మట్టి మనిషి మళ్లీ దగాపడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రజా ప్రయోజనం పేరుతో తమను వీధిన పడేస్తున్న 120 ఏళ్లనాటి భూసేకరణ చట్టం విరగడై అంతో ఇంతో ప్రయోజనం చేకూర్చేలా కొత్త చట్టం వచ్చిందని రైతాంగం సంబరపడేలో గానే అది కాస్తా ఆవిరవుతున్నది. సరిగ్గా ఈ ఏడాది జనవరి 1నుంచి అమల్లోకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం పీకనొక్కే ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. నూతన సంవత్సర సంబరాల్లో అందరూ మునిగి తేలేవేళ ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రాబోతున్నది. 1894 నాటి భూసేకరణ చట్టం ఆరున్నర దశాబ్దాలుగా, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ అనంతరం ప్రజానీకంలో కల్లోలం సృష్టించింది.
‘ప్రజాప్రయోజనం’ మాటున ఏ భూమినైనా సర్కారు స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం కల్పించిన ఆ చట్టంవల్ల లక్షలాదిమంది జనం వీధులపాలయ్యారు. స్వాతంత్య్రం వచ్చాక భూసేకరణవల్ల దాదాపు 6 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. వారిలో 20 శాతం మందికి కూడా ఇప్పటివరకూ పునరావాసం దక్కలేదు. అమ్మలాంటి పంటభూమితో తమకున్న పేగుబంధాన్ని తెంచే దుష్ట పోకడలపై సింగూరు, నందిగ్రామ్, భట్టాపర్సాల్ వంటి చోట్ల బడుగు రైతులు తిరగబడ్డారు. ఒడిశాలో పోస్కో కర్మాగారం కోసం భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగినప్పుడల్లా అక్కడి రైతాంగం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఉదంతాలన్నిటా పోలీసుల కాల్పుల్లో పదులకొద్దీమంది తనువు చాలించారు. వేలాదిమంది జైళ్లపాలయ్యారు. ఇన్ని జరిగాక రైతుల కడుపు కొడుతున్న ఆ చట్టాన్ని మార్చాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత... ఎన్నో శషభిషల తర్వాత 2013 చివరిలో కొత్త చట్టం పురుడుపోసుకుంది. ఇందుకు ఆనాడు విపక్షంలో ఉన్న బీజేపీ సైతం ఆమోదముద్రేసింది. పనిలో పనిగా కొన్ని సవరణలనూ చేర్పించింది. రైతులు నెత్తురు చిందించి, ప్రాణాలొడ్డి సాధించుకున్నవన్నీ ఈ ఆర్డినెన్స్ వమ్ముచేస్తున్నది.
రైతుల ప్రయోజనాలకే ఇదంతా... వారికి మరింత మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించడమే తమ ధ్యేయమంటున్న ఎన్డీయే సర్కారువన్నీ ఊకదంపుడు మాటలేనని ఆర్డినెన్స్‌లోని నిబంధనలు చూస్తే అర్థమవుతుంది. ‘అచ్ఛే దిన్’ ఆశలు కల్పించి అందలమెక్కినవారు చివరకు కార్పొరేట్ ప్రపంచానికి వాటిని కొత్త సంవత్సర కానుకగా అందజేయబోతున్నారు. దేశంలోని భూమంతటికీ రాజ్యమే అసలు యజమానని...పట్టాలున్నా, మరే ఇతర కాగితాలున్నా దాని ముందు చెల్లుబాటుకావన్న వలస పాలకుల నాటి భావనకు ఈ ఆర్డినెన్స్ ప్రాణప్రతిష్ట చేస్తున్నది. పంట భూముల సేకరణకు రైతుల అనుమతి తప్పనిసరి అని చెబుతున్న ప్రస్తుత చట్టంలోని నిబంధన ఇక అటకెక్కినట్టే. మళ్లీ ‘ప్రజాప్రయోజనం’ పాట, అభివృద్ధి రాగం అందుకుని రైతుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వాలకు ఈ ఆర్డినెన్స్ వీలుకల్పిస్తున్నది. ఫలితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని కోసం భూముల్ని ఇచ్చేది లేదంటున్న తుళ్లూరు చుట్టుపక్కల రైతులు నిస్సహాయులవుతారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు(పీపీపీ), రక్షణ, గ్రామీణ మౌలిక వసతులవంటి అవ సరాలకు భూములు సేకరించే సందర్భంలో భూయజమానుల అనుమతి అవసరం లేదని ఆర్డినెన్స్ చెబుతున్నది.
పీపీపీ కోసం భూసేకరణ జరిపినప్పుడు సంబంధిత భూ యజమానుల్లో 70 శాతంమంది...ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో 80 శాతం మంది అంగీకారం తప్పనిసరన్న ప్రస్తుత చట్ట నిబంధనను ఇది పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా (ఎస్‌ఐఏ) నిబంధనను కూడా తొలగించబోతున్నారు. రైతుల ప్రయోజనాలకూ, పారిశ్రామికాభివృద్ధికీ మధ్య సమతూకం ఉండేలా చూడటమే తమ ధ్యేయమని చెబుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాటల్లో నిజమెంతో ఆర్డినెన్స్‌లోని నిబంధనలు చూస్తుంటేనే అర్థమవుతున్నది. ప్రజా ప్రయోజనం పేరిట ప్రభుత్వాలే భూకబ్జాలకు పాల్పడే పాత విధానాలను ఇలా ఆర్డినెన్స్ తోవలో తీసుకురావడం అన్యాయం...అప్రజాస్వామికం.
అయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న భూసేకరణ చట్టంపై అభ్యంతరాలే లేవనడం సత్యదూరం. గ్రామాల్లో భూములు కోల్పోయే వారికిచ్చే పరిహారాన్ని మార్కెట్ విలువపై నాలుగు రెట్లు... పట్టణాల్లో భూమి సేకరించినప్పుడు మార్కెట్ విలువపై రెండు రెట్లు ఇస్తామన్న నిబంధన అస్పష్టంగా ఉన్నదన్న విమర్శలొచ్చాయి. మార్కెట్ విలువగా దేన్ని ఏ ప్రాతిపదికన లెక్కేస్తారో చట్టం నిర్దిష్టంగా చెప్పడంలేదని సామాజిక ఉద్యమకారులు ఆరోపించారు. అలాగే, ‘ప్రజా ప్రయోజనం’ పదానికిచ్చే నిర్వచనంలో స్పష్టత లోపించిందనీ, ఆ క్లాజుకింద దేన్నయినా ప్రజా ప్రయోజనంగా పరిగణించే ప్రమాదమున్నదనీ వారి వాదన.
నిజంగా రైతుల మేలుకోరి సవరణలేమైనా తీసుకురాదలిస్తే ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలి. అసలు ఆర్డినెన్స్ తోవను ఎంచుకోవడమే దోషం. అందులోనూ ఇంత కీలకమైన అంశంపై పార్లమెంటులో ఎలాంటి చర్చకూ తావీయకుండా ఆర్డినెన్స్ తీసుకురాబూనడం మరింత దారుణం. ఎందుకింత తొందర? ఇంతలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి సాధించదల్చుకున్న ప్రయోజనమేమిటి? మరో రెండు నెలల్లో ఎటూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలుంటాయి. అందులో ఈ ప్రతిపాదనలుంచి, వాటిపై చర్చించి ఉంటే హుందాగా ఉండేది. భూమిని కేవలం మట్టిగా, ఆస్తిగా మాత్రమే పరిగణిస్తే... అది ప్రజల భావోద్వేగాలతో, వారి సంస్కృతీ సంప్రదాయాలతో బలంగా పెనవేసుకున్న అనుబంధమని గుర్తించకపోతే...రైతుకూ, పొలానికీ మధ్య ఉండే తల్లి పేగుబంధాన్ని విస్మరిస్తే ఇలాంటి ఆర్డినెన్స్‌లే పుట్టుకొస్తాయి. ఎన్డీయే సర్కారు తన తప్పిదాన్ని గ్రహించి ఈ ఆర్డినెన్స్ ఆలోచనను విరమించుకుంటే జనం హర్షిస్తారు.
ఎవరికి ‘అచ్ఛే దిన్’?!
Published Wed, Dec 31 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement