భాషా పెత్తనం అనర్ధదాయకం | Sakshi Editorial On Hindi Imposition Row | Sakshi
Sakshi News home page

భాషా పెత్తనం అనర్ధదాయకం

Published Tue, Jun 4 2019 12:44 AM | Last Updated on Tue, Jun 4 2019 12:44 AM

Sakshi Editorial On Hindi Imposition Row

భిన్న భాషలుండటం, భిన్న మతాలు, సంస్కృతులు వర్థిల్లడం మన దేశ విశిష్టత. ఈ వైవిధ్యతను గర్వకారణంగా భావించేవారికీ... తమ భాషతో సమానంగా ఇతర భాషల్ని గౌరవించి, ప్రేమించే వారికీ కొదవలేదు. పరాయి భాషల పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడి వాటిని నేర్చుకోవడానికి ప్రయ త్నించేవారూ గణనీయంగా ఉంటారు. అయితే ఈ అమరికలో ఆధిపత్య భావన వచ్చి చేరినప్పుడే పొరపొచ్చాలు మొదలవుతాయి. ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్‌ డాక్టర్‌ కె. కస్తూరిరంగన్‌ ఆధ్వర్యంలోని 9మంది సభ్యుల కమిటీ రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదా దేశంలో మరోసారి హిందీ వ్యతిరేక ఆందోళనను రగిల్చింది. ఆ ముసా యిదా ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ మాతృభాషలో విద్యాబోధన ఉండాలని, ఆ వ్యవ ధిలో పిల్లలకు మూడు భాషల్ని పరిచయం చేయాలని సూచించింది. ఆరో తరగతి నుంచి ఆ మూడు భాషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేందుకు విద్యార్థికి అవకాశం ఉండాలని ముసాయిదా చెబుతోంది. దాని ప్రకారం హిందీ భాషా ప్రాంతాల్లోని పిల్లలు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో ఆధునిక భాషను నేర్చుకోవచ్చు. హిందీయేతర ప్రాంతాల్లో హిందీ, ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాష ఉంటుంది. సారాంశంలో హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకుతీరాలని నిర్దేశించింది. 484 పేజీల ఈ ముసాయిదాలో దాంతోపాటు అనేక కీలకమైన అంశాలున్నాయి. వాటన్నిటిపైనా కూలంకషమైన చర్చ కూడా జరగాల్సి ఉంది.

కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు... మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఈ ముసాయిదాపై వ్యతిరేకత పెల్లుబికింది. పశ్చిమ బెంగాల్‌లో సైతం హిందీని రుద్దేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఉద్యమం ప్రారంభించారు. ఇదంతా గమనించాక కేంద్ర ప్రభుత్వం మేల్కొంది. కస్తూరి రంగన్‌ కమిటీ ఇచ్చింది ముసాయిదా నివేదికే తప్ప విధానం కాదని, ఆ కమిటీ చేసిన సిఫార్సుల్ని ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా అమలు చేయబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌తోపాటు ఇతర మంత్రులంతా హామీ ఇచ్చారు. వాస్తవానికి ముసాయిదా రూపొందించే క్రమంలో కస్తూరి రంగన్‌ కమిటీ భిన్నరంగాలవారిని సంప్రదించింది. అవన్నీ పూర్తయ్యాక నిరుడు డిసెంబర్‌లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. హిందీ ఆధిపత్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకున్న అనుమానాలేమిటో, అభ్యంతరా లేమిటో గ్రహించడంలో కమిటీ విఫలమైంది. కనీసం కేంద్ర ప్రభుత్వమైనా ఈ అయిదు నెలల్లో ముసాయిదాను క్షుణ్ణంగా పరిశీలించి వివాదాస్పద అంశాలను గుర్తించాల్సింది. అది జరగకపోబట్టే నిరసనలు చెలరేగాయి. చివరకు ముసాయిదాలోని ఆ వివాదాస్పద క్లాజును సవరిస్తున్నట్టు సోమ వారం కేంద్రం ప్రకటించింది. హిందీ తప్పనిసరన్న నిబంధన స్థానంలో ఆరు లేదా ఏడో తరగతి లోకి ప్రవేశించే విద్యార్థులకే భాషను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తూ కొత్త నిబంధన తెచ్చారు. 

హిందీ భాషాధిపత్యంపై దక్షిణాది రాష్ట్రాల్లో అనుమానాలు ఈనాటివి కాదు. 1937నాటికే తమిళ భాషా ప్రాంతాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. ఆ సమయంలోనే విశిష్ట తెలుగు కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ భాషా పెత్తనాన్ని ప్రశ్నించారు. స్వాతంత్రోద్య మంలో పనిచేస్తున్నవారు హిందీ విషయంలో మహాత్మా గాంధీనుంచి, కాంగ్రెస్‌ నుంచి తగిన హామీ పొందాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చాక హిందీ భాషను దక్షిణాదిపై బలవంతంగా రుద్దుతారన్న అనుమానాలు ఆ స్థాయిలో ఉండేవి. స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించాక వచ్చిన ప్రభుత్వాలు ఆ అనుమానాలను నివృత్తి చేయకపోగా  వాటిని పెంచుతున్నాయి. 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం హిందీ వినిమయాన్ని పెంచడానికంటూ మెట్రిక్, ఆ పై స్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదన పెట్టింది. అందరూ నిరసించడంతో వెనక్కి తగ్గింది. ఇంకా వెనక్కు వెళ్తే 1960 ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తమిళనాడులో ఉద్యమాలు చెలరేగాయి. భాషను ఇష్టంగా నేర్చుకున్నప్పుడే అందులోని మెలకువలు పట్టుబడతాయి. ఏ భాష అయినా సహజ పద్ధతుల్లో వికసించాలి. చలనచిత్రాలు, చానెళ్లలో వచ్చే సీరియల్స్‌వంటివి ఆ పని కొంతవరకూ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలే భాష విషయంలో చాలా వెనకబడి ఉంటున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులు మాతృ భాషల్లో ఉంటున్నా అవి ఓ పట్టాన అర్ధంకాని స్థితి ఉంది. కేంద్రం జారీచేసే ఉత్తర్వుల్లో వాడే హిందీ జటిలంగా, కృత్రిమంగా ఉంటున్నదని హిందీ మాతృభాషగా ఉన్నవారు సైతం చెబుతుంటారు. భాషపట్ల అంత ప్రేముంటే జనం భాషకూ, అధికార లావాదేవీల్లో వాడే భాషకూ మధ్య ఉండే ఈ వైరుధ్యాన్ని ముందు సరిచేసుకోవాలి. ఏదేమైనా హిందీ భాష తప్పనిసరి చేయాలన్న ముసాయిదా లోని పాత నిబంధనను సవరించడం హర్షణీయం. 

ఇప్పుడున్న 10+2+3  విద్యా వ్యవస్థ స్థానంలో 5+3+3+4 వ్యవస్థను తీసుకురావాలని కమిటీ సూచించింది. మొదటి అయిదేళ్లనూ ‘పునాది దశ’గా పరిగణిస్తారు. ఇందులో మూడేళ్ల ప్రీ–ప్రైమరీ విద్య, ఒకటి, రెండు తరగతులు ఉంటాయి. ఆ తర్వాత ‘సన్నాహక దశ’(3,4,5 తరగతులు), అనం తరం ‘మధ్యస్త దశ’(6,7,8 తరగతులు), చివరిగా ‘సెకండరీ దశ’(9,10,11,12 తరగతులు) ఉంటాయి. అనంతరం నాలుగేళ్ల గ్రాడ్యుయేట్‌ ఆనర్స్‌ కోర్సులుంటాయి. రెండేళ్ల తర్వాత డిప్లొమో, మూడేళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి విద్యార్థి నిష్క్రమించవచ్చు. కొత్త విధానంలో ఇంటర్మీడి యెట్‌ విద్య కనుమరుగవుతుంది. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు కూడా కొత్త విద్యావ్యవస్థ పరిధి లోకొస్తాయి. విద్యాసంస్థల్లో ఇప్పుడున్న మధ్యాహ్నభోజనంతోపాటు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం ఉండాలన్న ప్రతిపాదన ఉంది. వీటన్నిటిపైనా కూలంకషంగా చర్చ జరిగి, సమకాలీన అవసరాలకు అనుగుణమైన, పటిష్టమైన విద్యా వ్యవస్థ అమల్లోకి రావాలని ఆశించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement