కోహినూర్ దేనికి ప్రతీక?!
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...బ్రిటన్ రాణి ఎలిజెబిత్ 90వ పుట్టినరోజు జరుపు కుంటున్న సమయంలోనే అత్యంత విలువైన, అపురూపమైన కోహినూర్ వజ్రంపై మన దేశంలో పెను దుమారం మొదలైంది. ప్రస్తుతం బ్రిటన్ అధీనంలో ఉన్న ఆ వజ్రాన్ని వెనక్కు ఇవ్వమని అడగటం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభు త్వం తెలియజేయడం ఈ దుమారానికి మూలం. ‘బ్రిటన్ పాలకులు దాన్ని బలవం తంగా గానీ, దొంగిలించిగానీ తీసుకెళ్లలేదు. బహుమతిగా పొందారు.
కనుక తిరిగి వ్వాలని అడగలేం’అని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ విషయంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను గమనించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన వైఖరిని మార్చుకుంది. ‘సామరస్య ధోరణి’లో దాన్ని తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని తెలిపింది. ఆ వజ్రం పొదిగివున్న బ్రిటన్ మహారాణి కిరీటం ప్రస్తుతం లండన్ మ్యూజియంలో కొలువై ఉంది. అదొక్కటే కాదు...500 కిలోల బరువుతో 2.3 మీటర్ల ఎత్తుతో ఉండే సుల్తాన్‌గంజ్ బుద్ధ విగ్రహం సైతం బ్రిటన్ అధీనంలోనే ఉంది. అలాంటివి ఇంకా అనేకం ఉన్నాయి.
చరిత్రను మనకిష్టం వచ్చినట్టు మార్చలేం. మన అభిప్రాయాలకు తగ్గట్టు మల చలేం. అయితే చరిత్రలో జరిగిన తప్పుల్ని తప్పులుగా అంగీకరించడం ద్వారా, క్షమాపణ కోరడంద్వారా ...తగిన పరిహారం చెల్లించడం ద్వారా కొంతవరకూ సరి చేసుకోవచ్చు. అలా చేస్తే ఆ తప్పుల పర్యవసానంగా బాధితులైనవారి వారసులకు సాంత్వన లభిస్తుంది. స్వీయ తప్పిదాలను గుర్తించడం, సరిచేసుకోవడం పరిణతి చెందిన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి చిహ్నం. అలాంటి వారిని మన్నించడమైనా అంతే...ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. న్యూజిలాండ్‌లోని ఆదిమజాతులపై 1840లో సాగించిన దౌష్ట్యానికి బ్రిటన్ రాణి 1995లో క్షమాపణ కోరారు. చైనాలో సాగించిన అరాచకాలపై, నరమేథంపై జపాన్ చక్రవర్తి, ప్రధాని చైనా ప్రజలకు క్షమాపణ చెప్పారు. 200 ఏళ్లపాటు సాగించిన వలస పాలనలో ప్రజలను ఉక్కు పాదాలకింద అణచి ఉంచి, ఇక్కడి సంపదను సర్వస్వం దోచుకుపోయిన బ్రిటన్ మనకు మాత్రం ఇంతవరకూ క్షమాపణ చెప్పలేదు. ఎందరో వీరుల్ని ఉరికంబం ఎక్కించినందుకూ, ఎన్‌కౌంటర్‌ల పేరుతో కాల్చిచంపినందుకూ, లక్షలాదిమందిని జైళ్లపాలు చేసినందుకూ అది పశ్చాత్తాపం ప్రకటించలేదు. కనీసం కోహినూర్ లాంటి అపురూపమైన వస్తువుల్ని తిరిగివ్వడానికైనా అది ముందుకు రావడం లేదు.
కోహినూర్ ఈ దేశ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అనేకానేక అం శాల్లో ఒకటి. అది ఇక్కడి తరగని సంపదలకూ, విలువైన వనరులకూ ప్రతీక మాత్రమే కాదు... రెండు శతాబ్దాలపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన వలస దోపి డీకి కూడా చిహ్నం. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే ‘కాంతి శిఖరం’ అని అర్ధం. దాని వేయేళ్ల చరిత్రను గమనిస్తే ఆ పేరు దానికి అన్ని విధాలా సరిపోతుం దనిపిస్తుంది. మన పురాణగాధల్లోని శమంతకమణి కథకు ఉన్న మలుపులన్నీ కోహినూర్‌కు కూడా ఉన్నాయి. కాకతీయుల ఏలుబడి కొనసాగుతున్న దశలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పరిటాల దగ్గర లభ్యమైన ఆ వజ్రం ఎందరెం దరో చేతులు మారింది. మహమ్మద్ బీన్ తుగ్లక్ సేనలు వరంగల్‌ను ముట్టడించి నప్పుడు 793 క్యారట్ల(158.6 గ్రాముల) ఆ వజ్రం ఢిల్లీకి చేరింది. ఆ తర్వాత నాదిర్ షా నెమలి సింహాసనంతోపాటు దాన్ని కూడా ఎత్తుకెళ్లాడు(నెమలి సింహా సనం ప్రస్తుతం ఇరాన్ దగ్గరుంది).
అఫ్ఘానిస్తాన్‌పై దండెత్తి లాహోర్ కేంద్రంగా పం జాబ్‌ను పాలించిన రంజిత్‌సింగ్ కోహినూర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన మరణానంతరం పూరీలోని జగన్నాథాలయానికి అప్పగించమని వీలునామా కూడా రాశాడు. 1843లో ఆయన మరణించాక కుమారుడు అయిదేళ్ల దలీప్ సింగ్‌ను రాజుగా ఉంచి తల్లి పాలనా బాధ్యతలు నిర్వహించిన కొన్నాళ్లకు రాజ్యంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని చక్కదిద్దే సాకుతో ఈస్టిండియా కంపెనీ రంగ ప్రవేశం చేసి, సిక్కుల తిరుగుబాటును అణిచి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దలీప్ పదమూడేళ్ల బాలుడిగా ఉండగా ఈస్టిండియా కంపెనీ ప్రతి నిధులు అతన్ని ఇంగ్లండ్‌కు వలస తీసుకుపోయి అతనితోనే బ్రిటిష్ రాణికి కోహినూర్ వజ్రాన్ని బహుకరించే ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ముందు అది ‘బహుమతి’ అని కేంద్రం చెప్పింది ఈ కారణంతోనే!
బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరు సమాన స్థాయి వ్యక్తులు లేదా స్వతంత్ర వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ ఇద్దరిలో స్వీకరించేవారు యజ మానిగా లేదా అజమాయిషీ చెలాయించేవారిగా...‘ఇచ్చేవారు’ బానిసగా ఉన్న ప్పుడు దాన్ని ‘బహుమతి’ అనరు. అందుకు దోపిడీ, దొంగతనంలాంటి వేరే పేర్లు న్నాయి. వలస పాలకుల వారసుల పరిభాష వేరే ఉండొచ్చు. వలస దోపిడీకి గురైన వారిగా మనం ఏం మాట్లాడాలో...ఏం మాట్లాడుతున్నామోనన్న స్పృహ కలిగి ఉం డాలి. సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌కు ఈ విషయంలో సూచనలిచ్చిన మహా నుభావులకు ఆ స్పృహ లోపించినట్టు కనబడుతోంది. బ్రిటన్‌ది ఈ విషయంలో ఒకే వాదన. ‘అలా తిరిగివ్వడానికి మా చట్టాలు అంగీకరించవ’న్నదే ఆ వాదన సారాం శం. 1963లో ఆ దేశం బ్రిటిష్ మ్యూజియం చట్టం పేరిట ఒక శాసనాన్ని తెచ్చింది. దాని ప్రకారం జాతీయ మ్యూజియంలో కొలువై ఉన్న వస్తువుల్ని తిరిగిచ్చేందుకు వీలుకావడం లేదని బ్రిటన్ వాదిస్తోంది. ఈ బాపతువాదాన్ని మర్కట తర్కం అం టారు.
దొంగిలించిన వస్తువులన్నిటినీ బాహాటంగా ఓ మ్యూజియంలో పెట్టుకోవ డమే సిగ్గుమాలినతనం. వాటిని ఇచ్చేది లేదంటూ చట్టం తెచ్చుకోవడం ఆ సిగ్గుమా లినతనానికి పరాకాష్ట. ఇవ్వడానికి అది అడ్డంకిగా మారిందంటూ చెప్పడం వం చన. మన దేశం 1948 నుంచీ ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగివ్వాలని అడుగుతోంది. మరికొన్ని ఇతర దేశాలు కూడా వారి వారి వస్తువులు తిరిగివ్వాలని కోరారు. వీట న్నిటినీ దృష్టిలో పెట్టుకునే 1963లో మ్యూజియం చట్టం తీసుకొచ్చారన్నది దాచేస్తే దాగని సత్యం. కోహినూర్‌తో మన పేదరికం పోతుందా... మన సమస్యలన్నీ తీరి పోతాయా...దానికోసం ఎందుకంత రాద్ధాంతమని కొందరు తర్కం లేవదీస్తు న్నారు. అలాంటి సమస్యల పరిష్కార సాధనలో కావలసిన సొంత వ్యక్తిత్వానికీ, రాజీపడని తత్వానికీ కోహినూర్ తిరిగి పొందడమన్నది ఒక చిహ్నం. అందుకోసం కావాలి మనకు కోహినూర్! ఈ విషయంలో వైఖరి మార్చుకోవడమే కాదు...దాన్ని సాధించేదాకా అన్ని స్థాయిల్లోనూ ఎన్‌డీఏ ప్రభుత్వం పోరాడుతుందని ఆశిద్దాం.