సార్వత్రిక ఎన్నికలై అయిదు నెలలు గడవకముందే మరో కీలక సంగ్రామానికి తెరలేచింది. సరిగ్గా నెలరోజుల వ్యవధిలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 15న ఓటింగ్, 19న ఓట్ల లెక్కింపు ఉంటాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డిసెంబర్‌లో జరగాల్సిన జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా కానిచ్చేయాలని కమిషన్ యోచిస్తున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే జమ్మూ-కాశ్మీర్ విలయం కారణంగా అక్కడ ఎన్నికల నిర్వహణ ఎటూ అసాధ్యం గనుక ఇక జార్ఖండ్ ఎన్నికలు కూడా నిర్ణీత సమయానికే జరపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నది. ఇప్పుడు ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సహజంగానే మహారాష్ట్ర ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అక్కడ కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకూ తిరుగులేనిది. 288 స్థానాలున్న అసెంబ్లీలో వరసగా మూడుసార్లు ఆ కూటమిదే హవా. ఇలా హ్యాట్రిక్ కొట్టి వరసగా పదిహేనేళ్ల సుదీర్ఘకాలం తిరుగులేని అధికారం చలాయించిన మత్తు వల్లనో, ఏమోగానీ కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పాలన అదుపుతప్పి, కుంభకోణాల్లో నిండా కూరుకుపోయి... దానికి కేంద్రంలోని యూపీఏ సర్కారు వైఫల్యాలు కూడా తోడై లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమి బొక్కబోర్లా పడింది. 48 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం రెండింటిని మాత్రమే గెల్చుకోగా, ఎన్సీపీకి నాలుగు దక్కాయి. అటు బీజేపీ-శివసేన కూటమి ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. ఆ కూటమి 41 స్థానాలను కైవసం చేసుకోగా అందులో బీజేపీకి 23, శివసేనకు 18 వచ్చాయి. ఈ ఫలితాలను అసెంబ్లీ స్థానాలవారీగా చూస్తే 288 స్థానాల్లో కూటమి 240 స్థానాలు గెల్చుకున్నట్టు తేలింది. గాలి ఎటువీస్తున్నదో తెలిసిపోయింది గనుక ఎన్సీపీ బీజేపీ పంచన జేరడానికి ప్రయత్నించకపోలేదు. అయితే, అది సాధ్యపడలేదు గనుక కాంగ్రెస్‌తో ఆ పార్టీ నడవక తప్పలేదు.
మొన్నటి ఓటమి దెబ్బనుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోకపోగా... నాయకత్వాన్ని ఎవరికి అప్పగిస్తే ఓట్లు ఒళ్లో వాలతాయన్న మీమాంస పార్టీ పెద్ద తలకాయలకు అంతుచిక్కని పజిల్‌లా మారిపోయింది. కేంద్ర నాయకత్వం ఇలా అయోమయంలో పడిన నేపథ్యంలో రాష్ట్ర విభాగానికి ఇక అది చేసే దిశా నిర్దేశం ఏముంటుంది? కనుకనే కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశానిస్పృహలు దట్టంగా ఆవరించి ఉన్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలతోపాటు ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రల్లో ఆ కూటమి దారుణంగా దెబ్బతింది. తన సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన దళితులు(10.6శాతం), ముస్లింలు (10.8శాతం) కూడా దూరం జరిగారని మొన్నటి ఎన్నికల విశ్లేషణలు నిర్ధారిస్తుండటంతో ఆ కూటమి వెన్నులో వణుకు పుడుతున్నది. దేశానికి ఆర్ధిక రాజధానిగా వెలుగులీనుతున్న మహారాష్ట్రలో మోడీ జగన్నాథ రథచక్రాలను ఈసారైనా నిలువరించలేకపోతే మిత్రపక్షం ఎన్సీపీ ఇక శాశ్వతంగా దూరమవుతుంది. అంతేకాదు...పార్టీలో సోనియాగాంధీ నాయకత్వ పటిమపై విశ్వాసం సన్నగిల్లుతుంది. అయితే, 1960లో మహారాష్ట్ర ఆవిర్భవించాక రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. 1978లో శరద్‌పవార్ కాంగ్రెస్‌నుంచి బయటకెళ్లి సొంత పార్టీని స్థాపించినప్పుడు, 1995లో శివసేన-బీజేపీ విజయం సాధించినప్పుడు మాత్రమే మహారాష్ట్రను కాంగ్రెస్ చేజార్చుకుంది. అందువల్లే బీజేపీ అత్యంత జాగురూకతతో మెలగుతున్నది.
మహారాష్ట్ర ఎన్నికలు నిజానికి బీజేపీకి అగ్నిపరీక్షే. లోక్‌సభ ఎన్నికల్లో ‘మోడీ మంత్ర’ పనిచేసి ఘనవిజయం సాధించిన మాట వాస్తవమే అయినా దూకుడు మీదున్న శివసేనను తన తోవకు తెచ్చుకోవడం ఆ పార్టీకి కత్తిమీద సాము. ఎన్నికల సర్వేలన్నీ బీజేపీ-శివసేన కూటమి విజయదుందుభి ఖాయమని చెబుతున్నాయి. కూటమికి 200 స్థానాలకు తక్కువ ఎవరూ వేయడంలేదు. ప్రధాని పదవి అధిష్టించాక మోడీ అటు ప్రభుత్వాన్నీ, ఇటు పార్టీనీ పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోగలిగారు. అయితే, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలాలు ఇంకా అందిరావలసే ఉన్నది. ఈలోగా ఎంతకూ లొంగిరాని అధిక ధరలు ఎప్పటిలానే సామాన్యుల్ని బాధిస్తున్నాయి.
కనుకనే నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ ఛాయలు కనిపిస్తాయేమోనన్న ఆందోళన ఆ పార్టీలో దండిగానే ఉన్నది. దీనికితోడు గతంలోవలే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అధిక స్థానాలు ఇవ్వాలని, రాష్ట్రంలో అధికారపగ్గాలు తనకే అప్పగించాలని శివసేన పట్టుబడుతున్నది. లేనట్టయితే ఒంటరి పోటీకి కూడా సిద్ధమని ప్రకటిస్తున్నది. కానీ, మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికగా తనకు సగం స్థానాలు ఇచ్చితీరాలన్నది బీజేపీ డిమాండు. ఈ సమస్యలకుతోడు 2009లో శివసేన-బీజేపీ కూటమి ఓట్లకు గండికొట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) ఉండనే ఉంది. సర్వేల్లో వస్తున్న ఫలితాలు నిజం కావాలంటే ఈ కూటమి ఇలాంటి అవరోధాలను అధిగమించాల్సి ఉన్నది. హర్యానాలో బీజేపీది నల్లేరుపై నడకే. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడున్న 10 స్థానాల్లో బీజేపీ ఏడింటిని సునాయాసంగా గెల్చుకోగలిగింది. కాంగ్రెస్‌కు ఒక్కటి మాత్రమే దక్కింది. ఈ గెలుపు ఇచ్చిన హుషారుతో ప్రాంతీయ పార్టీ హర్యానా జనహిత్ కాంగ్రెస్‌ను బీజేపీ దూరం పెట్టింది. అసెంబ్లీలోని మొత్తం 90 స్థానాలకూ ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించింది. మొత్తానికి వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో 8.20కోట్లమంది మహారాష్ట్ర ఓటర్లు, 1.60 కోట్లమంది హర్యానా ఓటర్లు ఎవరికి పట్టంగడతారన్నదాన్నిబట్టి ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
‘మహా’ సంగ్రామానికి నగారా
Published Sat, Sep 13 2014 11:36 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement