
‘మేకిన్ ఇండియా’ మరిచారా!
తన విదేశీ పర్యటనలకు అవసరమైన ప్రాధాన్యతనూ, ఆకర్షణనూ కలగ జేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలానే సఫలీకృతులయ్యారు.
సంపాదకీయం
తన విదేశీ పర్యటనలకు అవసరమైన ప్రాధాన్యతనూ, ఆకర్షణనూ కలగ జేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలానే సఫలీకృతులయ్యారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు ఇప్పుడు మీడియాలో లభిస్తున్న ప్రచారం ఈ సంగతిని రుజువు చేస్తున్నది. అయితే, ఈ పర్యటనలో మిగిలిన అన్ని అంశాల కంటే అందరినీ ఆకర్షించింది ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదిరిన ఒప్పందం. సరిగ్గా మూడేళ్లక్రితం యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసే ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్‌తో ఒప్పందానికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. రూ. 54,000 కోట్ల విలువైన ఆ ఒప్పందం కింద డసాల్ట్ సంస్థ మొత్తం 126 యుద్ధ విమానాలను మన దేశానికి సమకూర్చాలి. వీటిలో 18 విమానాలను 2015కల్లా సమకూరుస్తామని డసాల్ట్ పూచీ పడింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడం ద్వారా మన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)లో ఉత్పత్తి చేసేందుకు ఏడేళ్ల పాటు సహకరిస్తానని ఆ సంస్థ అంగీకరించింది. ఈ విషయంలో డసాల్ట్- హెచ్‌ఏఎల్ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతోపాటు... భారత వైమానికి దళానికి నాసిరకం యుద్ధ విమానాలను అంటగట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఒప్పందం కాస్తా మూలనబడింది. వాస్తవానికి మన వైమానిక దళం యుద్ధ విమానాల కొనుగోలు కోసం 2000 సంవత్సరంనుంచి ఒత్తిళ్లు తెస్తున్నది. మన దేశం చుట్టూ చైనా కుంపట్లు రాజేస్తున్నదని అడపా దడపా వస్తున్న వార్తలు... పాకిస్థాన్ షరా మామూలుగా కయ్యానికి కాలుదువ్వడం వంటివన్నీ మన రక్షణ సంసిద్ధత పెరగాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో రక్షణ దళాలకు వరస విజయాలు సాధించిపెట్టిన మిగ్-21 విమానాల వయసు మీరింది. అవి క్రమేపీ మూలనబడుతున్నాయి. వరస ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. హఠాత్తుగా యుద్ధం వస్తే రణరంగంలోకి ఉరకడానికి అవసరమైన సాధనాసంపత్తి మన వైమానిక దళానికి లేదన్నది నిజం. వైమానిక దళం చేసిన అభ్యర్థనలపై ఏడేళ్ల తర్వాత అంటే... 2007లో తొలిసారి గ్లోబల్ టెండర్లు పిలిచారు. అందులో మిగిలినవాటిని కాదని డసాల్ట్ సంస్థను ఖరారు చేయడానికి మరో అయిదేళ్లు పట్టింది. ఇంతాచేసి 2012నుంచీ ఆ ఒప్పందం కాస్తా మూలనబడింది.
రాఫెల్ యుద్ధ విమానాలపై ఉన్న శంకలైతేనేమి... విమర్శలైతేనేమి అంత తేలిగ్గా కొట్టిపారేయదగ్గవి కాదు. రాఫెల్‌ను ఎంపిక చేయడానికి ముందు అమెరికాకు చెందిన ఎఫ్/ఏ-18, ఎఫ్-16, స్వీడన్‌కు చెందిన గ్రిపెన్, రష్యాకు చెందిన మిగ్-35 విమానాలను 2011లో జరిగిన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత పక్కనబెట్టారు. ఇక రంగంలో రాఫెల్‌తో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల కన్షారియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. చివరకు 2012లో రాఫెల్‌ను ఖరారుచేశారు. అయితే దీని ఎంపిక ఆదినుంచీ వివాదాస్పదంగానే ఉంది. బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, సౌదీ అరేబియా సహా పలు దేశాలు నిరాకరించిన రాఫెల్ మనకెలా నచ్చిందని విమర్శలొచ్చాయి. ఈ ఎంపికలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. రాఫెల్‌ను సాంకేతిక కారణాలు చూపి మనమే ఒకప్పుడు వద్దనుకున్నామని రక్షణ రంగ నిపుణులు గుర్తుచేశారు. వీటన్నిటికీ తోడు డసాల్ట్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అనేక మెలికలు పెట్టడంవల్ల ఈ మూడేళ్లనుంచీ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడిందని మరిచి పోకూడదు.
ఇప్పుడు ప్రధాని మోదీ కుదుర్చుకున్న ఒప్పందానికీ, పాత ఒప్పందానికీ సంబంధం లేదు. ఇప్పుడు కుదిరింది డసాల్ట్‌తో కాదు...ఫ్రాన్స్ ప్రభుత్వంతో. ఇరు ప్రభుత్వాలమధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే రెండేళ్లలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు మన వైమానిక దళానికి సమకూరుతాయి. ‘అత్యవసర నిర్వహణా అవసరాల’కింద ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నారు. మధ్యశ్రేణి బహువిధ యుద్ధ విమానంగా పేరుగాంచిన రాఫెల్ వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మన అవసరాలు తీరతాయని ప్రభుత్వం చెబుతున్న మాట నిజమే కావొచ్చు. అయితే, నరేంద్ర మోదీ అధికారంలోకొచ్చినప్పటినుంచీ హోరెత్తిస్తున్న ‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తికి ఇది విరుద్ధమని వస్తున్న విమర్శల మాటేమిటి? ‘మేకిన్ ఇండియా’ నినాదం సంగతలా ఉంచి... రక్షణ రంగంలో స్వావలంబన సాధించలేని మన అశక్తతపై నిపుణులు ఆదినుంచీ ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. దిగుమతుల వల్ల మన తక్షణ భద్రతా అవసరాలు తీరుతాయన్న వాదనలో నిజమున్నా... భద్రత కోసమంటూ వ్యయం చేస్తున్న వేలాది కోట్ల రూపాయల్లో 70 శాతం విదేశీ సంస్థల ఖాతాలకే చేరుతున్నాయన్నది వాస్తవం. మన భద్రతా అవసరాలు తీరేలా... ఆ క్రమంలో వేలాదిమంది శాస్త్ర, సాంకేతిక నిపుణులకు, కార్మికులకు పని లభించేలా చేస్తే అది మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది. ఇప్పుడున్న మన రక్షణ పరిశోధనా సంస్థలకు కేటాయింపులను ఎక్కువచేస్తే రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని సైతం మరింత పెంచుకోవడానికి వీలుంటుంది. ఎయిర్‌బస్ సంస్థ భారత్‌లో ఉత్పత్తులు ప్రారంభించడానికి సిద్ధమేనని మోదీ సమక్షంలో ప్రకటించింది. డసాల్ట్ సంస్థ సైతం తన వైఖరిని సడలించుకుని సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపునకు అంగీకరించేలా చేయగలిగి ఉంటే మన దేశానికి అది ఉపయోగపడేది. ‘మేకిన్ ఇండియా’ నినాదం తర్వాత మిగిలిన రంగాల మాటెలా ఉన్నా రక్షణ పరిశోధనారంగం బలోపేతమవుతుందని, శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఉంటుందని పలువురు నిపుణులు ఆశించారు. అలాంటి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఆశిద్దాం.