iraq war
-
చిల్కాట్ ‘వాతలు’!
నాగరిక చరిత్రలో హిట్లర్ దురాక్రమణ దాహం, అతడి సేనల దురాగతాలతో మాత్రమే సరిపోల్చగల ఇరాక్ ఘోరకలిపై ఎట్టకేలకు సర్ జాన్ చిల్కాట్ కమిషన్ నివేదిక వెల్లడైంది. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన టోనీ బ్లెయిర్ అమెరికాతో కుమ్మక్కై ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి దేశాన్ని అనవసర యుద్ధంలోకి దించాడని ఆ నివేదిక తేల్చిచెప్పింది. ప్రపంచ ప్రజలందరికీ పుష్కరకాలం క్రితమే ఈ సంగతి తెలుసు. ఇప్పుడు చిల్కాట్ కమిషన్ చేసిందల్లా దాన్ని ధ్రువీకరించడమే! యుద్ధం చట్టవిరుద్ధమా, కాదా అన్న అంశం జోలికి ఈ నివేదిక పోలేదు. కాకపోతే దీనికి ‘చట్ట ప్రాతిపదిక’ను ఏర్పర్చడంలో అనుసరించిన తీరు సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడింది. ఈ నివేదిక నేరుగా చెప్పకపోయినా బ్లెయిర్ తన కేబినెట్ సహచరులకూ, పార్లమెంటుకూ, దేశ పౌరులకూ నిజాలు చెప్పకుండా దాచారనీ... నిజాయితీగా వ్యవహరించలేకపోయారని రుజువుచేసింది. ప్రజాస్వామ్యాన్ని నిత్యం జపించే అగ్రదేశాల్లో తెరవెనక జరిగేదేమిటో చిల్కాట్ నివేదిక చూస్తే అర్ధమవుతుంది. మొదట్లో ఆనాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అదుపాజ్ఞల్లో ఉంచితే సరిపోతుందన్న అభిప్రాయంతో ఉన్న బ్రిటన్... చాలా స్వల్పకాలంలోనే ఆ వైఖరిని మార్చుకున్న తీరును నివేదిక పట్టిచూపింది. బ్లెయిర్ ఆలోచన మారిపోగానే నిఘా సంస్థలతోసహా ప్రభుత్వ విభాగాలన్నిటా వచ్చిన మార్పును విశదీకరించింది. ఇరాక్ విషయంలో భద్రతామండలి నుంచి రెండో తీర్మానం లేకుండా యుద్ధానికి దిగితే అది చట్టవిరుద్ధమవుతుందని మొదట్లో చెప్పిన అటార్నీ జనరల్ పీటర్ గోల్డ్‌స్మిత్ అమెరికా వెళ్లొచ్చి స్వరం మార్చిన వైనాన్నీ, నిఘా సంస్థలు ప్లేటు ఫిరాయించడాన్నీ ప్రస్తావించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్-బ్లెయిర్‌ల మధ్య సమావేశం అనంతరమే ఈ మార్పు సంభవించిందని రుజువుచేసింది. ‘ఏదేమైనా నీతోనే నేను...’అంటూ 2002 జూలై 28న బ్లెయిర్ బుష్‌కు పంపిన నోట్లో చెప్పడాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఈ మాటలే ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో విస్తృ తంగా ప్రచారమవుతున్నాయి. బుష్‌కు దాసోహమన్న బ్లెయిర్ నేలబారు వ్యక్తి త్వాన్ని పరిహసిస్తున్నాయి. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని కోణాల్లో విశ్లేషించడం, పర్యవసానాలు అంచనా వేయడం, తగిన ప్రణాళికలు రచించడం, వ్యూహానికి పదును పెట్టుకోవడంలాంటివి ఉండాలి. ఇరాక్ దురాక్ర మణ సమయంలో వీటన్నిటినీ బ్లెయిర్ విస్మరించారన్నది చిల్కాట్ నివేదిక సారాంశం. ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని, తన చర్యలకు దేశాన్ని బలి చేశారని నివేదిక రుజువు చేసింది. తమతో కూటమి కట్టాలన్న అమెరికా సూచనను తిరస్కరిస్తే ఆ దేశంతో బ్రిటన్ సంబంధాలు దెబ్బతినేవన్న బ్లెయిర్ వాదన పనికి మాలినదని చిల్కాట్ కొట్టిపడేశారు. వివిధ సంక్షోభాల్లో రెండు దేశాలూ భిన్న వైఖరులు తీసుకున్న సందర్భాలను ఎత్తిచూపారు. అయితే ఇరాక్ దురాక్రమణ యుద్ధంవల్ల వాటిల్లిన నష్టాలను చిల్కాట్ నివేదిక సరిగా ప్రతిబింబించలేకపోయిందనే చెప్పాలి. ఇరాక్ పౌరులు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావంటూనే....‘ఆ యుద్ధంలో కనీసం 1,50,000మంది లేదా అంతకన్నా ఎక్కువమంది ఇరాకీలు మరణించి ఉంటారని, 10 లక్షలమందికిపైగా నిరాశ్రయులయ్యార’ని నివేదిక తెలిపింది. కానీ జరిగిన నష్టం అంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. మరణించినవారి సంఖ్య 10 లక్షల పైమాటేనని యుద్ధ వ్యతిరేక ఉద్యమకారులు చాన్నాళ్లక్రితమే లెక్కగట్టారు. వీరుగాక వికలాంగులుగా, అనాథ లుగా, జీవన్మృతులుగా మిగిలినవారు మరిన్ని లక్షల్లో ఉంటారు. ఈ నష్టం నిజానికి ఇన్నేళ్లయినా ఆగలేదు సరిగదా... అది అంతకంతకు పెరుగుతూ పోతోంది. అది నిజానికి ఇరాక్‌కు మాత్రమే పరిమితమై లేదు. పశ్చిమాసియా దేశాలను చుట్టుము ట్టింది. ఐఎస్ అనే అత్యంత భయానకమైన ఉగ్రవాద సంస్థకు పురుడుబోసింది. ఆఖరికి పాశ్చాత్య దేశాలను సైతం వెంటాడుతోంది. చిల్కాట్ కమిషన్ స్వతంత్ర సంస్థ. ఈ కమిషన్ ఏర్పాటును 2009 జూన్ 15న ప్రకటించినప్పుడు అప్పటి ప్రధాని గోర్డాన్ బ్రౌన్ చాలా చెప్పారు. దానికి అన్నివిధాలా సహకరిస్తామన్నారు. తీరా యుద్ధకాలంలోనూ, అంతకుముందూ జరిగిన బ్రిటన్ కేబినెట్ సమావేశాల మినిట్స్‌ను అందజేయడానికి 2012లో ప్రభుత్వం ససేమిరా అంది. విచారణ రహస్యంగా జరపాలంటూ పేచీ పెట్టింది. బుష్-బ్లెయిర్ సంభాషణలను అందించేందుకు విదేశాంగ శాఖ మొరాయించింది. అవి వెల్లడిస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయన్న తర్కానికి దిగింది. ప్రధానిగా బ్రౌన్ దిగిపోయి కామెరాన్ వచ్చినా ఈ మొండి వాదనలు అంతం లేకుండా సాగాయి. చివరకు కమిషన్ బ్లెయిర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది గనుక...నివేదిక ముసాయిదాను ముందుగా ఆయనకు పంపాలన్న నియమం ఒకటి అమల్లోకి తెచ్చాకే చిల్కాట్ నివేదిక విడుదలకు ప్రభుత్వం సరేనన్నది. ఈ నివేదిక అందిన పర్యవసానంగానే బ్లెయిర్ నిరుడు అక్టోబర్‌లో పాక్షిక క్షమాపణకు సిద్ధపడ్డారు. ఇన్ని అవరోధాలమధ్యా, పరిమితులమధ్యా చిల్కాట్ పనిచేశారని అర్ధం చేసుకుంటే ప్రపంచానికి తెలియనివి ఇంకెన్ని ఉండి ఉంటాయో ఊహించుకోవచ్చు. బ్రిటన్‌లో కనీసం కమిషన్ ఏర్పాటై జరిగిన దోషాలను, లోపాలను ఎత్తిచూపడ మైనా ఉంది. అమెరికాలో ఈపాటి సంస్కారమైనా లేదు. తాము ఎవరికీ జవాబు దారీ కాదనుకునే మనస్తత్వం అక్కడి పాలకులది. ఆ సంగతలా ఉంచి ఇప్పటికీ బ్లెయిర్ మారలేదు. దురాక్రమణను తప్పనడం లేదు. పర్యవసానాలను ఊహించ లేకపోయినందుకు క్షమించమంటున్నారు. అయినా ఇది సారీతో పోయేంత చిన్న తప్పేమీ కాదు. ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి, భద్రతారాహిత్యంలోకి నెట్టిన క్రూరమైన నేరం. లేబర్ పక్ష నాయకుడు కోర్బిన్ అన్నట్టు ఎంతటివారైనా అలాంటి నేరాలకు శిక్ష అనుభవించాల్సిందే. -
తప్పుచేశానని ఒప్పుకున్న హిల్లరీ
వాషింగ్టన్: సెనేటర్‌గా ఉన్న సమయంలో ఇరాక్‌పై యుద్ధానికి అనుకూలంగా ఓటు వేసి పెద్ద తప్పుచేశానని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ చెప్పారు. 2002లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ప్రభుత్వానికి ఇరాక్ పై దాడి చేసే అవకాశమిచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నానన్నారు. ప్రథమ మహిళగా ఉన్న సమయంలో వైద్యరంగంలో మెరుగైన సంస్కరణలు చేపట్టలేకపోయినందుకు మూడు నెలల క్రితం హిల్లరీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే ఉపాధ్యక్ష పదవి కూడా మహిళకే దక్కుతుందని హిల్లరీ ప్రచార కమిటీకి సారధ్యం వహిస్తున్న జాన్ పొడెస్టా చెప్పారు. -
బ్లెయిర్ 'పరివర్తన'
యుద్ధమంటే విమానాలు, ద్రోన్లు కురిపించే బాంబుల వర్షం... శతఘ్నుల మోతలు, క్షిపణి దాడులు...ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాదు. యుద్ధమంటే సమాజాన్ని నడిపించే సకల వ్యవస్థలపైనా దాడి చేయడం. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ వ్యవస్థలన్నిటినీ రూపురేఖల్లేకుండా ధ్వంసం చేయడం. ఒక్క మాటలో- జీవితాన్ని నిర్మించే, నిలబెట్టే వాటిన్నిటినీ నాశనం చేయడం. మనుషులందరినీ అమానవీకరించడం. ఇరాక్‌లో పన్నెండేళ్లక్రితం ఇంతటి ఘోరకలికి కారకులైనవారిలో ఒకరైన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తొలిసారి ఆ దురాక్రమణ యుద్ధానికి క్షమాపణ చెప్పారు. ఇరాక్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయన్న తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా ఆ దేశంపై యుద్ధం ప్రకటించామని ఆయన ప్రకటించారు. అయితే అది బేషరతు క్షమాపణ కాదు. అమెరికాతో కలసి సాగించిన ఆ యుద్ధంవల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారని... తాము రాజేసిన మంట ఇప్పటికీ ఇరాక్‌ను దహించివేస్తూ నిత్యం అక్కడి పౌరులను బలిగొంటూనే ఉన్నదన్న చింత ఆయనకేమీ లేదు. తమ ప్రణాళికలో... ముఖ్యంగా సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోశాక ఏం జరిగే అవకాశం ఉందో అంచనా వేయడంలో విఫలమైనందుకు ఆయన బాధపడుతున్నారు. సద్దాంను కూలదోయడం సరైందేనని ఇప్పటికీ బ్లెయిర్ విశ్వసిస్తున్నారు. తమ చర్య పర్యవసానంగా ఇరాక్‌లో తొలుత అల్-కాయిదా, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదం వేళ్లూనుకున్నాయన్న వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించడంలేదు. నాలుగేళ్లక్రితం అరబ్ ప్రపంచాన్ని ఊపేసిన ప్రజాస్వామిక ప్రభంజనం కూడా అందుకు దోహదపడిందని వాదిస్తున్నారు. ఐఎస్ పుట్టింది సిరియాలో తప్ప ఇరాక్‌లో కాదని తర్కిస్తున్నారు. జార్జి బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశంతో కలిసి బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలూ సాగించిన దురాక్రమణ యుద్ధం మానవేతిహాసంలోనే భయానకమైనది. 2003లో ప్రారంభమైన ఆ యుద్ధం పర్యవసానంగా పది లక్షలమందికిపైగా దుర్మరణం చెందారు. మరిన్ని లక్షలమంది వికలాంగులుగా, అనాథలుగా మిగిలారు. మెరుగైన జీవనప్రమాణాలతో ప్రశాంతంగా ఉండే ఇరాక్ ఆ యుద్ధం తర్వాత నిత్య సంక్షుభిత దేశంగా మారిపోయింది. అక్కడ ప్రభుత్వాలు ఏర్పడినా అవి నామమాత్రంగా మిగిలాయి. రెండు ప్రధాన తెగలైన షియా, సున్నీల మధ్య భీకర సంగ్రామం...అందులో భాగంగా చోటుచేసుకునే ఆత్మాహుతి దాడులు ప్రతిరోజూ జనం ఉసురు తీస్తున్నాయి. ఈ తెగల పోరులో పుట్టుకొచ్చిన ఐఎస్ దేశంలో గణనీయమైన ప్రాంతాన్ని తన గుప్పిట బంధించింది. ఇరుగుపొరుగు దేశాలకు సైతం పాకుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తోంది. బుష్, బ్లెయిర్ ద్వయం చేసిన నేరాలెలాంటివో, వాటి పర్యవసానాలేమిటో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలుసు. 2003లో దురాక్రమణ యుద్ధానికి పూనుకున్నప్పుడే అనేకులు దాన్ని నిరసించారు. అందుకు చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని ఎలుగెత్తారు. కేవలం ఇరాక్ చమురు బావులపై కన్నేసి, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఆ దేశంపై దండెత్తుతున్నారని చెప్పారు. అయినా ఆ మారణహోమాన్ని బుష్, బ్లెయిర్లు ఆపలేదు. యుద్ధం చేయకపోతే ఎప్పుడైనా కేవలం 45 నిమిషాల వ్యవధిలో సద్దాం హుస్సేన్ బ్రిటన్‌పై జన హనన ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉన్నదని ఊదరగొట్టారు. సామూహిక జన హనన ఆయుధాల విషయంలో బ్రిటన్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్(ఎంఐ)6 నివేదికలు తమను పక్కదోవ పట్టించాయని ఇప్పుడు బ్లెయిర్ చెబుతున్నది వాస్తవం కాదు. ఆ నివేదికలు రావడానికి ఏడాది ముందే బ్లెయిర్ ఈ యుద్ధానికి సిద్ధమయ్యారని ఈమధ్యే అమెరికాలో వెల్లడైన నోట్ చెబుతోంది. 2002లో ఆనాటి అమెరికా విదేశాంగమంత్రి కోలిన్ పావెల్ బుష్‌కు పంపిన నోట్ అది. ఈ దురాక్రమణ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదని, దేశ చట్టాల ప్రకారం కూడా చెల్లుబాటు కాదని బ్రిటన్ న్యాయ విభాగం అధికారులు ఆరోజున మొత్తుకున్నారు. ఆ దేశ పార్లమెంటు సంగతలా ఉంచి, తన కేబినెట్‌కి సైతం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా బ్లెయిర్ దురాక్రమణకు సై అన్నారు. దురాక్రమణకు దిగితే యుద్ధ నేరాల కింద బోనెక్కే పరిస్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తూ ఆ దేశ అటార్నీ జనరల్ లార్డ్ గోల్డ్ స్మిత్ సమర్పించిన నోట్‌ను బ్లెయిర్ కేబినెట్ కంటపడనీయలేదు. ఇంతకూ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా ఆ యుద్ధం పొరబాటేనని పాక్షికంగానైనా బ్లెయిర్ ఎందుకు ఒప్పుకున్నట్టు? అదీ తమ దేశ మీడియాకు కాక అమెరికాకు చెందిన సీఎన్ఎన్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంలోని ఆంతర్యమేమిటి? ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్రపై ఏర్పాటైన జాన్ చిల్కాట్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక కోసం బ్రిటన్‌లో అన్ని వర్గాలూ... మరీ ముఖ్యంగా యుద్ధ వ్యతిరేక ఉద్యమకారులు ఎదురుచూస్తున్నారు. నివేదిక సమర్పణలో జాప్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో వెల్లడికానున్న ఆ నివేదికలో బ్లెయిర్ వ్యవహార శైలిపై...ముఖ్యంగా పలు వాస్తవాలను ఆయన తొక్కిపెట్టడంపై నిశితమైన విమర్శలుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ నేరస్తుడిగా ఆ నివేదిక నిర్ధారించిన పక్షంలో నలువైపులనుంచీ తనపై దాడి తప్పదని గ్రహించబట్టే పాక్షిక క్షమాపణకైనా బ్లెయిర్ సిద్ధపడ్డారు. ఆ సంగతిని కూడా తమ మీడియాకు చెబితే ప్రస్తుత పరిస్థితుల్లో కాకుల్లా పొడుస్తారన్న భయంతో అమెరికా చానెల్ సీఎన్ఎన్ను ఆశ్రయించారు. యుద్ధమూ, దాని పర్యవసానాలూ క్షమాపణలతో ముగిసిపోయేవి కాదు. అలాంటి నేరానికి పాల్పడేవారు విచారణను ఎదుర్కొనవలసిందే. శిక్షకు సిద్ధపడాల్సిందే. బ్లెయిర్ అయినా, మరొకరైనా అందుకు మినహాయింపు కాదు. -
ఇరాక్ విడిపోవచ్చు.. జాగ్రత్త!!
వర్గ వైరుధ్యంతో అతలాకుతలం అవుతున్న ఇరాక్ ఇక ఎన్నాళ్లో ఒక్క దేశంగా ఉండే అవకాశం లేదని, త్వరలోనే అది విడిపోవచ్చని ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమోన్ పెరెజ్ హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అధికారిక పర్యటన కోసం పెరెజ్ అమెరికా వచ్చినట్లు సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఇరాక్ ఒకటిగా ఉంటే చాలా బాగుండేదని ఒబామాతో పెరెజ్ అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అది సాధ్యమ్యే పరిస్థితులు కనిపించడం లేదని కూడా ఆయన అన్నారు. ఒకవేళ ఇరాక్ ఒకటిగా ఉండాలంటే అమెరికా తప్పనిసరిగా అక్కడకు బలమైన సైన్యాన్ని పంపి మూడు వర్గాలను ఒకటిగా చేయాలని పెరెజ్ సూచించారు. సైన్యం అలా చేస్తుందని తాను అనుకోవట్లేదని, అలాగే అక్కడి వర్గాలు కూడా అందుకు అంగీకరిస్తాయని భావించట్లేదని తెలిపారు. ఒబామా, పెరెజ్ కలిసి అమెరియన్ యూదు నాయకులను కూడా కలిసి వారితో భోజనం చేశారు. 65 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన పెరెజ్.. వచ్చే నెలతో ఇజ్రాయెల్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నారు. అమెరికా కాంగ్రెస్ ఆయనకు కాంగ్రెషనల్ స్వర్ణపతకాన్ని బహూకరించే అవకాశం ఉంది.