వేతన సవరణ | central government pay scale changed for employees | Sakshi
Sakshi News home page

వేతన సవరణ

Published Sat, Jul 2 2016 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

వేతన సవరణ - Sakshi

వేతన సవరణ

జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం నిరుడు నవంబర్‌లో చేసిన సిఫార్సులపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడింది. ‘దాదాపు అన్ని’ సిఫార్సులనూ ఆమోదించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ జనవరినుంచి సిఫార్సులను అమలు చేయాలన్న సంఘం సూచన మేరకు ఆర్నెల్ల బకాయిలతోసహా కొత్త జీతాలిస్తామని ఆయన చెప్పారు. సంఘం సిఫార్సులు వెలువడినప్పుడే కేంద్ర సిబ్బంది తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పెంపు లేదని విమర్శించారు. వీటిని సవరించి తమకు న్యాయం చేయాలని అడిగారు.

ప్రభుత్వం మాత్రం సంఘం సిఫార్సులకు మాత్రమే కట్టుబ డింది. కనీస వేతనం రూ. 7,000ను రూ. 18,000కు(157 శాతం) పెంచడం... ఇప్పుడున్న గరిష్ట వేతనం రూ. 90,000ను రూ. 2,50,000 చేయడం... అలవెన్సు లను 63 శాతానికి, మూల వేతనాన్ని 16 శాతానికి పెంచడం ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రధానమైనవి. పింఛన్‌దార్లకు ఈ పెంపు 24 శాతం వరకూ ఉంది. జీతం, అలవె న్సులు అన్నీ కలుపుకుంటే మొత్తంగా 23.55 శాతం మేరకు పెరుగుదల ఉంటుంది.  వేతన సంఘం సిఫార్సులు వెలువడినప్పుడూ... వాటిని ఆమోదిస్తున్నట్టు కేంద్రం ప్రకటించినప్పుడూ సహజంగానే ఉద్యోగ సంఘాలు, విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి. ఈసారి కూడా అలాంటి విమర్శలే వినిపించాయి. గత ఏడు దశా బ్దాల్లో ఇంత తక్కువగా ఎప్పుడూ పెంచలేదని సిబ్బంది సంఘాలు అంటున్నాయి. సాధ్యమైనంత వరకూ ఖర్చు తగ్గించుకోవడానికే ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి గనుక అందులో వింతేమీ లేదు.

ఉద్యోగులు ఆశించిన దానికి మించి ఇచ్చి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన సందర్భం ఒకే ఒకటుంది. 2008లో మన్మోహన్ సర్కారు సిబ్బంది వేతనాలు 20 శాతం పెంచాలని ఆరో వేతన సంఘం సిఫార్సు చేస్తే దాన్ని 35 శాతానికి మించి హెచ్చించింది. 2007 జనవరినుంచి కొత్త వేత నాలు అమలు చేయాలని కోరితే ఇంకా వెనక్కెళ్లి వేతన సంఘం ఏర్పర్చిన ప్పటినుంచీ అంటే... 2006 జనవరినుంచి అమలు చేసి రెండేళ్ల బకాయిలు చెల్లించింది. పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా ప్రపంచీకరణ విధా నాలు అమలుచేసి దేశ గతినే మార్చిన మన్మోహన్ అలా చేయడానికి కారణం అప్పట్లో ముంగిట్లోకొచ్చిన ఎన్నికలే. అలా చేయడం 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి లాభదాయకమైంది కూడా. నిజానికి ఆ అనుభవంతోనే ఆ సర్కారు 2014 ఎన్నిక లకు వెళ్లే ముందు జస్టిస్ మాథుర్ నేతృత్వంలో వేతన సంఘాన్ని నియమించింది.

వేతన సంఘం సిఫార్సుల వల్ల మొత్తం కోటిమందికి లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వంపై అదనంగా లక్షా 2 వేల కోట్ల భారం పడుతుందని గణాంకాలు చెబు తున్నా అలవెన్సులకు సంబంధించిన ప్రతిపాదనలు కమిటీ పరిధిలో ఉన్నాయి గనుక ఇదింకా తక్కువే ఉండొచ్చు. తాజా పెంపుదల వల్ల లాభాలుంటాయనేవారు కొందరైతే ఇబ్బందులు ఏకరువు పెట్టేవారు మరికొందరు. ఈ ఏడాది బడ్జెట్‌లో వేతనాల కోసం చేసిన కేటాయింపులను మించి కేంద్రం అదనంగా రూ. 38,200 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇది వచ్చే బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్న మాట. అలాగే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని అంటున్నారు. అయితే ఈ రెండింటి విషయంలోనూ అరుణ్ జైట్లీ ధీమాగా ఉన్నారు. అందుకు ఇతరత్రా కారణాలున్నాయి.

సిఫార్సుల అమలువల్ల రూ. 45,110 కోట్ల మేర వినియోగం(జీడీపీలో 0.30శాతం), రూ. 30,710 కోట్ల మేర(జీడీపీలో 0.20శాతం) పొదుపు పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేస్తోంది. బ్యాంకు డిపాజిట్లు, వినియోగ వస్తువులు, ఇతర సేవల కొనుగోలు వల్ల వృద్ధి రేటు వర్తమాన సంవత్సరంలో జీడీపీ 7.9 శాతం ఉండగలదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరం జీడీపీ 7.6 శాతంతో పోలిస్తే ఇది 0.3 శాతం ఎక్కువ. ఉద్యోగుల వినియోగ వస్తు కొనుగోళ్లపై పారిశ్రామిక రంగం కూడా ఆశాభావంతోనే ఉంది. అలాగే రియల్‌ఎస్టేట్ కూడా పుంజుకుంటుందని ఆ రంగం భావిస్తోంది. ఇలాంటి వన్నీ అరుణ్ జైట్లీకి ఆశావహంగా ఉన్నాయి. అయితే ఉద్యోగులు జరిపే కొనుగోళ్ల వల్ల పెరిగే జీడీ పీ దేన్ని ప్రతిఫలిస్తుందన్న ప్రశ్న ఉండనే ఉంది. దేశ ప్రజలందరికీ ఉపాధి సమకూరి, వారి ఆర్థిక స్తోమత పెరిగితే...తద్వారా ప్రజల కొనుగోలు శక్తి మరింత హెచ్చితే వేరు.

కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి వేతనాలు పెంచినప్పుడల్లా రాష్ట్రాల్లోని ఉద్యోగులు సైతం ఆ నిష్పత్తికి అనుగుణంగా తమకు కూడా పెంచాలని డిమాండ్ చేస్తారు. కనుక ఈ ఏడాది ఆఖరుకు ఎన్నికలకు వెళ్లబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల సిబ్బంది నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిళ్లు బాగానే ఉంటాయని ఊహించుకోవచ్చు. ముఖ్యంగా యూపీలోని అఖిలేష్ సర్కారుపై అసంతృప్తి పెర గడం ఖాయం. ఎందుకంటే కేంద్ర సిబ్బందిలో అధిక శాతం ఆ రాష్ట్రానికి చెందిన వారే. తమ తోటివారికి ఆ స్థాయిలో జీతాలు హెచ్చి తమకు మాత్రం అరకొరగా ఉన్నాయన్న అసంతృప్తి అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి ఉంటుంది. పోనీ ఏదో మేరకు చేద్దామనుకున్నా ఇప్పటికే అక్కడ లోటు బడ్జెట్ ఉంది. ఏతావాతా వచ్చే ఎన్నికల్లో అక్కడ బీజేపీకి సానుకూల పవనాలు వీస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లకోసారి ఏర్పరిచే వేతన సంఘాలు చేసే సిఫార్సుల కోసం ఆ దశాబ్దమంతా ఉద్యోగులు ఆత్రంగా ఉంటారు.

వేతన సంఘం నియామకం ఒక ఎత్తయితే అది అందరి అభిప్రాయాలూ తీసుకుని ఒక నిర్ణయానికి రావడం మరో ఎత్తు. సంఘం ఏ చెబుతుందో, చివరకు ప్రభుత్వం ఏం చేస్తుందో నన్న ఉత్కంఠ సిబ్బంది అందరిలోనూ ఉంటుంది. సిబ్బందిని సంతృప్తిపరిచి, వారికి మంచి వేతనాలివ్వాలని, అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరగకుండా చూడాలని ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తుంది. అయితే అదే సమయంలో దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాలు కూడా ఉన్నాయని అక్కడివారు కూడా ఇబ్బం దుల్లో ఉంటారని... వారికి కూడా తగిన వేతనాలు అందేలా చూడటం అవసరమని పాలకులు గుర్తించడం లేదు. వారికంటూ చట్టాలున్నాయి. నిబంధనలున్నాయి. కాదనడం లేదు. కానీ అవి అమలవుతున్నాయో, లేదో చూసే పని సక్రమంగా జరుగుతున్నదా అన్నది ఆలోచించాలి. అప్పుడే అందరి మొహాల్లోనూ చిరునవ్వులు కనబడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement