అంతర్జాతీయ ఈవెంట్లలో అవకాశం దొరికిందే తడవుగా క్రీడాభిమానుల్ని అబ్బురపరిచి వారి హృదయాల్లో శాశ్వత స్థానం పొందడానికి.. చరిత్ర పుటల్లోకెక్కడానికి క్రీడాకారులంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. అందుకోసం తమ క్రీడా నైపుణ్యానికి నిరంతరం పదును పెట్టుకుంటూ, ఎంచుకున్న ఆటలో ప్రత్యర్థిని మట్టికరిపించడానికి అవసరమైన మెలకువలన్నీ నేర్చుకుంటారు. కానీ రష్యా ఈ మార్గాన్ని విడిచిపెట్టి తన ప్రతిభాపాటవాలన్నిటినీ దొంగచాటుగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడటంలో చూపించి, వాటి సాయంతో పతకాలు కొల్లగొడుతోందని ఏడెనిమిదేళ్లుగా ఆరోపణలుంటున్నాయి.
వాటిని ఎప్పటికప్పుడు ఆ దేశం కొట్టిపడేస్తోంది. తమ క్రీడాకారుల్ని చూసి అసూయతో ఇలా తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని విరుచుకుపడుతోంది. కానీ గత నెలాఖరున ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ‘వాడా’ నియమించిన కమిటీ అవన్నీ పచ్చి నిజాలని ధ్రువీకరించి, నాలుగేళ్ల పాటు రష్యాకు ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రవేశం లేకుండా నిషే«ధించాలని సిఫార్సు చేసింది. తాజాగా ఆ సిఫార్సును ‘వాడా ఆమోదించిన పర్యవసానంగా వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌తోపాటు అదే సంవత్సరం జరిగే పారాలింపిక్స్, 2022లో జరగబోయే యూత్ ఒలిపింక్స్, వింటర్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో రష్యా జట్లు పాల్గొనడానికి వీలుండదు. అంతేకాదు... వచ్చే నాలు గేళ్లలో అది ఏ అంతర్జాతీయ క్రీడా పోటీలకూ ఆతిథ్యం కూడా ఇవ్వడం సాధ్యపడదు.
విశ్వవేదికల్లో నిర్వహించే క్రీడలు సమీపిస్తున్నాయంటే అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది. స్వయంగా వీక్షిద్దామని వెళ్లినవారికి సరే... ప్రపంచంలో మూలమూలనా క్రీడాభిమానులకు అవి సాగినన్నాళ్లూ పండగే. అయితే వాటిల్లో ఆడుతున్నవారంతా ఉత్ప్రేరకాలు మింగి చెలరేగుతున్నారని తెలిస్తే వారంతా ఎంతో నొచ్చుకుంటారు. సోవియెట్ యూనియన్‌గా ఉన్నప్పుడు ఏ క్రీడలోనైనా పతకాలు రాబట్టుకోవడానికి అది విశేషమైన కృషి చేసేది. తాము నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా మొదట్లో అది అంతర్జాతీయ క్రీడోత్సవాలకు దూరంగా ఉన్నా 1952లో మొదటిసారి ప్రవేశించింది మొదలుకొని ఆ దేశ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచేవారు. అన్ని ఈవెంట్లలో పోటీబడి పతకాలు సొంతం చేసుకునేవారు.
సోవియెట్ విచ్ఛిన్నమయ్యాక 1992 నుంచి నాలుగేళ్లు అది అంత ర్జాతీయ పోటీలకు దూరంగా ఉండిపోయింది. తిరిగి 1996లో తొలిసారి అట్లాంటా ఒలింపిక్స్‌లో ఆడింది. గత వైభవాన్ని అందుకోవడానికి రష్యా చేస్తున్న కృషిని ప్రపంచమంతా ప్రశంసించింది. అన్ని దేశాలూ దాని స్ఫూర్తితో తమ క్రీడాకారుల ప్రతిభాపాటవాలకు పదును పెట్టడానికి కృషి చేశాయి. కానీ రష్యా ప్రతిభకు మూలాలు నిషిద్ధ ఉత్ప్రేరకాల్లో ఉన్నాయని వెల్లడయ్యాక ప్రపంచమే నివ్వెరపోయింది. తొలిసారి 2014లో జర్మనీకి చెందిన చానెల్ ఏఆర్‌డీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ అందరినీ దిగ్భ్రాంతిపరిచింది.
రష్యన్ అథ్లెట్లు ఒక పద్ధతి ప్రకారం డోపింగ్‌కు పాల్పడుతూ ప్రపంచ క్రీడలకు మచ్చ తెస్తున్నారని అది తేల్చి చెప్పింది. పర్యవసానంగా ఆ దేశానికి చెందిన క్రీడా బాధ్యులు పలువురు పదవులనుంచి తప్పుకున్నారు. ఈ చానెల్ వెల్లడించిన అంశాల్లో నిజానిజాలు తేల్చడానికి ‘వాడా’ అప్పట్లోనే ఒక నిజనిర్ధారణ సంఘాన్ని నియమించింది. ఆ మరుసటి ఏడాది ఏఆర్‌డీ రెండో డాక్యుమెంటరీ విడుదల చేసింది. రష్యా, కెన్యా అథ్లెట్లు అసాధారణమైన రీతిలో డోపింగ్‌కు పాల్పడ్డా రని అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య(ఐఏఏఎఫ్) డేటా ఆధారంగా ఆ డాక్యుమెంటరీ తేల్చి చెప్పింది. క్రీడా ప్రపంచంలో ఉన్నతంగా నిలవడం కోసం డోపింగ్‌ను రష్యా రాజ్య వ్యవస్థే ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రోత్సహిస్తున్నదని ‘వాడా’ నివేదిక కూడా ఆరోపించింది.
ఇప్పుడు రష్యాపై విధించిన నిషేధంమాటెలా ఉన్నా ఇన్నాళ్లుగా ‘వాడా’ ఏం చేసిందన్న ప్రశ్నలు తలెత్తకమానవు. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ ‘రుసాదా’ తమ నిబంధనలకు అనుగుణంగా పని చేయడం లేదని 2015లోనే ‘వాడా’ ప్రకటించింది. కానీ ఆ తర్వాత కూడా రష్యా క్రీడాకారులు విశ్వ క్రీడావేదికల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు కూడా ‘మచ్చలేని’ రష్యా క్రీడాకారులు స్వతంత్ర హోదాలో ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చునని ‘వాడా’ చెబుతోంది. తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ‘రుసాదా’పై అభియోగం మోపినప్పుడు అప్పట్లోనే నిషేధం దిశగా ఆలోచిం చివుంటే వేరుగా ఉండేది.
‘వాడా’ నివేదిక చూశాక రష్యా ప్రభుత్వం ‘రుసాదా’ అధిపతిని వెళ్లగొ ట్టింది. కానీ తమ క్రీడా మంత్రిత్వ శాఖకు ఈ కుంభకోణంతో ప్రమేయం లేదని తెలిపింది. ఈ విష యంలో నిష్పాక్షికంగా విచారణ జరిపితే తాము అన్నివిధాలా సహకరిస్తామని దేశాధ్యక్షుడు పుతిన్ అప్పట్లో తెలిపారు. కానీ మాస్కోలోని ల్యాబొరేటరీల్లో డోపింగ్ పరీక్షల నివేదికలన్నీ తారుమారయ్యా యని ‘వాడా’ 2016లో తేల్చింది. అప్పట్లో జరిగిన ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెటిక్స్ విభాగంలో పోటీ పడకుండా నిషేధించింది.
పూర్తిస్థాయి నిషేధానికి మరో మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలోనూ జరి గిన వివిధ క్రీడోత్సవాల్లో రష్యా పాల్గొనడం వల్ల వేరే దేశాల క్రీడాకారులకు అన్యాయం జరిగివుం డదా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. నిరుడు సెప్టెంబర్‌లో ‘రుసాదా’ను తిరిగి చేర్చుకున్న ప్పుడు మాస్కో ల్యాబొరేటరీల్లోని డేటా తమకు ఇవ్వాలని ‘వాడా’ షరతు పెట్టింది. కానీ ఇష్టాను సారం మార్చి తమకు అందజేశారని అది ఆలస్యంగా తెలుసుకుంది.
రష్యా క్రీడా ప్రపంచంలోని చీకటి కోణాల గురించి ఇప్పటికి పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. కొత్త కుంభకోణం వెల్లడైనప్పుడల్లా పాతది వెలవెలబోవడం రివాజుగా మారింది. పతకాల మోజులో పడి, అడ్డదారిలో వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నించి రష్యా ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. తన క్రీడాకారుల బంగారు భవిష్యత్తును తానే నాశనం చేసింది. ‘వాడా’ విధించిన నిషేధంపై అప్పీల్‌కు వెళ్లి ఇంకా తాను సుద్దపూసనని అది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుందా లేక క్షమాపణ చెప్పి నాలు గేళ్లపాటు అన్నిటికీ దూరంగా ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటుందా అన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment