ఇంత అసహనమా?!
Published Thu, Nov 26 2015 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
దేశంలో ఈమధ్య దాదాపు సద్దుమణిగినట్టు కనిపించిన ‘అసహనం’ మళ్లీ బుసలు కొట్టింది. ఈసారి సందర్భం చిత్రమైనది. దేశంలో అసహనాన్ని ప్రదర్శించే ఉదంతాలు ఇటీవలి కాలంలో పెరిగాయని... ఈ విషయంలో తన భార్య కూడా ఆందోళన వెలిబుచ్చిందని సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మరుక్షణం అందరూ ఒక్కుమ్మడిగా ఆయనపై విరుచుకుపడ్డారు. ఆమీర్‌ఖాన్ చెప్పినదంతా అక్షరాలా నిజమని నిరూపించారు. దేశంలో అంతా సవ్యంగా ఉన్నదని, ఎక్కడ చూసినా సహనమే రాజ్యమేలుతున్నదని కళాకారులు, రచయితలు తదితరులను కూడగట్టి న్యూఢిల్లీలో ర్యాలీ నిర్వహించిన మరో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఇలాంటివారిలో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమీర్ ఖాన్ ఇంటర్వ్యూను మొత్తం చూసినవారికి, ఆ మాటల వెనకున్న ఆవేదనను అర్ధం చేసుకున్నవారికి ఆయనేదో మహాపరాధం చేశాడన్న భావన కలగదు. ఆయన ఈ దేశం విడిచి వెళ్లిపోతున్నామని గానీ, దానిపై ఆలోచిస్తున్నామని గానీ చెప్పలేదు. ఆమాటకొస్తే ఆయన భార్య కిరణ్ సైతం అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. తనకూ, తన భార్యకూ మధ్య జరిగిన ఒక ప్రైవేటు సంభాషణలో దొర్లిన విషయాలను ఆయన వివరించారు. ‘మనం ఈ దేశం విడిచి వెళ్దామా’ అని ఆమె అడిగిందంటూనే... ఇది ఆమెనుంచి వచ్చిన దురదృష్టకరమైన అభిప్రాయమన్నారు. ఆమె తన పిల్లవాడి గురించి... చుట్టూ ఉండబోయే వాతావరణం గురించి భయపడుతున్నదని ఆమీర్ చెప్పారు. రోజూ పత్రికలు తెరవాలంటేనే భయపడుతున్నదన్నారు. గత ఆరేడు నెలలుగా తమలో అభద్రతాభావమూ, నైరాశ్యమూ ఏర్పడుతున్నాయన్నారు. పాలకులుగా ఉన్నవారు ఇలాంటి ఉదంతాల్లో కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశం పంపితే దేశంలో అభద్రత పోతుందన్నారు. ఇంతమాత్రానికే ఆమీర్‌పై అందరూ విరుచుకుపడ్డారు.
ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగించారు. పాకిస్థాన్ పొమ్మని ఒకరూ...వెళ్తే దేశ జనాభా తగ్గుతుందని మరొకరూ వ్యాఖ్యానించారు. అవార్డు వాపసీని అనుకరిస్తూ కొందరు...ఆయన ప్రచారం చేసిన ఒక వాణిజ్య సంస్థ యాప్‌ను తొలగించుకుంటున్నట్టు ప్రకటించారు. చుట్టూ జరుగుతున్న విషయాలపై మౌనంగా ఉండిపోయేవారూ.... సూటిగా ప్రశ్నించినా దాటవేసే రీతిలో జవాబిచ్చేవారూ ఇలాంటివారి దృష్టిలో ఉత్తములు. గతంలో మరో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆమీర్ తరహాలోనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ఆయనపై కూడా ఇలాగే విరుచుకుపడ్డారు. ఆమీర్, షారుఖ్ లాంటివారు చెప్పిన మాటల్లో అతిశయోక్తులన్నాయని విమర్శించవచ్చు...నిజం లేదని వాదించవచ్చు. కానీ వారి దేశభక్తిని, నిజాయితీని శంకించడం...ద్రోహులుగా చిత్రించడం అమానుషమనిపించుకుంటుంది. నిజానికి ఆమీర్ నేపథ్యాన్ని గమనించినా, వివిధ సామాజికాంశాలపై ఆయన స్పందిస్తున్న తీరును అర్ధం చేసుకున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త అబుల్ కలాం ఆజాద్‌కూ, రాష్ట్రపతిగా పనిచేసిన మరో నేత జాకీర్ హుస్సేన్ కూ ఆయన ముని మనుమడు. ‘సత్యమేవ జయతే’వంటి కార్యక్రమాలు చేసినవాడు. ఉత్తమాభిరుచి గల, సామాజిక బాధ్యతగల నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నవాడు.
ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న ఉదంతాలు గమనించినా, అవి జరిగాక కొందరు బీజేపీ ఎంపీలు, మంత్రులు చేసిన ప్రకటనలు చూసినా భయాందోళనలు కలగడంలో వింతేమీ లేదు. ఈ సంగతిని బీజేపీ నాయకత్వం గమనించబట్టే అలాంటి నేతలను పిలిచి మందలించవలసి వచ్చింది. అనవసరమైన ప్రకటనలు చేయొద్దని కోరవలసివచ్చింది. ఒక సాధారణ ముస్లిం కుటుంబం భోజనం ముగించుకుని, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నవేళ వందమందికి పైగా ఉన్న గుంపు ఇంటి యజమానిపై దాడి చేసి కొట్టి చంపేశారంటే, అతని కుమారుణ్ణి తీవ్రంగా గాయపరిచారంటే... ఆ ఇంట్లోని మహిళలు చేతులెత్తి వేడుకుంటున్నా అది అరణ్యరోదనగా మిగిలిందంటే ఆందోళన కలగదా? ఒక యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా పనిచేసి రిటైరైన సాహితీవేత్త కేవలం తమకు నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేశాడన్న ఆగ్రహంతో ఉన్మాదులు కాల్చిచంపేశారంటే... అదే రీతిలో అంతక్రితం మరో ఇద్దర్ని అంతమొందించారంటే బాధ, ఆందోళనా ఏర్పడవా? ఒక అధ్యాపకుడు రచయితగా తాను మరణించానని ప్రకటించవలసి వచ్చిందంటే ఇంత ఘోరమైన పరిస్థితులు వచ్చాయేమిటని ఎవరైనా ఆవేదన చెందరా? ఈ ఉదంతాలన్నీ ఒక ఎత్తయితే...అవి జరిగాక వెలువడిన ప్రకటనలు మరో ఎత్తు. గొడ్డు మాంసం తిన్నారన్న వదంతి ఆధారంగా దాడి చేయడం తప్పని ఒక నాయకుడంటారు.
ఆయన దృష్టిలో అది వదంతికాక నిజమైన పక్షంలో జనం చేసింది సరైందే అవుతుందన్నమాట! ఇద్దరు పసిపిల్లలను సజీవదహనం చేసిన ఉదంతం విషయంలో...కుక్కపై ఎవరైనా రాయి విసిరితే దానికి కూడా మేమే బాధ్యులమా అని మరో నాయకుడు వెకిలిగా వ్యాఖ్యానిస్తారు. ఇవన్నీ గమనిస్తున్న ఒక తల్లి తన బిడ్డడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడంలో వింతేముంది? ఈ దేశంలో చాలామంది సంపన్నులు, ఎగువ మధ్య తరగతి జనం తమ పిల్లలకు ఇక్కడైతే మంచి భవిష్యత్తు ఉండదని భావించి విదేశాలకు పంపి చదివిస్తున్నారు. కొందరైతే ఉన్నతశ్రేణి విద్యా సంస్థల్లో సబ్సిడీకి చదువుకొని విదేశాల్లో భారీ వేతనాలు అందుతాయని, త్వరగా సంపద పోగేసుకోవచ్చునని అంచనావేసుకుని వెళ్లిపోతున్నారు. అలాంటివారంతా దేశభక్తులై... కేవలం తన పిల్లవాడి భవిష్యత్తుపై ఆందోళనపడి ఒక సందేహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేసినవారు దేశద్రోహులు కావడం ఎంత వింత? అసహనంతో ఉన్మాద చర్యలకు పాల్పడేవారి ఆటకట్టిస్తామని, అలాంటి ఉదంతాలు ఇకపై జరగకుండా చూస్తామని భరోసా ఇవ్వాల్సిందిపోయి దబాయింపునకు దిగడం న్యాయమేనా? భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన ఎవరినైనా సరే ఏమైనా అనడానికి తమకు హక్కున్నదని భావించే ధోరణిని బీజేపీ నేతలు విడనాడాలి. ఆరోగ్యకరమైన చర్చకు తావిచ్చే వాతావరణానికి దోహదపడాలి.
Advertisement
Advertisement