ప్రభుత్వాలు మొండికేసినా, మతం మోకాలడ్డినా పట్టుదలతో పోరాడితే ఎలాంటి అమానవీయ మైన చట్టాలైనా తుత్తినియలవుతాయని నిరూపించిన ఐర్లాండ్ మహిళలకు జేజేలు. మత విశ్వాసా నికీ, వైద్యపరమైన అవసరానికీ పోటీ పెట్టి... గర్భస్థ శిశువుకుండే హక్కుల్ని మాత్రమే గుర్తించి గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గర్భస్రావ నిషేధ చట్టం శుక్రవారం జరిగిన రిఫ రెండంలో పలాయనం చిత్తగించింది. 1983లో దేశ పౌరులంతా ఏమరుపాటుగా ఉన్నవేళ మత విశ్వాసాలది పైచేయిగా మారి అమల్లోకొచ్చిన చట్టాన్ని 67 శాతంమంది... అంటే మూడింట రెండొంతులమంది తిరస్క రించారని శనివారం వెల్లడైన రిఫరెండం ఫలితాలు చెబుతున్నాయి.
ఆరేళ్లక్రితం కర్ణాటకకు చెందిన దంత వైద్యురాలు సవితా హాలప్పన్ కేవలం ఐర్లాండ్ వాసి కావడం వల్ల ఈ పాశవిక చట్టానికి బలై పోయారు. ఆనాటినుంచీ ఐర్లాండ్ మహిళలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దృఢ సంకల్పంతో సాగిన ఆ ఉద్యమానికి జడిసి 2013లో అక్కడి ప్రభుత్వం ఆ చట్టానికి సవరణలు తెచ్చింది. గర్భిణి ప్రాణానికి ముప్పు ఏర్పడిందనుకున్నప్పుడు గర్భస్రావం చేయొచ్చునన్నది ఆ సవరణ సారాంశం. అయితే ఐర్లాండ్ మహిళలు దీంతో సంతృప్తి చెందలేదు. అసలు మహిళల పునరుత్పాదక హక్కుల విషయంలో అన్యాయంగా వ్యవహరించ డానికి ప్రభుత్వానికి హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లకు వారి ఉద్యమం ఫలించింది.
డాక్టర్ సవిత ఉదంతం అత్యంత విషాదకరమైనది. అది ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తుంది. స్వయంగా వైద్యురాలు అయినందువల్ల తన గర్భంలోని పిండం కదలికలపైనా, అది స్పందించే తీరుపైనా ఆమెకు అనుమానం వచ్చింది. తన శరీరంలో ఏదో జరుగుతున్నదని శంకిం చారు. ఆసుపత్రికెళ్లి వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలూ నిర్వహించి అది నిజమేనని వారు ధ్రువీకరించారు. గర్భస్థ శిశువు గుండె తప్ప మరేదీ పనిచేయడం లేదని తేల్చారు. అది కూడా ఏ దశలోనైనా నిలిచిపోవచ్చునని నిర్ధారించారు. కనుక గర్భస్రావం చేయడమొక్కటే మార్గమని సవిత దంపతులు వైద్యులను ప్రాథేయపడ్డారు. కానీ వారు చేతులెత్తేశారు. పిండం గుండె కొట్టుకుంటూ ఉన్నందువల్ల అమల్లో ఉన్న చట్టం ప్రకారం అబార్షన్ చేయడం నేరమవుతుందని తెగేసి చెప్పారు. కాసేపటికే ఆ గర్భస్థ శిశు పిండం సవిత పాలిట పెనుగండమైంది. మరణించిన పిండాన్ని సైతం అక్కడి చట్టం ప్రకారం పురుడు పోసి బయటకు తీయడానికి వైద్యులు ప్రయ త్నించారు. ఈ క్రమంలో ఆమెకు ఇన్‌ఫెక్షన్ సోకింది. సెప్టిసీమియా ఏర్పడింది. బాక్టీరియా వ్యాపించి శరీరంలో రక్తం కలుషితమైంది. శరీరంలో అవయవాలు ఒక్కొక్కటీ విఫలమవుతూ చివరికామె ప్రాణాలు కోల్పోయారు.
ఏ మతమైనా మనుషుల్లో నైతికవర్తన పెంపొందించి సమాజం సామరస్యంగా మనుగడ సాగించడానికి తోడ్పడాలి. దానికి భిన్నంగా వక్రభాష్యాలు చెప్పి స్వప్రయోజనాలు నెరవేర్చుకునే శక్తులు బయల్దేరినప్పుడు సమాజం అల్లకల్లోలమవుతుంది. ప్రభుత్వాలే ఆ పాత్ర పోషిస్తే ఇక చెప్పనవసరమే లేదు. సవిత మరణానంతరం ఐర్లాండ్‌లో విస్తృతంగా సాగిన చర్చలో మెజారిటీ పౌరులు ఛాందసవాద ధోరణుల్ని తప్పుబట్టారు. పిండం తల్లి ప్రాణానికి గండంగా పరిణ మించినప్పుడు గర్భస్రావం చేయడమే సరైనదని క్యాథలిక్ మత విశ్వాసాలు బలంగా ఉన్నవారు సైతం వాదించారు. కానీ అక్కడి క్యాథలిక్ చర్చి చట్టం రద్దును తీవ్రంగా వ్యతిరేకించింది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఐర్లాండ్ వంటి ఛాందసవాద సమాజం మరెక్కడా కనబడదు. ఒకప్పుడు ప్రపంచానికి చవగ్గా శ్రామికుల్ని ‘ఎగుమతి’ చేసే దేశంగా పేరుబడ్డ ఐర్లాండ్‌లో ప్రస్తుతం గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కార్యకలాపాలు నిర్వహి స్తున్నాయి.
ఆ సంస్థల్లో పనిచేసేందుకు ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది అక్కడికి వలసపోతున్నారు. 2015లో ఆ దేశం తొలిసారి స్వలింగ సంపర్కుల మధ్య వివాహాన్ని చట్టబద్ధం చేసింది. 2017లో ఆ దేశ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి పౌరుడు లియో ఎరిక్ వరాద్కర్ స్వలింగ సంపర్కుడని తెలిసినా అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అలాంటిచోట మహిళకు కనీస మానవహక్కును నిరాకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని యువత అంతా వలసబాట పట్టిన 80వ దశకంలో క్యాథలిక్ చర్చి అభీష్టం మేరకు ఒక రిఫరెండం ద్వారా రాజ్యాంగానికి 8వ సవరణ వచ్చి చేరి గర్భస్రావాల నిషేధం అమల్లోకొచ్చింది. ‘తల్లితో సమానంగా పుట్టబోయే బిడ్డకు సైతం ప్రాణం నిలుపుకునే హక్కు ఉంటుంద’ని అది చెప్పింది. ‘సాధ్యమైనంతవరకూ’ ఆ హక్కును రక్షించాలని నిర్దేశించింది. ఇది కేవలం ఐర్లాండ్ పౌరులకేనా లేక విదేశీయులకు కూడానా అనే అంశంలో స్పష్టత లేదు. అందువల్లే డాక్టర్ సవిత ప్రాణాలు కోల్పోయారు.
ఒక ఛాందసవాద సమాజంలో మహిళా ఉద్యమం పెను తుఫాను రేపింది. సకల సాధనా లనూ ఆ ఉద్యమం వినియోగించుకుంది. మహిళను వ్యక్తిగా గుర్తించ నిరాకరిస్తున్న చట్టాన్ని తుత్తి నియలు చేద్దాం రమ్మని పిలుపునిచ్చింది. దేశదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఐర్లాండ్ మహిళలు, వారికి మద్దతుగా యువత రిఫరెండం కోసం దండు కట్టారు. వారి రాకతో ఆ దేశంలోని అయిదు విమానాశ్రయాలు కిక్కిరిశాయి. కనుకనే ఊహించని ఫలితం వెలువడింది. అది పొరుగునున్న పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టించబోతోంది. అసలు ఆ చట్టమే లేని దేశాల్లోనూ, ఉన్నా సవాలక్ష లోపాలతో అమలవుతున్న దేశాల్లోనూ ఐర్లాండ్ మహిళల విజయం స్ఫూర్తినిస్తుంది. బ్రిటన్‌లో ఉన్న అబార్షన్ చట్టాన్ని సవరించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆ దేశంలో భాగమైన ఉత్తర ఐర్లాండ్‌లో ఆ చట్టమే వర్తించదు. ఇక మన దేశంలో అమలవుతున్న చట్టంలోనూ ఎన్నో లోపాలున్నాయి. ఇవన్నీ ఇప్పుడు బోనెక్కక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment