలో ఉన్నారన్న ఆరోపణతో ఈ మధ్యనే 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిపారసు చేసింది. ఆ వారాంతంలోనే రాష్ట్రపతి అనుమతి కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ జాబితాకు అంతు ఉండదు. కానీ ఇది అధికారులు, నియమ నిబంధనల పేరుతో కేంద్రం వైపు నుంచే ఎక్కువ దాడి జరిగిన సంగతిని మనకి చెబుతుంది. దీనికి కేవలం మాటలతోనే ఆప్ ఎదురుదాడికి దిగింది. ఆ మాటలలో చాలా ప్రసిద్ధమైనవి లేదా చాలా అవమానకరమైనవి మోదీని గురించి కేజ్రీవాల్ చేసిన వర్ణనలే. మోదీని కేజ్రీవాల్ అబద్ధాల కోరు, మానసిక రోగి అన్నారు. ప్రకాశ్ మీద జరి గిన దాడి నేపథ్యంలో ఈ మాటల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.
ఇదే సంస్కృతి విస్తరిస్తే...
ఇది దేనికి దారితీస్తుందంటే, మనం దేనిని మున్నెన్నడూ లేనిది అంటున్నామో, అదే కొత్త ఉదాహరణను కూడా ప్రవేశపెడుతుంది. అన్షు ప్రకాశ్ విషయంలో మనలని ఎక్కువ భయపెట్టేది అదే. ఆప్‌ను భయానక వీధి రౌడీల మూక అని మనం చెప్పాల్సిందే. కానీ ఆ పార్టీ వాళ్లు ఇలాంటి హింసను చట్టబద్ధం చేస్తే ఆ స్థాయి అధికారుల మీద దాడికి సంబంధించి దేశం నలుమూలలా ఉన్న కొరకరాని కొయ్యల వంటి రాజకీయనాయకులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయి. నిజాయితీ కల అధికారి ఒక ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఆదేశాలను తప్పుడు ఆదేశాలుగా భావించి తిరస్కరించినప్పుడు దానికి పరిష్కారం ఊహించండి. అలాంటి అధికారిని మీ ఇంట్లో జరిగే భేటీలోనో లేక అతడి కార్యాలయంలోనో చితకబాదడమే పరిష్కారమా? ఈ వ్యవహారంలో మనకు వినపడుతున్న వాదనల్లో ఒకటి ఏమిటంటే.. ప్రధాన కార్యదర్శి లేక అధికారులు.. రెండున్నర లక్షలమంది ప్రజలకు రేషన్ కార్డులను తిరస్కరించిన విషయాన్ని పట్టించుకోలేదన్నదే. అలా అని చెప్పి రాజకీయ నేతలు ఈ అధికార్ల పైకి మూకను ఉసిగొల్పుతారా?
రాజకీయ నేతలు, ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులకు మధ్య సున్నితమైన సంబంధం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనేది మంచి నాయకత్వానికి తెలుసు. ఒక రాష్ట్ర నాయకుడు, అదీ ఢిల్లీ వంటి పరిమిత అధికారాలు కల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి సమస్యలను పరిణామాలు దిగజారిపోని రీతిలో పరిష్కరించాల్సి ఉంది. తనకు సాధ్యం కానప్పడు సమస్యను అత్యున్నత రాజ్యాంగాధికారుల దృష్టికి తీసుకుపోవలసి ఉంటుంది. అది కూడా విఫలమైతే, బహిరంగంగా నిరసన తెలుపడం, మీడియా దృష్టికి తీసుకుపోవడం, (ఆప్‌కి ఇది వెన్నతో పెట్టిన విద్య) వంటి అవకాశాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీ ఇంట్లో దెబ్బలు తినడం – రెండు చెంపదెబ్బలే కావచ్చు– గర్వించవలసిన విషయం మాత్రం కాదు.
2014లో నా పుస్తకం ‘యాంటిసిపేటింగ్ ఇండియా’ ముందుమాటలో నేను ఒక ముఖ్యమైన అంశం ప్రస్తావించాను. మోదీ, రాహుల్, కేజ్రీవాల్ త్రయం మన వర్తమాన రాజకీయాల్లో అద్భుతమైన లక్షణాలను ప్రదర్శించనున్నారని, జర్నలిస్టుల జీవితాలకు ఇవి ఏమాత్రం విసుగెత్తించే క్షణాలు కావని నేను రాశాను. పైగా ఈ ముగ్గురు నేతలూ పరిణితి సాధిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాను. మోదీ ప్రధాన స్రవంతి సమన్వయం వైపుగా పయనిస్తారని, రాహుల్ బహిరంగ జీవితంలో బిడియాన్ని పక్కన పెడతారని రాశాను. కేజ్రీవాల్ వ్యవస్థాగతమైన శాంతివైపు పయనిస్తారని రాశాను. ఈ మూడో అంశంలో నా అంచనా తప్పు అని ఈ వారం మనకు చెబుతోంది.
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్
శేఖర్ గుప్తా
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment