కరోనా వైరస్ బాధితుల సంఖ్య పదులనుంచి వందల్లోకి, ఆ తర్వాత వేలల్లోకి వెళ్లి, ఇప్పుడు లక్ష దాటిన తరుణంలో దాని ప్రభావాల చుట్టూ, పరిణామాల చుట్టూ, పర్యవసానాలచుట్టూ చర్చ సాగుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి రెండునెలలు అవుతుండగా లక్షలాదిమంది వలస జీవులు స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ రహదార్ల పొడవునా ఎదుర్కొన్న వెతలు, వారిలో కొందరు మార్గమధ్యంలో మృత్యువాతపడిన తీరు, ఆ వైరస్ కబళించినవారి కుటుంబాలు పడు తున్న బాధలు వగైరాలపై వివిధ మాధ్యమాల్లో వెలువడుతున్న కథనాలు కంట తడిపెట్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ ఉత్పాదక సంస్థలు, సేవారంగ సంస్థలు తెరుచు కుంటుండగా నిరుద్యోగానికి సంబంధించిన గణాంకాలు గుండె గుభేలుమనిపిస్తున్నాయి. కరోనా వైరస్ కాటేయడానికి మూడు నాలుగేళ్లముందునుంచే మన ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ వుంది. అది గత రెండేళ్లుగా మాంద్యం లోకి జారుకుంది.
2017–18లో నిరుద్యోగిత 6.1 శాతం వుండగా ఇప్పుడది 24 శాతానికి చేరు కుంది. కరోనా వైరస్ వచ్చి ఈ క్షీణతను వేగవంతం చేసిందన్నమాట. ఒక రంగమని లేదు... ఒక వర్గమని లేదు అందరికందరూ దీని వాత పడ్డారు. వలస కూలీలతోపాటు చిన్నా చితకా వ్యాపా రులు, నిర్మాణ రంగం, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలవారు దెబ్బతిన్నారు. నెలనెలా జీతం అందుకునే మధ్యతరగతికి ఆ జీతంలో కోతలు పడటం లేదా ఉద్యోగాలు పోవడం తప్పలేదు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల్లో పలువురిని వేతనం లేని సెలవుపై వెళ్లాలని కోరాయి. పరిస్థితి చక్కబడితే మళ్లీ పిలుస్తామన్నాయి. రోజుకూలీలు, తోపుడు బళ్లపై వ్యాపారం చేసేవారు ఇప్పుడు నిస్సహాయంగా మిగిలిపోయారు. మొత్తంగా 12 కోట్లమందికి పైగా జనం నిరుద్యోగులుగా మారారని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఈ విషయంలో భారీగా నష్టపోయిందని ఆ సంస్థ అంచనా. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ) కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి, తమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్ విధించడంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమకు రావాల్సిన ఈఎంఐలపై మూడునెలలు మరటోరియం విధిం చాలని రిజర్వ్‌బ్యాంక్ చెప్పింది. ఆ మారటోరియాన్ని తాజాగా మరో మూడు నెలలు పొడిగించింది. బ్యాంకుల మాటెలావున్నా ఎన్‌బీఎఫ్‌సీలు ఈ నిర్ణయంతో చతికిలబడ్డాయి. తమకు రావాల్సిన బకాయిలు అడగడానికి లేదు... తాము బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడానికి లేదు. స్టార్టప్‌లు కూడా మూసివేత దిశగా పోతున్నాయని, ఇప్పటికే చాలా సంస్థలు కార్యకలాపాలను ఆపేశాయని నాస్కామ్ చెబు తోంది. ఇలా హఠాత్తుగా వచ్చిపడిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలూ ఇక్కట్లు పడుతున్నాయి. ఈ ప్రభావం ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల మీద పడుతోంది.
లాక్‌డౌన్‌కు ఇప్పుడొచ్చిన సడలింపుల వల్ల లేదా మన్ముందు అది పూర్తిగా తొలగించడం వల్ల ఈ గడ్డు పరిస్థితి తొలగి మళ్లీ యధాపూర్వ స్థితి ఏర్పడుతుందన్న భరోసా లేదు. దాదాపు అన్ని రంగాలకూ జీవనాడిగా వుంటూ వస్తున్న వలస జీవుల్లో చాలామంది వారి వారి స్వస్థలాలకు తరలిపోయారు. లాక్‌డౌన్ సమయంలో ఎదురైన చేదు అనుభవాలతో మళ్లీ తిరిగి రావడానికి వారిలో ఎంతమంది సిద్ధపడతారో ఇప్పుడే చెప్పడం కష్టం. అలాగని ప్రస్తుతం వున్నవారికే పూర్తిగా పనిపాటలు కల్పించలేని గ్రామీణ భారతం నగరాల నుంచి వెనక్కిచ్చిన దాదాపు రెండున్నర కోట్లమంది వలసజీవుల్ని వెనువెంటనే అక్కున చేర్చుకుని, ఆదుకునే పరిస్థితులు లేవు. గ్రామీణ ఉపాధి కల్పన పథకానికి కేంద్రం ఈమధ్యే అదనంగా రూ. 40,000కోట్లు ప్రకటించింది. అలాగే ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ప్రక టించాయి. ఇవి నిస్సందేహంగా ఉపయోగపడతాయి. నికర దేశీయోత్పత్తి(ఎన్‌డీపీ)లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాటా దాదాపు సగం...అంటే 48శాతం. శ్రమజీవుల్లో దాని వాటా 71 శాతమని ఒక అంచనా. వాస్తవానికి ఎన్‌డీపీలో 48 శాతం వున్న వ్యవస్థ ఉత్పాదకత ఇంతకన్నా చాలా మెరుగ్గా వుండాలి. ఎంఎస్‌ఎంఈలను చిత్తశుద్ధితో ఆదుకుని, వాటికి మరింత మూలధనం అందుబాటులో వుండేలా, మెరుగైన సాంకేతికత, నిపుణత లభించేలా చూడగలిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలో పేతం అవుతుంది. అక్కడ మరింతమంది కార్మికులకు ఉపాధి దొరకడంతోపాటు ఆ సరుకులకు డిమాండ్ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలూ కూడా ఈ మాదిరి చర్యలకు ఉప క్రమిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగవుతాయి.
నిరుద్యోగాన్ని నిర్ధారించేటపుడు ఉపాధి లేనివారిని మాత్రమే కాక... కొద్దిపాటి సమయం మాత్రమే పనిచేయడానికి అవకాశం లభించే పార్ట్‌టైమ్ సిబ్బందిని, చిన్నా చితకా ఉద్యోగాలు చేయకతప్పని స్థితిలోవున్నవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చుకున్న శాస్త్రవేత్త పాల్ క్రుగ్‌మన్ ఓ సందర్భంలో చెప్పారు. అలా చూస్తే కరోనా మహమ్మారి కారణంగా నిరుద్యోగులైనవారి సంఖ్య 12 కోట్ల కన్నా చాలా అధికంగా వుండే అవకాశం వుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి సకాలంలో సరైన చర్యలు తీసుకోనట్టయితే సమాజంలో అశాంతి ప్రబలుతుంది. వివిధ రంగాలకు ఆసరాగా నిలిచేందుకంటూ ఈమధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఈ విషయంలో ఏమేరకు తోడ్ప డుతుందన్నది ఇంకా చూడాల్సివుంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు నిరుద్యోగులకు నేరుగా నగదు తోడ్పాటు అందిస్తున్నాయి. ఆ మాదిరి చర్యలు ఇక్కడ కూడా తీసుకుంటే తప్ప వినియోగం పెరగదు. ఉత్పత్తి అయిన సరుకులకు మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడదు. కనుక కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment