ఈ ఫలితాలు చెప్పేదేమిటి? | What are the results? | Sakshi
Sakshi News home page

ఈ ఫలితాలు చెప్పేదేమిటి?

Published Wed, Dec 24 2014 12:34 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ఈ ఫలితాలు చెప్పేదేమిటి? - Sakshi

ఈ ఫలితాలు చెప్పేదేమిటి?

 ఆరు నెలలక్రితం దేశం మొత్తాన్ని కుదిపేసిన నరేంద్ర మోదీ ప్రభంజనం ఇంకా సజీవంగానే ఉన్నదని మంగళవారం వెలువడిన జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్ ఫలితాలు నిరూపించాయి.  జమ్మూ-కశ్మీర్‌లో బీజేపీ ‘మిషన్ 44 ప్లస్’ పేర బ్యాలెట్ పోరుకు సమరశంఖం పూరించినా కశ్మీర్‌లోయలో దాని ప్రతిధ్వని వినబడలేదు. అది జమ్మూకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. జమ్మూ-కశ్మీర్‌లో ఎప్పటిలాగే సంకీర్ణ ప్రభుత్వమే ఈసారి కూడా రాజ్యమేలబోతున్నది. 28 స్థానాలతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అగ్రభాగంలో ఉంటే 25 స్థానాలు గెల్చుకుని బీజేపీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇంతవరకూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) 15, కాంగ్రెస్ 12 గెల్చుకున్నాయి. జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్‌యూతో కలిసి స్పష్టమైన మెజారిటీ సాధించింది. రాష్ట్రం ఏర్పడి 14 ఏళ్లవుతుండగా ఇంతవరకూ ఏ రెండు పక్షాలకూ ఈ స్థాయి మెజారిటీ రాలేదు. అక్కడ బీజేపీ 37 స్థానాలు గెల్చుకోగా దాని మిత్ర పక్షం 5 స్థానాలు పొందింది. కనుక ఆ పార్టీ భవిష్యత్తులో బీజేపీని  శాసించే పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదు. ఇంతవరకూ రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ ఏ కూటమీ పూర్తికాలం పాలించలేకపోయింది. వరస వైఫల్యాలతో కుదేలవు తున్న కాంగ్రెస్ ఎప్పటిలానే రెండు రాష్ట్రాల్లోనూ అపజయాన్నే మూటగట్టుకున్నది. కనీసం ఇప్పటికైనా ఆ పార్టీ ఏ గుణపాఠమైనా నేర్చుకుంటుందో లేదో చెప్పలేం.

 జమ్మూ-కశ్మీర్‌లో స్థానిక పార్టీలతో అవగాహన వంటిదేమీ లేకుండా సొంతంగా పోటీ చేయాలనుకోవడం సాహసమే అయినా బీజేపీ ఆ పని చేసింది. అందుకోసం కొన్ని ‘త్యాగాలకు’ కూడా సిద్ధపడింది. జమ్మూ-కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని గొంతెత్తే అల వాటున్న బీజేపీ ఈసారి ఆ విషయంలో అస్పష్టంగా...ఇంకా చెప్పాలంటే మౌనంగా ఉండిపోయింది. అలాగే కొన్ని విషయాల్లో పరిమితులు ఏర్పర్చుకున్నది. అటు జమ్మూ... ఇటు కశ్మీర్‌లలో అన్నిటి గురించీ ఒకేలా మాట్లాడే అవకాశం లేకపోవడం ఆ పార్టీకున్న ఒక పరిమితి. ఉదాహరణకు కశ్మీర్ పండిట్లకు సంబంధించిన అంశంపై జమ్మూలో మాట్లాడినట్టు కశ్మీర్‌లో మాట్లాడితే ‘మిషన్ 44 ప్లస్’కు చేటు కలుగుతుం దని ఆ పార్టీ ఆచి తూచి అడుగేసింది. అలాగే, సైన్యానికి విశేషాధికారాలిస్తున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం విషయంలోనూ తన అసలు వైఖరిని అది చెప్పలేకపోయింది. ఆ చట్టం వల్ల నిత్యమూ సమస్యలెదుర్కొనే ప్రాం తంలో దాన్ని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడటం అంత సులభమేమీ కాదు. అయితే, ఇలా లెక్కలేసు కుని మాట్లాడటం ఒక్కోసారి లాభించదు. అది కశ్మీర్ ఫలితాల్లో నిరూపణ అయింది. అటు లోయలోనూ, ఇటు లడఖ్‌లోనూ బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపో వడం అందువల్లే! మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో లడఖ్ స్థానాన్ని గెల్చుకున్న బీజేపీ ఈసారి ఆ ప్రాంతంలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా రాబట్టుకోలేకపోయింది. లోయలోనూ, లడఖ్‌లోనూ మొత్తం 50 స్థానాలున్నాయి. ఈ రెండుచోట్లా బీజేపీ ఖాతా తెరవలేక పోయింది. పూర్తిగా జమ్మూ పార్టీగా మిగిలిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసిన తీరు గురించి చెప్పుకోవాలి. కశ్మీర్‌లో పార్టీ జెండా రెపరెపలాడగలదన్న అభిప్రాయాన్ని శ్రేణుల్లో కలిగించడంలో ఆయన విజయం సాధించారు. నిజానికి ‘మిషన్ 44 ప్లస్’ అలాంటి ఉత్సాహాన్ని వారిలో నింపేందుకే! ముఖ్యంగా ఆయన జమ్మూ-కశ్మీర్ అభివృద్ధిని, ఉపాధిని చర్చనీయాంశం చేయగలిగారు. ఎన్నికల ప్రచారాన్ని వాటి చుట్టూ తిప్పగలిగారు.


 ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌లో ఓటర్లు వెలువరించిన తీర్పు అటు పీడీపీకి, ఇటు బీజేపీకి పెద్ద పరీక్షే పెట్టింది. ఎన్నికల సభల్లో మోదీ ‘తండ్రీ కొడుకుల పాలన’, ‘తండ్రీ కూతుళ్ల పాలన’ అంటూ అటు ఎన్‌సీని, ఇటు పీడీపీని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు విమర్శించుకోవడం...అంతలోనే కౌగలించుకోవడం సర్వసాధారణం. కనుక ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాబోదు. ఒకవేళ బలమైన పీడీపీతో వెళ్లడంవల్ల తనకు పెద్దగా ప్రయోజనం కలగదని బీజేపీ భావించిన పక్షంలో ఎన్‌సీతో జట్టుకట్టినా కట్టొచ్చు.  గతంలో ఎన్‌సీ ఎన్డీయే భాగస్వామిగా ఉన్నది గనుక ఇది అసాధ్యమేమీ కాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రెండు పార్టీలకూ మరికొందరి తోడ్పాటు అవసరమవుతుంది. అలాగే పీడీపీ-కాంగ్రెస్‌లు కలవాలనుకున్నా ఇతరుల మద్దతు తప్పనిసరి.

 జార్ఖండ్‌లో ఈసారి వోటర్లు ఉన్నంతలో స్పష్టమైన తీర్పే ఇవ్వగలిగారు. పద్నాలుగేళ్ల ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీకీ విస్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఇప్పుడు బీజేపీకి 37 స్థానాలు లభించడం మోదీ ప్రభంజనం వల్లనే. అయితే ఇంత ప్రభ ంజనంలో కూడా ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకొచ్చిన సీనియర్ నేత అర్జున్‌ముండా ఓడిపోయారు. ఆయన గతంలో మూడుసార్లు సీఎంగా వ్యవహరించినవారు. రాష్ట్రంలో ఇంతవరకూ తొమ్మిది ప్రభుత్వాలు ఏర్పడగా మూడు సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సివచ్చింది. జేఎంఎం-కాంగ్రెస్ అధికార కూటమి పరాజయం పాలైనా కూటమిలోని జేఎంఎం గతంకంటే అదనంగా మరో స్థానాన్ని గెల్చుకోగలగడం ఈ ఎన్నికల్లో విశేషం. ఇంతవరకూ ఆ పార్టీకి 18 స్థానాలుంటే ఇప్పుడది 19కి పెరిగింది. అయితే, అధికారానికి మాత్రం దూరమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోని తొమ్మిది మంది మంత్రులు ఓటమి చవిచూశారు. ఇంతక్రితం 14 స్థానాలున్న కాంగ్రెస్ ఇప్పుడు అయిదింటితో సరిపెట్టుకోవాల్సివచ్చింది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాలూ బీజేపీకి తగినన్ని స్థానాలు అందిస్తూనే ఒక హెచ్చరిక లాంటిది చేయగలిగాయి. అభివృద్ధి ఎజెండానుంచి వైదొలగితే, ఇతరేతర అంశాలను నెత్తినెత్తుకుంటే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడక కాదని చాటి చెప్పాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement