ఆ దుర్మార్గుడి తండ్రి, సోదరుడు అరెస్టు!
ట్రిపోలి: మాంచెస్టర్ మారణహోమంపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాంచెస్టర్‌లో జరిగిన సంగీత కచేరిపై విరుచుకుపడి.. 22మందిని పొట్టనబెట్టుకున్న సూసైడ్ బాంబర్ సల్మాన్ అబేది తండ్రిని, సోదరుడిని పోలీసులు లిబియాలో అరెస్టుచేశారు. ట్రిపోలిలోని అయిన్‌జరా ప్రాంతంలో బుధవారం సల్మాన్ తండ్రి రమదాన్ అబేదిని అతని ఇంటిబయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సల్మాన్ సోదరుడు హషీం అబేదిని కూడా అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందం ‘రదా’ వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది. హషీం అబేదికి కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతడు సోదరుడు సల్మాన్‌తో పలుసార్లు సంప్రదింపులు జరిపాడని, లిబియా రాజధాని ట్రిపోలిలో ఉగ్రవాద దాడులు జరపాలని అతను పథకం రచించినట్టు తెలుస్తున్నదని చెప్పారు.
పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్‌లో సంగీత కచేరి నిర్వహిస్తుండగా ఉగ్రవాది సల్మాన్ అబేదీ అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్‌ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగారు.