నమ్మకద్రోహానికి నిర్వచనం ఉండదు. అది ఫలానా రూపంలోనే ఉంటుందని చెప్పడం సాధ్యపడదు. ఈ సంగతిని గ్రీస్ చాలా ఆలస్యంగా గ్రహించింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. గ్రీస్ ఇక పరాధీన. అప్పులిచ్చినట్టే ఇచ్చి దేశాన్ని పీల్చిపిప్పి చేసిన ‘యూరోత్రయం’ యూరొపియన్ సెంట్రల్ బ్యాంకు, యూరొపియన్ కమిషన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల ముందు అది నిస్సహాయంగా మోకరిల్లింది. ఊహించని రీతిలో తన సార్వభౌమత్వం తాకట్టుపడటాన్ని చూసి నిర్ఘాంతపోయింది. గత పక్షం రోజులుగా ఊహించని రీతిలో వేగంగా సంభవించిన పరిణామాల్లో గ్రీస్ ప్రధాని అలెక్సీ సిప్రాస్ యూరొపియన్ యూనియన్ పెట్టిన కఠిన షరతులన్నిటికీ అంగీకరిస్తున్నట్టు ప్రకటించడమే కాక... వారు కోరినట్టుగా పార్లమెంటులో అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి గురువారం ఆమోదం కూడా పొందారు.
పర్యవసానంగా దేశంలో ఇకపై అమలు కాబోయే పొదుపు చర్యలు గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా ఉండబోతున్నాయి. పన్నులు భారీగా పెంచడం, ప్రభుత్వ వ్యయంలో...ముఖ్యంగా పింఛన్లలో గణనీయంగా కోత... కార్మిక సంఘాల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలను కఠినం చేయడం వగైరా అందులో ముఖ్యమైనవి. రిఫరెండానికి ముందు ప్రభుత్వ వ్యయంలో 900 కోట్ల యూరోల కోత విధించాలన్న ఈయూ...గ్రీస్ పాదాక్రాంతమయ్యేసరికి దాన్ని 1,300 కోట్ల యూరోలకు పెంచింది!
గత నెల 30 నాటికి యూరోత్రయానికి చెల్లించాల్సిన 170 కోట్ల డాలర్ల వాయిదా మొత్తాన్ని తీర్చలేమని సిప్రాస్ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఈ మొత్తం డ్రామాకు తెరలేచింది. దేశంలో పొదుపు చర్యల పేరిట అమలవుతున్న కోతలపై సమరశంఖం పూరించి అధికారంలోకొచ్చిన సిప్రాస్ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టబోమని విస్పష్టంగా ప్రకటించింది. జనం దాన్ని విశ్వసించారు. అందుకే ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ సిరిజాకు అధికారం కట్టబెట్టారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటినుంచీ సిప్రాస్, ఆర్థికమంత్రి యానిస్ వరోఫాకిస్‌లు బెర్లిన్ నుంచి బ్రస్సెల్స్ వరకూ అలుపు లేకుండా తిరిగారు. అసాధ్యమైనదేదో వారు సాధించుకొస్తారని దేశం మొత్తం ఈ ఆర్నెల్లూ ఎదురుచూసింది. షరతులన్నిటినీ అంగీకరించడానికి తాము సిద్ధమేనని... అందుకు కాస్త సమయం కావాలని ఈయూను కోరుతూ సిప్రాస్ రాసిన లేఖ వెల్లడై మధ్యలో అలజడి బయల్దేరినా పరిస్థితి సద్దుమణిగింది. వామపక్ష భావాలున్న యువ నేతలు తమ ఆశల్ని వమ్ము చేయరన్న విశ్వాసం పౌరుల్లో ఉంది. అందుకు తగినట్టుగా సిప్రాస్ కూడా ఈ నెల 5న రిఫరెండం నిర్వహించారు. అందులో వ్యక్తమయ్యే జనాభిప్రాయానికి అనుగుణంగానే తమ తదుపరి చర్యలుంటాయని, అవసరమైతే ఈయూనుంచి బయటికొస్తామని సిప్రాస్ ప్రకటించారు. అంతేకాదు... ఈయూ షరతులకు తలొగ్గరాదని జనానికి పిలుపునిచ్చారు. ఇదంతా ప్రజల్లో ఉత్సాహం కలిగించింది. యూరోత్రయం షరతులను రిఫరెండంలో 61 శాతంమంది...అంటే మూడింట రెండువంతుల మంది తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయలేరని రుజువైనట్టు సిప్రాస్ వ్యాఖ్యానించడంతో ఈయూ అయోమయంలో పడింది.
రిఫరెండం ఇచ్చిన బలాన్ని ఆసరా చేసుకుని ఈయూ దేశాలతో, మరీ ముఖ్యంగా జర్మనీతో సిప్రాస్ బేరసారాలాడి వాటి మెడలు వంచుతారనుకుంటే అందుకు భిన్నంగా జరిగింది. గ్రీస్ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయి సంస్కరణలకు ఆయన అంగీకరించారు. కామాలు, ఫుల్‌స్టాప్‌లతోసహా దేన్నీ మార్చకుండా తాము చెప్పిన రీతిలో పార్లమెంటు తీర్మానం చేస్తేనే తదుపరి బెయిలవుట్ ప్యాకేజీ ఉంటుందని ఈయూ తేల్చిచెప్పింది. 17 గంటలపాటు కొనసాగిన అసాధారణ సమావేశంలో ఇందుకు సంబంధించిన పత్రాలు సిద్ధమయ్యాయి. గ్రీస్ పాలనా వ్యవస్థను ‘రాజకీయ ప్రభావం’నుంచి తప్పించాలన్నది అందులో ప్రధానమైనది. దాని ప్రకారం పొదుపు చర్యలు, ప్రైవేటీకరణ వంటివన్నీ ఈయూ నియమించిన కమిటీ పర్యవేక్షిస్తుంది.
సిప్రాస్ ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందానికి భిన్నంగా పార్లమెంటు భవిష్యత్తులో ఏ తీర్మానం చేసినా ఈ కమిటీ దాన్ని వీటో చేస్తుంది. అంతేకాదు...పార్లమెంటు ముందు ప్రవేశపెట్టబోయే ఏ బిల్లునైనా ముందుగా కమిటీకి చూపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ వ్యయం పెంచదల్చుకుంటే ఆ మేరకు ఆదాయం పెంపును కూడా చూపాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగంలో సమ్మెలపై ఆంక్షలు, ఈయూ విధానాలకు అనుగుణంగా కార్మిక చట్టాలు, నిబంధనలు ఉండేలా చూడటం...పింఛన్‌లలో కోత, మరింత ఆదాయాన్ని పెంచేలా పన్నుల సంస్కరణలు వగైరాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రీస్‌కు చెందిన 5,000 కోట్ల యూరోల విలువ చేసే పోర్టులు, విమానాశ్రయాలు, గ్రీస్ దీవులు వగైరా ప్రజా ఆస్తుల నిర్వహణను గ్రీస్ వెలుపలి తటస్థ సంస్థకు అప్పగించాలి.
ఇప్పటికే రెండు దఫాల పొదుపు చర్యలతో కుంగిపోయి ఉన్న గ్రీస్ పౌరులు ఈ కఠిన షరతులతో మరింతగా కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాక్షాత్తూ ఐఎంఎఫ్ సంస్థే ఈ షరతులవల్ల పనికాదని తేల్చింది. వచ్చే రెండేళ్లలో గ్రీస్ జీడీపీలో రుణం 200 శాతం కాబోతున్నదని అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీస్ చెల్లించాల్సిన రుణాలను దీర్ఘకాలం పాటు వాయిదావేసి, దాని ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి అవసరమైన నిధులను అందించడమే మార్గమని అంటున్నది. ఈ వ్యవహారంలో సిప్రాస్‌ను సమర్థిస్తున్నవారూ ఉన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రీస్ ఈయూ నుంచి తప్పుకుంటే దాని కరెన్సీ విలువ అత్యంత కనిష్ట స్థాయికి చేరుతుందని, అది దేశాన్ని పెను ప్రమాదంలోకి నెడుతుందని వారి వాదన. గ్రీస్ నిష్ర్కమిస్తే ఈయూ సైతం సంక్షోభంలో కూరుకుపోతుందన్నది నిజం. ఈ స్థితిని గమనించి దేశ పౌరులిచ్చిన బలంతో రాజకీయంగా దృఢ సంకల్పాన్ని ప్రదర్శించడానికి బదులు సిప్రాస్ చివరకు దేశ సార్వభౌమత్వాన్నే తాకట్టు పెట్టారు. రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి.
గ్రీకు ట్రాజెడీ!
Published Fri, Jul 17 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement