ఉరుము లేకుండా పిడుగు పడటాన్ని ఊహించలేం. కానీ రాజకీ యాల్లో ఏదీ అసాధ్యంకాదు. ఆ సంగతి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి బాగా అర్ధమై ఉంటుంది. ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయిలో సొంతంగా మెజారిటీని సాధించి... పాలనా యంత్రాం గాన్ని పటిష్టపరచడంలో మోడీ నిమగ్నమై ఉండగా హఠాత్తుగా జరిగిన రెండు పరిణామాలు ఆయన సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఆ రెండూ సైనిక దళాల ప్రధానికాధికారిగా వచ్చే నెల 31న పదవీబాధ్యతలు స్వీకరించబోతున్న లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌కు సంబంధించినవే. దల్బీర్‌సింగ్‌పై కొన్నాళ్లక్రితం అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ వీకే సింగ్ తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమై నవని, పథకంప్రకారం చేసినవనీ సుప్రీంకోర్టు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన అఫిడవిట్ తేల్చిచెప్పింది. వీకే సింగ్ ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్నారు. ప్రభు త్వంలోని ఒక శాఖ మరో శాఖకు మంత్రిగా ఉన్నవారిని తప్పు బడుతూ అఫిడవిట్ దాఖలుచేయడమే దిగ్భ్రాంతికరంకాగా... వీకే సింగ్ దాన్ని ఇంకొంచెం పొడిగించారు. దల్బీర్‌సింగ్ ఖూనీకోరులకూ, బందిపోట్లకూ రక్షణ కల్పించిన వ్యక్తి అంటూ ట్వీట్ చేశారు. మరి కొన్నాళ్లలో మన సైన్యానికి నేతృత్వంవహించబోతున్న వ్యక్తి గురించి ప్రభుత్వంలోని మంత్రే ఇలాంటి వ్యాఖ్యలుచేయడంతో అందరూ విస్తుపోయారు.
వీకే సింగ్‌కు వివాదాలు కొత్తకాదు. ఆయన సాధారణ సైనికుడిగా మొదలుపెట్టి సైనిక దళాల చీఫ్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో విజయాలు సాధించివుండవచ్చు. దురదృష్టవశాత్తూ సింగ్ పేరు చెబితే ఈ విజ యాలు కాక వివాదాలు మాత్రమే అందరికీ స్ఫురణకొస్తాయి. సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు తన పుట్టిన తేదీని మార్చాలని, దాని ఆధారంగా తన రిటైర్మెంట్ తేదీని కూడా సవరించాలని కేం ద్రంతో పేచీకి దిగారు. అది చూస్తుండగానే పెను దుమారంగా మారి ఆయన చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సైన్యంలో చేరిననాడు సమర్పిం చిన పత్రాల ఆధారంగా చూస్తే వీకే సింగ్ వాదన చెల్లదని, ఆయన కోరుకున్నట్టు పుట్టినతేదీని సవరించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అటుతర్వాత ఆయన జడ్జీలపైనే వ్యా ఖ్యలుచేశారు. అటుతర్వాత నాసిరకం ట్రక్కుల కొనుగోలుకు తనపై ఒత్తిళ్లు వచ్చాయని, ఒక దళారీ రూ. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆరోపించారు. దానిపై కేంద్రానికి లేఖ రాసినా స్పందనలేదని అన డంతో యూపీఏ సర్కారు ఇరకాటంలో పడింది. తమకు లేఖరాలేదని అప్పటి రక్షణమంత్రి ఆంటోనీ చెప్పినా, యూపీఏ సర్కారు మాటను ఎవరూ విశ్వసించలేదు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి సీబీఐ దర్యాప్తు వరకూ వచ్చింది. ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సైనిక దళాల చీఫ్ స్థానంలో ఉన్నవారు ఎవరూ గతంలో ఇలా ప్రభుత్వంతో వివాదాలు తెచ్చుకోలేదు. అందరూ సామరస్య ధోరణిలో పనిచేసి రిటైరైనవారే. ప్రభుత్వానికీ, ఆర్మీ చీఫ్‌కూ మధ్య విశ్వాసరాహిత్యం ఏర్పడితే దాని ప్రభావం సైనిక దళాలపైన కూడా పడుతుందని, అది దేశానికి మంచిదికాదని రక్షణ రంగ నిపుణులు అప్పట్లో హెచ్చరించారు.
ఇదంతా ఒక ఎత్తయితే తాను సైనిక దళాల చీఫ్‌గా ఉన్నప్పుడు దల్బీర్‌సింగ్ విషయంలో వ్యవహరించిన తీరు మరో ఎత్తు. దల్బీర్ ఆధ్వర్యంలో పనిచేసిన యూనిట్ 2010లో ముగ్గురిని ఎన్‌కౌంటర్ పేరిట మట్టుబెట్టిందని, ఆ మరుసటి సంవత్సరం ఒక ఇంటిపై బంది పోటు దొంగతనానికి పాల్పడిందని ఆరోపణలు రావడంతో వీకే సింగ్ ఆయనపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించారు. అయితే, ఈ ఘట నల్లో నిందితులుగా ఉన్న సైనికాధికారులపైనా, జవాన్లపైనా సైన్యం విచారణ జరపడం, చర్యలు తీసుకోవడం పూర్తయింది. ఘటనలతో ప్రమేయం ఉన్నవారిని దల్బీర్ కాపాడటానికి ప్రయత్నించారన్న ఆరో పణల్లో నిజంలేదని ఆ విచారణల్లో వెల్లడయ్యాకే దల్బీర్‌కు ఈస్ట్రన్ క మాండ్ చీఫ్‌గా పదోన్నతి వచ్చింది. ఈలోగా వీకే సింగ్ రిటైరయ్యారు. వాస్తవం ఇదికాగా దల్బీర్ ఖూనీకోరులకూ, బందిపోట్లకూ నెలవైన యూనిట్‌కు నాయకత్వంవహించారని, వారిని కాపాడటానికి ప్రయ త్నించారని వీకే సింగ్ అనడం వాస్తవాలను తారుమారు చేయడమే.
ఇప్పుడు దల్బీర్‌కు సైనిక దళాల చీఫ్‌గా పదోన్నతి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యం విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆ వాస్తవాలనే అఫిడవిట్‌లో పొందుపరిచింది. అంతేకాదు... మరి కొంచెం ముందుకుపోయి దల్బీర్‌పై అప్పట్లో తీసుకున్న క్రమశిక్షణా చర్యలు చట్టవిరుద్ధమైనవని, పథకం ప్రకారం చేసినవని తేల్చి చెప్పింది.
ఈ అఫిడవిట్‌ను ప్రమాణంగా తీసుకుంటే వీకే సింగ్ ఇప్పుడు మంత్రి పదవిలో కొనసాగడానికి నైతికంగా అనర్హుడవుతారు. సర్వీ సులో ఉండగా కిందిస్థాయి ఉద్యోగిపై వీకే సింగ్ కుట్రపూరితంగా వ్యవహరించారని ప్రభుత్వమే సుప్రీంకోర్టు ముందు అంగీకరించిన ప్పుడు ఆయనను మంత్రిగా కొనసాగించడంలో ఔచిత్యమేముంటుం దన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ న్యాయ మీమాంస ఇలావుండగానే తన ట్వీట్‌తో వీకే సింగ్ దాన్ని మరింత జటిలం చేశారు. యూపీఏ సర్కారు అధికారంనుంచి వైదొలగుతూ దల్బీర్‌ను సైనిక దళాల చీఫ్‌గా నియ మించడంపై బీజేపీకి అభ్యంతరమున్నా రక్షణమంత్రి అరుణ్ జైట్లీ పరి ణతితో వ్యవహరించి ప్రస్తుత వివాదానికి ఇప్పటికైతే ముగింపు పలి కారు. లేకుంటే ఇది మరింత ముదిరేది. మంత్రులకూ, అధికార యం త్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించి చురుగ్గా పనిచేసుకుంటూ పోతున్న ఎన్ డీఏ సర్కారుకు ఇలాంటి వివాదాలు ఇబ్బంది కలిగించేవే. ఏరి కోరి ఇష్టపడి తెచ్చుకున్నందుకు వీకే సింగ్‌లాంటివారిని అదుపు చేయడం కూడా తన బృహత్తర కర్తవ్యాల్లో ఒకటిగా భావించక తప్పదుమరి!
వీకే సింగ్ ‘దుమారం’!
Published Fri, Jun 13 2014 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement