మేఘసందేశం! | meteorological department reveals rains details | Sakshi
Sakshi News home page

మేఘసందేశం!

Published Thu, Apr 14 2016 12:22 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

మేఘసందేశం! - Sakshi

మేఘసందేశం!

ప్రచండ వడగాడ్పులతో ప్రజానీకం బెంబేలెత్తుతున్న వేళ వాతావరణ సంస్థలు చల్లని కబురందించాయి. రెండేళ్లనుంచి మొహం చాటేస్తున్న నైరుతి రుతుపవనాలు ఈసారి సమృద్ధిగా వానలు తీసుకొస్తాయని ప్రైవేటు సంస్థ స్కైమెట్‌తోపాటు వాతావరణ విభాగం కూడా ప్రకటించింది. రెండు రోజుల వ్యవధిలో ఈ రెండు సంస్థలూ దాదాపు ఒకే రకమైన అంచనాలివ్వడం అందరినీ సంతోషపరుస్తోంది. ఈ ఏడాది సాధారణం లేదా అంతకన్నా అధికంగా...అంటే దాదాపు 106 శాతం వర్షం కురిసేందుకు 94 శాతం అవకాశాలున్నాయని వాతావరణ విభాగం లెక్కలు కట్టింది.

అయితే జూన్‌నాటికి మాత్రమే మరింత స్పష్టమైన అంచనాలొస్తాయి. నిరుడు వర్షాలపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని వాతావరణ విభాగం ప్రకటించగా స్కైమెట్ కాస్త ఆశాజనకమైన అంచనాకు వచ్చింది. చివరకు వాతావరణ విభాగం చెప్పిన మాటే నిజమైంది. వాతావరణానికి సంబంధించి నూటికి నూరుపాళ్లూ ఖచ్చితంగా చెప్పడం ఇంకా సాధ్యం కావడం లేదు. అయితే గతంతో పోలిస్తే శాస్త్రవేత్తలు కొత్త కొత్త నమూనాలను అమల్లోకి తెచ్చి మెరుగైన అంచనాలు ఇవ్వగలుగుతున్నారు.

జూన్‌తో మొదలై సెప్టెంబర్‌తో ముగిసే నైరుతీ రుతుపవనాల వల్ల మన దేశంలో సాధారణంగా ఏటా 887 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. దానికన్నా ఈసారి 5 శాతం అధికంగా...అంటే 931మి.మి. వర్షపాతం ఉండొచ్చునని స్కైమెట్ చెబుతోంది. వేడి గాలుల పర్యవసానంగా పసిఫిక్ మహా సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడంవల్ల అక్కడి గాలుల్లో తేమ శాతం పెరగడం పర్యవసానంగా ఎల్‌నినో ఏర్పడుతుంది. హిందూసముద్రంనుంచి భారత్ వైపుగా వీచాల్సిన రుతుపవనాలు అలాంటి వాతావరణ పరిస్థితుల్లో దారి మళ్లి పసిఫిక్ వైపు వెళ్లిపోతాయి. ఫలితంగా దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 19వ శతాబ్దం చివరినుంచి మన దేశం ఎదుర్కొన్న ఆరు ప్రధాన కరువుకాటకాలకు ఎల్‌నినోయే ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతారు. 2002లోనూ, 2009లోనూ, తిరిగి గత రెండేళ్లూ దేశంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావమే మూలం. అయితే ఎల్‌నినో ఏర్పడినప్పుడు కూడా ఒకోసారి దేశంలో సాధారణ వర్షపాతం ఉన్న సందర్భాలు లేకపోలేదు.

సముద్ర జలాల ఉష్ణోగ్రత స్థాయి, హిందూమహా సముద్రంపై ఆవరించి ఉండే మేఘాల స్థితిగతులు, వాతావరణంలో ఉండే గాలి తుంపరలు, అటవీ సాంద్రత వంటి స్వల్పకాల, దీర్ఘకాల అంశాలు కూడా ఎల్‌నినోపై ప్రభావం చూపడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు భావించారు. వివిధ వాతావరణ పరిస్థితుల నమూనాలను సూపర్ కంప్యూటర్లకు అందించి అందులో వచ్చే ఫలితాల ఆధారంగా అంచనాలను రూపొందించే విధానం కూడా రూపుదిద్దుకుంటోంది. అది అందుబాటులోకొస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలను రాబట్టడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో నైరుతీ రుతుపవ నాలతోపాటు మరో నాలుగు రుతుపవనాలు- పశ్చిమాఫ్రికా, ఆసియా- ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణమెరికా రుతుపవనాలుండగా వీటిలో నైరుతీ రుతుపవనాల అంచనాయే అత్యంత క్లిష్టమైనదని శాస్త్రవేత్తలు చెబుతారు.

మన దేశంలో 60 శాతంపైగా సాగుభూమి వర్షాలపైనే ఆధారపడుతుంది. మనకు కురిసే వర్షాల్లో 80 శాతం నైరుతీ రుతుపవనాల ద్వారానే వస్తుంది. జీడీపీలో సాగు రంగం వాటా దాదాపు 15 శాతమే అయినా 50 శాతంమందికి ఆ రంగమే ఉపాధి కల్పిస్తున్నది. అందువల్లే నైరుతీ రుతుపవనాలు విఫలమైనప్పు డల్లా మన వ్యవసాయ రంగంపైనా, ఆర్ధిక పరిస్థితిపైనా అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటుంది. పంట దిగుబడులు క్షీణించి ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగు తాయి. ద్రవ్యోల్బణం ఎక్కువవుతుంది. ఫలితంగా ఆర్ధిక వృద్ధి తిరోగమనంలో ఉంటుంది. పంట దిగుబడులు తగ్గడమే కాదు...పచ్చదనం హరించుకుపోయి పశుగ్రాసం లభ్యత కూడా క్షీణిస్తుంది. ఇందుకు విరుద్ధంగా లా నినా ఏర్పడి నప్పుడు అతివృష్టి ఏర్పడుతుంది. ఈసారి సెప్టెంబర్‌నాటికి అలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పటికి మన నైరుతీ రుతుపవనాలు దాదాపు బలహీనపడే స్థితికి చేరుకుంటాయి గనుక దానివల్ల సాధారణ వర్షాలు మాత్రమే కురవొచ్చునని వారంటున్నారు.  

ఈసారి మంచి వర్షాలు పడతాయన్న కబురందేసరికి మార్కెట్లు కూడా మెరిశాయి. వరసగా మూడు రోజులు ఉత్సాహం ఉరకలెత్తింది. పారిశ్రామిక రంగం ఊపందుకుంటుందని, జీడీపీ ఈసారి దాదాపు ఎనిమిది శాతానికి కూడా వెళ్లే అవకాశం ఉండవచ్చునని, ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని భావించడంవల్లనే మార్కెట్లు హుషారుగా స్పందించాయి. అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో మంచి వర్షాలు కురుస్తాయన్న అంచనాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా సంతోషం కలిగించేవే. వరసగా మూడు నెలలపాటు దాదాపు స్తంభించిన స్థితిలో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరి నెలలో 2శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే మైనింగ్ 5 శాతం, విద్యుదుత్పాదన రంగం 9.6 శాతం వృద్ధిని చూపడంవల్లనే ఇది సాధ్యపడింది. ఇలాంటి సమయంలో వ్యవసాయ రంగం మెరుగ్గా ఉండబోతున్నదన్న సంకేతాలు సహజంగానే ఆశ కలిగిస్తాయి.

అయితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలతోపాటే వరదలు సంభవించే అవకాశం ఉన్నదన్న హెచ్చరికలూ వెలువడ్డాయి. ఈ విషయంలో ప్రభు త్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో మిషన్ కాకతీయ పథకం చేపట్టి చెరువుల పూడికలు తీయించడంలాంటి పనులు చేయించినందువల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తరహా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇక నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు, అసలు పనులే ప్రారంభం కాని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. పోలవరం విషయానికొస్తే అది సమీప భవిష్య త్తులో పూర్తయ్యే అవకాశం లేదని దానికి చేస్తున్న కేటాయింపులే రుజువు చేస్తు న్నాయి. ఇలాంటి బృహత్తర పథకాల మాట దేవుడెరుగు...కనీసం శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను, ఇతర భవనాలను మరమ్మతు చేయించడం, అస్తవ్యస్థంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దడంలాంటి పనులైనా చేపడితే జనం ప్రాణాలకు కాస్త భరోసా ఏర్పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement