మారణహోమం | ISIS terrorist attack in manchester | Sakshi
Sakshi News home page

మారణహోమం

Published Wed, May 24 2017 1:51 AM | Last Updated on Tue, Oct 9 2018 5:31 PM

మారణహోమం - Sakshi

మారణహోమం

మాంచెస్టర్‌లోని మ్యూజిక్‌ కన్సర్ట్‌పై ఆత్మాహుతి దాడి
22 మంది మృత్యువాత, 59 మందికి తీవ్ర గాయాలు
దుండగుడు సల్మాన్‌ అబేదీగా గుర్తింపు
మాదే బాధ్యత అని ప్రకటించుకున్న ఐసిస్‌
మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిక
ఇది వికృతమైన ఉగ్ర దాడి: థెరిసామే
ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన బ్రిటన్‌ పోలీసులు
మనవాళ్లు క్షేమం.. ‘హెల్ప్‌ లైన్లు’ ఏర్పాటు
దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు


జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్‌ కన్సర్ట్‌.. యువతీయువకుల కేరింతలు, పాప్‌ స్టార్‌ అరియానా గ్రాండేతో కలసి చిన్నారుల స్టెప్పులు.. మ్యూజిక్‌ కన్సర్ట్‌ ముగుస్తుందనగా ఒక్కసారిగా భారీ పేలుడు.. రక్తపుమడుగులో మృతదేహాలు.. ప్రాణభయంతో జనం పరుగులు.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినప్పటి దృశ్యాలివీ.

మ్యూజిక్‌ కన్సర్ట్‌పై ఆత్మాహుతి దాడి
మాంచెస్టర్‌/లండన్‌: జోరుగా.. హుషారుగా సాగిన మ్యూజిక్‌ కన్సర్ట్‌.. యువతీయువకుల కేరింతలు, తుళ్లింతలతో హంగామా.. పాప్‌ స్టార్‌ అరియానా గ్రాండేతో కలసి చిందులేసిన చిన్నారులు.. మ్యూజిక్‌ కన్సర్ట్‌ మరికాసేపట్లో ముగుస్తుందనగా అలజడి.. ఒక్కసారిగా భారీ తీవ్రతతో పేలుడు.. రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలు.. తీవ్ర గాయాలతో నెత్తురోడిన క్షతగాత్రులు.. ప్రాణ భయంతో జనం పరుగులు.. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినప్పటి దృశ్యాలివీ.

బ్రిటన్‌లోని పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌ నెత్తురోడింది. యూరోప్‌లోనే అతిపెద్ద ఇండోర్‌ ఎరీనా అయిన మాంచెస్టర్‌ ఎరీనాలో పాప్‌ స్టార్‌ అరియానా గ్రాండే మ్యూజిక్‌ కన్సర్ట్‌ సందర్భంగా ఒక దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 22 మంది యువతీయువకులు, చిన్నారులు మృత్యువాత పడగా.. మరో 59 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకే దుండగుడు భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను తీసుకుని కన్సర్ట్‌ జరుగుతున్న మాంచెస్టర్‌ ఎరీనా వెలుపలకు వచ్చి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. 2005లో లండన్‌వరుస బాంబు దాడుల తర్వాత బ్రిటన్‌లో జరిగిన అతి ఘోరమైన ఉగ్ర దాడి ఇదే.



మేమే దాడి చేశాం: ఐసిస్‌
ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) ప్రకటించింది. ఇకపై ఇలాంటి మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ‘‘నిబద్ధత కలి గిన ఒక సైనికుడొకరు జన సమూహం ఉన్న చోట బాంబులు పెట్టాడు’’అంటూ తమ సోష ల్‌ మీడియా సైట్లలో పోస్ట్‌ చేసింది. కాగా ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని లిబియా సంతతికి చెందిన బ్రిటన్‌ పౌరుడు సల్మాన్‌ అబేదిగా గుర్తించారు. గడాఫీ నియంత పాలన నుంచి తప్పించుకునేందుకు అబేది కుటుంబం బ్రిట న్‌కు వలసవచ్చింది. ఉగ్రదాడి కోసం అబేది లండన్‌ నుంచి మాంచెస్టర్‌కు రైల్లోకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మాంచెస్టర్‌లోని అబేది ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

వేగంగా కేసు దర్యాప్తు..
దాడికి సంబంధించి దర్యాప్తును వేగంగా నిర్వహిస్తున్నామని, ఉగ్రవాద కోణంలోనూ ముందుకువెళుతున్నామని, దాడికి ఒక్కరే పాల్పడ్డాడా లేక.. దీని వెనుక ఏదైనా నెట్‌వర్క్‌ ఉందా అనే దానిపై దృష్టిసారించామని గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఘటనాస్థలంలోనే మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా, సౌత్‌ మాంచెస్టర్‌లోని కార్ల్‌టన్‌లో ఈ దాడితో సంబంధం ఉందని భావిస్తున్న 23 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాంచెస్టర్‌ ఎరీనా అంతా పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. సాధారణ ప్రజలను ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలను కూడా రంగంలోకి దించారు.

పాశవికమైన ఉగ్రవాద చర్య: బ్రిటన్‌ ప్రధాని
మాంచెస్టర్‌ ఉగ్ర దాడిని బ్రిటన్‌ ప్రధాని థెరిసామే తీవ్రంగా ఖండించారు. అత్యంత పాశవికమైన ఉగ్రవాద చర్యగా దీనిని అభివర్ణించారు. దాడి తర్వాత అత్యవసరంగా కోబ్రా(కేబినెట్‌ ఆఫీస్‌ బ్రీఫింగ్‌ రూమ్స్‌) సమావేశంలో ఆమె పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. ఒకే ఉగ్రవాది ఇంట్లో చేసిన అత్యంత శక్తివంతమైన బాంబుతో దాడికి పాల్పడినట్టు ఆమె వెల్లడించారు. కన్సర్ట్‌ ముగిసే సమయం కా>వడంతో జనం అప్పడే బయటకు వస్తున్నారని, ఆ సమయంలో దాడికి పాల్పడటంతో ఎక్కువ మంది గాయపడ్డారని వివరించారు. బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజిబెత్‌ 2 ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాంచెస్టర్‌ దాడిని తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఉగ్ర దాడి నేపథ్యంలో బ్రిటన్‌ సాధారణ ఎన్నికల ప్రచారానికి బ్రేక్‌ పడింది. ప్రధాని థెరిసామే, లేబర్‌ పార్టీ నాయకుడు జెర్మీ కార్బైన్‌ ఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.

భారతీయులంతా క్షేమం: కేంద్రం
మాంచెస్టర్‌ ఉగ్ర దాడిలో భారతీయులెవరూ మరణించలేదని, గాయపడలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ భారతీయులకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఉగ్రదాడిలో భారతీయులెవరైనా చిక్కుకుంటే వారి కోసం భారత హై కమిషన్‌ సహాయ విభాగంతో పాటు బాధితులు 020 76323035ను సంప్రదించవచ్చని అవసరం మేరకు మరిన్ని హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తామని భారత హైకమిషన్‌ తెలిపింది. మాంచెస్టర్‌ ఉగ్రదాడి బాధితులకు సాయమందించేందుకు సిక్కు గురుద్వారాలు ముందుకొచ్చాయి. బాధితుల కోసం ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు అందించాయి.

పాప్‌ స్టార్‌ గ్రాండే సేఫ్‌..
పాప్‌ స్టార్‌ గ్రాండే తన షోను ముగించుకుని, స్టేజ్‌ దిగిన తర్వాత దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఈ దాడిలో అరియానా గ్రాండేకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె సురక్షితంగా ఉన్నారని గ్రాండే అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘మాంచెస్టర్‌ దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. నన్ను క్షమించండి’’అంటూ గ్రాండే ట్విట్టర్‌లో తన భావోద్వేగాన్ని వెల్లడించింది. మాంచెస్టర్‌ దాడి నేపథ్యంలో తన ప్రపంచ టూర్‌ను గ్రాండే రద్దు చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

7/7 దాడిని గుర్తు చేస్తూ..
రెండు నెలల క్రితం లండన్‌లో పార్లమెంటుకు సమీపంలో ఓ దుండగుడు వ్యాన్‌తో దూసుకువచ్చి నలుగురిని చంపడమే కాక.. కత్తితో దాడి చేసి ఓ పోలీసు అధికారిని హత్య చేసిన విషయం తెలిసిందే. 2005 జూలై 7న లండన్‌లో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 52 మంది మృత్యువాత పడగా.. 700 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.

దుండగుడు సల్మాన్‌ అబేది ఇల్లు

 

 


దాడికి కొన్ని గంటల ముందు మాంచెస్టర్‌ ఎరీనాలో ఉగ్ర దాడి జరగనుందంటూ ఓ ట్వీటర్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement