సింగపూర్ టైగర్!
నిత్యం ఘర్షణలతో అట్టుడికే... మరణమృదంగం మార్మోగే... దారిద్య్రం తాండవించే ప్రాంతాన్ని సిరులు పండే సీమగా తీర్చిదిద్దడం అసాధారణం. బ్రిటన్ వలసాధిపత్యాన్నీ, జపాన్ దురాక్రమణనూ, మలేసియా పెత్తందారీ పోకడలనూ చవిచూసి... కుంగి కృశించి ఉన్న చిన్న దీవిని అచిరకాలంలోనే ప్రపంచ పటంలో శిఖరాగ్రాన నిలబెట్టడం అనితరసాధ్యం. అసాధారణమైన, అనితరసాధ్యమైన ఈ అద్భుతాన్ని సాకారంచేసి ప్రపంచ పౌరులను అబ్బురపరిచినవాడు సోమవారం కన్నుమూసిన లీ క్వాన్ యూ. అధునాతన సింగపూర్ సృష్టికర్తగా మన్ననలందుకున్న లీ ఆ దేశ వ్యవస్థాపక ప్రధాని. పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ)ని స్థాపించి 1959లో ప్రధాని పదవి చేపట్టిన నాటినుంచి 1990లో దాన్నుంచి వైదొలగే వరకూ దేశ నిర్మాణంలో ఆయన పాత్ర సాటిలేనిది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సేనలకు చిక్కినప్పుడు బట్టలు మార్చుకొస్తానని నమ్మించి ఉడాయించిన లీ ఆ తర్వాత కాలంలో పలు దేశాధినేతలకే కాదు...ఒకప్పుడు తమనేలిన బ్రిటన్‌కు సైతం పాలనా వ్యవహారాల్లో పాఠాలు చెప్పాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. లీ చేజారాక జపాన్ సైన్యాధికారులు ఎంత కలతచెందారంటే... ఆయన మాట నమ్మి విడుదల చేసిన సైనిక బృందం మొత్తాన్ని కాల్చిచంపేశారు. బహుశా లీ శక్తిసామర్థ్యాలను జపాన్ అప్పటికే గుర్తించి ఉండాలి.
కావడానికి సింగపూర్ ఒక చిన్న రేవు పట్టణం. తాగడానికి నీళ్లు కూడా పుట్టని ప్రాంతం. రెండో ప్రపంచయుద్ధ సమయానికి బ్రిటన్ ఆధిపత్యంలో ఉండి, కొన్నాళ్లు జపాన్ సేనల అధీనంలోకెళ్లినందువల్ల అది ప్రత్యర్థి పక్షాల రణరంగస్థలి అయింది. ఆ గడ్డపై బాంబుల వర్షం కురిసింది. జనం చెట్టుకొకరు... పుట్టకొకరయ్యారు. అలాంటిచోట 1955లో బ్రిటన్ పరిమిత స్వయంపాలనకు అంగీకరించింది. 1963లో మలేసియా సమాఖ్యలో సింగపూర్ భాగమైంది. ఇదంతా సవ్యంగా కొనసాగి ఉంటే ప్రపంచానికి లీ గొప్పతనం తెలిసేది కాదు. కానీ మలేసియా పాలనలోని పెత్తందారీ పోకడలు ఆ సమాఖ్య భావనకు తూట్లుపొడిచాయి. జాతి ఘర్షణలకు ఆజ్యం పోశాయి. మలయా తెగ పౌరులను హతమార్చడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు మలేసియాకు ఆగ్రహం కలిగించాయి.
పర్యవసానంగా సమాఖ్యనుంచి సింగపూర్‌ను వెలేశారు. ఈ నిర్ణయం లీ ని దిగ్భ్రమపరిచింది. నేలా, నీరూ, సహజవనరులూ... అన్నీ పరిమితంకాగా, వాటిని పంచుకోవాల్సిన జనం గణనీయంగానే ఉన్నారు. చేతినిండా పని దొరకడం, అది జీవనం కొనసాగించడానికి సరిపోవడం కలలోని మాట. ఇలాంటి పరిస్థితుల్లో ఎటు అడుగులేయాలో లీ తేల్చుకోవాల్సివచ్చింది. అప్పటికే తనపై బలంగా ముద్రవేసిన సామ్యవాద భావజాలాన్ని, పాశ్చాత్య దేశాల్లో అమలవుతున్న పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యాన్ని కాదనుకుని తనదైన మధ్యేవాద మార్గంలో పయనించాలని ఆయన భావించాడు. ఆ సమయానికి అమెరికా, సోవియెట్ యూనియన్‌లమధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధ ప్రభావంతో ఎన్నో దేశాలు మౌనంగా రోదిస్తున్నాయి. కనుకనే ఈ రెండు కూటములకూ ఆమడ దూరాన ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. పాశ్చాత్య దేశాల బహుళ జాతి సంస్థలను రెండుచేతలా ఆహ్వానిస్తూనే...స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ బలపడేలా చేస్తూనే వాటితోపాటు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య భావన వంటివి దిగుమతి కాకుండా లీ జాగ్రత్తపడ్డారు. ‘మెతక నిరంకుశత్వాన్ని’ అమలు చేసి, తమ పార్టీ పాలనే కొనసాగేలా ఏర్పాట్లు చేసుకుని దాన్నే ప్రజాస్వామ్యంగా భావించమన్నాడు. మరో రెండు దశాబ్దాలకు చైనా నాయకుడు డెంగ్ జియావో పెంగ్ ఆయన సలహాతో దాన్నే తమ దేశంలో అమలు చేయబోగా తియనాన్మెన్ స్క్వేర్‌లో తిరుగుబాటుగా సాక్షాత్కరించింది.
కనుక లీ విధానాలను మక్కికి మక్కీ అమలు పరచడం అంత సులభమేమీ కాదు. ఒక ప్రసంగంలో లీ స్వయంగా చెప్పినట్టు... అరుదైన సందర్భాల్లో అప్పటి పరిస్థితులు, ఆనాడున్న ప్రజలూ కలిస్తే ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఆనాటి సింగపూర్‌ను ఇప్పుడప్పగిస్తే దాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దడం తనవల్ల కాదేమోననిపిస్తున్నదన్న లీ వ్యాఖ్యానంలో వాస్తవం ఉండొచ్చు. గత నలభై ఏళ్లుగా సింగపూర్ స్థూల దేశీయోత్పత్తి ఏడాదికి 6.8 శాతం చొప్పున పెరుగుతున్నది. ఇంచుమించు ఇదే కాలంలో దాని తలసరి జీడీపీ 50 రెట్లు పెరిగింది. మానవాభివృద్ధిలో దాని స్థానం 9. పట్టణీకరణ మురికివాడలనూ, మురికిని పెంచుతుందన్న అభిప్రాయాన్ని తలకిందులు చేసి పరిశుభ్రమైన నగరాన్ని, 80 శాతం జనాభాకు కనీస సదుపాయాలుండే ఆవాసాన్ని సుసాధ్యంచేసిన దేశమది. ప్రైవేటు ఉద్యోగాలవైపు చూడనీయనంతగా ప్రభుత్వమే భారీ మొత్తంలో జీతాలు చెల్లించడం, నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించడం, అవినీతిని దరిచేరనీయక పోవడం దాని విశిష్టత. అదే సమయంలో వ్యక్తి స్వేచ్ఛకు పగ్గాలేయడం, నిరంతర నిఘాలో ఉంచడం ఆ దేశం అమలుచేసే ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగం.
స్వయంగా ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ నోరు తెరిచి అడిగినా బెత్తం దెబ్బల శిక్ష పడిన అమెరికా పౌరుణ్ణి క్షమించకపోవడం, ఆస్ట్రేలియా ప్రధాని విజ్ఞప్తిచేసినా ఆ దేశ పౌరుణ్ణి మాదకద్రవ్యాల కేసులో ఉరితీయడం సింగపూర్‌కు మాత్రమే సాధ్యం. భౌగోళికంగా అతి చిన్న ప్రాంతం కావడం, మన హైదరాబాద్ జనాభాలో సగం కూడా లేకపోవడం వల్లే సింగపూర్‌ను అంత ఘనంగా తీర్చిదిద్దడం కుదిరిందనే వారున్నారు. అయినా సింగపూర్‌కూ సమస్యలు లేకపోలేదు. వృద్ధుల జనాభా పెరుగుతున్న దేశంగా, వలసొచ్చేవారి కాయకష్టంతో మాత్రమే వృద్ధిచెందే దేశంగా సింగపూర్ ఎన్నాళ్లు మనుగడ సాధిస్తుందని ప్రశ్నించేవారున్నారు. అయితే, అన్నిటా సింగపూర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన లీ క్వాన్ యూ వ్యక్తిత్వం, ఆయన విధానాలు ఎప్పటికీ చర్చకొస్తూనే ఉంటాయి. మరింత మెరుగైన విధానాల అన్వేషణకు అవి ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంటాయి.