భార్యనూ చంపాలనుకున్నాడా? | professor killed sons before ending his life | Sakshi
Sakshi News home page

భార్యనూ చంపాలనుకున్నాడా?

Published Wed, Oct 8 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

భార్యనూ చంపాలనుకున్నాడా?

భార్యనూ చంపాలనుకున్నాడా?

సాక్షి, హైదరాబాద్: రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ తన భార్య సుహాసినిని సైతం అంతమొందించాలనుకున్నాడా? పథకంలో భాగంగా ముందుగా ఇద్దరు పిల్లలను చంపిన తరువాత సుహాసినిని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లి చంపాలనుకున్నాడా? అతని ఇంట్లో పోలీసులకు లభించిన తాడు ఆమెను చంపడానికే తెచ్చాడా అనే అనుమానాలకు.. ఆ రోజు అతను భార్యను తీసుకెళ్లడానికి యత్నించిన తీరు బలం చేకూరుస్తోంది. గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులు విఠల్ విరించి(9), నందవిహారి (5)లను చంపి సోమవారం  సికింద్రాబాద్ జేమ్స్‌స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10.30-11.30 గంటల మధ్యలో మేడ్చల్‌కు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టిన గురుప్రసాద్ మధ్యాహ్నం 12.30 గంటలకు మల్కాజ్‌గిరిలోని సుహాసిని ఇంటికి వెళ్లాడు. పిల్లలు గుడిలో భోజనం చేస్తున్నారని, నీవు కూడా వస్త్తే పిల్లలతో కలిసి వద్దామని బతిమాలాడాడు. అయితే సుహాసిని అంగీకరించకపోవడంతో అతని పథకం బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలతో కొడుకులను శనివారం తీసుకెళ్లిన గురుప్రసాద్ అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 భూమి పూజ నెపంతో గొయ్యి
 
 చిన్నారులిద్దర్ని చంపి మేడ్చల్‌లోని తన సొంత ప్లాట్‌లో ఖననం చేయాలనుకున్న గురుప్రసాద్ హత్యకు ఒక రోజు ముందే అక్కడ గొయ్యి తీయించాడు. మృతదేహాల ఖననం కోసం అని చెబితే గొయ్యి తీసే వారికి అనుమానాలు వస్తాయని భావించిన గురుప్రసాద్ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయాల్సి ఉందని అబద్ధాలు చెప్పి కూలీలతో గొయ్యి తీయించాడని తెలుస్తోంది. కూలీలను కూడా మేడ్చల్‌లోని అడ్డాకూలీపై నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. హత్యకు దారితీసిన పరిస్థితులు, గురుప్రసాద్ ఒక్కడే ఈ ఘటనలో పాల్గొన్నాడా లేదా ఎవరి సహకారం తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇందులో కేవలం గురుప్రసాద్  ఒక్కడికే సంబంధం ఉందని తేలితే  కేసును మూసివేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా పాలుపంచుకున్నారని తెలిస్తే వారిని కూడా అరెస్టు చేస్తామంటున్నారు.
 
 చిన్నారుల మెడపై వేటు
 
 కత్తిలాంటి పదునైన ఆయుధంతో మెడ నరకడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు. పెద్దకుమారుడి మెడపై రెండు, చిన్నకుమారుడి మెడపై మూడు సార్లు ఆయుధంతో వేటేసినట్లు గుర్తించామన్నారు. విషప్రయోగం, మత్తుమందు ఆనవాళ్లను గుర్తించేందుకు శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని, పది రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు. విషప్రయోగం, మత్తుమందు వంటి ప్రయోగాలు జరిగితే ముందునుంచే చంపేవాడని భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు మోహన్‌సింగ్ నేతృత్వంలో మంగళవారం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుహాసినికి అప్పగించారు. చిన్నారుల మెడపై వేటు వేసిన పదునైన కత్తి మాత్రం ఇంకా లభించలేదు. హత్య జరిగిన స్థలంలో చిన్నపాటి కత్తి మాత్రం పోలీసులకు లభ్యమైంది. అయితే ఈ కత్తితో మెడపై వేటువేయడం అసాధ్యమని పోలీసులు భావిస్తున్నారు.
 
 
 నన్ను కూడా రమ్మన్నాడు: సుహాసిని
 గురుప్రసాద్ తనను కూడా చంపేందుకు ఎత్తగడ వేశాడని ఆయన భార్య సుహాసిని మంగళవారం మీడియాకు తెలిపింది. శనివారం మధ్యాహ్నం అతడు తమ ఇంటికి వచ్చాడని, తనను కూడా వెంట రమ్మన్నాడని చెప్పింది. తాను పిల్లల కోసమే బతుకుతున్నానని, వారు లేకుండా ఈ ప్రాణాలు ఎందుకంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘తొమ్మిదేళ్లు భర్త కొడితే భరించాను. అత్తకూడా కొట్టడంతో ఇల్లు వదిలి పుట్టింటికి చేరుకున్నాను. ఆమె కూడా గురుప్రసాద్‌కే మద్దతు పలుకుతూ నాకు చీవాట్లు పెట్టేది’ అని సుహాసిని కన్నీటిపర్యంతమైంది. ట్యాబ్ కొనిస్తానని ఆశ పెట్టడంతో పిల్లలు సంతోషంగా తండ్రితో కలిసి వెళ్లారని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని చెప్పింది. గాంధీ మార్చురీ వద్ద చిన్నారుల మృతదేహాలను చూసి ఆమె భోరున విలపించింది. చిన్నారుల మృతదేహాలను బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఖననం చేశారు. గురుప్రసాద్‌తో సుహాసిని వివాహం ఘనంగా జరిపించామని పెళ్లయిన రెండో రోజు నుంచే గురుప్రసాద్ వేధింపులు మొదలయ్యాయని ఆమె తమ్ముడు స్వరూప్, అక్క గీత, మేనత్త సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు అన్నం తినకపోయినా శాడిస్ట్‌లా అగ్గిపుల్ల కాల్చి వాతలు పెట్టేవాడని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement