ఈస్టర్ పర్వదినం రోజున నెత్తురోడిన శ్రీలంక వారం రోజులు గడిచినా ఇంకా తెరిపిన పడలేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. శనివారం ఒక పట్టణంలో సోదాలు జరుపుతుండగా భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు ఆత్మాహుతి దాడికి పాల్పడటం, మరో 15మంది మరణించడం చూస్తే ఆ దేశంలో ఉగ్రవాదం ఎంత లోతుగా వేళ్లూనుకున్నదో అర్ధమవుతుంది. సుదీర్ఘకాలం విధ్వంసాలు, ఊచకోతలు చవిచూసిన దేశంలో భద్రతా బలగాల, నిఘా సంస్థల కన్నుగప్పి ఉగ్రవాద సంస్థలు భారీయెత్తున బాంబులు, మారణాయుధాలు పోగేసు కోవడం... స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఊహకందనిది. వరసగా 26 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా లంకలో సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమిళ టైగర్లు సాగించిన ఆత్మాహుతి దాడులు, కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని సాగించిన మారణకాండ ఆ దేశాన్ని ఊపిరాడనీయకుండా చేశాయి. అదంతా పదేళ్లక్రితం మాట. ఆ దాడులకు కారణమైన తమిళ టైగర్ల సంస్థ ఎల్‌టీటీఈ అక్కడే పుట్టి పెరిగి విస్తరించింది. సింహళ జాతీయతను రెచ్చగొట్టి, మైనారిటీలుగా ఉన్న తమిళ సంతతి ప్రజలపై వివక్ష అమలు చేయడంతో రేగిన అసంతృప్తి క్రమేపీ ఉద్యమ రూపం ధరించి స్వయంపాలన అడిగేవరకూ వెళ్లింది. తమిళ ఉద్యమ సంస్థలు లేవనెత్తిన అంశాలను చక్కదిద్దేం దుకు శ్రీలంకలోని ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ పెట్టని కారణంగా అది సాయుధ పోరాటాన్ని విశ్వసించే ఎల్‌టీటీఈ తదితర సంస్థల ఆవిర్భావానికి దోహదపడింది. కానీ ఇప్పుడు ఉగ్రవాద ఉదంతాల మూలాలు వేరు. మతపరమైన విశ్వాసాలు కాస్తా విద్వేషంగా రూపుదిద్దుకోవడం, ఆ విద్వేషం అంతిమంగా ఉన్మత్త స్థితికి చేరడం తాజా దాడుల్లో కనబడుతుంది. లంక దాడులకు పాల్పడిన ముఠాలకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొందరు తోడ్పాటును అందించారని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. పేలుళ్ల సూత్రధారి కోయంబత్తూర్ వచ్చివెళ్లారని ఆ కథనాలు అంటున్నాయి. ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ దాడులు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి నగరంలో ఒక మసీదుపై దాడిచేసి 50మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతానికి ప్రతీకారమనడం ఒక సాకు మాత్రమే. కొన్నేళ్లుగా విధ్వంసానికి పథక రచన చేయకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. న్యూజిలాండ్ దాడికి, శ్రీలంక దాడులకు మధ్య నిండా నెలరోజుల వ్యత్యాసం కూడా లేదు. ఇంత తక్కువ వ్యవధిలో అవసరమైన మను షుల్ని పోగేసుకొని వారికి ఉన్మాదాన్ని నూరిపోయడం, బాంబులు, ఇతర మారణాయుధాలు అవ సరమైనచోట్లకు తరలించడం వీలుకాదు. శ్రీలంకకు భారీయెత్తున పర్యాటకులు వస్తుండటం, అందులో పాశ్చాత్య దేశాలకు చెందినవారు గణనీయంగా ఉండటం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, నిఘా సంస్థలు ఏమరుపాటుగా ఉండటం వంటివన్నీ క్షుణ్ణంగా గమనించిన తర్వాతే ఉగ్రవాదులు ఆ దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారని, దాడులకు అదును కోసం ఎదురుచూశారని మొత్తం ఘటనల క్రమం చూస్తే అర్ధమవుతుంది. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు రద్దు చేయడం, భద్రతా బలగాల కదలికలు తగ్గడం వగైరాలను ఉగ్రవాదులు కొన్నేళ్లుగా గమనించబట్టే ఈ స్థాయిలో హింసకు పాల్పడ్డారు. ఇది శ్రీలంకకు మాత్రమే కాదు... అన్ని దేశాలకూ గుణపాఠమే. వేరే ఎక్కడో దాడులు జరిగాయి గానీ అటువంటివి ఇక్కడ సాధ్యం కాదని అనుకోవడానికి వీల్లేదని లంకకు ఎదు రైన చేదు అనుభవాలు చెబుతున్నాయి. లంకలో ఎంత ఘర్షణాత్మక వాతావరణమున్నా ముస్లింలు, క్రైస్తవుల మధ్య ఎప్పుడూ పొరపొచ్చాలు రాలేదు. వాస్తవానికి దాడులకు సూత్రధారిగా భావిస్తున్న ఎన్‌టీజే చీఫ్ జహ్రన్ హషీమ్ విద్వేష ప్రసంగాలతో అందరినీ రెచ్చగొడుతున్నాడని నాలుగేళ్లక్రితం ఒకసారి, ఏడాదిక్రితం మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్లిప్తత ఈ స్థాయిలో పెరిగాక ఉగ్రవాదులు దాడులకు దిగడంలో వింతేముంది?
ఉగ్రవాదులు తక్షణ లక్ష్యాలు ఆశించి పనిచేయరు. వారిది దీర్ఘకాలిక ప్రణాళిక. తమ దాడుల పర్యవసానాలు మరణాలతో, విధ్వంసంతో ఆగిపోవడం కాదు వారికి కావలసింది. అవి సమా జంలో శాశ్వతంగా విద్వేషాగ్నులు రగల్చాలి. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలి. మను షులు పరస్పరం కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని ధ్వంసం చేయాలి. ఒకరిపై ఒకరికి అనుమా నాలు కలిగించాలి. ఈ పన్నాగాలను సరిగా అర్ధం చేసుకోలేకపోతే ఉగ్రవాదాన్ని అంతం చేయడం అంత సులభం కాదు. లంక దాడుల తర్వాత కొలంబో ఆర్చిబిషప్ మాల్కమ్ రంజిత్ ఈ విషయం లోనే అప్రమత్తంగా ఉండాలని అందరినీ హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా తాము నమ్ముతున్నా మని చెప్పే మతాన్ని ఉగ్రవాదులు ఎలా చిత్రీకరించదల్చుకున్నారో, దానిపై ఎలాంటి అభిప్రా యాన్ని కలగజేయాలనుకున్నారో అందరూ గ్రహించాలని ఆయన కోరారు. సమాజంలో అందరూ వృధా ఘర్షణలకు దిగాలన్నదే వారి ఆంతర్యమని హెచ్చరించారు. అందరం సమష్టిగా వ్యవహ రించి ఉగ్రవాదుల ఆటల్ని సాగనీయకుండా చూద్దామని పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తూ లంకలో కొన్నిచోట్ల ముస్లింలపై కొందరు అకారణంగా దాడులకు దిగారు. శరణార్థులను తరిమి కొట్టారు. ఇటువంటివి పరోక్షంగా ఉగ్రవాదులకే తోడ్పడతాయి. క్రైస్ట్ చర్చి దాడి అనంతరం ‘మనం ఉన్మాదానికి బలైనవారి పేర్లు తల్చుకుందాం. వారిని బలితీసుకున్న ఉన్మాది పేరు ఉచ్చరించొద్దు. ఆ ఉన్మాదికి పేరుతో సహా ఏమీ మిగలకుండా చేద్దామ’ని న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ అన్న మాటలు గమనించదగ్గవి. ఉగ్రవాదం ఒక మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. దానికి నిర్దిష్టమైన రూపం ఉండదు. సమాజం మొత్తం ఏకమై అవిశ్రాంతంగా పోరాడితే తప్ప అది సుల భంగా అంతరించదు. లంక దాడుల నుంచి గ్రహించాల్సింది ఇదే.
కోలుకోని లంక
Published Tue, Apr 30 2019 12:46 AM | Last Updated on Tue, Apr 30 2019 12:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment