
అదితి హంతకులెవరు?
ఆకాశం ఉరిమిందంటే... చినుకు పడిందంటే కలవరపడాల్సిన పాడు కాలం దాపురించింది. ఇంటినుంచి బయటికెళ్లిన కంటి దీపాలు సురక్షితంగా తిరిగొస్తాయా లేదా అనే బెరుకుతో క్షణమొక యుగంగా గడపాల్సిన దుస్థితి వచ్చిపడింది. తూర్పు తీరాన మణిహారంలా మెరిసిపోయే విశాఖ నగరంలో ఏమీ పట్టని నగర పాలక సంస్థ పుణ్యమా అని వాన నీరూ, డ్రైనేజీ నీరు ఏకమై రోడ్లు చెరువులవుతున్నాయి. అవి వాకిట ముందే దుఃఖదాయినులై ఉప్పొంగుతున్నాయి. మూతల్లేని మాన్‌హోళ్లూ...పైకప్పుల్లేని కాల్వలు మృత్యువుకు స్థావర ప్రాంతాలవుతున్నాయి. ఎవరూహిస్తారు...చెంగుచెంగున చిందులేస్తూ వెళ్లే చిన్నారి అదితి ఓ చినుకు రాలిన సాయంకాలం రెప్పపాటులో మాయమవుతుందని! ఎవరనుకుంటారు...నిండా ఆరేళ్లులేని అదితి ట్యూషన్‌కని వెళ్లి తిరిగిరాని లోకాలకు మరలిపోతుందని!
గత నెల 24న అదితి మాయమైన క్షణంనుంచి ఆ చిట్టితల్లి ఏమైందోనని విశాఖ మొత్తం బెంగటిల్లింది. కన్నవారు, అయినవారు మాత్రమే కాదు...ఆ మహా నగర జనమంతా ఆమె క్షేమంగా, సురక్షితంగా తిరిగి రావాలని తాపత్రయపడ్డారు. అదితి సంగతేమైనా తెలిసిందా అని ఆత్రంగా వాకబు చేశారు. అటు ప్రభుత్వ యంత్రాంగమూ కదిలింది. పది పడవలను రంగంలోకి దించడంతోపాటు మత్స్యకారులను, నావికాదళ సిబ్బందిని, కమ్యూనిటీ గార్డులను, వందలాది మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఈ గాలింపులో వినియోగించింది. వందలాదిమంది పౌరుల స్వచ్ఛంద కృషి దీనికి తోడైంది. దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. అయినా అదితి దక్కలేదు. విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల తీర ప్రాంతంలో ఏడు రోజులయ్యాక గురువారం సాయంత్రం విగతజీవిగా కనబడింది.
అదితి మాయమయ్యాక ప్రభుత్వమూ, నగర పాలక సంస్థ అధికారులూ చూపిన ఆందోళన, చేసిన కృషి మెచ్చదగినదే. కానీ ఏదైనా జరిగితే తప్ప కదలని మనస్తత్వం మన పాలనా యంత్రాంగాలను పట్టిపీడిస్తున్నది. వందేళ్లక్రితం హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదలు వణికించినప్పుడు ఆ మాదిరి పరిస్థితులు మరెప్పుడూ తలెత్తకూడదన్న లక్ష్యంతో విఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి సమాలోచనలు సాగించాడు ఆనాటి నిజాం. ఫలితంగా అత్యంత పటిష్టమైన వరద, మురుగునీటి వ్యవస్థలు ఏర్పడ్డాయి.
కానీ విస్తరిస్తున్న నగరానికి దీటుగా ఈ వ్యవస్థలను విస్తృతపరచడంలో అనంతర పాలకులు అశ్రద్ధ చూపారు. వర్షం పడినప్పుడల్లా జంట నగరాల వాసులకు దాని పర్యవసానాలు కనబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ను హైటెక్ నగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు తరచు ప్రకటించుకుంటారు గానీ కుంభవృష్టి కురిసినప్పుడు చూడాలి దాని దుస్థితి. వందేళ్లనాడు నిజాం రాజు చేసిన ఆలోచన ఈనాటి పాలకులకు కొరవడటంవల్లనే అదితివంటి పిల్లల జీవితాలు విషాదాంతాలవుతున్నాయి. ఇదే విశాఖ నగరంలో కొన్నేళ్లకిందట సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక బాలుడు హఠాత్తుగా కాల్వలో కొట్టుకుపోయాడు. దాన్నుంచి గుణపాఠం నేర్వకపోవడంవల్లే మళ్లీ ఒక అదితి బలి కావాల్సివచ్చింది.
మన పాలకులు నగరాన్ని సంభావించుకోవడంలోనే మౌలికంగా తప్పటడుగులు వేస్తున్నారు. నగరమంటే ఆకాశాన్నంటే భవన సముదాయాలతో... మిరుమిట్లు గొలిపే కాంతులతో, అత్యంత రద్దీగా ఉండే రోడ్లతో నిండి ఉండాలనుకుంటున్నారు. అక్కడ జనం ఉంటారని, ఇవన్నీ క్రమబద్ధంగా లేకపోతే వారు ఇబ్బందిపడతారని భావించడంలేదు. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ...ఏ నగరాన్ని చూసినా సమస్యలతో సతమతమవుతున్నవే. సామాన్యుడికి ప్రాణాంతకమవుతున్నవే. పదేళ్లక్రితం కుంభవృష్టి కురిసి వరదలు ముంచెత్తినప్పుడు ముంబై చిగురుటాకులా వణికిన వైనం ఎవరూ మరిచిపోరు. ఆ వరదలకు దాదాపు వేయిమంది మరణించారు. జనావాసాలన్నీ నీటి మడుగులయ్యాయి.
ఈమధ్య సింగపూర్ సర్కారుతో ప్లాన్ గీయించి చంద్రబాబు పట్టుకొచ్చిన అమరావతి నగర బ్లూ ప్రింట్ సైతం సామాన్య పౌరులకు అంగుళమంత చోటిచ్చిన దాఖలా లేదు. ప్రధాన రహదారుల్లో, చిన్న చిన్న వీధుల్లో మట్టి జాడ కనబడకుండా సిమెంటు కుమ్మరించి వేసే రోడ్లవల్ల వానాకాలం వస్తే జనం భయంతో వణుకుతున్నారు. కురిసిన నీరంతా ఎటుపోవాలో అర్థంకాక ఇళ్లను ముంచెత్తుతుంటే నిస్సహాయులుగా మిగులుతున్నారు. అక్కడక్కడ తెరుచుకుని ఉండే మాన్‌హోళ్ల జాడ వరదనీటిలో కానరాక ప్రమాదాల బారిన పడుతున్నారు. లక్షలమంది జనాభాతో ఉండే నగరాల్లో ఏయే కాలాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తగలవో ముందుగానే అంచనా వేసి, వాటిని నివారించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్న స్పృహ కొరవడటం మూలంగానే సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఏ నగరంలోనైనా జరిగే ఉదంతాన్ని టీవీలో చూసి నిట్టూర్చడం, పత్రికల్లో చదివి పేజీలు తిప్పేయడం మాత్రమే అలవాటైన పాలకులూ, అధికారులూ ఉన్నంతకాలం ఈ దుస్థితి మారదు. అలాంటి ఘటన జరగడానికి ఆస్కారమున్న ప్రాంతాలు తమ నగరంలో ఏమున్నాయో ఆరా తీసి, వెనువెంటనే దాన్ని సరిదిద్దాలనుకోకపోతే పదే పదే అవే ఘటనలు అన్నిచోట్లా సంభవిస్తాయి. నిరుడు దేశవ్యాప్తంగా నగరాల్లో మాన్‌హోళ్లపై మూతల్లేకపోవడం, గోతులుండటంవంటి కారణంగా దాదాపు వేయిమంది మరణించారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. కేవలం మూతలేని మాన్‌హోళ్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఆరుగురు ప్రాణాలు కోల్పోతే, తెలంగాణలో 10మంది చనిపోయారు. పాలకులు ఇకనైనా మేల్కొనాలి. ఇప్పుడున్న నగరాలతోపాటు... తాము కలగంటున్న స్మార్ట్ సిటీలను నిరపాయకరంగా తీర్చిదిద్దాలంటే ఏంచేయాలో ఆలోచించాలి. అది మాత్రమే అదితికి నిజమైన నివాళి అవుతుంది.