వైద్య సిబ్బంది భద్రత కోసం... | Sakshi Editorial On Attacks On Medical Personnel | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బంది భద్రత కోసం...

Published Fri, Apr 24 2020 12:04 AM | Last Updated on Fri, Apr 24 2020 12:04 AM

Sakshi Editorial On Attacks On Medical Personnel

వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడానికి వీలుకల్పించే ఆర్డినెన్స్‌పై గురువారం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దాడికి పాల్పడినవారికి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్ష, భారీ జరిమానా విధించడంతోపాటు ధ్వంసం చేసిన ఆస్తికి రెట్టింపు వసూలు చేయడానికి ఆర్డినెన్స్‌ వీలు కల్పిస్తోంది. 1897నాటి మహమ్మారి వ్యాధుల చట్టానికి సవరణలు తీసుకొస్తూ రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌కు బుధవారమే కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైద్యులపైనా, ఆ రంగంలో పనిచేసే ఇతర సిబ్బందిపైనా దాడులు జరగడం కొత్త కాకపోయినా, కరోనా మహ మ్మారి తీవ్రత పెరిగాక  దేశమంతటా ఆ దాడులు అధికమయ్యాయి. ఒకపక్క పదుల సంఖ్యలో మొదలైన కరోనా కేసులు క్రమేపీ వందల్లోకి పెరిగి, చూస్తుండగానే వేల సంఖ్యలోకి చేరుకున్నాయి.

మరోపక్క ఉన్న ఆసుపత్రులు చాలక ప్రభుత్వాలు పెద్దయెత్తున అదనపు ఏర్పాట్లు చేయాల్సివస్తోంది. ఇవిగాక ఆ రోగులతో సన్నిహితంగా మెలిగారని నిర్ధారించినవారి కోసం పర్యవేక్షణ కేంద్రాలు నెలకొల్పారు. అలాగే కరోనా రోగులుగా అనుమానం వచ్చినవారిని పరీక్షించి, తరలించేందుకు వివిధ ప్రాంతాలకు వైద్య బృందాలు వెళ్లాల్సివస్తోంది. ఇందుకోసం లక్షలాదిమంది సిబ్బంది రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. వారికి తగిన ఉపకరణాలు లేకున్నా సేవలందించడంలో వెనకాడటంలేదు. ఆ క్రమంలో వారిలో కొందరు వ్యాధిబారిన పడి మరణించారు. అయినా తమవారిని కాపాడలేకపోయారనో, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవనో వైద్యులపై, ఇతర సిబ్బందిపై దుండగులు దాడులు చేస్తున్నారు. పరీక్షించడానికొచ్చిన వైద్యుల్ని కర్రలతో, రాళ్లతో వెంటబడి తరిమిన ఉదంతాలు పలుచోట్ల జరిగాయి.

కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలం దిస్తున్నారన్న కారణంతో ఇల్లు ఖాళీ చేయమని యజమానులు వత్తిడి తెస్తున్నారు. ఇరుగుపొరుగున వుంటున్నవారు సైతం వారిని దూరం పెడుతున్నారు. చెన్నై నగరంలో ఇటీవల జరిగిన ఉదంతం వీటన్నిటినీ తలదన్నింది. ఆ నగరానికి చెందిన న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సైమన్‌ హెర్క్యులస్‌ ఒక రోగి ద్వారా కరోనా బారిన పడి కన్నుమూస్తే, ఆయన భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు వెళ్లిన బంధువులపై, సహోద్యోగులపై జనం దాడికి దిగారు. అలా ఖననం చేస్తే కరోనా వ్యాపిస్తుందన్న మూఢ విశ్వాసంతో స్మశానంలోనే దాడి చేశారు. మిగిలినవారిని పంపి, సైమన్‌ మృత దేహాన్ని అక్కడినుంచి వెనక్కి తీసుకొద్దామని ఆగిన వైద్యుడిపైనా, అంబులెన్స్‌ డ్రైవర్లపైనా కూడా దాడులు చేసి గాయపరిచారు. చివరకు రాత్రి 11 గంటలకు జనం కన్నుగప్పి ఒకరిద్దరి సాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు.

కరోనా సేవల్లో తలమునకలై పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, ఇతరులకు కరతాళ ధ్వనులతో జేజేలు పలుకుదామని ప్రధాని నరేంద్ర మోదీ గత నెల పిలుపునిచ్చినరోజున కోట్లాదిమంది తమ తమ ఇళ్ల వద్ద దాన్ని పాటించారు. కానీ వారిలో చాలామందికి ఆ పిలుపు వెనకున్న ఉద్దేశమేమిటో, ఈ క్లిష్ట సమయంలో తమ కర్తవ్యమేమిటో తెలియలేదు.
వైద్య వృత్తిని ఎంచుకుని, పనిచేయడానికి సిద్ధపడినప్పుడే అందులోని సాధకబాధకాలేమిటో అందరూ గ్రహిస్తారు. వారు నిత్యం రోగులతో వ్యవహరించవలసి వుంటుంది గనుక ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఇతరులకన్నా వారికి బాగా ఎక్కువ. ఆ విషయంలో వారు మానసికంగా సిద్ధపడే వుంటారు. అనుక్షణం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మూర్ఖత్వం మూర్తీభవించిన వారినుంచి ఆత్మరక్షణ చేసుకోవడం ఎలా? ఈ మాదిరి దాడులను నియంత్రించడానికి మన దేశంలో ఇంతక్రితం కూడా చట్టాలున్నాయి.

19 రాష్ట్రాలు ఎక్కడికక్కడ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చాయి. కానీ ఆచరణలో అవి అంతగా వినియోగపడలేదు. సీపీసీ లేదా సీఆర్‌పీసీలో తగిన నిబంధనలు పొందుపరచకపోతే ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలో తెలియని అయోమయంలో కిందిస్థాయి పోలీసులుంటారు. పైగా దాదాపు అన్ని రాష్ట్రాల చట్టాలూ పనిచేసే స్థలంలో జరిగే దాడులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వారి ఇళ్లవద్దనో, మరోచోటనో జరిగే దాడులు ఆ చట్టాల పరిధిలోకి రావు. కనుకనే కేంద్ర స్థాయిలో పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలని ఎన్నో ఏళ్లుగా వైద్యులు, వైద్య రంగ సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు నిరసన ప్రదర్శనలు జరగడం, విధులకు గైర్హాజరవడం మామూలే. ఆ తర్వాత ప్రభుత్వాలు వారిని బుజ్జగించి యధావిధిగా పనిచేయాలని కోరడం కూడా రివాజే.

కొన్ని సందర్భాల్లో దాడులు చేసినవారిని అరెస్టు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మరో ఘటన జరిగేవరకూ అంతా సవ్యంగా వున్నట్టే కనిపిస్తుంది. నిజానికి భౌతిక దాడులు జరిగినప్పుడే ఆ ఉదంతాలు వార్తల్లోకెక్కుతాయి. కానీ బెదిరించడం, దూషించడం, ఫర్నీ చర్‌ను, వైద్య ఉపకరణాలను ధ్వంసం చేయడం వంటివి చాలా తరచుగా జరుగుతుంటాయి. 75 శాతంమంది వైద్యులు విధుల్లో వున్నప్పుడు ఏదో రకమైన హింసను చవిచూస్తున్నారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) రెండేళ్లక్రితం వెల్లడించింది. 

ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో వుంటున్నారు గనుక వైద్యులకూ, ఇతర సిబ్బందికీ నిత్యం కత్తి మీద సాము. రోగి ఎంతటి ప్రమాదంలో వున్నాడో అర్థం చేసుకోలేని బంధువులు ఏం జరిగినా చికిత్సపరంగా లోపం చోటుచేసుకుని వుంటుందన్న అభిప్రాయం ఏర్పర్చుకుంటారు. ఆ భావో ద్వేగంలో దేనికైనా సిద్ధపడతారు. ఈ మాదిరి దాడులు ఇటీవలకాలంలో బాగా పెరిగిపోయాయి. చివరకు స్మశానాలకు కూడా ఇవి విస్తరించాయని చెన్నై ఉదంతం చెబుతోంది. వర్తమాన సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది సరిహద్దుల్లో శత్రువుతో పోరాడే సైన్యంతో సమానం. వారికి ఎలాంటి హాని జరగకుండా చూడటం, వారు నిర్భయంగా పనిచేసే వాతావరణం కల్పించడం అత్యవసరం. తాజా ఆర్డినెన్స్‌ అందుకు  దోహదపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement