చిల్కాట్ ‘వాతలు’! | Chilcot Report Criticises UK, US Over Failure to Control Purge of Iraq | Sakshi
Sakshi News home page

చిల్కాట్ ‘వాతలు’!

Published Sat, Jul 9 2016 1:19 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

చిల్కాట్ ‘వాతలు’! - Sakshi

చిల్కాట్ ‘వాతలు’!

నాగరిక చరిత్రలో హిట్లర్ దురాక్రమణ దాహం, అతడి సేనల దురాగతాలతో మాత్రమే సరిపోల్చగల ఇరాక్ ఘోరకలిపై ఎట్టకేలకు సర్ జాన్ చిల్కాట్ కమిషన్ నివేదిక వెల్లడైంది. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన టోనీ బ్లెయిర్ అమెరికాతో కుమ్మక్కై ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి దేశాన్ని అనవసర యుద్ధంలోకి దించాడని ఆ నివేదిక తేల్చిచెప్పింది. ప్రపంచ ప్రజలందరికీ పుష్కరకాలం క్రితమే ఈ సంగతి తెలుసు. ఇప్పుడు చిల్కాట్ కమిషన్ చేసిందల్లా దాన్ని ధ్రువీకరించడమే! యుద్ధం చట్టవిరుద్ధమా, కాదా అన్న అంశం జోలికి ఈ నివేదిక పోలేదు. కాకపోతే దీనికి ‘చట్ట ప్రాతిపదిక’ను ఏర్పర్చడంలో అనుసరించిన తీరు సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడింది. ఈ నివేదిక నేరుగా చెప్పకపోయినా బ్లెయిర్ తన కేబినెట్ సహచరులకూ, పార్లమెంటుకూ, దేశ పౌరులకూ నిజాలు చెప్పకుండా దాచారనీ... నిజాయితీగా వ్యవహరించలేకపోయారని రుజువుచేసింది. 

 

ప్రజాస్వామ్యాన్ని నిత్యం జపించే అగ్రదేశాల్లో తెరవెనక జరిగేదేమిటో చిల్కాట్ నివేదిక చూస్తే అర్ధమవుతుంది. మొదట్లో ఆనాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అదుపాజ్ఞల్లో ఉంచితే సరిపోతుందన్న అభిప్రాయంతో ఉన్న బ్రిటన్... చాలా స్వల్పకాలంలోనే ఆ వైఖరిని మార్చుకున్న తీరును నివేదిక పట్టిచూపింది. బ్లెయిర్ ఆలోచన మారిపోగానే నిఘా సంస్థలతోసహా ప్రభుత్వ విభాగాలన్నిటా వచ్చిన మార్పును విశదీకరించింది. ఇరాక్ విషయంలో భద్రతామండలి నుంచి రెండో తీర్మానం లేకుండా యుద్ధానికి దిగితే అది చట్టవిరుద్ధమవుతుందని మొదట్లో చెప్పిన అటార్నీ జనరల్ పీటర్ గోల్డ్‌స్మిత్ అమెరికా వెళ్లొచ్చి స్వరం మార్చిన వైనాన్నీ, నిఘా సంస్థలు ప్లేటు ఫిరాయించడాన్నీ ప్రస్తావించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్-బ్లెయిర్‌ల మధ్య సమావేశం అనంతరమే ఈ మార్పు సంభవించిందని రుజువుచేసింది. ‘ఏదేమైనా నీతోనే నేను...’అంటూ 2002 జూలై 28న బ్లెయిర్ బుష్‌కు పంపిన నోట్‌లో చెప్పడాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఈ మాటలే ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో విస్తృ తంగా ప్రచారమవుతున్నాయి. బుష్‌కు దాసోహమన్న బ్లెయిర్ నేలబారు వ్యక్తి త్వాన్ని పరిహసిస్తున్నాయి. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని కోణాల్లో విశ్లేషించడం, పర్యవసానాలు అంచనా వేయడం, తగిన ప్రణాళికలు రచించడం, వ్యూహానికి పదును పెట్టుకోవడంలాంటివి ఉండాలి. ఇరాక్ దురాక్ర మణ సమయంలో వీటన్నిటినీ బ్లెయిర్ విస్మరించారన్నది చిల్కాట్ నివేదిక సారాంశం. ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, తన చర్యలకు దేశాన్ని బలి చేశారని నివేదిక రుజువు చేసింది. తమతో కూటమి కట్టాలన్న అమెరికా సూచనను తిరస్కరిస్తే ఆ దేశంతో బ్రిటన్ సంబంధాలు దెబ్బతినేవన్న బ్లెయిర్ వాదన పనికి మాలినదని చిల్కాట్ కొట్టిపడేశారు. వివిధ సంక్షోభాల్లో రెండు దేశాలూ భిన్న వైఖరులు తీసుకున్న సందర్భాలను ఎత్తిచూపారు. 

 

అయితే ఇరాక్ దురాక్రమణ యుద్ధంవల్ల వాటిల్లిన నష్టాలను చిల్కాట్ నివేదిక సరిగా ప్రతిబింబించలేకపోయిందనే చెప్పాలి. ఇరాక్ పౌరులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావంటూనే....‘ఆ యుద్ధంలో కనీసం 1,50,000మంది లేదా అంతకన్నా ఎక్కువమంది ఇరాకీలు మరణించి ఉంటారని, 10 లక్షలమందికిపైగా నిరాశ్రయులయ్యార’ని నివేదిక తెలిపింది. కానీ జరిగిన నష్టం అంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. మరణించినవారి సంఖ్య 10 లక్షల పైమాటేనని యుద్ధ వ్యతిరేక ఉద్యమకారులు చాన్నాళ్లక్రితమే లెక్కగట్టారు. వీరుగాక వికలాంగులుగా, అనాథ లుగా, జీవన్మృతులుగా మిగిలినవారు మరిన్ని లక్షల్లో ఉంటారు. ఈ నష్టం నిజానికి ఇన్నేళ్లయినా ఆగలేదు సరిగదా... అది అంతకంతకు పెరుగుతూ పోతోంది. అది నిజానికి ఇరాక్‌కు మాత్రమే పరిమితమై లేదు. పశ్చిమాసియా దేశాలను చుట్టుము ట్టింది. ఐఎస్ అనే అత్యంత భయానకమైన ఉగ్రవాద సంస్థకు పురుడుబోసింది. ఆఖరికి పాశ్చాత్య దేశాలను సైతం వెంటాడుతోంది.

 

చిల్కాట్ కమిషన్ స్వతంత్ర సంస్థ. ఈ కమిషన్ ఏర్పాటును 2009 జూన్ 15న ప్రకటించినప్పుడు అప్పటి ప్రధాని గోర్డాన్ బ్రౌన్ చాలా చెప్పారు. దానికి అన్నివిధాలా సహకరిస్తామన్నారు. తీరా యుద్ధకాలంలోనూ, అంతకుముందూ జరిగిన బ్రిటన్ కేబినెట్ సమావేశాల మినిట్స్‌ను అందజేయడానికి 2012లో ప్రభుత్వం ససేమిరా అంది. విచారణ రహస్యంగా జరపాలంటూ పేచీ పెట్టింది. బుష్-బ్లెయిర్ సంభాషణలను అందించేందుకు విదేశాంగ శాఖ మొరాయించింది. అవి వెల్లడిస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయన్న తర్కానికి దిగింది. ప్రధానిగా బ్రౌన్ దిగిపోయి కామెరాన్ వచ్చినా ఈ మొండి వాదనలు అంతం లేకుండా సాగాయి. చివరకు కమిషన్ బ్లెయిర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది గనుక...నివేదిక ముసాయిదాను ముందుగా ఆయనకు పంపాలన్న నియమం ఒకటి అమల్లోకి తెచ్చాకే చిల్కాట్ నివేదిక విడుదలకు ప్రభుత్వం సరేనన్నది. ఈ నివేదిక అందిన పర్యవసానంగానే బ్లెయిర్ నిరుడు అక్టోబర్‌లో పాక్షిక క్షమాపణకు సిద్ధపడ్డారు.

ఇన్ని అవరోధాలమధ్యా, పరిమితులమధ్యా చిల్కాట్ పనిచేశారని అర్ధం చేసుకుంటే ప్రపంచానికి తెలియనివి ఇంకెన్ని ఉండి ఉంటాయో ఊహించుకోవచ్చు. బ్రిటన్‌లో కనీసం కమిషన్ ఏర్పాటై జరిగిన దోషాలను, లోపాలను ఎత్తిచూపడ మైనా ఉంది. అమెరికాలో ఈపాటి సంస్కారమైనా లేదు. తాము ఎవరికీ జవాబు దారీ కాదనుకునే మనస్తత్వం అక్కడి పాలకులది. ఆ సంగతలా ఉంచి ఇప్పటికీ బ్లెయిర్ మారలేదు. దురాక్రమణను తప్పనడం లేదు. పర్యవసానాలను ఊహించ లేకపోయినందుకు క్షమించమంటున్నారు. అయినా ఇది సారీతో పోయేంత చిన్న తప్పేమీ కాదు. ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి, భద్రతారాహిత్యంలోకి నెట్టిన క్రూరమైన నేరం. లేబర్ పక్ష నాయకుడు కోర్బిన్ అన్నట్టు ఎంతటివారైనా అలాంటి నేరాలకు శిక్ష అనుభవించాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement