‘బాల భోగం... రాజభోగం’ అంటారు. ఎందుకంటే ప్రతి ఇంటా అమ్మానాన్నల్ని శాసించేది వాళ్లే. అడిగింది తక్షణం తెచ్చి ఇవ్వకపోయినా, తమకు ఆకలేసిన సంగతిని గ్రహించలేని అజ్ఞానాన్ని ప్రదర్శించినా వాళ్లకు కోపం వస్తుంది. దేశాన్నేలే రాజుకైనా అసమ్మతి ఉంటుందేమోగానీ అలాంటి వేషాలు పిల్లల ముందు సాగవు. విసుక్కున్నా, కసురుకున్నా చివరకు లొంగిరావలసింది అమ్మానాన్నలే. కంటిపాపల్లా, ఇంటిదీపాల్లా ఉండే పిల్లల్ని తిట్టడానికీ, కొట్టడానికీ ప్రయత్నిస్తేనే మనుషులా, రాక్షసులా అని నలుగురూ తిట్టిపోస్తారు.
అలాంటిది కల్లాకపటం తెలియని ప్రేమతో పెనవేసుకున్న కన్నబిడ్డల్ని చంపేంత కిరాతకానికి ఒడిగట్టిన తండ్రిని ఏమనవచ్చు? హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాఘవేంద్ర గురుప్రసాద్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనతో పాటు ఉండాల్సిన ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియడంలేదని రెండురోజులక్రితం వార్తలు వచ్చినప్పుడు అందరూ ‘అయ్యో పాపం’ అనుకున్నారు. ఉన్నత విద్యావంతుడిగా, బాధ్యతగల ఆచార్యుడిగా ఉన్నవాడు ఇలా అర్ధంతరంగా ప్రాణం తీసుకోవాల్సినంత పరిస్థితులు ఏమొచ్చాయో అని బాధపడ్డారు.
అతను ఆత్మహత్య చేసుకున్నది సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై. ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాల్లో గురుప్రసాద్ ఒక్కడే కనిపించాడు గనుక పిల్లల్ని ఎవరికో అప్పగించి తానొక్కడే వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని అంచనావేశారు. గంటలు గడుస్తున్నా అయినవారి ఇళ్లలో ఎక్కడా ఆ పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువులు కంగారుపడ్డారు. ఏదో కీడు శంకించారు. చివరకు వారి అనుమానాలే నిజమయ్యాయి. భార్యతో తగాదాపడి పంతాలకూ, పట్టింపులకూ పోయి... చివరకు వాటితో ఏమాత్రమూ సంబంధంలేని ముత్యాల్లాంటి ముద్దు బిడ్డల్ని గురుప్రసాద్ బలితీసుకున్నాడు.
పెళ్లనేది కేవలం భార్యాభర్తల సహజీవన బంధం మాత్రమే కాదనీ... విస్తృతార్థంలో అది ఇద్దరూ ఉమ్మడిగా పౌర సమాజంపట్ల నెరవేర్చవలసిన బాధ్యతని అంటారు. కానీ ఆ బాధ్యతను నెరవేర్చడానికి దగ్గరయ్యే ఇద్దరూ సాధారణంగా భిన్న కుటుంబాల్లో, భిన్న వాతావరణాల్లో పెరిగేవారు గనుక ఇద్దరి దృక్పథాల్లో తేడాలుంటాయి. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం లేదు గనుక సహజీవనానికి దగ్గరయ్యే ఇద్దరిలోనూ దాని ప్రభావం కూడా ఉంటుంది. సర్దుకుపోయే మనస్తత్వాలైనప్పుడు ఆ ఇద్దరికీ ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించకపోవచ్చు. కనుక వాటి ప్రభావం వారి జీవితాలపై పెద్దగా పడకపోవచ్చు. కానీ అవతలివారిపై ‘ఏం చేసైనా’ ఆధిపత్యాన్ని సాధించాలనుకున్నప్పుడు అది సహజీవనాన్ని ఛిద్రం చేస్తుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవారితో కాపురం చేయడం దుర్భరమవుతుంది. ఈ ఆధిపత్యధోరణులే బహుశా గురుప్రసాద్, సుహాసిని దంపతుల మధ్య దూరాన్ని పెంచాయి. తాను కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం తొమ్మిదేళ్లపాటు అతడు పెట్టిన చిత్రహింసల్ని భరించానని, చివరకు ఏడాదిక్రితం 498ఏ కింద కేసు పెట్టాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. సుహాసిని చెబుతున్న మాటల్లో నిజమెంతో... గురుప్రసాద్ ఎలాంటివాడో, అతని మానసిక స్థితి ఎలాంటిదో తెలియడానికి పెద్ద పరిశోధన అక్కరలేదు.
భార్య దగ్గరినుంచి పిల్లల్ని తీసుకెళ్లడానికి ముందే వారిని చంపడానికి అతను చేసుకున్న ఏర్పాట్లు...అందుకు సంబంధించిన పనులు జరిపిస్తూనే ఆమెతో జరిపిన ఫోన్ సంభాషణలు అతని హంతక మనస్తత్వాన్ని పట్టి ఇస్తాయి. ఆర్థిక ఇబ్బందుల మూలంగానో, అహం దెబ్బతినో ఆత్మహత్యలకు సిద్ధపడటం ఇటీవలికాలంలో పెరిగింది. కానీ, అలా చనిపోదల్చుకున్నవారు ఇతరులకు, అందునా కన్నబిడ్డలకు హాని తలపెట్టడం చాలా అరుదు.
పెంపకంలో ఆడపిల్లలు, మగపిల్లలమధ్య చూపుతున్న వ్యత్యాసం ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నది. నడి బజారులో ఆడపిల్లలపై జరుగుతున్న యాసిడ్ దాడులకైనా, ఇళ్లల్లో మహిళలపై సాగే హింసకైనా మూలం అక్కడే ఉన్నదని సామాజిక విశ్లేషకులు చెబుతున్న మాట. ఇలాంటి సంస్కృతిని ఒంటబట్టించుకోబట్టే పెరిగి పెద్దయి భార్య స్థానంలో వచ్చినవారిని కాల్చుకుతినడం అలవాటుగా మారుతున్నదని వారంటున్నారు. అనురాగం ఉండాల్సినచోట అహంకారమూ... ఆత్మీయత ఉండాల్సినచోట పచ్చి విద్వేషమూ పెచ్చరిల్లితే ఏ కుటుంబమైనా కుప్పకూలుతుంది.
అమ్మానాన్నల విభేదాలు పిల్లల పెరుగుదలపైనా, వారి మానసిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈమధ్యనే మన హైకోర్టు ఒక జంట మధ్య తలెత్తిన సమస్య విషయంలో కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరకు సర్దుకుపోవడానికి ఆ ఇద్దరూ అంగీకరించారు. అయితే, అన్ని కేసుల్లోనూ ఇది సాధ్యంకాకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు తగాదా పడినప్పుడు దానికి పరిమితమై ఆలోచించి పరిష్కరించడం కాక...వారిద్దరి మానసిక స్థితి ఎలాంటిదో అంచనావేసే స్థితి ఉండాలి. గురుప్రసాద్‌లో సొంత బిడ్డల్ని చంపుకొనేంత ఉన్మాదం హఠాత్తుగా ఏర్పడి ఉంటుందా? అతని మానసిక స్థితిని సైతం ముందుగా విశ్లేషించగలిగితే ఆ ఉన్మాదం జాడల్ని పసిగట్టడం పెద్ద కష్టమా? వాస్తవానికి ఇలాంటి స్థితిని ఎంతో కొంత అంచనా వేయబట్టే సుహాసిని అతనికి దూరం జరిగివుంటారు. ‘నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను... నా ఇంటికి వస్తే నేను నిన్ను చంపుకుంటామని అనుకుంటున్నావు. మనమేమైనా కసాయిలమా?’ అని ఫోన్‌లో అన్న సమయానికే పిల్లలకోసం గురు ప్రసాద్ ప్లాట్‌లో గోతులు తవ్వించి పెట్టాడు. ఈమధ్యే హైదరాబాద్‌లో ఇలా భార్యనూ, కన్నబిడ్డనూ హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఇలాంటి ఉదంతాలు సమాజాన్ని మొద్దుబారుస్తాయి. సున్నితత్వాన్ని దెబ్బతీస్తాయి. కనుక ఈ తరహా ఉన్మాదానికి తావులేని స్థితి ఏర్పడాలని అందరూ కోరుకుంటారు.
మమకారమా... ప్రతీకారమా!
Published Wed, Oct 8 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement