మన పౌరులకు చాన్నాళ్లనుంచి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించడమే కాదు...వర్తక, వాణిజ్య రంగాల్లో మనకు కీలక భాగస్వామిగా ఉంటూవస్తున్న యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు పర్యటించారు. మనకు గతంలో ఇరాన్‌తో ఉన్న సంబంధబాంధవ్యాల వల్లకావొచ్చు... యూఏఈపై మొదటినుంచీ ఉన్న అమెరికా ప్రభావంవల్ల కావొచ్చు భారత-యూఏఈల మధ్య సంబంధాలు తగిన స్థాయిలో విస్తరించలేదు. ఇప్పుడు మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఒక్క యూఏఈ మాత్రమే కాదు... గల్ఫ్ సహకార మండలి(జీసీసీ)లోని ఇతర భాగస్వామ్య దేశాలు బహ్రైన్, కువైట్, ఒమన్, కతార్, సౌదీ అరేబియాలు సైతం ‘లుక్ ఈస్ట్’ విధానంలో భాగంగా భారత్‌తో మరింత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఇదే సమయంలో మన దేశం కూడా పశ్చిమాసియాపై దృష్టి సారించింది. మన ప్రాథమ్యాలు ఏవైనా... మన ప్రయోజనాలు ఎవరితో ముడిపడి ఉన్నా మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అన్నివిధాలా తోడ్పడుతున్న యూఏఈని విస్మరించడం తెలివైన పని కాదు. అయినా సరే మన ప్రధాని ఒకరు ఆ దేశం వెళ్లడానికి 34 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే ఇన్నేళ్ల సమయంలోనూ ఆ దేశంతో మంచి సంబంధాలు లేవని కాదు. ఇరు దేశాల మంత్రులూ పరస్పరం పర్యటించుకోవడం సాగుతున్నది. ద్వైపాక్షిక ఒప్పందాలూ కుదురుతున్నాయి. కానీ ప్రధాని స్థాయి అధినేత పర్యటించడంవల్ల చేకూరే లాభాలు వేరుగా ఉంటాయి.
వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం రంగాలతోపాటు యూఏఈలో ఉండే భారతీయుల స్థితిగతులను మెరుగుపర్చడం మోదీ పర్యటన ఉద్దేశమని నాలుగు రోజుల నాడు విదేశాంగ ప్రతినిధి చెప్పారు. వాస్తవానికి రెండేళ్లక్రితం అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ యూఏఈ పర్యటన ఖరారై చివరి నిమిషంలో రద్దయింది. అప్పుడే ఉగ్రవాద కార్యకలాపాల నిరోధంలో పరస్పరం సహకరించుకునే ఒప్పందం, పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయని అన్నారు. అప్పటినుంచీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ ఒప్పందాలపై సంతకాలు చేయడంతోపాటు త్వరలో జరపబోయే ఇజ్రాయెల్ పర్యటనకు ఇది విరుగుడుగా ఉపయోగపడుతుందని భావించడంవల్ల కూడా కావొచ్చు...మోదీ యూఏఈ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక బృందంగా చూస్తే జీసీసీ దేశాలకు మన నుంచి ఎగుమతులు, ఆ దేశాలనుంచి మనకొచ్చే దిగుమతులూ గణనీయంగానే ఉన్నాయి. ప్రత్యేకించి యూఏఈతో ఇవి అధికం. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమెరికా, చైనాల తర్వాత మనతో వాణిజ్య భాగస్వామ్యమున్న దేశాల్లో యూఏఈది అగ్రతాంబూలం. ఈ కాలంలో యూఏఈతో మన వాణిజ్య లావాదేవీల పరిమాణం 6,000 కోట్ల డాలర్లు (రూ. 3,93,000కోట్లు). ఇక మన దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో 45 శాతాన్ని జీసీసీ దేశాలే అందజేస్తుండగా అందులో యూఏఈ వాటా గణనీయంగా ఉంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనీయాలని సంకల్పించుకున్న మన దేశం ఆ రంగంలో గల్ఫ్ దేశాలనుంచి భారీయెత్తున పెట్టుబడులను ఆశించింది. అందుకు తగ్గట్టుగా భారత్-యూఏఈలమధ్య కుదిరిన ఒప్పందం మొత్తంగా 7,500 కోట్ల డాలర్లను (రూ.4 లక్షల 90 వేల కోట్లు) భారత్‌లో రైల్వేలు, పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం కోసం వెచ్చించాలని సంకల్పించింది. అలాగే గల్ఫ్ దేశాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిర్మాణ రంగం, రవాణా, ఇతర సర్వీసుల్లో భారత్ సహకారంతో మానవ వనరులను పెంపొందించాలను కుంటున్నాయి.
యూఏఈని నరేంద్ర మోదీ ‘మినీ భారత్’గా అభివర్ణించడంలో వాస్తవముంది. జీసీసీ దేశాల్లో మొత్తంగా 70 లక్షలమంది భారతీయులుండగా అందులో ఒక్క యూఏఈలోనే 26 లక్షలమంది ఉన్నారు. ఆ దేశ జనాభాలో మన ప్రవాసులు 30 శాతం వరకూ ఉంటారు. మొత్తంగా గల్ఫ్ దేశాలనుంచి ఏటా 600 కోట్ల డాలర్ల(రూ. 39,240 కోట్లు) సొమ్ము మన దేశానికి వస్తుంటుంది. ఇదంతా రాత్రింబగళ్లు నెత్తురును చెమట చుక్కలుగా చేసి తమ కుటుంబాలకు కార్మికులు పంపిస్తున్న మొత్తం. ఈ రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో మన పాలకులు ఇంతవరకూ సరైన దృష్టి పెట్టలేదు. అసలు ప్రవాస భారతీయుల సదస్సుల్లో అమెరికా, బ్రిటన్ దేశాల ఎన్నారైలకిచ్చే ప్రాముఖ్య తను గల్ఫ్ దేశాల ప్రవాసులకు ఇవ్వరు. గల్ఫ్ దేశాలకెళ్లేవారిలో అత్యధికులు అంతంతమాత్రం చదువులు చదివి వివిధ పనుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించినవారే. వారి జీవన పరిస్థితులను సరిదిద్దడానికి, వారికెదురవుతున్న ఇబ్బందులపైనా, వాటి పరిష్కారాలపైనా పాలకులు సమగ్ర ఆలోచన చేయలేదు. ఇప్పుడు భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు, వారికి చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని తీర్చడానికి అవసరమైన వ్యవస్థ వంటివి ఏర్పాటు చేయబోతున్నట్టు మోదీ ప్రకటించారు. మంచిదే. ఇది మరింత విస్తరించాల్సి ఉంది.
నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయనడంలో సందేహం లేదు. ఇరు దేశాల సంయుక్త ప్రకటన ఆ సంగతిని స్పష్టంచేస్తున్నది. ముఖ్యంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో ఇరు దేశాలూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. మతంపేరుతోగానీ, ఇతరత్రాగానీ వేరే దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించే పోకడలను ఖండించాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్న మన దేశానికి ఇది నైతికబలాన్ని చేకూర్చే విషయం. అంతేకాదు...దావూద్ ఇబ్రహీంవంటి మాఫియా డాన్‌లు పాక్‌నుంచి గల్ఫ్ దేశాలకు నిధులు తరలించి, అటునుంచి భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతున్నారు. ఇరు దేశాలమధ్యా కుదిరిన అవగాహనవల్ల అలాంటి కార్యకలాపాలకు బ్రేకు పడుతుంది. మొత్తంగా మోదీ పర్యటన పశ్చిమాసియాలో భారత్ ప్రభావాన్ని, పాత్రనూ మరింతగా పెంచుతుంది.
యూఏఈతో అనుబంధం
Published Mon, Aug 17 2015 11:41 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement