అద్భుత విజయాలు! | Outstanding Achievements! | Sakshi
Sakshi News home page

అద్భుత విజయాలు!

Published Mon, Nov 17 2014 12:41 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Outstanding Achievements!

భారత బాడ్మింటన్ చరిత్రలో ఆదివారం ఒక నూతన శకం ఆవిష్కృతమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చైనా ఓపెన్‌లో హైదరాబాద్ ఆణిముత్యాలు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టైటిల్స్ సాధించి దేశం గర్వపడేలాచేశారు. సైనా నెహ్వాల్‌కు సూపర్ సిరీస్ విజయాలు కొత్త కాకపోవచ్చు. ఇంతవరకూ ఆమె ఎనిమిది సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచింది. ఈ ఏడాది వరకే చూసుకుంటే ఆమె ఖాతాలో ఇప్పుడు సాధించినది మూడో టైటిల్. కానీ, చైనా ఓపెన్ అనేక విధాల ప్రత్యేకమైనది. గత అయిదేళ్లుగా ప్రతి టోర్నీలోనూ ఆమె ఈ ‘చైనా గోడ’ను అధిగ మించడంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నది. బ్యాడ్మింటన్‌లో చైనా తిరుగులేని ఆధిపత్యాన్ని దెబ్బతీయడం మాట అటుంచి... దాన్ని ఎంతో కొంత నిలువరించడం అసాధ్యమని క్రీడా రంగ నిపుణులంటారు. కానీ పట్టుదల, దృఢ సంకల్పంగల ప్రయత్నశీలుర ముందు పర్వతాలు సైతం గులకరాళ్లవుతాయని వీరిద్దరూ నిరూపించారు. ఈసారి మహిళల చైనా ఓపెన్ ప్రధాన డ్రాలో మొత్తం 32 మంది క్రీడాకారిణులకుగాను ఏకంగా 12 మంది చైనీయులే బరిలోకి దిగారు. సాధారణంగా ప్రతి ప్రధాన టోర్నీలోనూ క్వార్టర్స్ దశ నుంచీ సైనాకు చైనీయుల తోనే పోరాటం! ఈసారైతే రెండో రౌండ్ నుంచే ఆమెకు చైనా ప్రత్యర్థులు ఎదుర య్యారు. వరుసగా ముగ్గురు చైనా అమ్మాయిలను ఓడించి సైనా ఫైనల్‌కు చేరింది. అక్కడ సైతం మళ్లీ చైనాకు చెందిన ఉత్తమ ర్యాంక్ క్రీడాకారిణి షి జియాన్ వాంగ్ తో ఆమె తలపడవలసి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే జపాన్ యువ సంచలనం యామగుచి రెండో రౌండ్‌లోనే షి జియాన్‌కు షాకిచ్చింది. ఆ రకంగా యామగుచి సైనా శ్రమను కొంత తగ్గించిందని అనుకోవాలి.

ఇక పురుషుల విభాగంలో శ్రీకాంత్ సాధించిన ఘనత మహాద్భుతం. ఇంత కాలం బ్యాడ్మింటన్‌లో మహిళల విభాగంలో మాత్రమే చైనాను భారత్ ఎంతో కొంత ఇబ్బంది పెడుతోంది. తొలిసారి ఒక భారత క్రీడాకారుడు ప్రపంచాన్ని జయించాడు. 2001లో తన గురువు గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో... లేదా సూపర్ సిరీస్‌లలో భారత క్రీడాకా రులెవరూ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. ఎట్టకేలకు శ్రీకాంత్ ఫైనల్‌కు చేరినా, గెలుస్తాడని మాత్రం ఎవరూ ఊహించనేలేదు. అలాంటిది... ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్స్ విజేత అయిన బ్యాడ్మింటన్ మొనగాడు లిన్ డాన్‌ను అతను ఓడించడం నిజంగా పెను సంచలనమే. ఫైనల్‌కు చేరే క్రమంలో శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే చైనా క్రీడాకారుణ్ణి ఓడించాడు. మరోవైపు టాప్ సీడ్ చెన్‌లాంగ్‌ను మార్క్ జ్విబ్లెర్ ఓడించడం కూడా అతనికి కలిసొచ్చింది. జ్విబ్లెర్‌ను సెమీస్‌లో ఓడించిన శ్రీకాంత్, ఫైనల్లో మాత్రం తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేశాడు. టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్కో గేమ్ పోగొట్టుకున్నా ఫైనల్లో డాన్‌పై మాత్రం అలవోకగా గెలవడం ఆశ్చర్యం కలిగిం చింది. ఆటలో గెలుపోటములు సహజం. తనకంటే పెద్ద ఆటగాడితో ఆడుతు న్నప్పుడు ‘పోరాడితే పోయేదేముంది’ అనే దృక్పథం చూపించాలి. ఈ సూత్రం తోనే శ్రీకాంత్ సర్వశక్తులూ ఒడ్డి డాన్‌ను మట్టికరిపించాడు. ర్యాంక్‌పరంగా శ్రీకాంత్‌ది ప్రపంచంలో 16వ స్థానం. అయితేనేం, ఏ క్రీడాకారుడికైనా ఒకసారి కోర్టులోకి దిగితే ర్యాంక్‌తో పనిలేదని నిరూపించాడు.

ఒలింపిక్స్ నుంచి గ్రాండ్ ప్రి గోల్డ్ దాకా ఏ టోర్నీలో అయినా చైనాదే ఆధిపత్యం. డ్రా విడుదల కాగానే ప్రతి క్రీడాకారుడూ, క్రీడాకారిణీ ‘డ్రాగన్’ను చూసి మానసికంగా ఓడిపోతారు! కొంతకాలంగా ఈ దృక్పథంలో మార్పు వస్తున్న ది. మన సైనా, సింధు అడపాదడపా సంచలనాలు సృష్టిస్తున్నారు. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) చైనాకు చాలా కాలంనుంచి కొరకరాని కొయ్యగా మారాడు.అతను డోపింగ్‌లో పట్టుబడ్డాక చైనా మళ్లీ కుదుటపడింది. ఇక పురుషుల విభాగంలోనూ తమకు ఎదురులేదని సంబర పడింది. కానీ లీ చోంగ్ వీ లేకుండా జరిగిన మొదటి టోర్నీలో ఓ భారతీయుడి నుంచి తమకు షాక్ తగులుతుందని ఊహించలేదు. శ్రీకాంత్ విజయంతో ఇకపై ప్రతి టోర్నీలోనూ భారత క్రీడాకారుల గురించి చైనా ఆలోచించకతప్పని స్థితి ఏర్పడింది.
 చైనా ఇంతకాలం బ్యాడ్మింటన్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించడానికి కారణం అక్కడి వ్యవస్థే. చిన్నతనంలోనే పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి, వారిని సాన బెట్టి ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దటం ద్వారా అది పతకాలను కొల్లగొడు తున్నది. సరైన ప్రణాళిక, మంచి సౌకర్యాలు, ముందుచూపు ఉంటే భారత్‌లోనూ ప్రపంచ చాంపియన్లు పుట్టుకొస్తారనడానికి ఇప్పుడు సైనా, శ్రీకాంత్‌లు సాధించిన విజయాలే తార్కాణం. దాదాపు ఎనిమిదేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు హైదరాబాద్ హబ్‌గా మారింది. ఇందుకు కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ముందుగా అభినందించాలి. ఆయన ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటైన అకాడమీ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రీడాకారులు చాలామందే ఉన్నారు. సైనా, శ్రీకాంత్ కూడా ఆ అకాడమీ ఆణిముత్యాలే. ఒక్కసారి విజయాలు మొదలై ఒక రోల్‌మోడల్ వస్తే ఆ ఆటను మరింతమంది ఎంచుకుంటారు. ప్రకాశ్ పదుకొనే, గోపీచంద్ లాంటి దిగ్గజాలు ఆ రోజుల్లో విజయాలు సాధించినా పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ప్రసారమాథ్యమాల ప్రభావం కారణంగా ఆ దిగులు లేదు. ఒకరి విజయం ఎందరికో స్ఫూర్తినిస్తున్నది. సైనా, శ్రీకాంత్ ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. అయినా తమ కలలను సాకారం చేసుకోగలిగారంటే వారి నిరంతర కృషి, పట్టుదలే అందుకు కారణం.  ఇదే రేపు సింధు, కశ్యప్‌లకు ఒరవడి అవుతుంది. ఇంకా తమ ప్రతిభకు సానబట్టుకుంటున్న ఎందరో చిన్నారులకు మార్గదర్శకమవుతుంది. జగజ్జేతలను సృష్టిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement