ఈ కృషి నిరంతరమైతే... | This work is continuous ... | Sakshi
Sakshi News home page

ఈ కృషి నిరంతరమైతే...

Published Mon, Feb 2 2015 12:55 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ఈ కృషి నిరంతరమైతే... - Sakshi

ఈ కృషి నిరంతరమైతే...

అలకతో గడప దాటారా, అనుకోకుండా యములాళ్ల చేతికి చిక్కారా, ఆర్థిక దైన్యం తో అయినవాళ్లే అమ్మేశారా...మాయమవుతున్న పిల్లలంతా ఏమవుతున్నారు, ఎటు పోతున్నారన్న సందేహాలకు మన దేశంలో చాన్నాళ్లుగా జవాబు ఉండటం లేదు. పిల్లల అదృశ్యం గురించి ఫిర్యాదు స్వీకరించడమే కనాకష్టమవుతున్న చోట వారి ఆచూకీ తెలుసుకుని అయినవారికి అప్పగిస్తారన్నది అత్యాశే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరేళ్లక్రితం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ సమస్య పరిష్కారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నది.

కేంద్రా నికీ, రాష్ట్ర ప్రభుత్వాలకూ నోటీసులు జారీచేసింది. ఎన్నోసార్లు మందలింపులు, అభిశంసనలూ అయ్యాక ప్రభుత్వ యంత్రాంగంలో కాస్తంత కదలిక వచ్చింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసుల చొరవ అందరికీ మార్గ దర్శకమైంది. దాని పర్యవసానంగా హైదరాబాద్ పాత బస్తీలోని గాజుల బట్టీల్లో మగ్గిపోతున్న 1,400మంది పసివాళ్లకు విముక్తి లభించింది.
 
ఇంటి దీపాల్లా, కంటిపాపల్లా ఉండాల్సిన పసివాళ్లు గాజులబట్టీల్లో, ఇతర కుటీర పరిశ్రమల్లో ఎలాంటి నరకాన్ని చవిచూశారో ఆదివారంనాటి ‘సాక్షి’ సంచిక కథనం కళ్లకు కట్టింది. రాష్ట్ర రాజధాని నగరంలో ఇన్ని వందలమంది పిల్లలు అమ్మానాన్నలకు దూరంగా, క్షణక్షణ గండంగా బతుకులు వెళ్లదీయాల్సి వచ్చిం దంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఐదేళ్ల వయసున్న ఆడ, మగ పిల్లలు మొదలుకొని పదిహేనేళ్ల వయసువారి వరకూ అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో, అధిక ఉష్ణోగ్రతలను విరజిమ్మే బట్టీలతో నిత్యమూ సహజీవనం చేశారు.

సూర్యోదయం మొదలుకొని రాత్రి పదింటివరకూ రెక్కలు ముక్కలు చేసుకున్నారు. అర్ధాకలితో బతుకులు వెళ్లదీశారు. చర్మవ్యాధులు మొదలుకొని జ్వరం వరకూ ఏ అనారోగ్యం వచ్చినా చూసే దిక్కులేనిచోట, ఆర్తనాదాలేవీ బయటిలోకానికి వినబడే అవకాశం లేని చోట ఇరుకిరుకు గల్లీల్లోని మరింత ఇరుకైన గదుల్లో మగ్గిపోయారు. ఇంత ఘోరం జరుగుతుంటే సమస్త సాధనాసంపత్తి అందుబాటులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఇన్నాళ్లుగా పసిగట్టలేకపోయింది. వేలాదిమంది కార్యకర్తలతో ఎన్ని కల సమయంలోనూ, ఉత్సవాల్లోనూ బలప్రదర్శన చేసే పార్టీలు ఆనవాలుకట్టలేక పోయాయి. కనుక నాగరిక సమాజం ఉందనుకున్నచోట నిర్నిరోధంగా సాగిపోయిన ఈ దురంతంలో అందరి బాధ్యతా ఉంది.
 
శ్రమ దోపిడీ చేసే ఉద్దేశంతో బెదిరించి, మోసగించి, డబ్బు ఆశ చూపి, హింసను ప్రయోగించి ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం, తరలించడంవంటివి ట్రాఫి కింగ్‌గా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి పాలెర్మో(ఇటలీ) ప్రొటోకాల్ చెబుతోంది. పిల్లలు, మహిళల అక్రమ తరలింపు వెనక వందల కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నదని ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. జాతీయ నేర గణాంక విభాగం లెక్కల్నిబట్టి చూస్తే ఏటా మాయమవు తున్న పిల్లల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. 2011లో 90,654మంది పిల్లలు ఆచూకీ లేకుండా పోతే 2013నాటికి ఆ సంఖ్య 1,35,262కు చేరుకుంది.

సగటున ఏడాదికి లక్షమంది పిల్లలు కనిపించకుండా పోతున్నారని, వారిలో 55 శాతంమంది బాలికలని సుప్రీంకోర్టుకు నిరుడు సమర్పించిన నివేదికలో కేంద్ర హోంశాఖ వివరించింది. మాయమవుతున్నవారిలో 45 శాతంమంది ఆచూకీ లభ్యంకావడం లేదని కూడా చెప్పింది. పిల్లల అక్రమ తరలింపునకు పేదరికంతో, సామాజిక అసమానతలతో సంబంధం ఉన్నదని... ఆ వర్గాలవారికి చెందిన పిల్లలే అధిక సంఖ్యలో అపహరణకు గురవుతారని బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థ గణాంక సహితంగా వివరించింది.

సమాజంలో చిన్నచూపునకు గురయ్యే దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలు తమ పిల్లలు తప్పిపోయారని చేసే ఫిర్యాదులు స్వీకరించేవారే ఉండరు. పెద్ద గొడవ జరిగాక అలాంటి ఫిర్యాదులు తీసుకున్నా వారిని వెతకడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలూ చేయరు. ఇప్పుడు హైదరాబాద్ పాతబస్తీలో దొరికిన చిన్నారుల్లో అత్యధికులు బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లోని వెనకబడిన జిల్లాలకు చెందిన దళితులు, మైనారిటీలు కావడం యాదృచ్ఛికం కాదు.
 
ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘజియాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సృజనాత్మకంగా ఆలోచించారు. పిల్లలను వెదకడం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 100 మంది పోలీసులతో 25 బృందాలను ఏర్పాటుచేసి, వారికి పసిపిల్లలతో సున్నితంగా వ్యవహరించడం దగ్గరనుంచి అనేక అంశాల్లో శిక్షణనిచ్చి ‘ఆపరేషన్ స్మైల్’ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాట్సాప్ మొదలుకొని గూగుల్ మ్యాప్‌ల వరకూ సైబర్ ప్రపంచంలో అందుబాటులో ఉండే అన్ని సాధనాలనూ ఈ ప్రత్యేక బృందం వినియోగించుకుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ మధ్య వీడియో సంభాషణకు వీలుకల్పించారు.

ఈ ప్రయత్నం ఫలించింది. నిరుడు సెప్టెంబర్-అక్టోబర్ నెలలమధ్య మొత్తం 227మంది పిల్లలను వారి తల్లిదండ్రులవద్దకు చేర్చగలిగారు. వాస్తవానికి ఘజియాబాద్ పోలీసులకు 122మంది పిల్లలకు సంబంధించి మాత్రమే ఫిర్యాదులు అందాయి. కానీ వారు చూపిన చొరవ వల్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకానీ మరో 105మంది పిల్లలు కూడా క్షేమంగా అమ్మానాన్నల్ని చేరుకోగలిగారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని జనవరి నెలంతా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న కేంద్ర హోంశాఖ సూచనలు ఫలించాయి.

పర్యవసానంగానే ఇప్పుడు పాతబస్తీ నరకకూపాల్లోని పిల్లలు సురక్షితంగా బయటకు రాగలిగారు. ఇలాంటి కృషి, పట్టుదల నిరంతం కొనసాగితే కన్నపేగు ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్న లక్షలాదిమందికి ఉపశమనం లభిస్తుంది. పసిమొగ్గలను చిదిమేస్తున్న దుర్మార్గుల అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. చిన్నారుల అపహరణ కేసుల విషయంలో భారత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్న అప్రదిష్ట పోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement