ఎన్నికల మహా సంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతున్న వేళ ఆ పార్టీ నాయకశ్రేణిలో ముఖ్యుడ నదగ్గ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం కన్నుమూశారు. ఆయన్ను కేన్సర్ మహ మ్మారి కొంచెం కొంచెంగా ఎలా కబళిస్తున్నదో మీడియా ద్వారా అప్పుడప్పుడు ఆయన్ను చూస్తున్న వారందరికీ అర్థమవుతూనే ఉంది. పరీకర్‌కు తీవ్ర అనారోగ్యంగా ఉన్నా, దానివల్ల ఆయనకు ఎంతో అసౌకర్యంగా ఉంటుందని తెలిసినా బీజేపీ అధినాయకత్వం ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయకపోవడం... ఆయన మరణించిన 24 గంటల తర్వాత కూడా కొత్త నాయకుణ్ణి నిర్ణయించలేక పోవడం గమనిస్తే పరీకర్ ప్రాముఖ్యత తెలుస్తుంది. గర్వాతిశయాలు లేకపోవడం, అధికార దర్పం ఎన్నడూ ప్రదర్శించకపోవడం, సామాన్యులతో సైతం ఆదరణగా మాట్లాడటం పరీకర్ ప్రత్యేక తలు. ఆయన తరచుగా స్కూటర్‌పై రివ్వుమంటూ వెళ్లడం గోవా వాసులకు పరిచిత దృశ్యం. తాను రక్షణమంత్రిగా ఉన్న సమయంలోఒక వేడుకకు హాజరయ్యే పాత్రికేయులు బూట్లు ధరించి రావా లని తన మంత్రిత్వ శాఖ అధికారులు షరతు విధించినట్టు తెలుసుకుని, తానే ఆవేడుకకు చెప్పులు ధరించి వచ్చిన తీరు పరీకర్ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది.
పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఆరె స్సెస్ భావాలు ఒంటబట్టించుకున్న పరీకర్ చివరివరకూ ఆ భావాలతోనే ప్రయాణించినా రాజ కీయాల్లో అందరివాడిగా, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇది అసా ధారణమనే చెప్పాలి. తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా 2000 సంవత్సరంలో బాధ్యతలు స్వీక రించి, వరసగా నాలుగు దఫాలు ఆ పదవిలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయం సాధించాక ఆయన 2017 వరకూ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే గోవా రాజకీయాల్లో ఆయన లేకపోవడం బీజేపీని ఎంత నష్టపరిచిందో ఆ తర్వాత పార్టీ అధినాయ కత్వానికి అర్థమైంది.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలతో మెజారిటీ పక్షంగా అవతరించగా, బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆ వెంటనే ఆగమేఘా లమీద పరీకర్‌ను కేంద్ర నాయకత్వం గోవాకు పంపింది. పరీకర్ వచ్చీ రావడంతోనే రాష్ట్రంలోని చిన్న చిన్న పార్టీలతో సమావేశమై వాటిని బీజేపీ ఛత్రఛాయలోకి తీసుకొచ్చి అక్కడ కూటమి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మెజారిటీ స్థానాలు లభించిన కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పా టుచేసే అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు ఎదురయ్యాయి. సీఎంగా ఆయన పనితీరు విలక్షణ మైనది. ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తున్నప్పుడు విమాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిం చడం దీనికి ఉదాహరణ. అలా తగ్గించడం వల్ల ఆదాయం పడిపోతుందని, అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అధికారులు వారించినా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఇంధనం కోసం గోవాకు రాత్రి వేళల్లో భారీగా విమానాలు రావడం మొదలై ప్రభుత్వ ఆదాయం మూడు రెట్లు పెరిగింది.
గోవాలో బహుళ మతాలు, తెగలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 27 శాతంమంది క్రైస్తవులు, 9 శాతం ముస్లింలు. పైగా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)వంటి బలమైన ప్రాంతీయ పార్టీ లున్నాయి. అలాంటిచోట ఆరెస్సెస్ భావాలను వ్యాప్తి చేయడం, ఆ సంస్థను పటిష్టపరచడం సులభం కాదు. కానీ పరీకర్ ఎంతో చాకచక్యంతో, నైపుణ్యంతో ఆ పని చేయగలిగారు. రాజకీ యాల్లోకి ప్రవేశించాక బీజేపీని సైతం ఆ విధంగానే తిరుగులేని రాజకీయ శక్తిగా రూపొందించారు. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు... బహుళ మతాలవారున్న నియోజకవర్గం నుంచి 1994 మొదలుకొని ప్రతి ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. ఈ కారణాలన్నిటి వల్లా జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2014లో జరిగే సార్వత్రిక ఎన్ని కలకు బీజేపీ ప్రచార సారథ్యం ఎవరు స్వీకరించాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు నరేంద్రమోదీ పేరును ప్రతిపాదించింది పరీకరే. బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా తనకొచ్చిన ఈ అవ కాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పీఠం ఎక్కారు.
గోవా వంటి ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడు కేంద్రంలో కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించడం మాటలు కాదు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులతో ముడిపడి ఉండే రక్షణ కొనుగోళ్ల కారణంగా ఆ శాఖను నిర్వహించడం కత్తి మీద సాము. ఆ శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎంతటి ఉద్దండులైనా జంకుతారు. ఒకవేళ ఎవరైనా ఉత్సాహం చూపినా ప్రధానిగా ఉన్నవారు ఎన్నో విధాల ఆలోచించిగానీ వారికి ఆ శాఖ అప్పగించరు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక రక్షణ శాఖ వ్యవహారాలు చూడటానికి మనోహర్ పరీకర్ తగినవారని నిర్ణయించారంటేనే ఆయన సచ్చీలత, నిజాయితీ వెల్లడవుతాయి.
ఇప్పుడు ఎంతో వివాదా స్పదంగా మారిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కూడా పరీకర్ భిన్నంగా ఆలో చించారని చెబుతారు. సుఖోయ్–30 యుద్ధ విమానాలైతే మన వైమానిక దళ తక్షణావసరాలు తీరుస్తాయని, త్వరగా సమకూర్చుకోవడం వీలవుతుందని, రఫేల్‌తో పోలిస్తే ఆర్థికంగా కూడా అవి మెరుగని ఆయన భావించారంటారు. రక్షణమంత్రిగా ఆయన సైనిక దళాల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారు. మన ఆయుధ సంపత్తి ఆధునీకరణకు కృషి చేశారు. సైనిక దళాలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ‘వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం ఆయన హయాంలోనే అమల్లోకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పరీకర్‌ను మైనింగ్ స్కాం వంటి వివాదాలు కూడా చుట్టుముట్టకపోలేదు. కానీ విభిన్నంగా ఆలోచించడం, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా వ్యవహరించడం, ప్రత్యర్థులతో సైతం అరమరికల్లేకుండా మాట్లాడటం ఆయన విశిష్టత. కనుకనే మనోహర్ పరీకర్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులభం కాదు.
Comments
Please login to add a commentAdd a comment