రాం మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ప్రభావితుడై నూనూగు మీసాల ప్రాయంలోనే కార్మికో ద్యమంలో అడుగుపెట్టి, తిరుగులేని కార్మిక నాయకుడిగా ఎదిగి అధికార పీఠాన్ని గడగడలాడించిన జార్జి ఫెర్నాండెజ్ మంగళవారం 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని దశాబ్దాలపాటు క్షణ కాలం తీరికలేనంతగా ఉద్యమాలతో మమేకమై, ఆ తర్వాత పార్లమెంటరీ రాజకీయాల్లో తలమున కలై, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఫైర్‌బ్రాండ్ ఫెర్నాండెజ్ గత పదేళ్లుగా అనారోగ్యం బారినపడి ఎవరినీ గుర్తుపట్టలేని నిస్సహాయస్థితికి చేరుకున్నారు. తన లోకంలో తాను ఉండి పోయారు. చెప్పాలంటే ఫెర్నాండెజ్ మరణమే ఇప్పుడు ఆయన్ను మళ్లీ ప్రజాజీవన రంగంలో ప్రస్తావనాంశంగా మార్చింది. కేథలిక్ మతాచార్యుడిగా తీర్చిదిద్దాలనుకున్న అమ్మానాన్నలను కాదని 8 అణాలతో ముంబై మహానగరంలో ఆయన అడుగుపెట్టాడు. చిన్నా చితకా పనులు చేసు కుంటూ రాత్రుళ్లు పేవ్‌మెంట్లపై నిద్రపోయేవాడు. అటువంటి వ్యక్తి అచిరకాలంలోనే ఆ మహా నగరాన్ని స్తంభింపజేసే స్థాయి కార్మికోద్యమ నాయకుడిగా ఎదగడం ఆయన నాయకత్వ పటిమకు తార్కాణం. పది భాషల్ని అనర్గళంగా మాట్లాడగలగటం, దిగ్గజాల్ని సైతం ధిక్కరించడం ఆయన నైజం. బహుశా ఫెర్నాండెజ్ ఇప్పుడూ ఆ బాణీనే కొనసాగిస్తే ‘జాతి వ్యతిరేకి’గా ముద్రపడి జైలు గోడల వెనక మగ్గేవారేమో!
తిరుగుబాటుదారన్నా, ధిక్కారస్వరం వినిపించేవారన్నా సాధారణ ప్రజానీకంలో తెలియని ఆపేక్ష ఉంటుంది. వారి సిద్ధాంతాలతో, ఆచరణతో విభేదిస్తున్నా అంతరాంతరాల్లో అది సహజంగా అంకురిస్తుంది. విస్ఫులింగాలు విరజిమ్ముతూ, నరనరాల్లో నెత్తుర్ని ఉప్పొంగింపజేసే ధైర్యశాలిని తమవాడిగా భావించనిదెవరు? కనుకనే కార్మికులంతా చాలా త్వరగానే ఆయన్ను సొంతం చేసు కున్నారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్.కె. పాటిల్‌ను ఓడిం చాక ఆయన పేరు ఆసేతు హిమాచలం మార్మోగిపోయింది. అందరూ ఆయన్ను ‘జయింట్ కిల్లర్’గా పిలవడం ప్రారంభించారు. మరో ఏడేళ్లకు ప్రారంభమైన రైల్వే సమ్మె ఫెర్నాండెజ్ జీవి తంలో అత్యంత కీలకమైన ఘట్టం. లక్షలమంది కార్మికులను ఒక్కతాటిపై నడిపి సాగించిన ఆ సమ్మె అప్పటి కేంద్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. రైల్వేలో ఇతర సిబ్బందికి ఎప్పటి కప్పుడు వేతనాలు పెంచుతూ లోకో సిబ్బందికి నిర్దిష్ట పనివేళలు లేకుండా, సరైన వేతనాలివ్వ కుండా రాచిరంపాన పెట్టేవారు. ఒకసారి వారు రైలు ఎక్కారంటే దాన్ని గమ్యస్థానం చేర్చేవరకూ వారిదే బాధ్యత. అందుకు ఎన్నిరోజులు పట్టినా డ్యూటీలో కొనసాగాల్సిందే. కేంద్రప్రభుత్వాధీ నంలో ఉన్న అతి పెద్ద సంస్థ బాహాటంగా చట్టాలను ఉల్లంఘిస్తున్న తీరును రైల్వే సమ్మె ప్రశ్నిం చింది. కనుకనే రైల్వే కార్మికుల్లో 70 శాతంమంది అందులో భాగస్వాములయ్యారు. ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదంతో దాన్ని అణిచివేసింది. లక్షలమందిని జైళ్లలో బంధించి, వేలాదిమందిని ఉద్యోగాలనుంచి వెళ్లగొట్టింది.
అనంతరకాలంలో విధించిన ఎమర్జెన్సీకి గల అనేక కారణాల్లో రైల్వే సమ్మె ఒకటి. ఆ నిర్బంధకాలంలో ఫెర్నాండెజ్ కోసం పోలీసులు వేంటాడి, వేటాడి అరెస్టుచేశారు. బరోడా డైనమైట్ కేసులో ముద్దాయిని చేశారు. ఆయన్ను అవమానించాలని గొలుసులతో బంధించి నడిపించారు. నిజానికి ఆ ఛాయాచిత్రమే లోక్‌సభ ఎన్నికల్లో అతి పెద్ద ప్రచారాస్త్రంగా మారి, జైల్లో ఉండగానే ఆయనకు ఘనవిజయాన్ని సాధించిపెట్టింది. ఎమర్జెన్సీ అనంతరం ఆయన హక్కుల సంఘాలతో కూడా సన్నిహితంగా పనిచేశారు. దేశంలో ఏ మూల హక్కుల ఉల్లంఘన జరిగినా, దానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు ఆయన దన్నుగా నిలబడేవారు. అవి చిన్నవా, పెద్దవా... వాటి వెనక ఉండే జనం ఎంతమంది అన్న అంశాలు ఆయన లెక్కజేసేవారు కాదు. అది నెత్తురోడిన ఇంద్రవెల్లి కావొచ్చు...మరోచోట గని కార్మికుల సమ్మె కావొచ్చు–ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఫెర్నాండెజ్ ప్రత్యక్షం కావాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరిశిక్షపడిన ఇద్దరు దళిత యువకుల ప్రాణాలను కాపా డటంలో ఫెర్నాండెజ్ తీసుకున్న చొరవ మరవలేనిది.
‘అలజడి మా జీవితం... ఆందోళన మా ఊపిరి’ అనుకుంటూ పోరుబాట పడుతున్న యువ తను అప్పట్లో లోహియా సిద్ధాంతాలతో ప్రభావితమై పనిచేస్తున్న పలువురు ఆలోచింపజేశారు. హింసామార్గం కాక వేరే పోరాట విధానాలున్నాయని అభిప్రాయం కలగజేయడంలో వీరి పాత్ర గణనీయమైనది. అందులో ఫెర్నాండెజ్ ముఖ్యుడు. ఆయన పేరు చెబితే ఎప్పుడూ చెదిరి ఉండే జుత్తు, నలిగిపోయిన కుర్తా, పైజమా, భుజానికో సంచీ గుర్తొస్తాయి. ఆయనే కాదు... అప్పట్లో చాలామంది లోహియావాదుల ఆహార్యం అదే. కానీ విషాదమేమంటే ఆ వర్గంలోని అందరి మాదిరే ఫెర్నాండెజ్ కూడా సగటు రాజకీయవేత్తగా మారిపోయారు. ఒకప్పుడు వ్యవస్థకు పక్కలో బల్లెంగా ఉన్నవాడు అందులో భాగం కావడం మాత్రమే కాదు... ఆ రాజకీయపుటెత్తుల్లో కీలకంగా మారడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనతాపార్టీ పాలనలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి వెన్నుదన్నుగా నిలిచి ద్వంద్వ సభ్యత్వం ఉన్నవారికి చోటులేదంటూ పరోక్షంగా పార్టీలో ఆరెస్సెస్ అనుకూలవాదులపై దాడి చేసిన ఫెర్నాండెజ్ 24 గంటలు తిరగకుండా అందుకు భిన్న మైన వైఖరి తీసుకోవడం ఎవరికీ రుచించలేదు. అనంతరకాలంలో ఆయన ఎన్‌డీఏలో మంత్రిగా పనిచేశారు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ వ్యక్తిగతంగా ఫెర్నాండెజ్‌ను అవినీతిపరుడని నిరూపించ లేకపోయింది. ఆయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయన్న శవపేటికల కుంభకోణం, బరాక్ క్షిపణుల స్కాంలో కమిషన్లు విచారణ జరిపి ఆయన ప్రమేయం లేదని తేల్చాయి. ఆయన ఎన్ని తప్పటడుగులు వేసినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటికీ, ఎప్పటికీ ‘రెబల్’ ఫెర్నాండెజ్ మాత్రమే జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment