ఉన్మాదానికి పరాకాష్ట | Mob kills man, injures son over 'rumours' that they ate beef | Sakshi
Sakshi News home page

ఉన్మాదానికి పరాకాష్ట

Published Fri, Oct 2 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

ఉన్మాదానికి పరాకాష్ట

ఉన్మాదానికి పరాకాష్ట

 కళ్లెదుట ఉన్న మనిషిని కడతేర్చడానికి ఎన్ని కారణాలుంటాయి?  కక్ష కావొచ్చు... డబ్బు కావొచ్చు...కులం, మతం, ప్రాంతీయత వంటివి కావొచ్చు. హత్యలకు ఇలాంటి కారణాలెన్నో నిత్యం మీడియాలో కనబడుతుంటాయి. కానీ తినే తిండి కారణంగా ఒకరి ఇంటిపై దాడిచేసి, ధ్వంసం చేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఊహకందనిది. కానీ విద్వేషం అధికారమై ఊరేగుతున్నప్పుడు, వదంతులే దాని ఊపిరైనప్పుడు ఏదైనా  సంభవించవచ్చు. మంగళవారం రాత్రి దేశ రాజధాని నగరానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిసారా అనే పల్లెటూళ్లో ఒక పేద కుటుంబంపై వందమందికిపైగా జనం రాళ్లు, కట్టెలు చేతబూని 52 ఏళ్ల మహమ్మద్ అఖ్‌లాఖ్ అనే వ్యక్తిని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టి చంపేశారు.

అడ్డొచ్చిన అతని 20 ఏళ్ల కొడుకు డానిష్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఆ యువకుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ కుటుంబం గోమాంసం (బీఫ్) తింటున్నదని ఒక గుడి పూజారి చెప్పిన మాటలు విని ఉన్మాదులు రెచ్చిపోయారని పోలీసులు అంటున్నారు. ఊళ్లో పెత్తనం చలాయించే ఠాకూర్లే ఇదంతా చేయించారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. తానూ, తన కుమార్తె కాళ్లావేళ్లాపడినా ఆ ఉన్మాదులు కనికరించలేదని...పైగా అసభ్యంగా ప్రవర్తించారని, నోటికొచ్చినట్టు దూషించారని...ఇంట్లోని సమస్తమూ ధ్వంసం చేసి పోయారని, బంగారు నగలు అపహరించారని అఖ్‌లాఖ్ భార్య చెబుతున్నది.

 

ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి ఈ దురంతాన్ని ఆపించమని వేడుకున్నా తనది అరణ్యరోదనే అయిందని ఆమె విలపిస్తున్నది. అఖ్‌లాఖ్ పెద్ద కుమారుడు సర్తాజ్ చెన్నైలోని వైమానిక దళంలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న డానిష్ ప్రస్తుతం ఎన్టీపీసీలో వెల్డర్‌గా పనిచేస్తూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కుమార్తె సజిదా నోయిడా యూనివర్సిటీలో చదువుకుంటున్నది. అఖ్‌లాఖ్ అంటే విచక్షణా జ్ఞానమని అర్థం. పేరుకు తగినట్టే అఖ్‌లాఖ్‌కు ఆ జ్ఞానం పుష్కలంగా ఉంది. కనుకనే తాను పెద్దగా చదువుకోక పోయినా, కమ్మరి పని చేస్తున్నా పిల్లల్ని ఎంతో బాధ్యతగా పెంచి ప్రయోజకుల్ని చేయగలిగాడు.  


 ఎప్పుడూ ప్రశాంతంగా, సఖ్యతతో ఉండే తమ ఊరు ఎందుకో ఈమధ్య విద్వేషంతో రగులుతున్నదని అక్కడివారు అంటున్నారు. ముఖ్యంగా రెండేళ్లక్రితం ముజఫర్‌నగర్‌లో హిందూ, ముస్లిం ఘర్షణలు తలెత్తాక ఆ ఊరు తీరు మారిందట. కొన్ని ముస్లిం కుటుంబాలు భయంతో ఆ ఊరొదిలి వెళ్లిపోయాయట. అఖ్‌లాఖ్ ఇంత ఘోరాన్ని ఊహించి ఉండడు. తమ బతుకేదో తాము బతుకుతున్న తమపై ఎవరు దాడి చేస్తారన్న ధీమా కావొచ్చు. కానీ విద్వేషం ఊరకే ఉండదు. అది సంబంధం లేనివారిని కబళించడానికి కూడా వెనకాడదు. దీన్ని ఆలస్యంగా గ్రహించిన అఖ్‌లాఖ్ కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్లడానికి సిద్ధపడుతోంది. ఉన్మాదంతో ఊగిపోయిన గుంపు సరే...యూపీ పోలీసులకు కూడా ఇంగిత జ్ఞానం కొరవడింది.

 

ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు హంతకులెవరో ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించడంకంటే అఖ్‌లాఖ్ ఇంట్లో ఉన్న మాంసం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. దాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు! బీజేపీ అధికారంలో ఉన్న ఒకటి రెండు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా బీఫ్ నిషిద్ధ పదార్థం కాదు. దాన్ని తెచ్చుకోవడం, తినడం నేరం కాదు. యూపీలోని గో పరిరక్షణ చట్టం ప్రకారం గోవధకు పాల్పడితే ఏడేళ్ల శిక్ష ఉంటుంది. ఒకవేళ అఖ్‌లాఖ్ కుటుంబం ఆ నేరానికి పాల్పడిందనుకున్నా అరెస్టు చేయాల్సిందీ...కేసు పెట్టాల్సిందీ ప్రభుత్వ యంత్రాంగమే తప్ప ఉన్మాదులు కాదు. అలాంటపుడు పోలీసులు ఆ మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపడంలోని ఔచిత్యమేమిటి? ఇది బాధితుల్నే నేరస్తులుగా అనుమానించడం కాదా? ముజఫర్‌నగర్ మత ఘర్షణల్లో ఇప్పటికే తమ చేతగానితనాన్ని చాటుకున్న యూపీ పోలీసుల నిర్వాకంలో ఇది మరో అధ్యాయం. ఇంత ఘోరం జరిగాక పరీక్షలో ఆ మాంసం మటనేనని నిర్ధారణ అయింది. తమ ఇంట్లో ఉన్నది మటన్ అని తేలితే మా నాన్నను తిరిగి తెచ్చిస్తారా అని సజిదా అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు జవాబిచ్చేవారు లేరు.


  గత కొంతకాలంగా దేశంలో ఏర్పడిన పరిస్థితుల పర్యవసానంగానే బిసారా ఉదంతం జరిగింది. ముస్లింల విషయంలో విద్వేషపూరిత ప్రకటనలు పరాకాష్టకు చేరుకున్న దశలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని వాటిని ఆపవలసి వచ్చింది. వీటికి తోడు ఆహారపుటలవాట్లపై లేనిపోని చర్చ రేకెత్తించడంతోపాటు జైనుల పండగ సందర్భంగా మాంసం అమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్వులు జారీచేశాయి. ఈమధ్యే కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేష్ శర్మ రాబోయే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు మాంసం అమ్మకాలు నిలిపేయాలని సూచించారు.  ఈ ఘోర దురంతం చోటు చేసుకున్న బిసారా గ్రామం ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనిదే. ఈ ఉదంతాన్ని చర్య-ప్రతిచర్యగా చూడాలి తప్ప దీని వెనక ఏదో పథకం ఉన్నదనుకోవడం సరికాదని ఆయన చెబుతున్నారు.  


 భిన్న మతాలు, సంస్కృతులు, భాషల సమ్మేళనంగా ఉన్న మన దేశంలో వేర్వేరు ఆహారపుటలవాట్లున్నాయి. దేశ జనాభాలో దాదాపు 80 శాతంగా ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, కొన్ని వెనకబడిన కులాలవారూ బీఫ్ తింటారు. పైగా ప్రపంచంలో గొడ్డు మాంసాన్ని అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో మన దేశానిదే ప్రథమ స్థానం. ఆ తర్వాత బ్రెజిల్, ఆస్ట్రేలియాలుంటాయి. ప్రపంచంలో బీఫ్ ఎగుమతుల్లో మన దేశం వాటా 23.5 శాతం. ఇది నిరుటితో పోలిస్తే 3 శాతం అధికం.

 

అత్యధికులు భుజించే...భారీయెత్తున వ్యాపారం జరిగే గొడ్డు మాంసంపై అనవసర చర్చ లేవనెత్తడం, దాన్ని తినరాదంటూ సుద్దులు చెప్పడం...నిషేధించడానికి పూనుకోవడం కపటత్వం అనిపించుకుంటుందని మన రాజకీయ నాయకులకు తోచకపోవడం విచిత్రం. పై స్థాయి నేతల్లో ఉండే ఈ తరహా ఆచరణ కిందికొచ్చేసరికి ఉన్మాద బృందాలను తయారుచేస్తోంది. జంతు ప్రేమ మంచిదే కావొచ్చు... వాటిని పూజించడంవల్ల పుణ్యం వస్తుందని అనుకోవచ్చు. కానీ తోటి పౌరుల్ని మనుషులుగా గుర్తించలేనివారూ, గౌరవించలేని వారూ సమాజానికి చీడపురుగులవుతారని తెలుసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement