విషాద ఉదంతం | Nandamuri Harikrishna Died in Road Accident | Sakshi
Sakshi News home page

విషాద ఉదంతం

Published Thu, Aug 30 2018 12:07 AM | Last Updated on Thu, Aug 30 2018 4:28 PM

Nandamuri Harikrishna Died in Road Accident - Sakshi

నందమూరి వంశంలో నిష్కల్మష హృదయుడిగా, నిష్కర్షగా మాట్లాడే నేతగా పేరున్న హరికృష్ణ నల్లగొండ జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తీరు మన అస్తవ్యస్థ రహదారులను, వాటిపై అపరిమిత వేగంతో పరుగులెత్తే వాహనాల తీరుతెన్నులను వెల్లడించింది. ఇలాంటి రహదారులపై ప్రయాణించేవారైనా, పాదచారులైనా క్షేమంగా ఇళ్లకు చేర గలరని ప్రభుత్వాలు ఎలా అనుకుంటాయో అనూహ్యం. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మిగిలినవాటితోపాటే మన జాతీయ రహదారులు కూడా పూర్తిగా కొత్త రూపు సంత రించుకున్నాయి. ఆరు లేన్లు, ఎనిమిది లేన్ల రహదారులుగా మారాయి. విశాలమైన రహదార్ల మధ్య డివైడర్లు, వాటిపై పచ్చటి మొక్కలు ముచ్చట కలిగిస్తుంటాయి. ఆ రహదార్లపై అడ్డంగా అందంగా అమర్చిన టోల్‌ గేట్లు... వచ్చే పోయే వాహనాలు అక్కడ కప్పం కట్టడం అన్నిచోట్లా అనునిత్యం కనిపించే దృశ్యం. విశాలమైన రహదార్లను చూసి అమిత వేగంతో వెళ్లాలన్న సరదా కావొచ్చు... సత్వరం గమ్యం చేరాలన్న ఆత్రుత కావొచ్చు– మితిమీరి వెళ్తూ చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు హరికృష్ణ దుర్మరణం పాలైన ప్రాంతాన్ని గమనిస్తే అలాంటిచోట ప్రమాదం జరగటం ఆశ్చర్యం కలిగించదు. ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవటం, అతి వేగంతో వాహనాన్ని నడపటం, అదే సమయంలో పక్కనున్న వాటర్‌ బాటిల్‌ అందుకోవటానికి ప్రయ త్నించటం ప్రాణం మీదికి తెచ్చి ఉండొచ్చుగానీ, సరిగ్గా అక్కడే ఉన్న ప్రాణాంతక మలుపు కూడా ఈ విషాదానికి దోహదపడిందని అర్ధమవుతుంది. అక్కడ తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.  మలుపు ఉన్నచోట, పాదచారులు రహదారులు దాటేచోట స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించటం, ఆ ప్రదేశానికి చాలా ముందే తగిన సంఖ్యలో హెచ్చరిక బోర్డులుంచటం అత్యవసరం. ఊళ్ల మధ్య నుంచి రహదారి పోతుంటే అండర్‌పాస్‌లను నిర్మించటం, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయటం చాలా ముఖ్యం.

స్పీడ్‌ గన్‌ల ద్వారా వేగనియంత్రణ కూడా అవసరం. ఇవన్నీ లేకపోగా ఆ రహదారులపై మార్కింగ్‌లు వేయటంతో తమ పని పూర్తయిందన్నట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. నిర్దిష్ట ప్రాంతంలో తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రోడ్డు డిజైన్‌లో ఏం సవరణలు చేయాలో అధ్యయనం చేసే వ్యవస్థ ఉంటే ఆ ప్రమాదాలను నిరోధించవచ్చు. వీటి విష యంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ప్రమాదాలు జరిగి ఆప్తులను కోల్పో యిన పలువురు ప్రముఖులు ప్రాణాంతకంగా మారిన ఇలాంటి లోపాలను ఎత్తిచూపిన సందర్భా లున్నాయి. కానీ ఫలితం ఏదీ?  

 రెండేళ్లక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి 12 నిమిషాలకో మరణం, పదిమందికి గాయాలు, ఏటా 30 శాతంమందికి అంగవైకల్యం సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే మొదటి పది రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ చోటు సంపాదించాయి. ప్రమాదాల్లో మరణాల శాతం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఇవన్నీ తక్షణ చర్యలకు పురిగొల్పి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగేది కాదు. హరికృష్ణకు డ్రైవింగ్‌లో అపారమైన అనుభవం ఉంది. తన తండ్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని ‘చైతన్యరథం’ వాహనంపై సుడిగాలిలా చుట్టుముట్టినప్పుడు ఆ వాహనానికి ఆయనే సారథి. అంత అనుభవశాలి సైతం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం విచారకరం.

అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే నిరుడు రోడ్డు ప్రమాదాలు 3 శాతం తగ్గాయని రహదార్ల భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిలో 2016లో 1,50,935మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే... 2017నాటికి ఆ సంఖ్య 1,46,377కి తగ్గింది. తెలంగాణలో 2016లో 7,219మంది దుర్మరణం పాలైతే, నిరుడు ఆ సంఖ్య 6,595కి తగ్గింది. మన రోడ్ల స్థితిగతులెలా ఉన్నాయో గమనించకుండా అధిక సామర్ధ్యం గల ఇంజన్లున్న అత్యాధునిక వాహనాలను వెనకా ముందూ చూడకుండా ఇక్కడి మార్కెట్లలో ప్రవేశపెట్టడానికి అనుమతించటం కూడా ప్రమాదాలకు మూల కారణం. ఇప్పుడొచ్చే వాహనాల గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్ల మేరకు చేరుకుంది. కారులో ప్రయాణించేవారికి ఈ వేగం తీవ్రత తెలియదు. బ్రేక్‌ వేయాల్సివచ్చినప్పుడు మాత్రమే పరిస్థితి అర్ధమవుతుంది. కానీ అప్పటికే నష్టం జరిగిపోతుంది. వాహనాల్లో అత్యవసర సమయాల్లో బెలూన్లు తెరుచుకునే వ్యవస్థ సక్రమంగా ఉందో లేదో చూడటం, వాహనాన్ని నడిపేవారు సీటు బెల్టు ధరించారో లేదో చూసి హెచ్చరించటం వంటివి పకడ్బందీగా అమలు కావాలి. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు విభాగం ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై వివిధ రకాలుగా తీసుకుంటున్న చర్యల పర్యవసానంగా ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలొస్తున్నాయి. వీటిని జాతీయ రహదార్లకు సైతం వర్తింపజేయటం ఎలాగన్న విషయాన్ని ఆలోచించాలి.

రహదార్లపై ప్రమాదాలు నివారించటానికి రహదారి భద్రత సంఘం ఏర్పాటు చేయాలని ఏడాదిక్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వైద్య, రవాణా, పోలీసు, ఆర్‌ అండ్‌ బీ అధికా రులు భాగస్వాములుగా ఉంటారని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పటికీ దానికొక స్వరూపం ఏర్పడలేదు. ఈ సంఘం ఉనికిలోకొస్తే ప్రమాదాల నివారణకు అదెంతో దోహదపడుతుంది.  సురక్షితమైన డ్రైవింగ్‌ విషయంలో హరికృష్ణ అందరినీ తరచు హెచ్చరిస్తూ చైతన్యవంతుల్ని చేయ డానికి ప్రయత్నించేవారు. ముఖ్యంగా తన కుమారుడు జానకిరామ్‌ నాలుగేళ్లక్రితం రోడ్డు ప్రమా దంలో మరణించాక ఆయన పదే పదే ఈ జాగ్రత్తలను ప్రస్తావించేవారు. సహృదయుడిగా, స్నేహ శీలిగా, నిష్కపటిగా పేరు తెచ్చుకున్న హరికృష్ణ అకాల మరణం ఆయన కుటుంబానికి మాత్రమే కాదు... ప్రతి ఒక్కరికీ ఆవేదన కలిగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement