గల్ఫ్ కుమ్ములాట
గల్ఫ్ కుమ్ములాట
Published Wed, Jun 7 2017 1:09 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరే బియాను ఎంచుకున్నప్పుడు కొందరు కీడు శంకించారు. ఆ పర్యటన సందర్భంగా ఆయన సౌదీతో కోట్లాది డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నెల తిరగకుండానే ఆ పర్యటన పర్యవసానాలు బయటపడ్డాయి. ఉగ్రవాదానికి ఊత మిస్తున్నదని ఆరోపిస్తూ ఖతర్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్టు గల్ఫ్ సహకార మండలి(జీసీసీ)లోని మూడు దేశాలు– సౌదీ అరేబియా, యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్‌లతోపాటు ఈజిప్టు, మాల్దీవులు, యెమెన్, లిబియాలో ఒక వర్గం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం సోమవారం ప్రకటించాయి.
పనిలో పనిగా ఖతర్ పాలకుల నేతృత్వంలోని అల్ జజీరా మీడియా సంస్థను బహిష్కరించాయి. ఒబామా హయాంలో తన బద్ధ శత్రువైన ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందంతో గల్ఫ్‌లో తన పరిస్థితి ఏమి టని ఆందోళనపడిన సౌదీకి అమెరికాలో ట్రంప్ రావడంతో ఊరట దొరికింది. ఆ తర్వాత ఆయన తమ దేశాన్ని తొలి పర్యటనకు ఎంచుకోవడంతో ఎక్కడలేని బలమూ వచ్చింది. ఇప్పుడది ప్రకోపించి ఖతర్‌ను ఏకాకిని చేసేంతవరకూ వెళ్లింది. డోనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటన సందర్భంగా జీసీసీలోని ఆరు దేశాలతో పాటు ఇతర దేశాలకు చెందిన 50మంది అరబ్, ముస్లిం నాయకులనుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడండని పిలుపునిచ్చారు. గల్ఫ్ లో మళ్లీ తన పెత్తనాన్ని పటిష్టం చేసుకోవడానికి సౌదీకి ఇంతకన్నా అవకాశం దొర కదు. అందుకే అందరినీ పోగేసి ఖతర్‌పై కత్తిగట్టింది.
అయితే ఖతర్ చెప్పుకుంటున్నట్టు దానికి ఉగ్రవాద సంస్థలతో నిజంగా ఎలాంటి ప్రమేయమూ లేదా? ఖతర్ గురించి అయినా, ఆ మాటకొస్తే సౌదీతో సహా గల్ఫ్‌లోని ఏ దేశానికైనా ఆ విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడం అంత సులభమేమీ కాదు. ఆ దేశాల్లోని పాలకులందరూ అమెరికా చెప్పుచేతల్లో నడిచే వారే. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునేవారే. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట 2001 నుంచి అమెరికా ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న చర్యలన్ని టికీ అండగా నిలుస్తున్నవారే. మరోపక్క తమ తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే ఆ ఉగ్రవాద సంస్థలతో లాలూచీ పడటానికి వెరవని నైజం అక్కడి పాలకులది. అల్–కాయిదా మొదలుకొని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వరకూ అన్ని సంస్థలకూ సౌదీ నుంచే నిధులందుతున్నట్టు యూరప్ యూనియన్ (ఈయూ) ఇంటెలిజెన్స్ నిపుణులు నిరుడు ప్రకటించారు.
వివిధ ధార్మిక సంస్థల మాటున అనేక దేశాల్లో సౌదీ పాలకులు వెచ్చిస్తున్న నిధులు ఉగ్రవాద సంస్థలకు చేరు తున్నాయని అమెరికా సైతం తెలిపింది. అయినా తన విధానాలను అది సరి దిద్దుకున్న జాడలేదు. ఇక ఖతర్ విషయానికొస్తే... గల్ఫ్‌లోనే అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఉంది. అక్కడి నుంచే ఉగ్రవాద అనుమానిత స్థావరాలపై అమెరికా వైమానిక, ద్రోన్ దాడులు కొనసాగిస్తుంటుంది. కానీ ఆ దేశం సిరియాలో కొన్ని ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరిపి వారి చేతుల్లో బందీలుగా ఉన్నవారిని విడిపిం చిన సందర్భాలున్నాయి. అది అఫ్ఘానిస్తాన్ సర్కార్‌కూ, తాలిబన్‌లకూ మధ్య రాయబారాలు నడిపింది. పరమ కర్కోటకులుగా, మూర్ఖులుగా పేరుబడిన ఉగ్ర వాదులు ఖతర్ మాటలకు ఎందు కంత విలువిస్తారో ఎవరికీ తెలియదు. ఆ దేశం చెప్పదు.
ఈ తెగతెంపుల వ్యవహారంలో ఈజిప్టు కూడా చేరడం, ఖతర్ మద్దతునిస్తున్న దంటున్న ఉగ్రవాద సంస్థల జాబితాలో అల్–కాయిదా, ఐఎస్‌లతోపాటు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను కూడా చేర్చడం చూస్తే ఇదంతా పెద్ద ప్రహసనమని అర్ధమవు తుంది. ముస్లిం బ్రదర్‌హుడ్ చరిత్ర తెలిసినవారెవరూ దాన్ని ఉగ్రవాద సంస్థగా పరిగణించరు. 2011లో అరబ్ ప్రపంచాన్ని కుదిపిన ప్రజాస్వామిక విప్లవం సందర్భంగా ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్‌ను పదవీభ్రష్టుణ్ణి చేసిన అనేక సంస్థలతో ముస్లిం బ్రదర్‌హుడ్ కలిసి నడిచింది. అది ఈజిప్టులో ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2012–13 మధ్య కొద్ది కాలం అక్కడ అధికారంలో ఉంది.
అయితే ఆ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి అధికా రాన్ని కైవసం చేసుకుంది. ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఛాందసవాద సంస్థగా భావించ వచ్చుగానీ ఉగ్రవాద సంస్థగా పరిగణించలేం. వాస్తవమేమంటే ఈజిప్టు ఎన్నికల్లో దాని గెలుపు చూశాక గల్ఫ్ దేశాల రాచరిక పాలకులకు వణుకు మొదలైంది. దాని స్ఫూర్తితో తమ దేశాల్లోనూ ఉద్యమాలు చెలరేగవచ్చునని వారు భావించారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు ఉగ్రవాద సంస్థల సరసన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను చేర్చడాన్నిబట్టే సౌదీ అండ్ కో ప్రవచిస్తున్న ‘ఉగ్ర వాద వ్యతిరేక పోరు’లోని చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుంది. వాస్తవానికి ఖతర్ అధికార వార్తా సంస్థ వెబ్‌సైట్‌ను,ట్విటర్ ఖాతాను కొందరు దుండగులు హ్యాక్ చేసి ప్రచారంలో పెట్టిన వార్తే తాజా గల్ఫ్ సంక్షోభాన్ని రాజేసింది.
ఖతర్ పాలకుడు తమిమ్ బిన్ హమద్ అల్ థానీ ఇరాన్‌ను ఈ ప్రాంతంలో బలమైన దేశంగా అభివర్ణించినట్టు, దాన్ని ఏకాకిని చేయాలన్న ట్రంప్ పిలుపు వివేకవంతమైనది కాదని వ్యాఖ్యానించినట్టు ఆ వార్తా సంస్థ వెబ్‌సైట్‌లో వచ్చింది. దాన్ని ఖతర్ ప్రభుత్వం ఖండించింది. ఆ వార్తలో నిజం లేదని తెలి పింది. అయినా గల్ఫ్‌లో తన ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా స్వతంత్ర పోకడలకు పోతున్న ఖతర్‌పై కినుక వహించిన సౌదీ ఆసరా చేసుకుంది. గల్ఫ్‌లోని ఇతర దేశాలతో పోలిస్తే ఖతర్ తలసరి ఆదాయం చాలా ఎక్కువ. దానికీ, ఇరాన్‌కు మధ్య సాగర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. ఆ రెండు దేశాల మధ్యా అనేక ఒప్పందాలున్నాయి. ఇంత సంపద ఉండబట్టే అది జీసీసీలోని ఇతర సభ్య దేశాలైన కువైట్, ఒమన్‌లను ప్రభావితం చేస్తోంది. ఏతావాతా ఆధిపత్యం కోసం జరుగుతున్న కుమ్ములాటకు ఉగ్రవాద వ్యతిరేక రంగు పులిమి ప్రపంచ ప్రజ లను వంచించ డానికి సౌదీ ప్రయత్నిస్తోంది. ఈ దేశాలన్నీ అమెరికాకు కావలసి నవే గనుక దౌత్య సంక్షోభం ఎంతోకాలం కొనసాగబోదని భావించాలి.
Advertisement
Advertisement