గత నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ప్రతి సందర్భం లోనూ తన పాలన ఎలా ఉండబోతున్నదో, తన ప్రాధమ్యాలేమిటో చెబుతూ వస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారి రెండురోజులపాటు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సులో వాటిని మరింత తేటతెల్లం చేశారు. పాలనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ లోతైన అవగాహన ఉన్న పాలకుడు అధికార శ్రేణులకు ఏవిధంగా దిశానిర్దేశం చేయ గలడో ఈ రెండురోజులూ ఆయన ప్రసంగాలను నిశితంగా గమనించినవారికి అర్ధమవుతుంది. ‘మనం పాలకులం కాదు... ప్రజలకు సేవకులం. వారి ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి’ అని చెప్పడంలోనే ఆయన హృదయం ఎక్కడుందో తెలుస్తుంది. 341 రోజులపాటు 3,684 కిలోమీటర్ల మేర సాగించిన పాదయాత్ర వేసిన చెరగని ముద్ర ఈ సదస్సులో ఆయన నోటివెంబడి వెలువడిన ప్రతి పలుకులోనూ వ్యక్తమైంది.
ఏఏ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయో, ఎక్కడెక్కడ వారు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో... ఏం చేస్తే అవన్నీ సరిచేయవచ్చునో ఆయనకు స్పష్టత ఉంది. అవినీతిరహిత, పారదర్శక పాలన అందించాలనడం, ఏదైనా పరిష్కరిస్తామని హామీ ఇస్తే దాన్ని అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తిచేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత పెంచు కోవాలని ఉద్బోధించడం జగన్ వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ప్రజలతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు, వారి సమస్యల పరిష్కారానికి పూనుకున్నప్పుడు ఉదారతతో వ్యవహరించాలని, అందులో మానవీయ స్పర్శ ఉండాలని ఆయన ప్రసంగం విన్నాక అధికారులందరికీ అర్ధమై ఉండాలి. అసలు ఈ సదస్సు నిర్వహణ కోసం ప్రజావేదికను ఎంచుకోవడంలోనే ఆయనొక సందే శాన్నిచ్చారు.
గత పాలకుల హయాంలో చట్ట ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరిగాయో, ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయో అందరికీ తేటతెల్లం చేయడానికే సదస్సును అక్కడ నిర్వహిం చారు. పర్యావరణ చట్టాలను, ఇతర మార్గదర్శకాలను ఉల్లంఘించి చేసిన నిర్మాణాలన్నిటినీ కూల గొట్టడం ఖాయమని, ఆ కార్యక్రమం ‘ప్రజావేదిక’తోనే మొదలవుతుందని ఆయన ప్రకటించారు. దానికనుగుణంగా సదస్సు ముగిసిన కొన్ని గంటల్లోనే వేదిక కూల్చివేత పనులు ప్రారంభ మయ్యాయి. గత అయిదేళ్ల పాలనలో తమకెదురైన అనుభవాలు ఎటువంటివో ప్రతి అధికారికీ తెలుసు. ఎంతటి వారినైనా ఆ అనుభవాలు ఒకవిధమైన నిర్లిప్తతలోకి నెట్టేస్తాయి. నిర్వా్యపకత్వానికి లోను చేస్తాయి. నిరాశానిస్పృహలు కలిగిస్తాయి.
ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన మహిళా ఎమ్మార్వో పట్ల ఒక ప్రజాప్రతినిధి ఎంత కిరాతకంగా వ్యవహరించాడో... సీనియర్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను టీడీపీ ప్రజాప్రతినిధులు ఎలా అవమానించారో, ఈ రెండు ఉదంతాల్లోనూ గత ప్రభుత్వం వ్యవహరించిన తీరేమిటో ఏ అధికారీ మర్చిపోరు. విజ యవాడ, మరికొన్ని ఇతర నగరాల్లో చోటుచేసుకున్న కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవహారంలో పోలీసు అధికారుల చేతులెలా కట్టేశారో, నిందితులకు ఎలా అండదండలందించారో వారికి గుర్తుండే ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకునే ఆయన అధికారులకు తన పాలన ఎలా ఉండబోతున్నదో స్పష్టం చేశారు.
పరిపాలనకు ప్రజాప్రతినిధులు ఒక కన్ను అయితే, అధికార శ్రేణులు మరో కన్ను అని, ఈ రెండూ ఒక్కటైనప్పుడు మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పడం ద్వారా వారికిచ్చే సమాన ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను సూచించారు. ప్రజాప్రతినిధులు ఇచ్చే వినతి పత్రాలపై సానుకూలంగా స్పందించమని అధికారులను కోరడంతోపాటు, అదే సమయంలో వారు అక్రమాలు, అవినీతి, దోపిడీ వగైరాల కోసం ఇచ్చే ఎలాంటి ఆదేశాలనైనా తిరస్కరించమని పిలుపు నిచ్చారు. ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా, ఇంత నిర్మొహమాటంగా బహుశా దేశంలో మరే ముఖ్య మంత్రీ అధికారులకు చెప్పి ఉండరు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఉద్దేశిత వర్గాల్లోని చిట్టచివరి వ్యక్తి వరకూ చేరాలని జగన్ సూచించడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహార శైలిని తలపిస్తుంది. అయిదేళ్లనాటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తాజా ఎన్ని కల్లోనూ గిరిజనులంతా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అండగా నిలిచి నూరుశాతం ఆ పార్టీ అభ్యర్థుల్ని గెలి పించారు. వారికి వాగ్దానం చేసినవిధంగానే బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆ గిరిజనుల అభీష్టాన్ని జగన్ నెరవేర్చారు.
గత అయిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వింటున్న మాట ‘పాలనానుభవం’. అరిగిపోయిన రికార్డులా తెలుగుదేశం నేతలు పదే పదే వాడి ఆ పదాన్ని దుర్వినియోగం చేశారు. సమర్థతకు కొలమానం అనుభవం కాదని... ప్రజలపట్ల నిబద్ధత, వారిపట్ల సహానుభూతి ఉండే నాయకుడికి వారెదుర్కొంటున్న సమస్యల విషయంలో సంపూర్ణ అవగాహన ఉంటుందని, పరిష్కార మార్గం పట్ల స్పష్టత ఏర్పడుతుందని జగన్ నిరూపించారు. అందుకే నిర్దేశిత సమయంలోనే ఆయన తాను చెప్పదల్చుకున్నది అధికార శ్రేణులకు చేరేయగలిగారు. బాబు హయాంలో కలెక్టర్ల సదస్సులెలా జరిగేవో ఎవరూ మరిచిపోరు.
ఎక్కాల పుస్తకం ఒప్పజెప్పినట్టు ఆద్యంతమూ గణాంకాలు గుప్పిం చడం... వాటిని గ్రాఫిక్స్‌తో మేళవించడం... విషయమేమీ లేకుండా గంటలతరబడి మాట్లాడటం, మధ్యమధ్యన స్వోత్కర్షలకు పోవడం తప్ప అందులో ఏమీ ఉండేది కాదు. అందుకు భిన్నంగా జగన్ తనను తాను అధికార గణంలో భాగం చేసుకుని, అందరం కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చి వారిలో స్ఫూర్తిని నింపారు. సమయపాలనకు ప్రాముఖ్యమిచ్చారు. భిన్న అంశాలపై ముఖ్యమంత్రి వైఖరి ఎలా ఉన్నదో, ఆయన సందేశంలోని సారాంశమేమిటో అధికారయంత్రాంగం అవగాహన చేసుకున్నది గనుక రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన, సమర్ధవంతమైన పాలన అందగలదని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment