ఒక భారతీయ మహిళ విషాదభరితమైన మరణం ఐర్లాండ్ చట్టాలనే మారుస్తుందా ? గర్భస్రావంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు అయిదేళ్లుగా చేస్తున్న పోరాటం ఎలాంటి మలుపు తిరగబోతోంది ? ఐర్లాండ్‌లో అబార్షన్లపై నిషేధాన్ని రద్దు చేయాలా ? వద్దా ? అనే అంశంపై అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు వీలుగా ఈ నెల 25 శుక్రవారం రిఫరెండం జరుగుతున్న వేళ ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తల్లి ప్రాణంతో పాటు, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి అత్యంత విలువను ఇస్తూ గర్భస్రావంపై అత్యంత కఠినమైన చట్టాలు ఇప్పటివరకు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల కారణంగా కర్ణాటకకు చెందిన సవిత హలప్పనవర నిండు ప్రాణం బలైపోయింది. ఆమె మృతి దేశంలో ఎందరినో కదలించడంతో ప్రభుత్వం రిఫరెండంకు సిద్ధమైంది.
అయిదేళ్ల క్రితం ఏం జరిగిందంటే ?
కర్ణాటకకు చెందిన దంత వైద్యురాలు సవిత హలప్పనవర (31) ఆమె భర్త ప్రవీణ్‌లు ఐర్లాండ్‌లో నివాసం ఉంటున్నారు. మూడో నెల గర్భవతిగా ఉన్న సవిత విపరీతమైన నడుం నొప్పి రావడంతో 2012 అక్టోబర్ 21న గాల్వే ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భస్రావం చెయ్యక తప్పనిపరిస్థితి ఏర్పడిందని నిర్ధారించారు. అయితే అప్పటికే గర్భస్థ శిశువు గుండెకొట్టుకోవడం ప్రారంభం కావడంతో చట్టపరంగా అబార్షన్ చేయడానికి వీల్లేదని భావించిన వైద్యులు సహజంగా గర్భస్రావం అయిపోతుందేమోనని రెండు, మూడు రోజులు వేచి చూశారు. ఈ లోపే ఆమె గర్భాశయానికి ఇన్‌ఫెక్షన్ సోకి సెప్టిక్‌గా మారి సవిత ప్రాణాల మీదకి వచ్చింది. దీంతో ఆమెకి మందుల ద్వారా అబార్షన్ చేశారు.
కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సవిత అక్టోబర్ 28న తుది శ్వాస విడిచింది. ఐర్లాండ్‌లోని కఠినమైన చట్టాలే సవిత ప్రాణాలు తీశాయంటూ ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సవిత మృతితో దేశవ్యాప్తంగా మహిళలు రోడ్డెక్కారు. తల్లి ప్రాణం మీదకి వస్తున్నా లెక్కచేయకపోవడమేమిటంటూ నినదిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. చట్టాల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆ సమయంలో ఆందోళనలు మిన్నంటాయి. సవిత మృతిపై ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ గాల్వే ఆస్పత్రి సిబ్బందిని క్షుణ్ణంగా విచారించి సరైన సమయంలో అబార్షన్ చేసి ఉంటే సవిత ప్రాణాలు దక్కి ఉండేవని, గర్భస్రావం చట్టాన్ని సవరించాలంటూ గట్టిగా సిఫారసు చేసింది.
మరోవైపు గర్భస్రావంపై నిషేధాన్ని సమర్థిస్తున్న కొందరు సంప్రదాయవాదులు సవిత కేసు సాకుతో చట్టాలను నీరుకార్చే ప్రయత్నం చేయవద్దంటూ నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం సవిత మృతి వెనుక నిజానిజాలను తెలుసుకోవడానికి రెండో కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ గాల్వే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సవిత ప్రాణాలు పోయాయని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం అబార్లషన్లపై ప్రజాభిప్రాయ సేకరించాలని నిర్ణయించింది.
సవితను గుర్తుకు తెచ్చుకోండి : ఓటర్లకు తండ్రి విజ్ఞప్తి
ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలో తమ కుమార్తె దేశం కాని దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో మరణించడం సవిత తల్లిదండ్రుల్ని కుంగదీసింది. తాము సర్వస్వాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని సవిత తండ్రి అందనప్ప ఎలగి కన్నీరుమున్నీరవుతున్నారు. ఐర్లాండ్‌వాసులు ఓటు వేసే ముందు తమ కుమార్తెను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, తమ పరిస్థితి మరే తల్లిదండ్రులకు రాకూడదని ఆయన అంటున్నారు. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్‌వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. మరి రిఫరెండంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారో మరో రోజులో తేలిపోనుంది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment