ప్రశంసనీయమైన ప్యాకేజీ! | Editorial About Relief Package Announced By Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

ప్రశంసనీయమైన ప్యాకేజీ!

Published Fri, Mar 27 2020 12:20 AM | Last Updated on Fri, Mar 27 2020 12:20 AM

Editorial About Relief Package Announced By Nirmala Sitharaman - Sakshi

కరోనా వ్యాధి ఉగ్రరూపం దాల్చే ప్రమాదం కనబడటంతో దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్‌ చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్మణ రేఖ గీసిన రెండు రోజుల తర్వాత గురువారం కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసంఘటిత రంగ కార్మికులను, పట్టణ, గ్రామీణ నిరుపేద ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ప్యాకేజీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో ఊరటనిస్తుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించిన అనేక చర్యలకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు కూడా ఎంతో తోడ్పాటును అందిస్తాయి. వాస్తవానికి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన రోజే కేంద్రం నుంచి ఇలాంటి ప్యాకేజీని చాలామంది ఆశించారు. ఎందుకంటే పౌరులను నయానో, భయానో లాక్‌డౌన్‌ చేయొచ్చు. గడప దాటకుండా చూడొచ్చు. కానీ వారి ఆకలిని, వారి కనీసావసరాలను లాక్‌డౌన్‌ చేయడం అసాధ్యం. అవి తీరక వారిలో వెల్లువెత్తే ఆగ్రహావేశాలను లాక్‌డౌన్‌ చేయడం అసాధ్యం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా ప్యాకేజీని ప్రకటించింది. 

మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి తమ కార్యకలాపాలను నిలుపుచేసి కొన్ని రోజులు నెట్టుకు రాగలరు. సంపన్నవర్గం సరేసరి. కేవలం రెక్కల కష్టంపై ఆధారపడి బతికే నిరుపేద వర్గాలవారికి ఇది కుదరదు. ఒక్క పూట పని దొరక్కపోతే వారికి పస్తులు తప్పవు. అటువంటిది 21 రోజులపాటు ఇళ్లకే పరిమితం కావడం ఆ వర్గాలకు ప్రాణాంతకం. ఆ మహమ్మారి వైరస్‌ కబళించడం మాటేమోగానీ ఆకలి వారి అంతు చూస్తుంది. పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. కనుకనే ఎవరూ ఆకలితో అలమ టించకూడదన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీని రూపొందించినట్టు కేంద్ర ఆర్ధికమంత్రి, కోవిడ్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ నిర్మలా సీతారామన్‌ చెప్పడం హర్షించదగ్గది. ఈ ప్యాకేజీ ద్వారా దేశ జనాభాలో మూడింట రెండువంతులమందికి... అంటే 80 కోట్లమందికి ప్రయోజనం కలుగుతుం దని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు.

వచ్చే మూడు నెలలపాటు కుటుంబానికి నెలకు అయిదు కిలోల బియ్యం లేదా గోధుమలు చొప్పున ఇస్తారు. అలాగే వారు కోరుకున్న పప్పు ధాన్యాలు కిలో చొప్పున ఇస్తారు. దీన్నంతటినీ ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా అందజేస్తామని నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు ఉచితంగా అందించడం ఎంతో అవసరం. ఈ చర్య వారు ఎదుర్కొంటున్న కష్టాలనుంచి సంపూర్ణంగా విముక్తి కలిగిస్తుందని కాదు. కానీ ఉన్నం తలో ఈ సంక్షోభకాలాన్ని సునాయాసంగా అధిగమించే నైతిక స్థైర్యాన్ని అందిస్తుంది. ప్యాకేజీ ద్వారా లబ్ధిపొందేవారిలో రైతులు, సీనియర్‌ సిటిజన్‌లు, వితంతువులు, వికలాంగులు, మహిళా స్వయం ఉపాధి బృందాలు, కూలీలు, కార్మికులు, నిర్మాణరంగ కార్మికులు, వైద్య సిబ్బంది తదితర వర్గాలు కూడా వున్నాయి.

పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు వారి ఖాతాల్లో వచ్చే నెల మొదటివారంలో రూ. 2,000 చొప్పున జమ చేస్తారు. 60 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్‌లకు, వితంతువులకు, దివ్యాంగులకు రూ. 1,000 చొప్పున రెండు దఫాలుగా అందజేస్తారు. వీరితోపాటు జన్‌ధన్‌ ఖాతా దార్లుగా వున్న మహిళలకు నెలకు రూ. 500 చొప్పున జమచేస్తారు. మహిళా స్వయం ఉపాధి బృందా లకు ఎలాంటి పూచీ చూపకుండా రూ. 20 లక్షల వరకూ రుణం మంజూరు చేయాలన్న నిర్ణయం కూడా ప్రశంసనీయమైనది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడిచ్చే దినసరి వేతనం రూ. 182ను రూ. 202కి పెంచడం కూడా మంచి చర్య. ఉజ్వల పథకంలోని కుటుంబాలకు మూడు నెలలపాటు ఉచితంగా వంట గ్యాస్‌ అందించడం, కార్మికులు తమ పీఎఫ్‌ ఖాతాలనుంచి తిరిగి చెల్లించనవసరం లేని పద్ధతిలో 75 శాతం మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకునే వెసులుబాటు, మూడునెలలపాటు వారి పీఎఫ్‌ మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తామనడం తోడ్పాటునందించే నిర్ణయాలు. 

నిరుపేద వర్గాలకు ఊరటనిచ్చే ఈ చర్యలన్నిటితోపాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వైద్యులకు, ఆశా వర్కర్లకు, పారా మెడికల్‌ సిబ్బందికి ఈ మూడు నెలలపాటు రూ. 50 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించాలన్న నిర్ణయం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం. వైద్యులు, వైద్య ఆరోగ్య రంగానికి చెందిన ఇతర సిబ్బంది ఈ గడ్డుకాలంలో అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. శత్రుమూకలు దాడికి దిగినప్పుడు, అసాంఘిక శక్తులు విజృంభించినప్పుడు సైనికులు, పోలీసుల అవసరం ఎంత వుంటుందో... ఇలాంటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు కూడా అంతే కీలకం. ముప్పు ముంచుకొచ్చినప్పుడు అందరిలా వారు ఇళ్లకు పరిమితం కావడం సాధ్యపడదు. ఇందువల్ల నిరంతరం వారిని ప్రమాదం వెన్నాడుతుంది. పశ్చిమ యూరప్‌ ప్రాంత దేశాల్లో ఇలాంటి సేవలందిస్తూ ఇంతవరకూ 30మంది కన్నుమూశారు. వేలాదిమంది కరోనా బారినపడి అస్వస్థులయ్యారు.

హైదరాబాద్‌లో ఒక వైద్య జంట కరోనా వ్యాధి బారిన పడ్డారని తాజా సమాచారం చెబుతోంది. కనుక వారి జీవితాలకు ధీమానివ్వడం మంచి చర్య. అదే సమయంలో ఈ మహమ్మారి కాటేయకుండా వారికి అవసరమైన రక్షణ ఉపకరణాలు కూడా అందిం చాలి. సంక్షోభాలు ఏర్పడినప్పుడల్లా సొమ్ము చేసుకుందామనే అక్రమ వ్యాపారులకు మళ్లీ లాభార్జన రోగం పట్టుకుంది. కఠిన చర్యలతో ఆ రోగాన్ని కుదర్చడం కూడా తక్షణావసరం. ప్రతి నెలా ఒకటో తారీకు నుంచి మధ్యతరగతిని వేధించే సమస్య ఈఎంఐ. నెలవారీ వాయిదాలు కట్టడం ధరలు ఆకాశాన్నంటిన ఈ అస్తవ్యస్థ పరిస్థితుల్లో తలకు మించిన భారం. కనుక వాటి చెల్లింపులను కూడా ఈ మూడు నెలలూ వాయిదా వేసే ప్రయత్నం చేయాలి. దీంతోపాటు నిత్యావసరాలపై ఉండే జీఎస్‌టీని తగ్గించడం కూడా అవసరం. కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని ప్రపంచమంతా ఎదురుచూసింది. ఇప్పుడు ప్రకటించిన చర్యలు ఎంతో ప్రశంసించదగ్గవి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement