మళ్లీ మోకాలడ్డిన చైనా | Editorial On China Supporting Pakistan In UN security Council | Sakshi
Sakshi News home page

మళ్లీ మోకాలడ్డిన చైనా

Published Fri, Mar 15 2019 12:49 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial On China Supporting Pakistan In UN security Council - Sakshi

ఆర్థిక ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ప్రపంచంలో చైనా భిన్నంగా ఉంటుందని ఆశించడం పొరపాటే. అది ఎప్పటిలాగే జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించాలన్న ప్రతిపాదనను భద్రతామండలి సమావేశంలో అడ్డుకుంది. మండలిలో శాశ్వత సభ్య దేశంగా తనకున్న వీటో అధికారాన్ని వినియోగించుకుని, ‘సాంకేతిక కారణాలు’ సాకుగా చూపి ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల ప్రతిపాదనను బుట్టదాఖలా చేసింది. ఇలా చేయడం చైనాకు కొత్తగాదు. పదేళ్లుగా ఇదే పని చేస్తూనే ఉంది. అందుకు పాకిస్తాన్‌ నుంచి ప్రతిఫలం పొందుతూనే ఉంది. ప్రపంచంలో అత్యధిక దేశాలు ‘ఉగ్రవాదం’ మహమ్మారి బారినపడుతున్నా ఆ పదానికి అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన చట్టబద్ధమైన నిర్వచనం ఇంతవరకూ లేకపోవడం వల్ల చైనా చాలా సునాయాసంగా ఇలాంటి ‘సాంకేతిక కారణాలు’ చూపగలుగుతోంది.

ఇలాంటి నిర్వ చనం లేకపోబట్టే చైనా పాలకులు తమ ఏలుబడిలోని జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో స్వయంపాలన కోసం, మత స్వేచ్ఛ కోసం శాంతియుతంగా పోరాడుతున్న వీగర్‌ జాతీయవాదుల్ని ఉగ్రవాదులుగా ముద్రేసి తీవ్రంగా అణిచేయగలుగుతున్నారు. అక్కడ ఉగ్రవాద వ్యతిరేక చట్టమంటూ లేకపోయినా  నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ముందున్న ముసాయిదా ప్రకారం సమాజానికి హాని తలపెట్టే పనులు చేసినా, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినా, ఆర్థిక నష్టాలకు కారణమైనా  ఉగ్రవాదులే అవుతారు. ఇలా స్వదేశంలో ఎందరో ఉగ్రవాదుల్ని ‘చూడగలుగుతున్న’ చైనా పాలకులకు మసూద్‌ అజర్‌లో అలాంటి లక్షణాలు కాస్తయినా కనబడటం లేదు! 

కశ్మీర్‌లోని పుల్వామాలో 43మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్ర దాడి జరిగిన కొద్దిసేపటికే అది తమ ఘనతేనని జైషే సంస్థ ప్రకటించుకుంది. ఆ దాడికి కారకుడైన యువకుడి పేరు సైతం ప్రకటించింది. తాము ఎప్పటిలాగే‘బాధ్యతాయుతమైన’ వైఖరితో ఉన్నామని, ఈ సమ స్యపై సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడాకే నిర్ణయించాలని భావిస్తున్నామని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్‌ చెబుతున్నారు. 2008 నవంబర్‌లో ముంబైపై ఉగ్రదాడి జరిగాక మసూద్‌ అజ ర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఆ మరుసటి ఏడాది మన దేశం ప్రతిపాదిం చింది. అప్పుడూ ఇదే తరహాలో చైనా ఆ ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేసింది. 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక దళ స్థావరంపై దాడి జరిగాక మరోసారి ఇదే ప్రతిపాదన తీసుకురాగా అప్పుడు సైతం చైనా అడ్డగించింది. ఆ మరుసటి ఏడాది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు తీర్మానం తీసుకొచ్చిన ప్పుడూ చైనా ఈ వైఖరే తీసుకుంది. జైషే సంస్థ భారత్‌లో దాడులకు పాల్పడిన ప్రతిసారీ తానే కారణమని చెప్పుకుంటోంది. భారత్‌ను బెదిరిస్తూ మసూద్‌ చేసిన ప్రసంగాలున్నాయి. కానీ ఇంకేదో కావాలని చైనా కోరుతోంది. ఆ దేశానికి తనపై ఇంత వల్లమాలిన విశ్వాసం ఉన్నందుకు మసూద్‌ కూడా ఆశ్చర్యపోతూ ఉండొచ్చు.

 కానీ చైనాకు వేరే ప్రయోజనాలున్నాయి. పాక్‌లో వివిధ ప్రాజెక్టుల్లో అది వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేవారిలో అత్యధికులు చైనా జాతీయులే. వారంతా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయవలసి వస్తోంది. వారికి ఉగ్రవాద బెడద తప్పడంలేదు. పెట్టుబడులు భద్రంగా ఉండటానికి అక్కడి ప్రభుత్వంతో... తమ పౌరులు క్షేమంగా ఉండటానికి పాకిస్తాన్‌ సైన్యంతో మంచి సంబంధాలు కొనసాగించడం చైనాకు అవసరం. ఇక సెంట్రల్‌ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో నేరుగా వాణిజ్యబంధం ఏర్పరచుకోవడానికి భారీయెత్తున తల పెట్టిన అధునాతన సిల్క్‌ రూట్‌ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో పాకిస్తాన్‌ను చేర్చుకుని ఇప్పటికే చైనా పనులు ప్రారంభించింది. అది ఏ మాత్రం అడ్డం తిరిగినా చైనా నిండా మునుగుతుంది.

అలాగే మన దేశానికి ఎంతో కొంత చెక్‌ పెట్టడానికి పాకిస్తాన్‌ తోడ్పడుతుందన్న నమ్మకం దానికుంది. కనుకనే ఏదో ఒక సాకుతో మసూద్‌ అజర్‌ విషయంలో భద్రతామండలి చర్య తీసుకోకుండా అది అడ్డుపడుతోంది. వాస్తవానికి పుల్వామా దాడి జరిగిన వెంటనే చైనా స్పందిం చిన తీరు గతంలో కంటే భిన్నంగా ఉంది. ఉగ్రవాదం బెడదపై ఈ ప్రాంత దేశాలన్నీ సహకరించు కుని దాన్ని అరికట్టడానికి పూనుకోవాలని, శాంతిసుస్థిరతలు సాధించాలని ఆ ప్రకటన సూచిం చింది. ఉగ్రవాదం బెడద పోవడానికి తాను భద్రతామండలిలో సహకరించదు. అజర్‌పై ఈగ వాలనీయదు. కానీ భారత్‌–పాకిస్తాన్‌లు మాత్రం మాట్లాడుకుని శాంతిసుస్థిరతలు సాధించాలి. ఇదెలా సాధ్యమవుతుందో, ఈ తర్కాన్ని ఏమంటారో చైనాయే చెప్పాలి.  

భద్రతామండలి 1998లో భద్రతామండలి ఆమోదించిన 1267 తీర్మానం పరిధిలోకి మసూ ద్‌ను తీసుకురావడం పదేళ్లుగా మన దేశం సాగిస్తున్న ప్రయత్నం సారాంశం. ఆ పని చేస్తే అతడి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని, ఆయుధాల సేకరణ అసాధ్యమవుతుందని భావించడమే ఇందుకు కారణం. 1267 తీర్మానం తర్వాత మండలి ఈ రెండు దశాబ్దాల్లోనూ ఉగ్రవాదుల కట్టడికి అనేక తీర్మానాలు చేసింది. కానీ నిషేధించిన సంస్థల్ని మూసేసి కొత్త పేర్లతో రావడం, యధావిధిగా తమ కార్యకలాపాలు సాగించడం ఉగ్రవాదులకు అలవాటు. గతంలో 1267 తీర్మానం కింద అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించిన జమా ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్, మరో అయి దుగురు పాకిస్తాన్‌లో అరెస్టయినా కొన్ని నెలలకే విడుదలయ్యారు. ఐక్యరాజ్యసమితి ముస్లిం దేశా లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని, భారత్‌ ప్రభావంతో ఇలాంటి తీర్మానాలు చేస్తున్నదని, సార్వభౌమాధికారం ఉన్న పాక్‌ దీన్నెలా అనుసరిస్తుందని హఫీజ్‌ చేసిన వాదనను లాహోర్‌ హైకోర్టు అంగీకరించి అతగాడిని విడుదల చేసింది. కనుక కశ్మీర్‌లో శాంతికి ప్రయత్నాలు చేయడం, సరిహద్దుల్లో ఉగ్రవాదులు ప్రవేశించకుండా కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం అవసరం. ఆ దిశగా అడుగులేస్తే ఉగ్రవాదం బెడద చాలావరకూ అరికట్టడం సాధ్యమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement