‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’
మన కళ్లముందు జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి చిత్రంగా అనిపిస్తాయి. ఇది కలా నిజమా అని సందేహం కలిగిస్తాయి. ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’ చలన చిత్రం చుట్టూ ఇప్పుడు అల్లుకున్న వివాదం అలాంటిదే. ఆ చిత్రం ప్రదర్శన యోగ్యమైనది కాదని కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు భావించింది. అనుమతి నిరాకరించింది. ఆ చిత్ర నిర్మాతలు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అది ఆదరాబాదరాగా చిత్రాన్ని చూసింది. దాన్ని వెనువెంటనే అనుమతించింది. ఈలోగా బోర్డు చీఫ్ లీలా శాంసన్, 13మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక చిత్రాన్ని ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు కాదన డమూ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లి కొన్ని కత్తిరింపులతో అనుమతులు తెచ్చు కోవడమూ కొత్తేమీ కాదు. గతంలోనూ అలాంటి ఉదంతాలు జరిగాయి. కానీ ఒక చిత్రం అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం ఆదుర్దాపడటం...ఆ విషయంలో అలిగిన బోర్డు చీఫ్, సభ్యులు రాజీనామాలకు ఉపక్రమించడం గతం లో ఎన్నడూ లేదు.
అసలు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు అన్న పేరే చిత్రమైనది. ఆ బోర్డు నెలకొల్ప డంలోని అంతరార్థమూ, బోర్డు సభ్యుల ప్రధాన వ్యాపకమూ చలనచిత్రాలను సెన్సార్ చేయడమైతే...దాని పేరులో ఎక్కడా ఆ సంగతి ఉండదు. దేశంలో తొలి చలనచిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913లో విడుదలైతే సినిమాటోగ్రాఫ్ చట్టం 1920 లో అమల్లోకి వచ్చింది. ఆ చట్టంకింద దేశంలో అప్పటికి ప్రధాన నగరాలనదగ్గ మద్రాసు, బొంబాయి, కలకత్తా, లాహోర్, రంగూన్‌లలో ఆయా ప్రాంతాల పోలీస్ చీఫ్‌ల ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డులు ఏర్పడ్డాయి. ఆ చట్టం స్థానంలో 1952లో మరో చట్టం రావడం, దానికి సైతం 1983లో సవరణలు వచ్చి ప్రస్తుత ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు ఏర్పడటం చరిత్ర. ఆ బోర్డుకు దేశంలోని తొమ్మిది నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మిగిలిన కళారూపాల్లాగే చలనచిత్రం కూడా ఒక కళా రూపం. పైగా అది ప్రజాబాహుళ్యాన్ని ప్రభావితం చేయగల బలమైన మాధ్యమం. ఆ కళారూపానికుండే శక్తిసామర్థ్యాలను గ్రహించబట్టే బ్రిటిష్ వలస పాలకులు ఆలస్యంగానైనా దేశంలో సెన్సార్ బోర్డు నెలకొల్పారు. ఇప్పుడు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డులకు పోలీసు బాస్‌ల సారథ్యం లేకపోయినా చీఫ్‌లుగా ఉంటున్న వారు అలాం టి మనస్తత్వంతోనే ఉంటున్నారన్నది చలనచిత్ర దర్శకులు, నిర్మాతలు తరచు చేసే ఆరోపణ. ఎవరిని కదిలించినా బోర్డుతో తమకెదురైన అనుభవాలను ఏకరువు పెడతారు. మన దేశంలో ‘సెన్సార్ బోర్డు’ అనేది ఎప్పుడూ అర్థంకాని బ్రహ్మ పదార్థమే! కొన్ని చిత్రాలు చూస్తే వాటికి ‘సెన్సార్’ అనుమతి ఎలా లభించిం దా అనే అనుమానం కలుగుతుంది. చిత్ర ప్రదర్శనకు బోర్డు ససేమిరా కాదన్న కొన్ని చిత్రాలు చివరకు న్యాయస్థానాల జోక్యంతో విడుదలైనప్పుడు చూస్తే వీటిని ఎందుకు కాద న్నారా అనే సందేహం ఏర్పడుతుంది. మహిళా సంఘాలను, అశ్లీల ప్రతిఘటనా వేదికవంటి సంస్థలు చలనచిత్రాల్లో మహిళలను కించపరిచే దృశ్యాలు ఎలా పెరిగి పోయాయో చెబుతాయి. నీచాభిరుచుల్ని ప్రేరేపించి సొమ్ము చేసుకోవాలనుకునే వైఖరివల్ల సమాజంలో విలువలు పతన మవుతున్నాయని ఆందోళన వెలి బుచ్చుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ‘ద మెసెంజర్ ఆఫ్ గాడ్’ను బోర్డు కాదనడమేమిటన్న మీమాంస కలగడం సహజమే. హర్యానా, పంజాబ్‌లలో గణనీయమైన సంఖ్యలో అనుచరులున్న దేరా సచ్చా సౌదా సంస్థ అధినేత బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ నిర్మించిన చిత్రమిది. దైవంగా చెప్పుకునే వారిపైనా, వారి మహిమలపైనా ఇంతకు ముందూ చిత్రాలు వచ్చాయి. కానీ, అలాంటి బాబాల పాత్రను మరొకరెవరో పోషించడం ఆనవాయితీ. ఈ చిత్రంలో రాం రహీం సింగ్ తన పాత్రను తనే పోషిం చారు. దీనికే బోర్డు అభ్యంతరం చెప్పింది. చిత్రంలో ఆయన ప్రదర్శించే ఫీట్లు... ఆయన దైవసమానుడని భావించే వారిలో ఆ విశ్వాసాన్ని మరింత పెంచుతాయన్నది బోర్డు ప్రధాన అభ్యంతరం. సభ్యుల రాజీనామా వెనక రాజకీయాలున్నాయని ఆ మంత్రిత్వశాఖను చూస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ఉండొచ్చు. వారి కాలపరిమితి ఎటూ ముగుస్తుంది గనుక... మళ్లీ పునర్నియా మకమయ్యే అవకాశం లేదు గనుక దీన్ని సాకుగా వాడుకున్నారని ఆయన చెబుతు న్నారు. అయితే, రాజీనామాలిస్తూ వారు చేసిన ప్రకటనలోని అంశాలు అంత తీసిపా రేయదగ్గవి కాదు. బోర్డు అభ్యంతరాలను బేఖాతరుచేసి, తగిన అర్హతలు లేనివారితో ఆదరాబాదరగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చిత్రాన్ని అనుమతించడమేమిటన్నది వారి ప్రధాన ప్రశ్న. అలాగే బోర్డు విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని, చలనచిత్రాల గురించి కనీస అవగాహన లేని అధికారులను కేటాయించి బోర్డును ధ్వంసం చేస్తున్నారని వారి ఆరోపణ. ఈమధ్య విడుదలైన ఆమిర్‌ఖాన్ పీకే చిత్రం విషయంలో బోర్డుపై కేంద్రంనుంచి ఒత్తిళ్లు వచ్చాయని లీలా శాంసన్ అంటున్నారు.
బోర్డు సభ్యుల రాజీనామాలో రాజకీయాలున్నాయో...సినిమాను ఆదరా బాదరాగా అనుమతించడంలో రాజకీయ ప్రయోజనాలున్నాయో చర్చించడంవల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అసలిలాంటి స్థితి ఎందుకేర్పడిందని కేంద్ర ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. చలనచిత్రాలకు సర్టిఫికేషన్ ఇవ్వడంలో ఇప్పుడను సరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉండటం, బోర్డు పనితీరులో పారదర్శకత లోపించడం... ఒక బలమైన మాధ్యమాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పాలకుల మనస్తత్వం ఈ మొత్తం స్థితికి మూలకారణాలు. కళారంగంలో నిష్ణాతులు, సామా జిక సేవారంగంలో పనిచేస్తున్నవారు, రాజ్యాంగం, చట్టాల్లో అవగాహనకలవారు సభ్యులుగా...స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తే సెన్సార్ బోర్డుకు విశ్వసనీయత, ప్రతిష్ట చేకూరతాయి. ఈ విషయంలో ఏడాదిన్నర క్రితం జస్టిస్ ముద్గల్ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఎన్నో విలువైనవి ఉన్నాయి. వాటిని పట్టించుకునేందుకు కేంద్రం ఇప్పటికైనా ప్రయత్నించాలి.