సమస్యలు పరిష్కరించడం చేతగానప్పుడు, సంక్షోభం ముదురుతున్నప్పుడు పాలకులంతా ఏం చేస్తారో జమ్మూ-కశ్మీర్‌లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. బుర్హాన్ వానీ అనే మిలిటెంటును ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపిన తర్వాత కశ్మీర్ లోయలో నెలకొన్న ఉద్రిక్తతలను ఎలా అదుపు చేయాలో తెలియక అయోమయంలో కూరుకుపోయిన ప్రభుత్వం మీడియా గొంతు నొక్కే పనిలో బడింది. ఫలితంగా గత మూడు రోజులుగా ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న జిల్లాల్లో పత్రికల ప్రచురణ ఆగిపోయింది.
తమ నేరానికి సాక్ష్యం లేకుండా చేయా లన్న ఉద్దేశంతో కావొచ్చు... మీడియా కార్యాలయాలపై అర్ధరాత్రుళ్లు దాడులు చేసి ప్రచురణ, పంపిణీ నిలిపేయాలని నోటిమాటగా ఆదేశాలిచ్చారు. పాత్రికేయు లనూ, ఇతర సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. కొందరిని అరెస్టుచేశారు. ఫలితంగా అనేక ఉర్దూ, ఆంగ్ల దినపత్రికలు ఆగిపోయాయి. టర్కీలో ఇంచుమించు ఇదే సమయంలో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించిన సైన్యం అచ్చం ఇదే తరహాలో మీడియా కార్యాలయాలపై దాడులకు దిగింది. అది కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. కానీ కశ్మీర్‌లో మూడురోజులుగా ఇది కొనసాగు తూనే ఉంది. ఇన్నిరోజులు గడిచినా నోరెత్తని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రకరకాల సాకులు వెదుకుతోంది. తొలుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సలహాదారు అమితాబ్ మట్టూ పత్రికా సంపాదకుల దగ్గరకెళ్లి క్షమాపణలు చెప్పారు.
ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఆ తర్వాత ఆయన మాట మార్చారు. మీడియాపై దాడులకు కారణమైన సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఫయాజ్ అహ్మద్‌ను బదిలీ చేస్తున్నామన్నారు. మీడియా నియంత్రణకు తాము ఎవరికీ ఆదేశాలి వ్వలేదని చెప్పారు. వాస్తవానికి దాడులు జరిగిన మర్నాడు రాష్ట్ర విద్యామంత్రి నయీమ్ అఖ్తర్ పత్రికా సంపాదకులను పిలిచి... కర్ఫ్యూకు సంబంధించి కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నందున పత్రికల పంపిణీ సాధ్యంకాదు గనుక మూడురోజులు నిలిపేయాలని అడిగారు.
వీరి ప్రకటనలు సృష్టించిన అయోమ యానికి కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటన తోడయింది. అసలు కశ్మీర్ లోయలో మీడియాపై నిషేధమే లేదని ఆయన చెబుతున్నారు. సీఎం మెహబూబా ఈ సంగతిని తనకు స్వయంగా చెప్పారని ఆయనంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజం? జరిగింది తప్పని గుర్తించి ఉంటే అది స్థానిక అధి కారివల్ల జరిగిందో, తమవల్ల జరిగిందో వివరణనివ్వాలి. ఏ స్థాయిలో తప్పు జరి గినా బాధ్యత నెత్తినేసుకుని బహిరంగ క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు పునరావృతం కావని హామీ ఇవ్వాలి. అలాకాక పత్రికలు యధావిధిగా పనిచేసుకోవచ్చునని చెప్పడం వల్ల లేదా నిషేధమే లేదని బుకాయించడంవల్ల అంతా సమసిపోతుందని అనుకోవడం తెలివితక్కువతనం. సిగ్గుమాలిన పని చేయడానికి లేని భయం దాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు?
కశ్మీర్‌లో వానీ ఎన్‌కౌంటర్ ఉదంతం తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంపై నిషేధం ఉంది. సెల్ ఫోన్ నెట్ వర్క్‌లు ఆగిపోయాయి. పత్రికల్ని కూడా ఆపేస్తే జరుగుతున్నదేమిటో ఎవరికీ తెలియకుండా పోతుందని, అప్పుడు పరిస్థితి దారి కొస్తుందని ఎలా అనుకున్నారో అంతుబట్టని విషయం. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మీడియాపై ఈ మాదిరి ఆంక్షలే విధించారు. అందు వల్ల సమాచారం ఆగిందేమీ లేదు. సరిగదా దానికి అనేక ఊహాగానాలు, వదం తులు కూడా జతచేరాయి. మరోపక్క కింది స్థాయిలో జరుగుతున్నదేమిటో ప్రభు త్వానికి తెలియకుండా పోయింది. చివరకు ఎమర్జెన్సీ ఎత్తేశాక జరిగిన ఎన్నికల్లో ఇందిర ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. కశ్మీర్‌లో అవాంఛనీయమైనవి జరు గుతున్నాయనుకుంటే వాటిని నిలిపేయడం సబబవుతుంది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించడం సబబవుతుంది. అంతేతప్ప అలా జరుగుతున్నవి బయటకు పొక్క నివ్వకూడదనుకోవడం సరైందేనా? ఎన్ని లోటుపాట్లున్నా మన దేశంలో మీడియా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంది. దాని పనికి అడ్డం రాకుండా ఉంటే వాస్తవ మైన, విశ్వసనీయమైన సమాచారం అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి చేరు తుంది.
అందువల్ల మేలే తప్ప కీడు ఉండదు. లోటుపాట్లుంటే చక్కదిద్దుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. వదంతులపై ఆధారపడకుండా నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రజలకు వీలవుతుంది. మతిమాలిన నిషేధాలతో ఈ రెండింటికీ చేటు కలుగుతుంది. ఉద్రిక్త వాతావరణం అలుముకొని ఉన్న కశ్మీర్‌లాంటి ప్రాంతా లలో ఇందువల్ల పరిస్థితి మరింత వికటిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే అక్కడ ప్రజలకు వాస్తవ సమాచారం చేరడం ఎంత అవసరమో అర్ధమవుతుంది.
జమ్మూ-కశ్మీర్ పాలకుల చేతగానితనం గత కొన్నిరోజులుగా తెలుస్తూనే ఉంది. వివిధ ఘటనల్లో 42మంది చనిపోగా, దాదాపు 2,000మంది గాయపడ్డారు. పరిస్థితి మెరగవుతున్న సూచనలు లేవు. కర్ఫ్యూ ఇంకా అమల్లోనే ఉంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీడియా ద్వారా ప్రజలకు చేరువకావాల్సింది పోయి దాన్ని అడ్డుకోవాలని చూడటం ఆశ్చర్యకరం. నిజానికి ఇది ఎక్కడో కశ్మీర్‌లో నెలకొన్న సమస్య మాత్రమే కాదు. మొన్నటికి మొన్న కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు కూర్చున్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఆంక్షలకే దిగింది.
సాక్షాత్తూ హోంమంత్రి చినరాజప్ప ముద్రగడ దీక్ష విరమించేంతవరకూ రాష్ట్రంలో ‘సాక్షి’ టీవీ ప్రసారా లను అడ్డుకుంటామని నిస్సిగ్గుగా ప్రకటించారు. తీరా ఉన్నత న్యాయస్థానంలో అందుకు సంబంధించిన కేసు విచారణకొచ్చే సమయానికి ప్రభుత్వం మాట మార్చింది. ప్రసారాల నిలిపివేతలో తమకు సంబంధం లేదని బుకాయించింది. అంతకుముందూ ఆ తర్వాతా అనేక అక్రమ కేసులు బనాయించింది. ఇప్పుడు కశ్మీర్‌లో కూడా తప్పును ఒక అధికారిపై నెట్టి పాలకులు తప్పుకో జూస్తున్నారు. కనీస విలువల్లేని ఇలాంటి పాలకులు మీడియాస్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్నే అర్ధరహితం చేస్తున్నారు. ప్రజల నిరంతర అప్రమత్తతే ఈ వంచ కుల ఆట కట్టించగలదు.
మీడియా స్వేచ్ఛకు గండం
Published Wed, Jul 20 2016 1:16 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement