మంద్‌సౌర్ హెచ్చరిక
గత కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల రైతుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పాలక పక్షాలకు మండుతున్న మధ్యప్రదేశ్ గట్టి హెచ్చరిక కావాలి. ఆ రాష్ట్రంలో కట్టలు తెంచుకున్న రైతన్నల ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పోలీసులు మంగళవారం జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది మరణించారు. అయినా ఆందోళన ఆగలేదు సరిగదా బుధవారం అది కొత్త ప్రాంతాలకు విస్తరించింది. అనేకచోట్ల కర్ఫ్యూ ధిక్కరించి రాస్తారోకోలు నిర్వ హించారు. మంద్‌సౌర్ జిల్లా కలెక్టర్, ఇండోర్ ఎస్‌పీ సహా పలువురు ఉన్నతాధికారులపై దాడి చేసి కొట్టారు.
బస్సులకూ, వాహనాలకూ నిప్పంటిం చారు. అన్నిటికన్నా వింత...24 గంటలు గడిచినా అన్నదాతల ఉసురు తీసిన తూటాలెవరివో సర్కారుకు తెలియదు! మధ్యప్రదేశ్ రైతుల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. పంటలకు తగిన గిట్టుబాటు ధర కావాలంటున్నారు. సాగు రుణాలను మాఫీ చేయాలంటున్నారు. ఇందులో మొదటి డిమాండ్ మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీయే. రెండోది–ఈమధ్యే జరిగిన యూపీ ఎన్నికల్లో అదే పార్టీ అక్కడి రైతులకు వాగ్దానం చేసి అమలుకు పూనుకుంటున్నదే.
అధిక దిగుబడి సాధిస్తున్నందుకు అయిదేళ్లుగా వ్యవసాయ రంగంలో వరసబెట్టి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డును సొంతం చేసుకుంటున్న రాష్ట్రంలో రైతులకు ఒరిగిందేమీ లేకపోగా... వారి డిమాండ్లు పెడ చెవిన పెట్టడం, చివరకు పోలీసు కాల్పుల వరకూ రావడం ఎంత విషాదం! నిజానికిది మధ్యప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన ధోరణి కాదు. పాలకులెవరైనా రైతుల విషయానికొచ్చేసరికి అంతటా ఈ మాదిరి ఉదాసీనతే కనిపిస్తోంది. కడు పుమండి, సహనం కోల్పోతే మాత్రం లాఠీచార్జిలు, కర్ఫ్యూలు, కాల్పులు, కేసులు వచ్చిపడుతున్నాయి. అదనపు బలగాలు దిగుతున్నాయి. మిర్చి రైతులు గిట్టు బాటు ధర కోసం ఉద్యమించిన రైతులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరాభవం ఎదురైందో అందరూ చూశారు. రైతుల ఆందోళన అరణ్యరోదనగా మిగిలిపోగా దళారులదే పైచేయి అయింది.
దేశంలో అనేకచోట్ల రైతులు ఆందోళన బాట పడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో రుణమాఫీ కావాలంటూ ఉద్యమిస్తున్నారు. వీటిని కేవలం యూపీలో రుణమాఫీ అమలు చేస్తున్న పర్యవసానంగా తలెత్తిన ఉద్యమాలుగా భావిస్తే రైతులకు అన్యాయం చేయడమే అవుతుంది. దేశ జనా భాలో 70 శాతంమంది ఆధారపడుతున్న సాగు రంగాన్ని వరస కరువులు పట్టి పీడిస్తున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు.
మరో పక్క సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. చివరకు రైతులు అప్పుల్లో కూరుకు పోయి ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. పత్తి, ఉల్లి, సోయాబీన్, టొమాటా, ఎండుమిర్చి...ఇలా ఏ పంట సాగుచేస్తున్న రైతులను కదిల్చినా కన్నీటి గాథలే. ఇప్పుడు అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్ విషయమే తీసుకుంటే అక్కడ నిరుడు ఫిబ్రవరి నుంచి మొన్న ఫిబ్రవరి వరకూ 1,982మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలో గత పదిహేనేళ్లలో ఇలా ఉసురు తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 20,000. నిరుడు వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండినా మార్కెట్‌కొచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేవు.
ఆ రాష్ట్రంలో మాల్వా– నిమద్ ప్రాంతంలో ఇప్పుడు పోలీస్ కాల్పులు జరిగిన మంద్‌సౌర్ జిల్లాతో సహా 15 జిల్లాలున్నాయి. ఆ ప్రాంతంలో వరసగా రెండోసారి కూడా ఉల్లి దిగు బడులు బాగున్నాయి. మార్కెట్‌కి తీసుకొచ్చాక దాని ధర అమాంతం పడి పోయింది. కిలో రూపాయి పలకడంతో ఆగ్రహించిన రైతులు ఉల్లిని రోడ్లపై పారబోయాల్సివచ్చింది. టొమాట, ఆలుగడ్డ రైతుల స్థితి సైతం ఇదే. ఆందోళన ఉధృతమయ్యాక చాలా ఆలస్యంగా ఉల్లి కనీస మద్దతు ధర రూ. 8గా ప్రభుత్వం ప్రకటించింది. ఇంచుమించు ఇవే పరిస్థితులు పొరుగునున్న మహారాష్ట్రలో కూడా కన బడుతున్నాయి. అక్కడ ఈ ఏడాది కంది బాగా పండిందన్న సంబరం కాస్తా ఆవిరైంది.
దాని ధర క్వింటాల్‌కు రూ. 12,000 నుంచి ఒక్కసారిగా రూ. 3,000కు పడిపోయింది. ఎన్నో ఒత్తిళ్లు, ఆందోళనల తర్వాత కనీస ధర రూ. 5,000గా ప్రభుత్వం ప్రకటించినా సరిగా అమలు కాలేదు. అందువల్లనే ఆగ్రహించిన రైతులు మహారాష్ట్రలోని పుణే ప్రాంతంలో పాలు, కూరగాయలు నగరాలకు వెళ్లనీయరాదని అడ్డుకున్నారు. ఈ ఉద్యమం ఇతరచోట్లకు విస్తరించిన పర్యవ సానంగా రాష్ట్రంలోని 307 వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీల్లో అధికచోట్లకు సాగు దిగుబడుల రాక పూర్తిగా నిలిచిపోయింది.
పర్యవసానంగా కూరగాయల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. కొల్హాపూర్, నాసిక్, సంగ్లి, అమరావతి జిల్లాల్లో రెవెన్యూ కార్యాలయాల ముందూ, కలక్టరేట్‌లముందూ కూరగాయలు పారబోసి రైతులు నిరసన తెలుపుతున్నారు. జూన్ 1 నుంచి ఆందోళన చేస్తున్నా పెద్దగా పట్టించుకోని మహారాష్ట్ర సర్కారు మంద్‌సౌర్ ఉదంతాన్ని గమనించాక కదిలింది. రుణమాఫీ అమలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ హామీ ఇచ్చారు. అటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం రుణమాఫీ ప్రతిపాదనను పరిశీలిస్తామంటున్నారు. రాజస్థాన్ రైతులు కూడా ఆందోళన బాటపడుతున్నారు.
రైతు రుణమాఫీ అనారోగ్యకరమంటున్న రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్, స్టేట్‌బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వేలాది కోట్ల రూపాయల కార్పొరేట్ బకాయిలు ఎలా మాఫీ అవుతున్నాయో చెప్పాలి. సాగు వ్యయానికి అదనంగా 50 శాతం చేర్చి కనీస మద్దతు ధర ప్రకటించాలన్న వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సును అమలు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అది సాకారమైతేనే వ్యవసాయ రంగం కాస్తయినా కోలుకుంటుంది. రైతులు తెరిపిన పడతారు. పాలకుల ధోరణి మారకపోతే మాత్రం మంద్‌సౌర్‌లు అన్నిచోట్లా పునరావృత మవుతూనే ఉంటాయి.