మాంచెస్టర్‌పై పంజా
ఇటీవల కాస్త సద్దుమణిగినట్టు కనిపించిన ఉగ్రవాద సర్పం మళ్లీ కాటేసింది. అనేక భారీ పరిశ్రమలున్న బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి పాప్ స్టార్ అరియానా గ్రాండే నేతృత్వంలో నిర్వహించిన ఒక సంగీత విభావరి కార్యక్రమంపై ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 22మందిని బలి తీసుకున్నాడు. ఈ దాడిలో మరో 59మంది గాయాలపాలయ్యారు. దాడి జరిగిన మాంచెస్టర్ ఎరీనా హాలు యూరప్‌లోనే అతి పెద్దది.
ఈ కార్యక్రమానికొచ్చినవారిలో అత్యధికులు యువత, పిల్లలే. తాము దాడి చేయదల్చుకుంటే ఎవరూ ఆపలేరని... ప్రపంచంలో ఎక్క డైనా, ఎప్పుడైనా భారీయెత్తున ప్రాణనష్టం కలిగించగల సత్తా తమకున్నదని ఉగ్ర వాదులు నిరూపించారు. ఫ్రాన్స్‌లో రెండేళ్లక్రితం ఒక సాకర్ పోటీ సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడి 128మంది ప్రాణాలు తీశారు. ఆ ఏడాదే చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడిచేసి 15మందిని కాల్చిచంపారు. 2004లో స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో రైళ్లలో బాంబులు పేల్చి 200మంది ఉసురుతీశారు.
భద్రతలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా కోలుకోలేని స్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని తాజా ఉదంతం మరోసారి హెచ్చరిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెళ్లగిస్తామని, అందుకు అవిశ్రాంతంగా పోరాడతామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణ మాత్రం సంతృప్తికరంగా లేదని మాంచెస్టర్ ఉదంతం నిరూపిస్తోంది. భారీ సంఖ్యలో జనం హాజరయ్యేచోట, కిక్కిరిసి ఉండే వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం, అందరిపైనా కన్నేసి ఉంచడం కష్టమే కావొచ్చుగానీ గరిష్టంగా భద్రతా ఏర్పాట్లు, పటిష్టమైన నిఘా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి.
ఇది తమ ఘన కార్యమేనంటూ ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సాధారణ అర్ధంలో ఒక సంస్థ కాదు. దానికొక స్వరూపమంటూ లేదు. నాయకుడని ప్రకటిం చుకున్న వ్యక్తి ఉండొచ్చు. తమదొక రాజ్యమని చెప్పుకోవచ్చు. ఇరాక్–సిరియా సరిహద్దుల్లో అరాచకం రాజ్యమేలుతున్నచోట వారికంటూ కొంత ప్రాంతం కూడా ఉండొ ఉండొచ్చు. కానీ నేతలు, శ్రేణుల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమనే విధానమేదీ కనబడదు. అయినా అత్యంత సులభంగా యూరప్‌లో ఏదో ఒక దేశంలో ఎప్పుడో ఒకప్పుడు దాడి చేయగలుగుతున్నారంటే అది భద్రతా సంస్థల వైఫల్యం ఫలితమే.
సాంకేతిక విజ్ఞానం పెరిగి సామాజిక మాధ్యమాలు విస్తరించినచోట ఏ భావ జాలమైనా వేగంగా చొచ్చుకుపోవడం వింతేమీ కాదు. ఆ మాధ్యమాలను ఆలంబన చేసుకునే ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ విధ్వంసక చర్యలు కొనసాగి స్తున్నాయి. యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, అనేక ఇతర మాధ్యమాల్లో జిహాదీల ప్రసంగాలకు కొదవలేదు. ఉగ్రవాదులు ఉన్మాదంతో రెచ్చిపోయి తోటి మనుషులపై అత్యంత క్రూరంగా దాడులు చేసిన వీడియోలు కూడా ప్రచారంలో ఉంటున్నాయి.
ఇలాంటివన్నీ వ్యక్తులుగా చీలిపోయిన సమాజాల్లో సులభంగా విషబీజాలు నాటుతున్నాయి. స్వీయ సమస్యలతో సతమతమయ్యే యువతలో అర్ధంలేని ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. తమ అసంతృప్తి దేనికో, ఆగ్రహం ఎవరిపైనో తెలియకుండానే ప్రతీకార వాంఛను రగిలిస్తున్నాయి. ఒకే ఇంట్లో నివసిస్తున్నవారి మధ్య అంతులేని అగాధం ఉంటుంటే ఇక ఇరుగు పొరుగు సంబంధాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇలాంటిచోట ఒక సెల్‌ఫోను లేదా ల్యాప్‌టాప్ ఉగ్రవాదానికి వాహికలవుతున్నాయి. ఉగ్రవాదంపై పోరు పేరిట దారీ తెన్నూలేని చర్యల పరంపరకు తెరలేపిన అమెరికాను దీనంతటికీ తప్పుబట్టాలి.
2001 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని జంట హర్మ్యాలపై అల్‌కాయిదా ఉగ్ర వాదులు దాడి జరిపాక ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ బ్రిటన్‌తో కలిసి అప్ఘానిస్తాన్‌లో దాడులు ప్రారంభించారు. అంతేకాదు... దానితో ఏమాత్రం సంబంధం లేని ఇరాక్‌పై రసాయన ఆయుధాలున్నాయనే సాకుతో యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం లక్షలాదిమంది ప్రాణాలు తీసింది. మరిన్ని లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. సోమాలియా, లిబియా, యెమెన్ లాంటి దేశాల్లో మూలమూలనా ద్రోన్ దాడులు జరిపారు. జరుపుతూనే ఉన్నారు. వాటిల్లో ఉగ్ర వాదులు పదుల సంఖ్యలో మరణిస్తే, అమాయక పౌరులు వందలాదిమంది చనిపోయారు.
మాంచెస్టర్ దాడి తర్వాత నగరవాసులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి మెచ్చ దగ్గది. ఈ ఘటన తర్వాత రైల్వే స్టేషన్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించడం, దుకా ణాలు సైతం మూతబడటంతో రాత్రి వేళ గమ్యస్థానాలకు ఎలా చేరాలో తెలియక వేలాదిమంది సతమతమయ్యారు. ఆ సమయంలో తమ నివాసాల్లో తలదాచు కోవచ్చునని కొందరు... తమ ఇంటికి వస్తే కాఫీ, టీ, ఇతర పానీయాలు, ఆహారం వగైరాలున్నాయంటూ మరికొందరు ట్వీట్‌లిచ్చారు. మీరున్న చోటునుంచి అయిదు నిమిషాల్లో రావొచ్చునని తోవ చూపారు.
ఆఖరికి క్యాబ్ డ్రైవర్లు సైతం ఉచితంగా తమ వాహనాల్లో ఎవరి ఇళ్లకు వారిని చేరుస్తామని భరోసా ఇస్తూ టెలిఫోన్ నంబర్లు ఇచ్చారు. దీన్నంతటినీ గమనించాక ఒక హోటల్ యాజమాన్యం సైతం ఘటనలో తల్లిదండ్రులనుంచి తప్పిపోయిన పిల్లలకు ఆశ్రయం కల్పించింది. తమ చర్యల ద్వారా సమాజంలో పరస్పర అపనమ్మకాలనూ, విద్వేషాలనూ రగల్చడం ఉగ్రవా దుల ధ్యేయం. ప్రభుత్వాధినేతలు సైతం ఇలాంటి సందర్భాల్లో సంయమనం కోల్పోయి ప్రకటనలు చేయడం ద్వారా వారి ధ్యేయాన్ని నెరవేరుస్తున్నారు.
కానీ సామాన్య పౌరులు ఎంతో పరిణతి ప్రదర్శించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని వమ్ము చేయడం ఉపశమనం కలిగిస్తుంది. మాంచెస్టర్ పౌరులు తెరిచి ఉంచింది తమ ఇళ్ల తలుపుల్ని కాదు... తమ విశాల హృదయాలనూ, మనసులనూ! ఇంతటి ఔదా ర్యంతో ప్రపంచ పౌరులకు మార్గ నిర్దేశం చేసి, సంక్షోభ సమయాల్లో ఎలా మెల గాలో, సౌహార్దాన్ని ఎలా పంచాలో తెలియజెప్పినందుకు మాంచెస్టర్ పౌరులను ప్రశంసించాలి. తాజా ఉగ్రవాద దాడి మన అలక్ష్యాన్ని అంతమొందిస్తుందని, మన అప్రమత్తతను మరింతగా పెంచుతుందని ఆశిద్దాం.