ముస్లిం దేశాలపై అమెరికా, బ్రిటన్‌ ఆంక్షలు | US, UK bans laptop, tablet on flights from Muslim countries | Sakshi
Sakshi News home page

ముస్లిం దేశాలపై అమెరికా, బ్రిటన్‌ ఆంక్షలు

Published Tue, Mar 21 2017 11:43 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

ముస్లిం దేశాలపై అమెరికా, బ్రిటన్‌ ఆంక్షలు - Sakshi

ముస్లిం దేశాలపై అమెరికా, బ్రిటన్‌ ఆంక్షలు

- విమానాల్లో ల్యాప్‌టాప్‌లు.. కెమెరాలు నిషేధం
- 8 ముస్లిం దేశాలపై యూఎస్.. 14 ఎయిర్‌లైన్స్‌పై యూకే ఆంక్షలు
- అమెరికాలో్ని 10 విమానాశ్రయాలు.. 9 ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం
- ఉగ్రవాద దాడుల భయంతోనే ఆంక్షలన్న ట్రంప్‌ సర్కారు
- ట్రంప్‌ బాటలోనే థెరిస్సా సర్కారు..


వాషింగ్టన్‌/లండన్‌:
ఉగ్రవాదాన్ని బూచిగా చుపుతూ అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌లు పలు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించాయి. మొన్న ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి ప్రయాణాలపై నిషేధం విధించిన అమెరికా.. తాజాగా ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల క్యాబిన్లలోకి కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఆంక్షలు. వలసలపై నిషేధంతో ఏర్పడ్డ వివాదం నుంచి ఇంకా బయటపడకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు మంగళవారం తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరతీసింది. అమెరికా తరహాలోనే బ్రిటన్‌ కూడా ఆరు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్యాబిన్‌ బ్యాగేజీపై నిషేధం విధించింది.

కైరో(ఈజిప్టు), దుబాయి, అబుదాబీ(యూఏఈ), ఇస్తాంబుల్‌(టర్కీ), దోహ(ఖతార్‌), అమ్మన్‌(జోర్డాన్‌), కువైట్‌ సిటీ, కాసాబ్లాంకా(మొరాకో), జెడ్డా, రియాద్‌(సౌదీఅరేబియా) నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. దీంతో అమెరికా వచ్చే 50కిపైగా విమానాల ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొనున్నారు. ఈజిప్ట్‌ ఎయిర్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, కువైట్‌ ఎయిర్‌వేస్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌, రాయల్‌ ఎయిర్‌ మొరాక్‌, రాయల్‌ జోర్డానియన్‌ ఎయిర్‌లైన్స్‌, సౌదీఅరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌, టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌పై నిబంధలన ప్రభావం పడనుంది. తొమ్మిది విమానయాన సంస్థలకు తాజా నిబంధనల గురించి మంగళవారం సమాచారం అందజేశామని, రానున్న 96 గంటల్లో వీటిని అమలు చేయాలని సూచించామని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది.

ఉగ్రదాడుల భయంతోనే కొత్త అధికారిక ఉత్తర్వును జారీచేశామంటూ తమ నిర్ణయాన్ని ట్రంప్‌ సర్కారు సమర్ధించుకుంది. భద్రతా కారణాలతోనే స్మార్ట్‌ఫోన్‌ కంటే పెద్దవైన ఐప్యాడ్లు, కిండల్స్‌, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలను సెక్యూరిటీ లేదా బోర్డింగ్‌ సమయానికంటే ముందే అందజేయాలని అమెరికా అధికారులు వెల్లడించారు. దీంతో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఈరీడర్లు, పోర్టబుల్‌ డీవీడీ ప్లేయర్లు, ఎలక్ట్రానిక్‌ గేమింగ్‌ డివైజ్‌లు, ట్రావెల్‌ ప్రింటర్లు, స్కానర్ల మొదలైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను విమాన ప్రయాణ సమయంలో కార్గోలోనే ఉంచుతారు. అయితే వైద్య పరికరాలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయంతో పేలుడు పదార్థాల రవాణాకు ఉగ్రవాదులు వాణిజ్య విమానాలను వినియోగిస్తున్నారనే సమచారంతో కొత్త నిబంధనలు రూపొందించామని అధికారులు వాదిస్తున్నారు. ఈ నిబంధనలతో అమెరికాకు చెందిన విమానయాన సంస్థలపై ఎటువంటి ప్రభావం పడబోదని, ఆ సంస్థలు తొమ్మిది విమానాశ్రయాల నుంచి అమెరికాకు సర్వీసులు నడపడం లేదని వారు స్పష్టం చేశారు. 2001 సెప్టెంబర్‌ 11 దాడి అనంతరం ఇదే తరహా నిషేధాజ్ఞలను అమెరికా అమలు చేసింది. తాజా నిబంధనలకు సంబంధించి ఆదివారమే రాయల్‌ జోర్డానియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు సమాచారం అందించింది.

వందల మంది భారతీయులపై ప్రభావం
తాజా నిర్ణయంతో ఆంక్షలు విధించిన తొమ్మిది విమానాశ్రయాల నుంచి ప్రయాణించే భారతీయులపై ప్రభావం పడనుంది. రోజూ వందల మంది భారతీయులు దుబాయ్‌, అబుదాబీ, కువైట్‌, ఇస్తాంబుల్‌ నగరాల నుంచి అమెరికాకు వెళ్తుంటారు. అయితే నిషేధంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. భారత్‌ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిబంధన వర్తించవని చెప్పారు. ఎయిరిండియా విమానాలు నేరుగా అమెరికా వెళ్తాయని అందువల్ల తమ ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడదని ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు.

అమెరికా తరహాలోనే బ్రిటన్‌
అమెరికా నిషేధం విధించిన కొద్ది గంటలకే టర్కీ, లెబనాన్‌, జోర్డాన్‌, ఈజిప్టు, ట్యునిసియా, సౌదీ అరేబియాలకు చెందిన 14 విమానయాన సంస్థలపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చే విమానాల్లోకి సాధారణ సైజుకి మించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, డీవీడీ ప్లేయర్స్‌ను అనుమతించమని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. వాటిని విమాన క్యాబిన్‌ బ్యాగేజీగా తీసుకురాకుండా ముందుగానే అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement