సహనం, సహజీవనం బాటలో... | The temple was built on a huge scale in the UAE on a 27 acre site | Sakshi
Sakshi News home page

సహనం, సహజీవనం బాటలో...

Published Sat, Feb 24 2024 2:19 AM | Last Updated on Sat, Feb 24 2024 2:19 AM

The temple was built on a huge scale in the UAE on a 27 acre site - Sakshi

యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు. స్పష్టంగా, బిన్‌ జాయెద్‌ ఇస్లాం శాంతి మతం మాత్రమే కాదు, అది ఇతర ఆధ్యాత్మిక అన్వేషణలను అంగీకరిస్తుందని చూపించాలనుకుంటున్నారు.

దీనిపై సంప్రదాయ ఉలేమానుండి వచ్చివుండిన వ్యతిరేకతను కూడా ఆయన అధిగమించగలిగారు. యూఏఈ పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగివుంది. ముల్లా ఒమర్‌ తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటనే వెలుగులో చూస్తే వారి ఈ ప్రయాణం అద్భుతమైనది.


ఫిబ్రవరి 13–14 తేదీలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబూ ధాబీలో, బోచాసన్‌ వాసీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ(బాప్స్‌) సంస్థ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు, అబూ ధాబీ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నాహ్‌ యాన్‌ (ఎంబీజెడ్‌) ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, స్వామి నారాయణ్‌ సంస్థ దివంగత అధినేత ప్రముఖ్‌ స్వామి మహారాజ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ సంబంధం ‘తండ్రీ కొడుకుల మాదిరిగానే ఉండేది’ అని చెప్పారు. ‘ప్రముఖ్‌ స్వామి మహారాజ్‌ కలను సాకారం చేయడంలో నేను సహాయపడినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. ప్రముఖ్‌ స్వామి మహా రాజ్‌ 1997లో యూఏఈని సందర్శించినప్పుడు అబూ ధాబీలో ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారు.

షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ సహనం, విభిన్న విశ్వాసాల మధ్య అవగాహన, సహజీవనం వంటి ధర్మాలకు కట్టుబడి ఉన్నారు. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం, గురుద్వారా నిర్మాణానికి అనుమతించిన దేశ ఉపాధ్యక్షుడు, దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూడా బిన్‌ జాయెద్‌ అభిప్రాయాలను గణనీయమైన స్థాయిలో పంచుకుంటు న్నారు. యూఏఈ ప్రభుత్వం పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగి ఉంది. దీనికి జ్ఞానవంతుడైన షేక్‌ నాహ్‌ యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నాహ్‌యాన్‌ నేతృత్వం వహిస్తున్నారు.

తమ సాంప్రదాయిక సమాజంలో అబ్రహామిక్‌ విశ్వాసాల ప్రార్థనా స్థలాలను మాత్రమే కాకుండా ఇప్పుడు హిందూ, సిక్కు, బౌద్ధమతాల ప్రార్థనాలయాలను స్థాపించడానికి అనుమతించడంలోనూ ఈ నాయకులు మార్గదర్శకులుగా నిలిచారు. నేను 1979–82 ప్రాంతంలో అబూ ధాబీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశాను. ఆ సమయంలో, దుబాయ్‌లో హిందువులు, సిక్కుల ఆరాధనకు సంబంధించి ఒక చిన్న స్థలం ఉండేది.  అయితే, బయటి నుండి దానిని గుర్తించలేరు.

హిందువులు, సిక్కులు బహిరంగంగా గుర్తించే విధంగా తమ ప్రార్థనలను, కీర్తనలను చేయకూడదనే అవ గాహనతో అప్పటి దుబాయ్‌ పాలకుడు షేక్‌ రషీద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తూమ్‌ దీనిని అనుమతించారు. ఆ రోజుల్లో, ప్రార్థనా స్థలాల నిర్మా ణానికి కాదు కదా, ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించుకోవడానికి కూడా యూఏఈ అనుమతించడం అనేది ఊహకందని విషయం. నిజానికి, ఇప్పుడు కూడా, యూఏఈ ఉదాహరణను ఇతర అరబ్‌ దేశాలు పూర్తిగా అనుసరించలేదు. సౌదీ అరేబియా యువ రాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌ మహిళల బహిరంగ కార్యకలాపాలపై ఇచ్చిన సామాజిక సడలింపులు పూర్తి భిన్నమైన కోవలోకి వస్తాయి.

యూఏఈ 1971 డిసెంబరులో ఏడు ఎమి రేట్లతో కలిసి ఒక దేశంగా ఆవిర్భవిం చింది. అవి: అబూ ధాబీ, దుబాయ్, షార్జా, రస్‌ అల్‌ ఖైమా, ఉమ్‌ అల్‌ క్వైన్, అజ్మాన్, ఫుజైరా. అప్పటివరకు బ్రిటిష్‌ రక్షిత ప్రాంతా లుగా ఉంటూవచ్చిన అవి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 1962లో అబూ ధాబీలో భారీ పరిమాణంలో చమురును కను గొన్నారు. కానీ దుబాయ్‌లో తక్కువ నిల్వలు ఉండేవి. షార్జాలో ఇంకా తక్కువ. మిగతా ఎమి రేట్స్‌లో అవీ లేవు. 1970వ దశకంలో చమురు ధరల పెరుగుదల యూఏఈ రూపు రేఖలను మార్చింది. అబూ ధాబీ తాను అభివృద్ధి చెందడమే కాకుండా, ఇతరులతో తన ఔదార్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది. దీంతో భారీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభ మయ్యాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాల నుండి ప్రజలను తీసుకువచ్చింది. వారు వివిధ విశ్వాసాలకు చెందినవారు. 

అప్పటి దుబాయ్‌ పాలకుడైన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ తన ఎమిరేట్‌ను వ్యాపారం, షిప్పింగ్, ఫైనాన్స్‌ కోసం ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా నిర్మించడం ప్రారంభించారు. దీని కోసం, ఆయన పెద్ద సంఖ్యలో విదేశీయుల రాకను ప్రోత్సహించవలసి వచ్చింది. బిన్‌ రషీద్‌ దార్శనికతను దుబాయ్‌ ప్రస్తుత పాలకుడు ముందుకు తీసు కెళ్లారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. పర్యాటకా నికి మహిళలు, ఆహారం, పానీయాలకు సంబంధించిన పాత, కఠిన మైన సామాజిక ఆచారాల సడలింపులు అవసరమయ్యాయి. అయితే, అధికారులు దుబాయ్‌లో నివసించడానికీ, పని చేయడానికీ వచ్చిన వారి రాజకీయ కార్యకలాపాలను మాత్రం అనుమతించలేదు. అబూ ధాబీ మినహా కొన్ని ఇతర ఎమిరేట్‌లు దీనిని అనుసరించాయి. ముస్లి మేతర మత కార్యకలాపాలను బహిరంగంగా వ్యక్తీకరించడాన్ని, పర్యవేక్షించడం మరొక అంశం. ఏమైనా విశ్వాసాల విషయంలో వహాబీ, సలాఫీ ఇస్లాం సిద్ధాంతాలు కచ్చితంగా అమలయ్యాయి.


ఇక్కడే యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ సహనం, సహజీవనాలను ప్రచారం చేయడంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఇవి ఇస్లామిక్‌ విశ్వాసంపై అత్యంత కఠినమైన వ్యాఖ్యానం, అభ్యాసం కోసం పట్టుబట్టే ఇబ్న్‌ వహాబ్‌ సాంప్రదాయ బోధనలకు భిన్నమైన పరాయి ఆలోచనలు. సౌదీ రాజకుటుంబం వహాబిజంతో ఒప్పందాన్ని కలిగి ఉంది. అరేబియా ద్వీపకల్పంలోని ఇతర గిరిజన పెద్దలు కూడా దానిని అనుసరించారు. ఇస్లాంకు ఇతర వ్యాఖ్యానాల చెల్లుబాటు తిరస్కరించబడింది. వాస్తవానికి, ఇతర మతాలను, ముఖ్యంగా అబ్రహామిక్‌ కానివాటిని అంగీకరించే ప్రశ్నే లేదు. ఇక విగ్రహారాధనకు అయితే పెద్ద వ్యతిరేకత ఉంటుంది.

స్పష్టంగా, మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ఇస్లాం శాంతికి సంబంధించిన మతం మాత్రమే కాదు, అది గౌరవప్రదమైనదనీ, ఇతర ఆధ్యా త్మిక అన్వేషణలను అంగీకరిస్తుందనీ చూపించాలనుకుంటున్నారు. అది ఉదారవాద, జ్ఞానోదయమైన విధానం. తీవ్రవాదం, హింసలను ఇస్లాం ప్రబోధిస్తుందనే అభిప్రాయాన్ని కూడా ఇది తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అల్‌ ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్, లష్కర్‌ ఎ తొయ్యబా, అఫ్గాన్‌ తాలిబాన్‌ వంటి గ్రూపులు ఆచరిస్తున్న భావజాలాలు, హింస కారణంగా చాలా ముస్లిమేతర ప్రాంతాలలో ఈ అభిప్రాయం ఏర్పడింది. 1990లలో ముల్లా ఒమర్‌ తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటి. మిగిలిన రెండూ సౌదీ అరేబియా. పాకిస్తాన్‌. ఈ వెలుగులో చూస్తే మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ పాలనలో సహనం, సహజీవనాలకు చెందిన విధానం, దాని అభ్యాసం అద్భుతమైనవి.

అబూ ధాబీలో బోచాసన్‌వాసీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామి నారాయణ దేవాలయం వంటి ఇస్లామేతర ప్రార్థనా స్థలాలను అనుమతించడంపై సంప్రదాయ వహాబీ ఉలేమా నుండి కచ్చితంగా వచ్చివుండిన వ్యతిరేకతను బిన్‌ జాయెద్‌ అధిగమించగలిగారు. ‘వహాబీ మజబ్‌’లోనే మార్పు వస్తున్నదని ఇది సూచిస్తున్నదో లేదో అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. బిన్‌ జాయెద్‌ నిస్సందే హంగా ఇతర దేశాల సంప్రదాయ ఉలేమాల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటారు. అయితే సహనం, సహజీవనం పట్ల తన నిబద్ధతను స్పష్టంగా వ్యక్తీకరించడానికి అటువంటి ఒత్తిళ్లను తట్టుకునే సామ ర్థ్యాన్ని ఆయన కలిగివున్నారు. కానీ అది ఎడారి గిరిజనుల స్పృహలోకి ఎంత లోతుగా ప్రవేశించిందో కాలమే చెబుతుంది.

- వ్యాసకర్త, విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
- వివేక్‌ కాట్జూ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement