
ఉన్మాద చర్య
సంపాదకీయం
సామాన్యుడు అసామాన్యుడై, శిరమెత్తి కళ్లెర్రజేసి రాజరికాన్ని తుత్తినియలు చేసిన గడ్డ అది. ఈ ప్రపంచంలో తొలిసారి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను మాటలుగా కాదు...ఆచరణలో ‘పారిస్ కమ్యూన్’గా ఆవిష్కరించి చూపిన ప్రాంతమది. మళ్లీ నియంత పోకడలను ప్రదర్శించబోయిన వ్యవస్థపై 1968లో అదే స్ఫూర్తితో తిరగబడి అధికార పీఠాన్ని వణికించిన చరిత్ర దాని సొంతం. ఈమధ్య ఫ్రాన్స్ ప్రభుత్వం ఇవ్వజూపిన దేశ అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరిస్తూ ‘పౌరుల్లో ఎవరు గౌరవనీయులో నిర్ణయించే అధికారం మీకెక్కడిద’ని తిరగ్గొట్టిన ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెటీ కొనసాగించింది ఆ సంప్రదాయాన్నే. స్వేచ్ఛను ప్రబోధించి, ఆచరించి...తిరుగుబాటును ఆశ్వాసించిన అలాంటి నేలపై నెత్తురొలికింది. పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై బుధవారం ముగ్గురు ఉగ్రవాదులు దాడులకు తెగబడి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు సుప్రసిద్ధ కార్టూనిస్టులుసహా 10మంది జర్నలిస్టులను, ఇద్దరు కానిస్టేబుళ్లనూ కాల్చిచంపారు. ఉన్మాదుల్లో ఒకడు తనంత తానే లొంగిపోయాడని వార్తలు వస్తుండగానే మరో ఇద్దరు ఉగ్రవాదులు రెండోరోజు కూడా పారిస్ రోడ్డుపై ఒక మహిళా కానిస్టేబుల్‌పై గుండ్ల వర్షం కురిపించి ప్రాణాలు తీశారు. ఒకటి రెండుచోట్ల పేలుళ్లు కూడా సంభవించాయి. అల్ కాయిదా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా చెప్పుకున్న ఈ ఉన్మాదుల్లో ఒకరికి గతంలో జైలు శిక్ష కూడా పడిందంటున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఫ్రాన్స్ సరిగానే అర్ధంచేసుకుంది. ‘ఇది భావప్రకటనా స్వేచ్ఛపైనా, రిపబ్లిక్ స్ఫూర్తిపైనా జరిగిన దాడి’ అని అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ ప్రకటించారు.
ఉదారవాద భావాలను సహించలేని వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పెచ్చుమీరుతున్నవేళ ఒక మతాన్ని అనుసరించేవారి మనోభావాలను దెబ్బతీసేలా, వారి విశ్వాసాలను అవహేళన చేసేలా...ఒక్కసారి కాదు, పదే పదే కార్టూన్లు ప్రచురించి ‘చార్లీ హెబ్డో’ తప్పే చేసి ఉండొచ్చు. అలాగని ‘చార్లీ హెబ్డో’ అనుసరించే మతమేమీ లేదు. దానికి క్రైస్తవమైనా, ఇస్లామైనా, జుడాయిజమైనా, మరొకటైనా ఒక్కటే. చెప్పాలంటే అన్ని మతాలనూ, ఆ మతాలు ప్రబోధించే విశ్వాసాలనూ అది వెటకారం చేసింది. ‘అధికార రోగపూరిత బదిరాంధకుల’ను అసలే వదల్లేదు. అత్యున్నతస్థాయి నేతలైనా, అధికారులైనా, సెలబ్రిటీలైనా ఆ పత్రిక కార్టూనిస్టులకు లెక్కలేదు. అలాంటివారందరినీ తమ కుంచెలతో గిచ్చారు...ఎత్తిపొడిచారు...తలెత్తుకు తిరగలేనివిధంగా వ్యంగ్య ధోరణిలో ఎండగట్టారు. వీటన్నిటి వెనకా అపరిమితమైన స్వేచ్ఛ, అన్నిటినీ ఎదిరించే తిరుగుబాటు మనస్తత్వం, దేన్నీ లెక్కచేయనితనం వంటి భావనలే ఉన్నాయి. అయితే, పాశ్చాత్య సమాజం మునుపటిలా లేదు. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలూ వ్యవహరించిన తీరువల్ల ఉగ్రవాదం అదుపులోనికి రాలేదు సరిగదా...మరింతగా విస్తరించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికా చేసిందంతా దానికి బలం చేకూర్చడమే. ఇందుకు యూరప్ దేశాలన్నీ సహకరించాయి. ట్విన్ టవర్స్‌పై దాడికి బాధ్యులైనవారిని వెంటాడి పట్టుకోవడానికి బదులు ఆ వంకన ఇరాక్‌పై దండయాత్ర జరిపి, అటు తర్వాత మరిన్ని దేశాల్లో జోక్యం చేసుకుని వాటన్నిటినీ వల్లకాటి సీమలుగా మార్చాయి. ఉగ్రవాదాన్ని ఒంటరి చేసి, దాన్ని తుదముట్టించడానికి బదులు ఒక మతంపై దాడి చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలగజేశాయి. గత పాతికేళ్లలో పాశ్చాత్య ప్రపంచం పోతున్న ఈ పోకడలపై ఉదారవాద మేథావులెందరో హెచ్చరించారు. దీనివల్ల ఉగ్రవాదానికి మరింత ఊపిరిపోసినట్టవుతుందని చెప్పారు. ఇలాంటి వాతావరణం ఉండటం కొందరు ఉన్మాదులకు అందివచ్చింది. తమను తాము మత రక్షకులుగా చెప్పుకుని తమతో ఏకీభవించనివారిని హతమార్చే పనికి పూనుకుంటున్నారు. వీరికి మతం ఒక సాకు తప్ప అది బోధించే ఉన్నతమైన విలువలతో, సంస్కృతితో సంబంధం లేదు. తోటి మనుషులపై కనీసమైన గౌరవం లేదు. ఇరాక్, యెమెన్, అఫ్ఘానిస్థాన్, నైజీరియా వంటి దేశాల్లో తుపాకులతో, కారు బాంబులతో, గ్రెనేడ్లతో, ఆత్మాహుతి దాడులతో నిత్యమూ వందలమందిని హతమారుస్తున్నవారు ఏ మతం పేరు చెప్పుకున్నా అది నిజం కాదు. మతాన్ని కాపాడుకోవడానికే తుపాకులను ఎక్కుపెట్టామని, హింసకు పాల్పడుతున్నామని అంటున్నవారు తామే ఆ మతానికి మొదటి శత్రువులమన్న సంగతిని మరుస్తున్నారు. అలాంటివారు మొత్తంగా మానవత్వానికీ, ఉదారవాద భావాలకూ, స్వేచ్ఛాసమానత్వాలకూ వ్యతిరేకులు.
ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రతినిధులపై దాడులు ఇటీవలికాలంలో పెరిగాయి. నిరుడు వివిధ దేశాల్లో 66మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతే, 119మంది కిడ్నాపయ్యారు. మరో 178మంది నిర్బంధంలో మగ్గుతున్నారు. సిరియా, పాలస్థీనా, ఉక్రెయిన్, ఈజిప్టు, మెక్సికోవంటి ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలియజెప్పాలన్న సంకల్పంతో పనిచేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ఇలా హింసకూ, దౌర్జన్యానికీ, వేధింపులకూ లోనవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంతోసహా చాలా దేశాల్లో మతం పేరుచెప్పి ఉన్మాదాన్ని పెంచిపోషిస్తున్న శక్తులు తయారవుతున్నాయి. విద్వేషాన్ని, అసహనాన్ని ప్రబోధిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరిగిన ఉదంతం వీటన్నిటికీ పరాకాష్ట. ఇలాంటి శక్తులపట్ల అప్రమత్తంగా లేకపోతే పారిస్‌లో జరిగిందే రేపన్నరోజు అన్నిచోట్లా పునరావృతమవుతుంది. ఒక వ్యంగ్య రేఖాచిత్రమో, మనసును సూటిగా తాకేలా చెప్పిన ఒక మాటో ప్రాణాలు తీసేంతటి కారణాలుగా కొందరికి కనబడటమంటే మళ్లీ మనం మధ్యయుగాలనాటి పరిస్థితుల్లోకి జారుకుంటున్నట్టే లెక్క. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న ఉదారవాద భావాలనూ, ప్రజాస్వామిక విలువలనూ ధ్వంసంచేయడానికి పూనుకుంటున్న ఇలాంటి శక్తులపై అప్రమత్తంగా ఉండటం...వారిని ఏకాకులను చేయటం ఈనాటి తక్షణావసరం. తమ చర్యలతో ఆ తరహా పోకడలకు పరోక్షంగా నారూ నీరూ పోస్తున్నవారిని సైతం నిలదీయగలగాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదం నామరూపాల్లేకుండా కొట్టుకుపోతుంది.