నిర్లక్ష్యానికి మూల్యం | Editorial On Explosion At Cracker Manufacturing Unit In Warangal | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి మూల్యం

Published Thu, Jul 5 2018 1:05 AM | Last Updated on Thu, Jul 5 2018 1:05 AM

Editorial On Explosion At Cracker Manufacturing Unit In Warangal - Sakshi

నిత్యం నిప్పుతో చెలగాటం అనదగ్గ బాణసంచా తయారు చేసేచోట, వాటిని నిల్వ చేసే ప్రదేశంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఏమాత్రం ఏమరు పాటుతో ఉన్నా పెను నష్టం సంభవిస్తుంది. వరంగల్‌ నగరంలోని కోటిలింగాలలో ఉన్న గోదాంలో బుధవారం హఠాత్తుగా పేలుళ్లు సంభవించి, క్షణాల్లో మంటలు వ్యాపించి 11 మంది సజీవదహనమైన ఉదంతం ఎంతో విషాదకరమైనది. ఈ దుర్ఘటనలో మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు దాదాపు నగరమంతా వినిపించాయంటే... వాటి ధాటికి మూడు కిలోమీటర్ల నిడివి లోని ఇళ్లు కంపించాయంటే ఈ ప్రమాదం తీవ్రత అర్ధమవుతుంది. ప్రమాదం జరిగాక 15 నిమిషాల పాటు పేలుళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది.

మంటలు అదుపులోకి రావడానికి రెండు గంటలు పట్టింది. ముప్పు ముంచుకొచ్చాక కదలటం మినహా ముందు జాగ్రత్త చర్యల్లో అధికార యంత్రాంగం ఎప్పుడూ విఫలమవుతున్నదని వరంగల్‌ ఉదంతం రుజువు చేసింది. బాణసంచా, టపాసుల తయారీ మాత్రమే కాదు... వాటిని నిల్వ చేసే గోదాంలు కూడా జనావాసాల మధ్య ఉండకూడదు. అలాగే వాటిని తెచ్చి నిల్వ చేసి, విక్రయించడానికి మాత్రమే అనుమతి ఉన్న సంస్థ తయారీ పనులకు దిగ కూడదు. కానీ వరంగల్‌ నగరంలో ఈ రెండింటినీ ఉల్లంఘించారు. ఎక్కడినుంచో పేలుడు పదా ర్థాలను తెప్పించుకుని 60మంది కార్మికులతో బాణసంచా, టపాసులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు మూడు నాలుగేళ్లనుంచి ఇదంతా కళ్లముందే సాగుతున్నా అధికార యంత్రాంగం, ప్రత్యేకించి అగ్ని మాపక శాఖ పట్టించుకోలేదు.

ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న విషయాల్లో కూడా పర్యవేక్షణ ఇంత నాసిరకంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ నిబంధనలైనా, ప్రమాణాలైనా ఏళ్ల తరబడి ఎదురైన సమస్యలనుంచి గుణపాఠాలు నేర్చుకుని రూపొందించుకున్నవే. కానీ అవి పుస్తకాల్లో మిగిలిపోతు న్నాయి. ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవ హరిస్తున్నారు. ఆ నిబంధనలు, ప్రమాణాలు అధికారులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి తప్ప జనం భద్రతకు, శ్రేయస్సుకు తోడ్పడటం లేదు.

పండగలు, శుభకార్యాలు, విజయోత్సవాలు జరిగే సందర్భాల్లో ఏ మతస్తులైనా బాణసంచా, టపాసులు కాల్చడం రివాజు. వీటిని ఎప్పటికప్పుడు అభివృద్ధిపరుస్తూ కొత్త కొత్త హంగులతో, ఆకర్షణీయంగా కనబడేలా చేయడం కోసం బాణసంచా ఉత్పత్తిదార్లు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రంగురంగుల కాంతులు వెదజల్లేలా, మిరుమిట్లు గొలిపేలా, భారీగా చప్పుళ్లు చేసేలా వీటిని రూపొందించడం కోసం ఎన్నో రకాల రసాయన పదార్ధాలు వినియోగిస్తారు.  ఈ ప్రక్రియలో నిర్దేశిత ప్రమాణాలను, అనుమతించిన రసాయనాలను మాత్రమే వినియోగిస్తున్నారా లేక నిషిద్ధ పదార్థాలేమైనా ఉపయోగిస్తున్నారా అన్న పర్యవేక్షణ ఉండాలి. అలాగే తయారైన బాణసంచాను, టపాసులను తీసుకెళ్లడంలో, నిల్వ చేయడంలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించాలి.

ఈ పనుల్లో ఎందరో నిమగ్నమై ఉంటారు గనుక వీటన్నిటినీ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలి. వరంగల్‌ ఉదంతంలో చట్టవిరుద్ధంగా టపాసులు, బాణసంచా తయారీ పనులు చేయిస్తున్నట్టు తమ దృష్టికి రాలేదని అధికారులు అమాయకత్వం నటిస్తే చెల్లదు. నిర్ణీత కాలవ్యవధిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, ఏం జరుగుతున్నదో తెలుసుకోవటం వారి బాధ్యత. వరంగల్‌ నగరంలో ఒకప్పుడు విప్లవ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ కారణం వల్ల ఇప్పటికీ అక్కడ ప్రజా సంఘాలు సభలు, సమావేశాలు జరుపుకోవటంపై అప్రకటిత నిషేధం, వాటి కార్యకలాపాలపై నిఘా ఉన్నాయి. అటువంటిచోట అత్యంత ప్రమాదకర స్థాయిలో జనావాసాల్లో బాణసంచా, టపా సుల తయారీ, నిల్వ, అమ్మకాలు యధేచ్ఛగా సాగిపోవటం వింత కాదా? గత నాలుగేళ్లలో మూడు సార్లు ప్రమాదాలు జరిగాయని అక్కడ లోగడ పనిచేసిన కార్మికుడు ‘సాక్షి’తో చెప్పాడు. పర్యవేక్షించా ల్సిన అధికారులకు మాత్రం ఈ సంగతి తెలిసినట్టు లేదు. 

బాణసంచా, టపాసుల తయారీ ప్రదేశంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలి. వీటి ఉత్ప త్తికి వాడే రసాయన పదార్థాలు ఎంతో ప్రమాదకరమైనవి. అందుకే తగిన శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే ఆ పనుల్లో ఉండాలి. అలాగే వారికి వివిధ రసాయనాలపై తగిన అవగాహన అవసరం. తాము ఎలాంటి ప్రమాదకర పదార్థాలతో పని చేస్తున్నామో వారికి అర్ధం చేయించడం, తీసుకోవా ల్సిన జాగ్రత్తలు చెప్పటం యాజమాన్యం బాధ్యత. అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నదని తెలిసినా కార్మికులు కేవలం పొట్ట నిండటానికి వేరే మార్గం లేక ఇటువైపు వస్తారు. సాధారణంగా కాంట్రాక్టు కార్మికుల్నే ఈ పనుల కోసం నియమించుకుంటారు. కనుక వారికి వివిధ ప్రయోజనాలు గానీ, రక్షణలుగానీ ఉండవు. కనీసం రికార్డుల్లో వారి పేర్లుంటాయో లేదో కూడా అనుమానమే.

ఇక ప్రమాదాల్లో ప్రాణాలుపోతే, తీవ్రంగా గాయపడితే వారిపై ఆధారపడి బతికే కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. మనకు 1884నాటి పేలుడు పదార్థాల చట్టం ఉంది. అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించి 2008లో రూపొందిన నిబంధనలున్నాయి. బాణ సంచా, టపాసుల పరిశ్రమలు అధికంగా ఉన్న శివకాశిలో పెను ప్రమాదాలు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు వీటికి అదనం. ఇవన్నీ బాణసంచా, టపాసుల తయారీ లేదా అమ్మకాలకు సంబంధించి లైసెన్స్‌లు జారీ చేయడానికి ముందు చూడాల్సిన అంశాలు, అనం తరకాలంలో ఎప్పటికప్పుడు తనిఖీలు సాగాలి. ఇలా ఎన్ని ఉన్నా వరంగల్‌ ఉదంతంలో 11 నిండు ప్రాణాలు బలైపోయాయి. కనీసం ఈ ఉదంతమైనా దేశంలో అందరి కళ్లూ తెరిపించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై... నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడకూడదు. అప్పుడు మాత్రమే ఇటువంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement