బతుకులు బుగ్గి | Cracker Unit Blast In Warangal 8 Killed | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 2:34 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

Cracker Unit Blast In Warangal 8 Killed - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  చెవులు చిల్లులు పడేలా శబ్దం.. ఆకాశం నిండా కమ్ముకున్న పొగలు.. మూడు కిలోమీటర్ల మేర కంపించిన ఇళ్లు.. వంగిపోయిన స్టీలు కడ్డీలు.. తునాతునకలైన షాబాదు రాళ్లు.. ఛిద్రమై వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికుల శరీర భాగాలు.. వరంగల్‌లో జరిగిన ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలివీ! నిబంధనలు తుం గలోకి తొక్కి, అధికారుల కళ్లు గప్పి నడుస్తున్న ఫైర్‌వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం 8 మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఐదుగురు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్‌ లోని భద్రకాళి ఫైర్‌వర్క్స్‌లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ విస్ఫోటానికి కారణం ధూమపానమా లేదా కరెంట్‌ షార్ట్‌ సర్క్యూటా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

అసలేం జరిగింది? 
వరంగల్‌కు చెందిన గుళ్లపెల్లి రాజ్‌కుమార్‌ అలియాస్‌ బాంబుల కుమార్‌ కాశి బుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ పేరుతో టపాసుల విక్రయాలు చేస్తున్నాడు. ఈ గోదాములో సుమారు 60 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది గోదాములో ఉన్నట్లు సమాచారం. కాజీపేటకు చెందిన ఓ మహిళ మరణించడంతో ఆమె శవయాత్రలో బాణసంచా కాల్చేందుకు బందెల సారంగపాణి, బండారి సమ్మయ్య, రాజు, మహేశ్‌ ఉదయం 11 గంటల సమయంలో ఈ గోడౌన్‌ వద్దకు వచ్చారు. కంపెనీ ఔట్‌లెట్‌లో టపాసులు బేరం చేస్తున్నారు. ఇంతలో శక్తివంతమైన టపాసులు లోపలి నుంచి తెస్తానంటూ ఓ వర్కర్‌ తయారీ విభాగంలోకి వెళ్లాడు.

ఇంతలో లోపలి నుంచి పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే ఒకదాని వెంట మరొకటిగా టపాసులు పేలిపోయాయి. దీంతో టపాసులు కొనేందుకు వచ్చినవారు ప్రాణభయంతో బయటకు పరుగెడుతూ విస్ఫోటం ధాటికి మెయిన్‌ గేటు వద్ద పడిపోయారు. కాసేపటికి తేరుకుని దూరంగా పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ గోదాములో పనిచేస్తున్న కార్మికులు ఎక్కడి వారక్కడే మంటల్లో సజీవ దహనమయ్యారు. పేలుళ్ల తీవ్రతకు కొందరి శరీరభాగాలు ఛిద్రమై వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పక్కనున్న కరెంటు తీగలు తెగిపడ్డాయి. కరెంటు పోల్‌పై ఉన్న ఇన్సులేటర్లు కూడా విరిగి ముక్కలయ్యాయి. గోదాము స్థలం నేలమట్టమైంది. చుట్టూ ఉన్న ప్రహరీ కూలిపోయింది.

కింద పరిచిన షాబాదు రాళ్లు తుక్కుతుక్కు అయ్యాయి. సుమారు గంట పాటు ఏకధాటిగా పేలుళ్లు, మంటలు కొనసాగాయి. పేలుడు తీవ్రతకు వరంగల్‌ తూర్పు ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదస్థలికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు ఒక్కసారిగా కంపించాయి. భారీ శబ్దం, ఇళ్లు కంపించడంతో పిడుగు పడిందేమో, భూకంపం వచ్చిందేమో అని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలియగానే ఫైర్‌ సిబ్బంది, స్థానికులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల్లో ఎనిమిది మృతదేహాలు లభించాయి. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. మృతులందరూ గోదాములో పని చేసే కార్మికులే. ఇందులో పనిచేసే మహిళలు బాణసంచాలో గన్‌పౌడర్‌ కూర్చి చుట్టలుగా చుట్టడం, క్రమంలో పేర్చడం, రంగులు అద్దడం వంటి పనులు చేస్తుంటారు. ప్రమాదంలో వీరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతదేహాలను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. 

ఆ సిగరెట్టే ముంచిందా? 
గోదాములో విస్ఫోటం ఎలా జరిగిందన్న అంశంపై స్పష్టత లేదు. అయితే టపాసులు కొనేందుకు వచ్చిన నలుగురిలో ఓ వ్యక్తి సిగరెట్‌ ముట్టించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. మిగిలిన ముగ్గురు బాణసంచా కొనుగోలు చేస్తుండగా మరో వ్యక్తి మూత్రం కోసం కాస్త దూరం వెళ్లాడు. ఈ సమయంలో అతడు సిగరెటు ముట్టించినట్లు తెలిసింది. ఇది గమనించిన ఓ కార్మికుడు సారూ.. సిగరెట్‌ ముట్టించవద్దు అని అరిచాడు. దీంతో ఆ వ్యక్తి సిగరెట్‌ను కింద పడేయడం, అక్కడే బాణసంచా తయారీ పదార్థాలపై అది పడడంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ నిప్పే క్రమంగా విస్తరించి పెద్ద ఎత్తున్న నిల్వ ఉన్న బాణసంచా మొత్తం అంటుకోవడంతో కారణమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మానవ తప్పిదం వల్ల జరిగిందేనని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గోడౌన్‌ ప్రాంతమంతా సీసీ కెమెరా నిఘాలో ఉంది. కెమెరా మెమెరీ ఉండే హార్డ్‌డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాదానికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు. 

అమ్మకాల పేరుతో తయారీ.. 
భద్రకాళి ఫైర్‌వర్క్స్‌లో అడుగడునా నిబంధనలు తుంగలో తొక్కారు. ఈ సంస్థను 2009లో రిజిస్టర్‌ చేయించారు. ఏడాది పొడవునా బాణసంచా అమ్మకాలపై వరుసగా అనుమతులు తీసుకుంటున్నారు. 2016లో మూడేళ్ల కాలపరిమితికి జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు పొందారు. ఇక్కడ కేవలం ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన టపాసులను నిల్వ ఉంచి అమ్మకాలు చేయాలి. కానీ ఇందుకు విరుద్ధంగా తయారీ చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు, రక్షణ చర్యలు తీసుకోకుండా కుటీర పరిశ్రమ స్థాయిలో నిత్యం మూడు షిఫ్టుల్లో టపాసుల తయారీ కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ భగవాన్‌ రెడ్డి మాట్లాడుతూ.. భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌కు తయారైన బాణసంచా అమ్ముకునేందుకు మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయన్నారు. ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఫైర్‌వర్క్స్‌ నిర్వాహకుడు బాంబుల కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

జాడ లేని ఫైర్‌సేఫ్టీ.. 
ఫైర్‌సేఫ్టీ నిర్వహణలో భాగంగా రిటైర్డ్‌ ఫైర్‌ అధికారిని ఫైర్‌ సెఫ్టీ ఉద్యోగిగా నియమించాల్సి ఉంది. దీంతోపాటు ప్రతి ఏడాదికి ఓ సారి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలి. ఈ రెండు నిబంధనలు గోదాములో అమలుకు నోచుకోలేదు. ఫైర్‌ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రమాద సమయంలో పని చేయలేదు. మంటలను ఆర్పే సిలిండర్లు సంఘటన స్థలంలోనే పడి ఉన్నాయి. ఫైర్‌ సేఫ్టీ పైపులు పగిలిపోయినా.  వాటి నుంచి మంటలను ఆర్పే రసాయనాలు, నీరు విడుదల కాలేదు. 

మధ్యాహ్నం మళ్లీ పేలుళ్లు 
ఉదయం 11 గంటలకు ప్రమాదం సంభవించగానే అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ వైపు ఫైర్‌ సిబ్బంది శిథిలాల తొలగింపు చేస్తుండగా మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో బాంబులు నిల్వ చేసే స్థలంలో మరోసారి మంటలు ఎగిశాయి. టపాసుల మోత మొదలైంది. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. ఓవైపు పేలుళ్ల మోత కొనసాగుతుండగానే శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీశారు.  

జనావాసాల మధ్య అనుమతి ఎలా ఇచ్చారు? 
ప్రమాదం జరిగే అస్కారం ఉండటం వల్ల బాణసంచా నిల్వలు, అమ్మకాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. సాధారణంగా జనావాసాల మధ్య వీటికి అనుమతి ఇవ్వరు. కానీ అగ్నిమాపక శాఖ, గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ అధికారులు జనావాసాల మధ్య అనుమతి ఇవ్వడం గమనార్హం. భద్రకాళి ఫైర్‌వర్క్స్‌కు పక్కన ఉన్న మణికంఠ కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. పద్ధతి లేకుండా ఇష్టారీతిగా అనుమతులు ఇవ్వడం, ఆపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంది. 

ప్రాణాలు పోయాయనుకున్నా: సారంగపాణి, ప్రత్యక్ష సాక్షి 
మా బంధువొకరు చనిపోవడంతో బాణసంచా కొనేందుకు మేం నలుగురం భద్రకాళి ఫైర్‌వర్క్స్‌కు వెళ్లాం. ఔట్‌లెట్‌లో టపాసులు చూసి మరింత శక్తివంతమైనవి కావాలని అడిగాం. అక్కడున్న వ్యక్తి తెచ్చి ఇస్తానంటూ లోపలికి వెళ్లాడు. ఇంతలో మాలో ఇద్దరు కొంచెం బయటకు వెళ్లగా నేను అక్కడే ఉన్నా. ఇంతలో శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే టపాసులు పేలుతున్నాయి. 

టెస్టింగ్‌ అనుకున్నా.. : శివకుమార్‌ 
భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ సమీపంలోనే మా ఇళ్లు ఉంది. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి పైకప్పుగా ఉన్న రేకులు విరిగిపోయి కింద పడుతున్నాయి. పదిహేను నిమిషాల పాటు శబ్దాలు తప్ప మరేమీ వినిపించలేదు. బాంబులు టెస్టు చేస్తున్నారేమో అనుకున్నా. బయటకొచ్చాక ప్రమాదం సంగతి తెలిసిందే. 

ఇది నాలుగోసారి.. 
నాలుగేళ్లలో ఇక్కడ మూడుసార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అందులో ఏడేళ్లుగా పనిచేసిన ఓ కార్మికుడు తెలిపాడు. అయితే కార్మికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదాలు తప్పాయని పేర్కొన్నాడు. వరుసగా ఈ తరహా ఘటనలు జరుగుతుండడంతో పని మానేసినట్టు వివరించాడు. 

మృతుల వివరాలు.. 
గాజుల హరిక్రిష్ణ (38), తిలక్‌రోడ్, కాశిబుగ్గ, వరంగల్‌ 
కోమటి శ్రావణి (33), ఓంసాయి కాలనీ , సుందరయ్య నగర్, వరంగల్‌ 
బేతి శ్రీవాణి (25) ఓంసాయి కాలనీ, సుందరయ్య నగర్, వరంగల్‌ 
రంగు వినోద్‌ (24) బాలాజీ నగర్, ఏనూమాముల మార్కెట్‌ రోడ్, వరంగల్‌ 
వల్‌దాసు అశోక్‌కుమార్‌ (30) కాశిబుగ్గ, వరంగల్‌ 
బాలిని రఘుపతి (40), సాయిబాబా గుడి దగ్గర, కాశిబుగ్గ, వరంగల్‌ 
కందకట్ల శ్రీదేవి (34), కీర్తినగర్‌ కాలనీ, గొర్రెకుంట, వరంగల్‌ 
బాస్కుల రేణుక (39) సుందరయ్య నగర్, వరంగల్‌ 

ఈ ఇద్దరి ఆచూకీ లేదు 
వడ్నాల మల్లికార్జున్‌ (35), కొత్తవాడ, వరంగల్‌ 
వంగరి రాకేష్‌ (22), కరీమాబాద్‌ ,వరంగల్‌ 

క్షతగాత్రులు 
కొండపల్లి సురేష్, బాలాజీనగర్, ఏనుమాముల, వరంగల్‌ 
బందెల సారంగపాణి, గొర్రెకుంట, వరంగల్‌ 
పరికెల మోహన్, కాశిబుగ్గ, వరంగల్‌ 
బి.రవి, హన్మకొండ 
సలేంద్ర శివ, కోటిలింగాల, వరంగల్‌ 

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి 
వరంగల్‌లో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. స్పీకర్‌ మధుసూధనాచారి, మంత్రి ఆజ్మీరా చందూలాల్, వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, వినయ్‌భాస్కర్, కొండా సురేఖ తదితరులు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 

సమగ్ర విచారణ జరపాలి 
ప్రమాదంపై విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, క్షతగాత్రులకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఫైర్‌వర్క్స్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అ««ధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement